శ్రీ: శ్రీమతే శఠగోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః

ఏ ప్రబంధాన్నైనా అధ్యయనం చేయునపుడు, దాని అంతరార్థాన్ని గ్రహించేందుకు మనం మూడు వైశిష్ట్యాలను పరిశీలించాలి —
- వక్తృ వైలక్షణ్యం – గ్రంథాన్ని ప్రసాదించిన గ్రంథకర్త యొక్క గొప్పతనము
- ప్రబంధ వైలక్షణ్యం – ప్రబంధం కృతి యొక్క సాహిత్య సౌందర్యం, భావ గర్భితమైన మహోన్నత లక్షణం
- విషయ వైలక్షణ్యం – ప్రబంధంలో ప్రతిపాదితమైన తత్త్వార్థం యొక్క అపారమైన మహిమ.
వాళి తిరునామాలు—ఆళ్వార్లు, ఆచార్యుల మహిమను కొనియాడే ఈ పద్యాలు—సులభమైన తమిళంలో అనుగ్రహించబడి, భక్తుల హృదయాలకు సులభంగా ఆకట్టుకుంటాయి. వీటిలో ఎక్కువ భాగం అప్పిళ్ళై ఆచార్యులు కృప చేసినవే.
అప్పిళ్ళై వారి వైభవం — వక్తృ వైలక్షణ్యం
అప్పిళ్ళై వారి పేరు ప్రణతార్థిహర. మనవాళ మామునుల అష్టదిగ్గజ శిష్యులలో ఒకరై, సంప్రదాయ విస్తరణలో అపారమైన పాత్ర వహించిన మహోన్నత ఆచార్యులు. వీరు స్థాపించిన మఠాలు, తిరుమాళిగైలు శ్రీవైష్ణవ ధర్మప్రచారానికి అద్భుతమైన కేంద్రాలుగా నిలిచాయి. అప్పిళ్ళై, అప్పిళ్ళార్ అనే మరో ఆచార్యునితో విడదీయరాని అనుబంధంతో ఉండేవారు. యతీంద్ర ప్రవణ ప్రభావం గ్రంథంలో, అప్పిళ్ళై వారు మనవాళ మామునులు తిరువడులకు ఎలా శరణాగతి చేసి, వారి అనుగ్రహంతో ఎలా కైంకర్యపరులయ్యారో హృదయాన్ని హత్తుకునే రీతిలో వివరించబడింది. వారి బాల్య జీవితం గురించి ఎక్కువ సమాచారం లభించకపోయినా, వారి ఆచార్యభక్తి, సంప్రదాయనిష్ఠలు వారి మహిమను స్పష్టంగా తెలియజేస్తాయి.
అది నిజంగా సంప్రదాయానికి స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు. మనవాళ మామునులు శ్రీరంగంలో వేంచేసి ఉండి, అనేకమంది శిష్యులకు ఆధ్యాత్మికతను బోధిస్తూ ఉజ్జీవింప చేశారు. అనేకమంది ఆచార్యులు శ్రీరంగానికి చేరి వారి తిరువడులకు శరణాగతి చేసేవారు. అప్పిళ్ళార్, అప్పిళ్ళై వారు కూడా ఈ కాలంలోనే శ్రీరంగానికి చేరుకున్నారు. వారు అనేక తత్వవేత్తలతో వాదములలో విజయం సాధించి, శ్రీవైష్ణవ సిద్ధాంతాన్ని ప్రతిష్ఠాపించి, చివరకు మామునిగళ్ సన్నిధికి చేరారు.
అప్పిళ్ళై మరియు అప్పిళ్ళార్ సంప్రదాయ సేవలో ఒకే శ్వాసలా, ఒకే సంకల్పంలా నిలిచిన సన్నిహిత సహచరులు మరియు ఇద్దరూ అష్టదిగ్గజాలలో ఒకరైన ఎరుంబి అప్పాకు అత్యంత సన్నిహితులు. ఎరుంబి అప్పా ఘటికాచలం (శోలింగర్) సమీపంలోని ఎరుంబి అనే గ్రామానికి చెందిన వారు. వీరు శ్రీ వరవరముని దినచర్య, విలక్షణ మోక్షాధికార నిర్ణయం, శ్రీ వరవరముని శతకం వంటి అనేక గ్రంథాలను అనుగ్రహించారు. అప్పిళ్ళై, అప్పిళ్ళార్ ఇద్దరూ మామునుల మహిమను ఎరుంబి అప్పా ద్వారా తెలుసుకొని, వారి శిష్యులుగా మారాలనే తపన పొందారు. తరువాత, మామునుల ప్రధాన శిష్యులైన పొన్నడిక్కాళ్ జీయర్ కూడా వారిని కలుసుకుంటారు. వారు మామునుల అపారమైన మహిమను వివరించి, “ఇద్దరూ మహా పండితులు అయినందున మామునులు సాక్షాత్ ఆదిశేష స్వరూపులు, రామానుజుల అవతారము అని గ్రహించగలరు” అని చెప్పి వారిని మరింత ప్రోత్సహిస్తారు.
