ఆళ్వార్/ఆచార్యుల వాళి తిరునామాలు – నమ్మాళ్వార్ – సరళ వివరణ

శ్రీః శ్రీమతే శఠగోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః 

పూర్తి వ్యాసమాలిక 

<< తిరుమళిశై ఆళ్వార్

నమ్మాళ్వార్ అవతార స్థలం ఆళ్వార్ తిరునగరి. ఇక్కడ ‘అప్పన్ కోయిల్’ అని పిలువబడే ఒక ప్రదేశం ఉంది. నమ్మాళ్వార్ జన్మించింది ఈ ప్రదేశంలోనే! నేటికీ ఈ ప్రదేశంలో తిరువేంగడముడయాన్ (శ్రీ వేంకటేశ్వర స్వామి) ఆలయం ఉంది. అందుకే దీనిని ‘అప్పన్ కోయిల్’ అని పిలుస్తారు. ఇక్కడ అప్పన్ అంటే తిరువేంగడముడయాన్ అని అర్థం.  అళ్వార్ జన్మించిన ఆ గదిని ఆ దేవాలయంలో అలాగే సంరక్షించి ఉంచారు.  నమ్మాళ్వార్ తిరు అవతార నక్షత్రం వైశాఖ మాసంలోని విశాఖ నక్షత్రం. నమ్మాళ్వార్ వేదాలలోని నాలుగు శాఖలతో సమానమైన నాలుగు దివ్య ప్రబంధాలను రచించారు.  ఆయన రచించిన తిరువిరుత్తం, తిరువాశిరియం, పెరియ తిరువందాది మరియు తిరువాయ్మొళి ప్రబంధాలు  ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వణ వేదం మరియు సామవేదాలకు సమానమైనవిగా పరిగణించబడతాయి. ఈ ప్రబంధాలు వేదాల యొక్క అంతరార్థాన్ని (సారాన్ని) కలిగి ఉండటం వలన, వేదాలకు సమానమైనవిగా భావించబడతాయి.

ఆయన కృష్ణావతారంలో చాలా లీనమైపోయేవారు! శ్రీవైష్ణవులందరికీ నాయకులుగా వారిని ‘ప్రపన్న జన కూటస్థర్’ అని కొనియాడతారు. ఆయనకు మారన్, శఠకోపన్ వంటి ఇతర దివ్య నామాలు కూడా ఉన్నాయి.ఆయన నంపెరుమాళ్‌కు అత్యంత ఆప్తులు కావడం చేత, ఆయనచేత “మా ఆళ్వార్”  అని పిలువబడ్డారు. నం అంటే మా అని అర్థం.అందువల్లనే ఆయనను “నమ్మాళ్వార్” అని పిలుస్తారు. ఆయన ఆళ్వార్లందరిలోనూ నాయకులు.  మిగిలిన ఆళ్వార్లందరూ కూడా సమగ్ర శరీరమైన నమ్మాళ్వార్ యొక్క వివిధ దివ్యమైన అవయవాలుగా (అంగములుగా) పరిగణించబడతారు.

నమ్మాళ్వార్ల యొక్క వాళి తిరునామములు:

ఆన తిరువిరుత్తం నూఱుమ్ అరుళినాన్ వాళియే

ఆసిరియం ఏళు పాట్టళిత్త పిరాన్ వాళియే

ఇనమఱ అందాది ఎణ్బత్తేళిన్దాన్ వాళియే

ఇలగు తిరువాయిమొళి ఆయిరత్తొరు నూఱ్ఱిరన్దురైత్తాన్ వాళియే

వానణియుమ్ మామాడక్ కురుగై మన్నన్ వాళియే

వైగాసి విసాగత్తిల్ వన్దుదిత్తాన్ వాళియే

సేనైయర్ కోణ్ అవతారమ్ శెయ్ద వళ్ళల్ వాళియే

తిరుక్కురుగైచ్ చడగోపన్ తిరువడిగళ్ వాళియే

నమ్మాళ్వార్ల యొక్క వాళి తిరునామములు – సరళ వివరణ:

