శ్రీ: శ్రీమతే శఠగోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమతే వరవరమునయే నమః

వడక్కు తిరువీధిప్పిళ్ళై – కాంచీపురం.
వడక్కు తిరువీధిప్పిళ్ళై గారు శ్రీరంగంలో జన్మించారు. వారి అసలు పేరు శ్రీ కృష్ణపాదులు. పూర్వకాలంలో శ్రీరంగంలోని సప్తప్రకారాల లోపల ఎవరూ నివసించేవారు కాదు. శ్రీ కృష్ణపాదులు ఉత్తర దిశలో, సప్తప్రకారాల పక్కన ఉన్న అగ్రహారంలో (తిరువీధి) నివసించేవారు. అందువల్ల ఆయనకు వడక్కు తిరువీధిప్పిళ్ళై అనే దివ్యనామం వచ్చింది. ఇదే విధంగా అగ్రహారంలో మధ్యలో నివసించిన మరో ఆచార్యుడు “నడువిల్ తిరువీధిప్పిళ్ళై భట్టర్” అని పిలువబడ్డారు. వడక్కు తిరువీధిప్పిళ్ళై, నంపిళ్ళై యొక్క అత్యంత అంతరంగ శిష్యుడు. తన ఆచార్యునిపై ఆయనకు అపారమైన భక్తి. నంపిళ్ళై కాలక్షేపం వింటూ, ఒక్క మాట కూడా తప్పకుండా అన్నింటినీ తాళ పత్రాలపై లిఖించేవారు.
వివాహితుడైనా, ఆయనకు గృహస్థ జీవితంపై ఆసక్తి లేదు. దీనిని ఆయన తల్లి నంపిళ్ళై గారికి చెప్పగా, నంపిళ్ళై ఆయనను, ఆయన భార్యను పిలిచి, సంప్రదాయ అభివృద్ధి కోసం మంచి సంతానం కలగాలని ఉపదేశించారు. ఆచార్య ఆజ్ఞ ప్రకారం, ఏడాదిలోపే ఒక కుమారుడు జన్మించాడు. నంపిళ్ళై ఆశీర్వచనంతో, ప్రేమతో పుట్టినవాడని ఆ కుమారునికి “పిళ్ళై లోకాచార్యర్” అనే పేరు పెట్టారు. లోకాచార్యర్ అనేది నంపిళ్ళై గారి ఇంకొక నామం.ఆచార్యుల వారి అనుగ్రహంతో బిడ్డ జన్మించినాడని వారి పేరు పెట్టారు.నంపిళ్ళై దీనిని విని ఎంతో ఆనందించారు. శ్రీరంగనాథుడు కూడా ఈ విషయాన్ని విని, “నీ ఆచార్యుని అనుగ్రహంతో ఒక కుమారుడు పుట్టినట్లే, నా అనుగ్రహంతో మరో కుమారుడు పుడతాడు” అని వరమిచ్చాడు. ఆ వరం ప్రకారం మరో కుమారుడు పుట్టాడు. ఆయనకు “అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్” అనే పేరు పెట్టారు. ఈ ఇద్దరు కుమారులు తరువాత కాలంలో శ్రీవైష్ణవ సంప్రదాయానికి రెండు మహాస్థంభాలుగా నిలిచారు.
వడక్కు తిరువీధిప్ పిళ్ళై గారు నంపిళ్ళై గారి తిరువాయ్మొళి కాలక్షేపంలోని మొత్తం సారాన్ని లిఖించారు. అదే “ఈడు 36,000 పడి వ్యాఖ్యానం”గా ప్రసిద్ధి చెందినది. నంపిళ్ళైకి అత్యంత ప్రియమైన ఇద్దరు శిష్యులు – వడక్కు తిరువీధిప్పిళ్ళై, మరియు పెరియ వాచ్చాన్ ప్పిళ్ళై. అందువల్ల నంపిళ్ళైను “ఇరుకన్నర్” (రెండు కన్నులు, ఇద్దరు కృష్ణులు కలవారు) అని పిలిచేవారు.
వడక్కు తిరువీధిప్పిళ్ళై జ్యేష్ఠ మాసంలో వచ్చే స్వాతి నక్షత్రం నాడు అవతరించారు.వీరు పెరియాళ్వార్ జన్మనక్షత్రం నాడే అవతరించారు.పెరియాళ్వార్ ఆండాళ్ను పెంచి, శ్రీరంగనాథుడికి ఇచ్చి కల్యాణం చేసినట్లే, వడక్కు తిరువీధిప్పిళ్ళై, ఇద్దరు మాణిక్యాల వంటి కుమారులను పెంచి, వారిని పూర్తిగా భగవద్ భక్తులుగా తీర్చిదిద్దారు.