తరువాత పొన్నడిక్కాళ్ జీయర్ వారిని కోయిల్ అన్నన్ వారి తిరుమాళిగైకి తీసుకువెళ్లి, మామునుల వైభవం, వారి గ్రంథాల మహిమను మరింత లోతుగా అవగాహన కల్పిస్తారు. ఇలా అప్పిళ్ళార్, అప్పిళ్ళై ఇద్దరూ మామునుల తిరువడులకు శరణాగతి చేసి, వారి శిష్యులై, తరువాత ఆయన అష్టదిగ్గజ శిష్యులలో స్థానం పొందారు.
అప్పిళ్ళై వారి రచనా వైభవం
అప్పిళ్ళై వారు ఆళ్వార్లు మరియు ఓరాణ్ వళి ఆచార్యులపై వాళి తిరునామాలు రచించారు. తిరువందాదులపై వ్యాఖ్యానాలు అందించారు. ఇతర ప్రబంధాలు, గ్రంథాలు కూడా రచించారు. వాటిలో వాళి తిరునామం వారికి అత్యంత ప్రసిద్ధి తెచ్చిన కృతి. తమ ఆచార్యుల పట్ల అపారమైన ప్రేమ, భక్తితో వారితోనే నివసిస్తూ, సంప్రదాయ మహిమను ప్రపంచానికి చాటేందుకు నిరంతరం కృషి చేశారు.
అప్పిళ్ళై అనేక వాళి తిరునామాలు రచించినప్పటికీ, అన్నీ వారు రచించినవే అనడం సరియైనది కాదు. ఉదాహరణకు, “శీరారుమ్ ఎతిరాసర్…” అనే వాళి తిరునామం రామానుజునిపై మామునులు రచించినది. ఇతర ఆచార్యులపై వాళి తిరునామాలు మరికొందరు కూడా రచించారు. అయితే, వాటిలో అనేకం అప్పిళ్ళై వారి రచనలేనని మనకు తెలుస్తుంది.
ఇంతవరకు వక్తృ వైలక్షణ్యం-రచయిత మహిమ స్పష్టమవుతుంది
ప్రబంధ వైలక్షణ్యం – కృతి మహిమ
వాళి తిరునామాల స్వరూపం, వాటి ప్రాముఖ్యత తెలుసుకోవడం అత్యంత అవసరం.
వాళి అనే పదం మంగళాశాసనమును సూచిస్తుంది. వాళి, నమః, పోట్ట్రి, జయ వంటి పదాలు, ఒక మహనీయునికి మంగళాశాసనం చేస్తున్నామనే భావాన్ని వ్యక్తపరుస్తాయి. మంగళాశాసనం అంటే-ఆ వ్యక్తికి శ్రేయస్సు కలగాలని మనసారా కోరడం. అందులో ప్రేమ, భక్తి, శుభాకాంక్షలే ప్రధానము. మన పూర్వాచార్యులు, ముఖ్యంగా పిళ్ళై లోకాచార్యులు, శ్రీ వచన భూషణంలో దీని గురించి విశదీకరించారు.
మంగళాశాసనం చేయగల అర్హత ఎవరికుంది?
మనలాంటి సాధారణులు, వయస్సు, స్థాయి, గుణాలలో ఉన్నతులైన ఆచార్యులకు మంగళాశాసనం చేయగలమా? ‘శీరారుమ్ ఎతిరాసర్ తిరువడిగళ్ వాళి’ అని చెప్పే అర్హత మనకు ఉందా?” అనే సందేహం కలగవచ్చు. ఈ ప్రశ్నకు పిళ్ళై లోకాచార్యులు శ్రీ వచన భూషణ దివ్య శాస్త్రంలో సమాధానం ఇచ్చారు.