ఆన తిరువిరుత్తం నూఱుమ్ అరుళినాన్ వాళియే

తిరువిరుత్తం ప్రబంధంలో 100 పాశురాలు ఉన్నాయి.ఈ ప్రబంధాన్ని నమ్మాళ్వార్ మనకు అనుగ్రహించారు.ఆయన చిరకాలం అనేకానేక సంవత్సరాలు వర్ధిల్లుగాక. ‘ఆన’ అనే పదానికి చాలా “సమంజసమైన” అనే అర్థం ఉంది.  ఆళ్వార్ తిరువిరుత్తంలోని మొట్ట మొదటి పాశురం “పొయ్ నిన్ఱ జ్ఞానముమ్ పొల్లా ఒళుక్కుమ్ అళుక్కుడమ్బుమ్ ఇన్నిన్ఱ నీర్మై ఇనియామ్ ఉఱామై” లోనే ఈ సంసార లోకంలో తాను నిలువలేనని వ్యక్తం చేశారు.  అదే పాశురంలో, తనకు ఎలాంటి దోషాలు లేని జ్ఞానాన్ని మరియు భక్తిని శ్రీమన్నారాయణుడు ఎలా అనుగ్రహించాడో ఆళ్వార్ వ్యక్తం చేశారు. తిరువిరుత్తం అనే ఈ ప్రబంధం అర్థం చేసుకోవడానికి చాలా క్లిష్టమైనది మరియు దీనిలోని ప్రతి పాశురంలోనూ అంతరార్థాలు (స్వాపదేశం) దాగి ఉన్నాయి. ఇలాంటి తిరువిరుత్తాన్ని అనుగ్రహించిన నమ్మాళ్వార్ కలకాలం వర్ధిల్లాలి (పల్లాండు)!

ఆసిరియం ఏళు పాట్టళిత్త పిరాన్ వాళియే

తిరువాశిరియం అని పిలవబడే 7 పాశురాల ప్రబంధం ఎంపెరుమాన్ (భగవంతుని) తిరుమేని (రూపం) యొక్క సౌందర్యాన్ని మరియు కళ్యాణ గుణాలను అద్భుతంగా వర్ణిస్తుంది. ఈ ప్రబంధంలో ఎంపెరుమాన్ యొక్క మంగళకరమైన గుణాలతో పాటు, తల్లిలా ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండే ఎంపెరుమాన్ ఉండగా, ఇతర దేవతలను ఆశ్రయించవద్దు అనే భావనలు ఉన్నాయి. ఇంతటి గొప్ప జ్ఞానాన్ని కలిగి ఉండి, మనకు ఈ ప్రబంధాన్ని అనుగ్రహించిన నమ్మాళ్వార్లు చిరకాలం వర్ధిల్లాలి (పల్లాండు)!

ఈనమఱ అందాది ఎణ్బత్తేళిన్దాన్ వాళియే

పెరియ తిరువందాది అనే ప్రబంధంలో 87 పాశురాలు ఉన్నాయి.ఈనం అనగా హీనత. మనలోని హీనతను తొలగించడానికి నమ్మాళ్వార్ ఈ 87 పాశురాలను మనకు అనుగ్రహించారు.అటువంటి నమ్మాళ్వార్ చిరకాలం వర్ధిల్లుగాక.  ముదల్ తిరువందాది, ఇరండామ్ తిరువందాది, మూన్రామ్ తిరువందాది మరియు నాన్ముగన్ తిరువందాది వంటి ఇతర ప్రబంధాలు అంతాది క్రమంలో ఉన్నప్పటికీ, ఈ ప్రబంధానికి మాత్రమే ‘పెరియ’ (పెద్ద/గొప్ప) తిరువందాది అనే ప్రత్యేక పేరు ఎందుకు వచ్చింది?  ఇతర అంతాది ప్రబంధాలలో 100 పాశురాలు ఉంటాయి. ఈ ప్రబంధంలో కేవలం 87 పాశురాలు మాత్రమే ఉన్నప్పటికీ,  నమ్మాళ్వార్ ఈ ప్రబంధం ద్వారా మనకు ఎంతో విలువైన సంప్రదాయ రహస్యాలను (విషయాలను) ప్రసాదించడం వల్ల దీనికి “పెరియ” (గొప్ప) అనే పేరు వచ్చింది.ఈ గ్రంథంలో , 75వ పాశురములో, నమ్మాళ్వార్ ఎమ్బెరుమాన్‌ను “నీవు ‘పెరియన్’ వా? లేక నేను ‘పెరియన్’ నా?” అని అడుగుతారు. నమ్మాళ్వార్ ఎమ్బెరుమాన్‌తో “అందరూ నిన్ను సర్వేశ్వరుడవని,అందరికంటే గొప్పవాడివని కీర్తిస్తారు” అని అంటారు. మీరు ‘పెరియన్’ – పరమాత్మగా కీర్తించబడుతున్నారు. అటువంటి సర్వోన్నత ప్రభువుగా నా చెవుల ద్వారా ప్రవేశించి, నా హృదయంలో శాశ్వతంగా కొలువై ఉన్నారు. కాబట్టి, “నేను మీకంటే పెద్దవాడిని కాదా?” అని అంటారు.ఈ పాశురంలో ఆళ్వార్ల యొక్క గాఢమైన భక్తి, ప్రపత్తి, అనుభూతి అటువంటిది. అందుకే, ఈ ప్రబంధానికి “పెరియ” తిరువందాది అనే పేరు వచ్చింది. ఆళ్వార్లు తన అవతార స్థలమైన ఆళ్వార్ తిరునగరిలో కూడా “పెరియన్” గా ప్రసిద్ధి చెందారు. అరుళప్పాడు (దివ్య ప్రబంధ గానం) సమయంలో, ఆళ్వార్లను “నమ్ పెరియన్” అని కీర్తిస్తారు. మన అల్పత్వాన్ని తొలగించడానికి మనకు పెరియ తిరువందాదిని అనుగ్రహించిన అటువంటి నమ్మాళ్వార్లు చిరకాలం వర్ధిల్లాలి (పల్లాండు)! 