ఇద్దరు కుమారులూ నైష్టిక బ్రహ్మచారులు. నైష్ఠిక బ్రహ్మచారి అనగా తన జీవితాంతం బ్రహ్మచారిగా ఉండటానికి చిన్నతనంలోనే ఒక సంకల్పం (వత్రం) తీసుకునే వ్యక్తి. నంబిళ్ళై తిరువాయిమొళి వ్యాఖ్యానాన్ని లిఖించడంతో పాటు, ఆయన అనుగ్రహించిన ఇతర వ్యాఖ్యానాలను కూడా అతను లిఖించారు.
వడక్కు తిరువీధిప్పిళ్ళై వాళి తిరునామములు :
ఆనితనిఱ్ శోదినన్నాళ్ అవతరిత్తాన్ వాళియే
ఆళ్వార్గళ్ కలైప్పొరుళై ఆయందురైప్పోన్ వాళియే
తానుగంద నంపిళ్ళై తాళ్ తొళువోన్ వాళియే
శఠకోపన్ తమిళ్క్కీడు శాఱ్ఱినాన్ వాళియే
నానిలత్తిల్ పాడియత్తై నడత్తినాన్ వాళియే
నల్లవులగారియనై నమక్కళిత్తాన్ వాళియే
ఈనమఱ ఎమైయాళుం ఇఱైవనార్ వాళియే
ఎంగళ్ వడవీధిప్ప్పిళ్ళై ఇణైయడిగళ్ వాళియే
వడక్కు తిరువీధిప్పిళ్ళై వాళి తిరునామములు — సరళ వివరణ:
ఆనితనిఱ్ శోదినన్నాళ్ అవతరిత్తాన్ వాళియే
జ్యేష్ట మాసంలో, శుభమైన స్వాతి నక్షత్రంలో అవతరించిన వడక్కు తిరువీధిప్పిళ్ళై, చిరకాలం వర్ధిల్లుగాక (పల్లాండు)!
ఆళ్వార్గళ్ కలైప్పొరుళై ఆయందురైప్పోన్ వాళియే
ఆళ్వార్లు అనుగ్రహించిన దివ్యప్రబంధాల లోతైన అంతరార్థాలను సూక్ష్మంగా పరిశీలించి, మనకు వివరిచిన ఆ మహానుభావుడు చిరకాలం వర్ధిల్లుగాక (పల్లాండు)! నంపిళ్లై గారి కాలక్షేపాన్ని శ్రద్ధగా విని, ప్రతి మాటను తప్పకుండా తాళపత్రాలపై లిఖించిన వడక్కు తిరువీధిప్పిళ్ళై గారు చిరకాలం వర్ధిల్లుగాక (పల్లాండు)!
తానుగంద నంపిళ్ళై తాళ్ తొళువోన్ వాళియే
వడక్కు తిరువీధి ప్పిళ్ళై గారు తమ ఆచార్యులు అయిన నంపిళ్ళై గారి పట్ల గొప్ప భక్తిని కలిగి ఉండేవారు.తమ ప్రియమైన ఆచార్యులు అయిన నంపిళ్ళై గారి దివ్య తిరువడిని ఆరాధించే వడక్కు తిరువీధి ప్పిళ్ళై గారు చిరకాలం వర్ధిల్లుగాక (పల్లాండు) !
శఠకోపన్ తమిళ్క్కీడు శాఱ్ఱినాన్ వాళియే
శఠకోపన్’ అంటే నమ్మాళ్వార్. నంపిళ్లై గారి తిరువాయ్మొళి కాళక్షేపాన్ని విని, దానిని 36,000 పడి ఈడు వ్యాఖ్యానంగా అద్భుతంగా లిఖించిన వడక్కు తిరువీధిప్పిళ్ళై,చిరకాలం వర్ధిల్లుగాక (పల్లాండు)!
ఒకసారి నంపిళ్లై గారు దయతో వడక్కు తిరువీధిప్పిళ్ళై గృహమునకు వెళ్ళారు. సాంప్రదాయన్ని అనుసరించి వడక్కు తిరువీధిప్పిళ్ళై గారు తమ గృహ కోయిళాళ్వారు నందలి నంపిళ్లై గారిని , ఎంపెరుమానులకు తిరువారాధన చేయమని కోరగా, వారి కోరికపై తిరువారాధనం మరియు మంగళాశశనం చేసి, అనంతరం, తాళపత్రాల కట్టను చూసి ఆశ్చర్యపోయారు – ఎందుకంటే వడక్కు తిరువీధిప్పిళ్ళై ఒక్క మాట కూడా తప్పకుండా, నంపిళ్ళై గారి కాలక్షేపాన్ని అద్భుతంగా లిఖించారు. పగలంతా కాలక్షేపంలో పాల్గొని, కైంకర్యం చేసిన వడక్కు తిరువీధిప్పిళ్ళై, లిఖించటానికి సమయం ఎలా కూర్చుకున్నారు అని ఆశ్చర్యపడి రాత్రివేళల్లో దీన్ని లిఖించారని గ్రహించి నంపిళ్లై గారు విస్మయపడ్డారు.