మంగళాశాసనం ప్రేమతో చేసే కార్యం. పెరియాళ్వార్ “పల్లాండు, పల్లాండు” అని సాక్షాత్తుగా శ్రీమన్నారాయణునికి మంగళం పాడారు. అక్కడే వారే ప్రశ్నించి, వారే సమాధానం ఇలా ఇచ్చారు- “ఎంపెరుమానుకే పల్లాండు పాడటం సముచితమా, కాదా?” మనకు నిజజ్ఞానం కలిగినప్పుడు, ఆ స్థితిని జ్ఞాన దశ అంటారు. ఆ సమయంలో, ఆయనే రక్షకుడు, మనమంతా రక్షితులు, మన ప్రార్థనలు ఆయనకే సమర్పించాలి,ఆయనకు సేవ చేయాలనే తపన కలుగుతుంది.
పెరియాళ్వార్ మాత్రం ప్రేమ దశలో స్థిరపడ్డారు. ఆయనకు శ్రీకృష్ణుడిపై ఉన్న ప్రేమ, యశోదమ్మకు ఉన్న ప్రేమతో సమానమైనది. అలాంటి ప్రేమస్థితిలో, ఎంపెరుమానుకు శ్రేయస్సు కోరడం, వారికి పల్లాండు పాడడం సహజం, సముచితం. ఎవరినైనా మనసారా ప్రేమిస్తే, వారికి శ్రేయస్సు కోరడం సహజమే కదా. అది వారికంటే మనం ఉన్నతులమని భావించడం కాదు. మనము వారి సేవకులమే; కానీ మన ప్రేమ ఉప్పొంగి (పొంగుం పరివు) మంగళాశాసనం రూపంలో బయటపడుతుంది. అందుకే పెరియాళ్వార్ పల్లాండు పాడటం సంప్రదాయానికి అనుగుణం, సహజం, అత్యంత శ్రేష్ఠం.
ఒక సాంప్రదాయపరులు, మహనీయునికి “దేవరీర్ శతమానం భవతి! పోట్ట్రి! వాళి!” అని మంగళం చెప్పడం మన స్వరూపానికి అనుగుణమైన కార్యం. అలాంటి మహనీయులు సుఖంగా, దీర్ఘకాలం జీవిస్తే, ప్రపంచమంతటికీ శ్రేయస్సు కలుగుతుంది. అందువల్ల, ఎవరైనా మంగళాశాసనం చేయవచ్చు- అర్హత గురించి సందేహం అవసరం లేదు. అప్పిళ్ళై వారు రచించిన వాళి తిరునామాల సహాయంతో మనమూ సరైన సందర్భాలలో మంగళాశాసనం చేయగలుగుతున్నాం. ఇది మన పూర్వాచార్యుల అమూల్యమైన అనుగ్రహమే.
మన పెద్దలు దేవాలయానికి, ఆళ్వార్ లేదా ఆచార్యుల సన్నిధికి వెళ్లినప్పుడు “దర్శనం బాగా అయ్యిందా?” అని అడగరు, “మంగళాశాసనం బాగా చేసారా?” అని అడుగుతారు. మన పూర్వాచార్యులు ఎంపెరుమాన్, ఆళ్వార్లు, ఓరాణ్ వళి ఆచార్యులకు ప్రతిరోజూ మంగళాశాసనం చేయడానికి వాళి తిరునామాలను అందించారు.
వాళి తిరునామాలలో వారి దివ్యరూప సౌందర్యం, వారి కృతులు, వారు చేసిన మహాసేవలు అన్నీ సంక్షిప్తంగా, భావపూర్వకంగా ఉంటాయి. వాళి తిరునామాలు జపించేటప్పుడు వారి మహిమ మనసులో మెదులుతుంది, వారి సేవలు గుర్తుకొస్తాయి, మనలో కృతజ్ఞత పెరుగుతుంది. వారి నిస్వార్థ సేవలను స్మరించుకుంటూ అటువంటి మహానుభావుల సంప్రదాయంలో పుట్టినందుకు మనకు గర్వం, ఆనందం కలుగుతుంది. అందుకే వాళి తిరునామాలు పఠించడం అత్యంత ముఖ్యమైనది.
వాళి తిరునామాలు ఎప్పుడు జపించాలి?