ఇలగు తిరువాయిమొళి ఆయిరత్తొరు నూఱ్ఱిరన్దురైత్తాన్ వాళియే

నమ్మాళ్వార్ “తిరువాయిమొళి” అనే శీర్షికతో సాటిలేని 1102 పాశురాల గ్రంథమును రచించారు. ఈ గ్రంథం 4000 దివ్య ప్రబంధాలలో మకుటాయమానమైనది.ఆచార్య నమ్పిళ్ళై గారి ప్రసిద్ధమైన తిరువాయిమొళి వ్యాఖ్యానానికి “భగవద్ విషయం” అని “ఈడు 36000 పడి వ్యాఖ్యానం” అని పేర్లు.అంతటి మహిమాన్వితమైన తిరువాయిమొళిని మనకు అనుగ్రహించారు నమ్మాళ్వార్. “ఇలగు” అంటే చాలా సులభమైనది అని అర్థం. తిరువాయిమొళి సామవేదానికి సమానమైనదిగా భావిస్తారు.సామవేదంలో 1000 కంటే ఎక్కువ శాఖలు ఉన్నాయి.సాధారణంగా అందరికీ వేదాలను, వాటి అంతరార్థాలను అర్థం చేసుకోవడం చాలా కష్టమైనది మరియు సాధ్యం కానిది.  కనుక, అందరూ సులభంగా అర్థం చేసుకునేందుకు వీలుగా, నమ్మాళ్వార్ తిరువాయిమొళి ద్వారా ఆ వేదాల సారాన్ని సరళీకరించి, తేలికైన తమిళ భాషలో సంగ్రహంగా అందించారు. ఈ ప్రబంధం ద్వారా ఆళ్వార్‌ ఎన్నో అద్భుతమైన దివ్యానుభవాలను వ్యక్తం చేశారు. ఇందుకోసం ఆయన భగవదనుభవం కోసం పరితపించే భక్తుడిగా, భగవానుని ప్రేయసికి తల్లిగా,  ప్రేయసిగా (నాయికా అవస్థ), మరియు చెలికత్తెగా వివిధ పాత్రలు పోషించారు. అంతేకాక దూతలుగా సందేశాలు పంపడం, మరియు ‘మడల్’ (ప్రియుడిపై బహిరంగంగా ఫిర్యాదు చేసి, సమాజం ముందు సిగ్గుచేటు కలిగించే ఒక ప్రాచీన సంప్రదాయం) వంటివి కూడా చేశారు.ఎందుకంటే భక్తుని కోరిక ను అందరి ముందు అడిగితే అది తొందరగా భగవంతుడు నెరవేరుస్తాడు.  మరియు ఇలాంటి అనేక అనుభవాలు అతని పాశురాల ద్వారా తెలుపబడతాయి. ఇది శాస్త్రాలలో వివరించబడిన అన్ని లోతైన భావాలను స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ తనియన్ ద్వారా వివరించబడిన అర్థ పంచక జ్ఞానాన్ని కూడా ఇది వ్యక్తపరుస్తుంది.