అయితే, కొద్దిగా విచారంతో, బరువైన హృదయంతో “నా అనుమతి లేకుండా లిఖించావు; ఇప్పుడే ఈ ఈడు వ్యాఖ్యానాన్ని ప్రచారం చేయవద్దు. భవిష్యత్తులో ఒక అధికారి (అర్హుడు) వస్తాడు; అతడే దీన్ని వెలువరించాలి” అని చెప్పి, గ్రంథాన్ని తనతో తీసుకుని వెళ్ళిపోయారు. తరువాత ఈ గ్రంథం ఈయుణ్ణి మాధవ పెరుమాళ్ కు ఇచ్చి తగిన అధికారికి గ్రంథాన్ని చేర్చమని ఆజ్ఞాపించారు. ఈయుణ్ణి మాధవ పెరుమాళ్ తన కుమారుడైన ఈయుణ్ణి పద్మనాభ పెరుమాళ్ కు, వారు నాలూరు పిళ్లైకు, నాలూరాచ్చాన్ పిళ్లై, తిరువాయ్మొళిప్పిళ్లైకు, వారు మణవాళ మామునిగళ్ కు అందించగా మామునిగళ్ 36000 పడి ఈడు వ్యాఖ్యానాన్ని ఎంపెరుమాన్ ఆనందానికై కాలక్షేపం చేశారు. అటువంటి అమూల్యమైన తిరువాయ్మొళి ఈడు వ్యాఖ్యానాన్ని మనకు అందించిన వడక్కు తిరువీధిప్పిళ్ళై, వైభవం చిరకాలం వర్ధిల్లు గాక. (పల్లాండు)!
నానిలత్తిల్ పాడియత్తై నడత్తినాన్ వాళియే
కురింజి (పర్వత ప్రాంతం), ముల్లై (అటవీ ప్రాంతం), మరుదం (సారవంతమైన ప్రాంతం), మరియు నెయ్దల్ (సముద్ర పరివాహక ప్రాంతం) – అనే నాలుగు భూభాగాలుగా ఉన్న ఈ లోకంలో, శ్రీ రామానుజుల వారి శ్రీభాష్యాం ( బ్రహ్మ సూత్రాలకు వ్యాఖ్యానం) ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా బోధించిన వడక్కు తిరువీధిప్పిళ్ళై, చిరకాలం వర్ధిల్లుగాక (పల్లాండు)! మన పూర్వాచార్యులు తమిళంలో ఎంత నైపుణ్యం కలిగివున్నారో, అలాగే సంస్కృతంలోనూ మహా పండితులు అని మనకు తెలుస్తుంది. ఆచార్యపీఠాన్ని అలంకరించే వారు అన్ని శాస్త్రాలలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. అటువంటి శ్రీభాష్యార్థాలను విశదీకరించి అందించిన సంస్కృత మహావిద్వాంసుడు వడక్కు తిరువీధిప్పిళ్ళై, చిరకాలం వర్ధిల్లుగాక (పల్లాండు)!
నల్లవులగారియనై నమక్కళిత్తాన్ వాళియే
మనకు అత్యంత దయామయుడైన పిళ్లై లోకాచార్యుని ప్రసాదించి, తన ఆచార్యులైన నంపిళ్లై గారి పేరునే తన కుమారునికి ‘లోకాచార్యులు’ అని పేరు పెట్టారు. అలాగే, ఎంపెరుమాన్ అనుగ్రహంతో జన్మించిన అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ కూడా మన సాంప్రదాయానికి అమూల్యమైన రత్నం. ఈ ఇద్దరు రత్నములవంటి కుమారులను లోకానికి అందించిన వడక్కు తిరువీధిప్పిళ్ళై, చిరకాలం వర్ధిల్లుగాక (పల్లాండు)!
ఈనమఱ ఎమైయాళుం ఇఱైవనార్ వాళియే
మనలోని అన్ని దోషాలు, అజ్ఞానాము తొలగిపోయేలా మనకు అధిపతిగా నిలిచిన వడక్కు తిరువీధి ప్పిళ్ళై చిరకాలం వర్ధిల్లుగాక (పల్లాండు)!
ఎంగళ్ వడవీధిప్పిళ్ళై ఇణైయడిగళ్ వాళియే
మన వడక్కు తిరువీధిప్పిళ్ళై గారి తిరువడి వైభవమునకు పల్లాండు! అనే వాక్యంతో వడక్కు తిరువీధిప్పిళ్ళై గారి వాళి తిరునామములు ముగుస్తుంది.
ఆళ్వార్ ఎంపెరుమానార్ జీయర్ తిరువడిగళే శరణం
అడియేన్ లక్ష్మీ సేనాపతి రామానుజ దాసి
అడియేన్ శ్రీ తేజ రామానుజ దాసి
పొందుపరచిన స్థానము – https://divyaprabandham.koyil.org
ప్రమేయము (లక్ష్యము) – https://koyil.org
ప్రమాణము (గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (పూర్వాచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org