ప్రతిరోజూ ఆ రోజు నక్షత్రానికి అనుగుణంగా, ఆ నక్షత్రంలో అవతరించిన ఆళ్వార్ లేదా ఆచార్యుల వాళి తిరునామం జపించవచ్చు. ఉదాహరణకు— తిరువాదిరై నక్షత్రం వచ్చినప్పుడు ఎంపెరుమానార్ వారి వాళి తిరునామం జపించవచ్చు. పునర్వసు నక్షత్రం వచ్చినప్పుడు కులశేఖర ఆళ్వార్, ముదళియాండాన్, పొన్నడిక్కాళ్ జీయర్ మొదలైన వారి వాళి తిరునామాలు జపించవచ్చు. ప్రతి నెలలో, ప్రతి ఆళ్వార్ మరియు ఆచార్యుల వారి తిరునక్షత్రం రోజున ఈ విధంగా వాళి తిరునామాలు జపించడం అనేక సన్నిధుల్లో ఇప్పటికీ కొనసాగుతున్న ఆచారం. వారి వార్షిక తిరునక్షత్రం రోజున, ఆ ఆళ్వార్ లేదా ఆచార్యుల వాళి తిరునామం రెండు సార్లు జపించబడుతుంది. ఇదే క్రమాన్ని మన ఇళ్లలో కూడా అనుసరించవచ్చు. మన గృహపెరుమాళ్కు తిరువారాధన, శాత్తుమురై చేసిన తరువాత, ఆ రోజు నక్షత్రానికి అనుగుణంగా ఆ ఆళ్వార్ లేదా ఆచార్యుల వాళి తిరునామం జపించవచ్చు. వారి వార్షిక తిరునక్షత్రం రోజున రెండు సార్లు జపించడం శ్రేయస్కరం.
ఈ ఆచారం వారి మహిమను మన హృదయాల్లో స్థిరపరచడానికి ఎంతో ఉపకరిస్తుంది. ఇంతవరకు ప్రబంధ వైలక్షణ్యం, వాళి తిరునామాల కృతి మహిమ, తెలిసింది.
విషయ వైలక్షణ్యం — విషయ మహిమ
సాధారణంగా మనం ఆళ్వార్లు మరియు ఓరాణ్ వళి ఆచార్యుల వాళి తిరునామాలు జపిస్తాము.
ఓరాణ్ వళి ఆచార్యులు పెరియ పెరుమాళ్ నుండి ప్రారంభమై మనవాళ మామునుల వరకు కొనసాగుతారు. అలాగే, పన్నెండు ఆళ్వార్ల వాళి తిరునామాలు కూడా జపించవచ్చు.
ఈ సంప్రదాయం అనాది కాలం నుండి ఆచార్య–శిష్య పరంపర ద్వారా నిలబెట్టబడింది. ఆచార్యుడు తన శిష్యునికి పరమార్థ జ్ఞానం, ఆచరణ, అనుష్ఠానాలను బోధిస్తూ వచ్చిన ఈ మార్గమే ఓరాణ్ వళి అని పిలవబడుతుంది. మొదటి ఆచార్యుడు పెరియ పెరుమాళ్. మొదటి ముగ్గురు ఆచార్యులు- పెరియ పెరుమాళ్, పెరియ పిరాట్టి, సేనై ముదలైయార్ వీరు శ్రీ వైకుంఠంలో నివసిస్తారు.
విస్తారమైన సంఖ్యలో ఉన్న మిగతా ఆచార్యులు ఈ సంసారిక లోకం లో అవతరించిన వారు.
ఓరాణ్ వళి ఆచార్యులు
- ఉపోద్ఘాతము
- పెరియ పెరుమాళ్
- పెరియ పిరాట్టి
- శ్రీ విశ్వక్సేనులు (సేనై ముదలియార్)
- నమ్మాళ్వార్ – శరణాగతి చేసిన జనులకు నాయకులు (ప్రపన్న జన కూటస్థులు)
- నాథ మునిగళ్
- ఉయ్యక్కొండార్ (పుండరీకాక్షులు)
- మనక్కాళ్ నంబి (శ్రీ రామ మిశ్రులు)
- ఆళవందార్ (యామునాచార్యులు)
- పెరియ నంబి (మహా పూర్ణులు)
- ఎంపెరుమానార్ (శ్రీ రామానుజులు)
- ఎంబార్ (గోవిందపెరుమాళ్)
- పరాశర భట్టర్
- నంజీయర్ (వేదాంతి)
- నంపిళ్ళై (లోకాచార్యులు)
- వడక్కుత్తిరువీధిపిళ్ళై (శ్రీ కృష్ణ పాదులు)
- పిళ్ళై లోకాచార్యర్
- తిరువాయ్మొళి పిళ్ళై (శ్రీ శైలేశులు)
- మనవాళ మామునులు (రమ్య జామాతృలు)
ఇవే ఓరాణ్ వళి ఆచార్యుల పరంపర. ఇవి కాకుండా, ప్రతి ఆచార్యుని తిరుమాళిగై/మఠం ఆధారంగా గురుపరంపర మరింత విస్తరించబడుతుంది.