మిక్క ఇఱై నిలైయుమ్ మెయ్యామ్ ఉయిర్ నిలైయుమ్ 

తక్క నెఱియుమ్ తడైయాగిత్ తొక్కియలుమ్ 

ఊళ్ వినైయుమ్ వాళ్వినయుమ్ ఓదుమ్ 

కురుగైయర్ కోన్ యాళిన్ ఇసై వేదత్తియల్

ఇఱై నిలైయ్ అంటే పరమాత్మ స్వరూపం. ఉయిర్ నిలైయ్ అంటే జీవాత్మ స్వరూపం.  నెఱి అంటే పెరుమాళ్ళని చేరుకోవడం.  ఊళ్ వినై అంటే జీవాత్మ ఎమ్బెరుమాన్‌ను చేరడానికి ఎదురయ్యే అడ్డంకులు, కర్మబంధాలు.  వాళ్వినై అంటే మనం చేరుకోగల పరమ పురుషార్థం,మోక్షం. తిరువాయిమొళి పాశురాలు ప్రతి ముముక్షువు తప్పక తెలుసుకోవలసిన ఈ 5 ముఖ్యమైన అర్థాలను చాలా సులభమైన రీతిలో వివరిస్తాయి.అటువంటి తిరువాయిమొళిని మనకు అనుగ్రహించిన నమ్మాళ్వార్ చిరకాలం వర్ధిల్లాలి (పల్లాండు)! 

వానణియుమ్ మామాడక్ కురుగై మన్నన్ వాళియే

నమ్మాళ్వార్లు అవతరించిన తరువాతనే,తిరుక్కురుగూర్ దివ్యదేశం ఆళ్వార్ తిరునగరిగా పేరుగాంచింది. ఈ దివ్యదేశంలో పెరుమాళ్ళు అయిన “పొలిన్దు నిన్ఱ పిరాన్” తో నమ్మాళ్వార్లు అర్చావతార అనుభవాన్ని సంపూర్ణంగా పొందారు.  నమ్మాళ్వార్లు ఈ పాశురం ద్వారా ‘ఆది పిరాన్’ (పరమాత్మ) సర్వోన్నతుడైన భగవానుడు అని కొనియాడారు.

ఒన్ఱుం దేవుం ఉలగుం ఉయిరుం మఱ్ఱుం యాదుం ఇల్లా  

అన్ఱు నాన్ముగన్ తన్నొడు దేవర్ ఉలగోడు ఉయిర్ పడైత్తాన్ 

కున్ఱం పొల్ మణి మాడ నీడు తిరుక్కురుగూర్ అదనుళ్  

నిన్ఱ ఆదిప్పిరాన్ నిఱ్క మఱ్ఱైత్ తైవం నాడుదిరే 

దేవతలు, వారి లోకాలు, ఇతర జాతులు, మరియు సమస్త ప్రాణులు అన్నీ లయమై భగవానునిలో ఐక్యమైనప్పుడు, సమష్టి పురుషుడైన బ్రహ్మను, దేవతలను, వారి లోకాలను మరియు ఇతర భిన్నమైన జీవరాశులను ఎంపెరుమాన్ (శ్రీమన్నారాయణుడు) సృష్టించారు. అలాంటి ఎంపెరుమాన్, పర్వతాల వంటి ఉన్నతమైన భవనాలు కలిగిన ఆళ్వార్ తిరునగరిలో వేంచేసియున్నారు. ఆయన సమస్త సృష్టికి కారణం మరియు గొప్ప ఉపకారి. అలాంటప్పుడు, సృష్టి మరియు ప్రళయాలకు లోబడి ఉండే ఈ ఇతర దేవతలను మీరు ఆశ్రయించడం తగునా? అని ఈ పాశురానికి అర్థం.  అంతేకాకుండా, నంపిళ్ళై మరియు అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ తమ వ్యాఖ్యానాలలో, ఈ దివ్యదేశం యొక్క గొప్పతనాన్ని చాటడానికి ‘కురుగూర్ చడగోపన్’ అనే నామం విన్న ప్రతిసారీ గౌరవపూర్వకంగా చేతులు జోడించాలని నొక్కి చెప్పారు. ఈ సాంప్రదాయం నేటికీ దివ్య ప్రబంధ గోష్ఠిలో కొనసాగుతోంది. పూర్వాచార్యుల వ్యాఖ్యానాలలో కూడా ఇది ఒక నియమంగా పేర్కొనబడింది. పెద్ద పెద్ద భవనాలు కలిగిన అటువంటి కురుగూర్ నగరానికి రాజుగా భావించబడే నమ్మాళ్వార్ వర్ధిల్లాలి (పల్లాండు)!