ఉదాహరణకు, ఎవరైనా శ్రీ పెరియ నంబి తిరుమాళిగైకి చెందినవారైతే, ఆ వంశంలోని ఆచార్యుల వాళి తిరునామాలను పెరియ నంబి నుండి ప్రారంభించి జపిస్తారు. అదేవిధంగా ఎంబార్, కూరత్తాళ్వాన్ మొదలైన వంశాలలో కూడా ఇదే విధానం ఉంటుంది. ప్రతి ఒక్కరు తమ వంశపరంపర వాళి తిరునామాలను జపించినా, ఆళ్వార్లు మరియు ఓరాణ్ వళి ఆచార్యుల వాళి తిరునామాలు అందరూ సాధారణంగా జపిస్తారు.
ఆళ్వార్లు మనలాంటి జీవాత్మలే. కానీ, సంసారంలో ఉన్న మనలాంటి వారికి మార్గదర్శకులుగా ఉండేందుకు, ఎంపెరుమాన్ వారిని స్వయంగా ఎన్నుకొని, మయర్వర మదినలం, అనగా నిర్మలమైన జ్ఞానం, భక్తి—అనుగ్రహించాడు. ఇది ఒక వేటగాడు చిన్న జింకను వశపరచుకొని, దానిని ఉపయోగించి ఇతర జింకలను ఆకర్షించడంలా ఉంటుంది. అలాగే, ఎంపెరుమాన్ ఆళ్వార్లకు నిర్మలమైన జ్ఞానాన్ని ప్రసాదించగా అది భక్తిగా మారి, అది ప్రేమగా ఉప్పొంగి, పాశురాల రూపంలో వెలువడింది. ఈ పాశురాలే 4000 దివ్యప్రబంధాలు. ఆళ్వార్లు వేదాంత సారాన్ని సులభమైన, మధురమైన తమిళంలో ప్రపంచానికి అందించారు. తరువాత ఆచార్యులు ఈ ప్రబంధాలకు విశదమైన వ్యాఖ్యానాలు రాశారు. ఎంపెరుమానార్ (శ్రీ రామానుజులు) ఈ సంప్రదాయాన్ని స్పష్టమైన మార్గంలో నిలబెట్టిన దూరదృష్టి కలిగిన మార్గదర్శకులు. వారు సంప్రదాయ సూత్రాలను స్థిరపరిచారు, 74 సింహాసనాధిపతులను నియమించారు, మరియు సంప్రదాయ జ్ఞానం, ఆచరణలను ప్రపంచమంతటా వ్యాప్తి చేశారు.
ఎవరైనా ఆసక్తి ఉన్నవారు ఎంపెరుమాన్కు సేవ చేయడానికి, సంప్రదాయాన్ని నేర్చుకోవడానికి సులభమైన మార్గాలు ఏర్పరిచిన వారు కూడా శ్రీ రామానుజులే. ఇది ఎంపెరుమాన్కే ఇష్టమైన కార్యం. ఆళ్వార్లు, ఆచార్యుల వచనాల ద్వారా మన స్వరూపాన్ని తెలుసుకునే మార్గం మనకు లభించడం ఎంపెరుమాన్ కరుణ వల్లే. ఆచార్యుల నిరంతర అనుష్ఠానాల వల్లే ఈ మార్గం అనాదిగా నిరంతరంగా కొనసాగుతోంది. ఇదే విషయ వైలక్షణ్యం- విషయ మహిమ.
ఇప్పుడు వాళి తిరునామాల అర్థాలను ఆస్వాదిద్దాం
- ముదల్ ఆళ్వార్లు
- తిరుమళిశై ఆళ్వార్
- నమ్మాళ్వార్
- మధురకవి ఆళ్వార్
- కులశేఖర ఆళ్వార్
- పెరియాళ్వార్
- ఆండాళ్
- తొండరడిప్పొడి ఆళ్వార్
- తిరుప్పాణాళ్వార్
- తిరుమంగై ఆళ్వార్
అడియేన్ లక్ష్మి సేనాపతి రామానుజ దాసి
మూలం : https://divyaprabandham.koyil.org/index.php/2024/01/vazhi-thirunamams-english-simple/
పొందుపరచిన స్థానము – https://divyaprabandham.koyil.org
ప్రమేయము (లక్ష్యము) – https://koyil.org
ప్రమాణము (గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (పూర్వాచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org