వైగాసి విసాగత్తిల్ వన్దుదిత్తాన్ వాళియే

వైశాఖ మాసంలో వచ్చే విశాఖా నక్షత్రం, నమ్మాళ్వార్ల యొక్క తిరునక్షత్రం.  ఉపదేశ రత్తిన మాలైలో మణవాళ మామునులు “ఉణ్డో వైగాసి విశాగత్తిర్కు ఒప్పు ఒరునాళ్” అని ఉపదేశించారు.  ఆ రోజుకు ఉన్న గొప్పతనం అటువంటిది.  ప్రతి సంవత్సరం ఆళ్వార్ తిరునగరిలో వైశాఖ విశాఖం రోజున ముగిసే విధంగా 10 రోజుల పాటు ఉత్సవం ఎంతో వైభవంగా నిర్వహించబడుతుంది. ఆళ్వార్ విగ్రహాన్ని ఒక చెక్క బల్లపై ఉంచి తామ్రపర్ణి నదిలో ఉంచడం ద్వారా ఆళ్వార్‌కి ఒక ప్రత్యేకమైన తీర్థవారి (తిరుమంజనం – అభిషేకం అనే ఆచారం) జరుగుతుంది.  ఇలాంటి సాటిలేని దృశ్యం మరెక్కడా కనిపించదు. ఇంతటి పవిత్రమైన వైశాఖ విశాఖ నాడు ఆళ్వార్ ఈ లోకంలోకి అవతరించారు.  ఆళ్వార్ విగ్రహ ప్రతిష్ఠ జరిగిన మాఘ మాసంలో వచ్చే విశాఖ నక్షత్రం నాడు కూడా ఇలాంటి తీర్థవారే జరుగుతుంది. ఒక మాఘ మాసం విశాఖ నక్షత్రం నాడే మధురకవి ఆళ్వార్ తామ్రపర్ణి నది నీటిని కాచి, నమ్మాళ్వార్ల దివ్య విగ్రహాన్ని వెలికితీశారు. వైశాఖ విశాఖ నాడు అవతరించిన నమ్మాళ్వార్లు చిరకాలం వర్ధిల్లాలి (పల్లాండు)!

సేనైయర్ కోణ్ అవతారమ్ శెయ్ద వళ్ళల్ వాళియే

సేనైముదల్వర్ గా కొనియాడబడే విశ్వక్సేనుని దివ్య అంశతో నమ్మాళ్వార్ అవతరించారని ప్రశంసిస్తారు. ఆళ్వారులు వాస్తవానికి ఈ సంసార చక్రంలో ఉన్నవారేననీ, వారిని భగవానుడే స్వయంగా ఎన్నుకుని ఆళ్వారులుగా మార్చాడని మనందరికీ తెలిసినదే.  ఆళ్వార్‌ను కొన్నిసార్లు తిరుక్కురుంగుడి నంబి అవతారంగానూ, మరికొన్నిసార్లు విశ్వక్సేన అవతారంగానూ కొనియాడుతారు.ఇది ఆళ్వార్ల యొక్క గొప్ప గుణాల వల్లనే జరిగింది. అంతేకాక, భగవంతుడు (ఎంపెరుమాన్) సంసారం నుండి ఒక జీవాత్మను ఎంపిక చేసి, ఆ ఆత్మలో విష్వక్సేనుల వారి గుణాలను ప్రేరేపించారని మన పెద్దలు వివరించారు.వేదాల సారాంశాన్ని తన సాటిలేని పాశురాల రూపంలో అందించినందున, ఆళ్వార్‌ను ‘వళ్ళల్’ (గొప్ప దాత లేదా ఉదార స్వభావులు) గా భావించవచ్చు. వారు ఎంతటి ఉదార స్వభావులంటే, ఆయన స్వయంగా రచించిన పాశురాలతో పాటు మిగిలిన ఆళ్వార్లు రచించిన సమస్త ప్రబంధాలను కూడా శ్రీమన్నాథమునులకు అనుగ్రహించారు.  నాథమునులు ఆళ్వార్ తిరునగరిలోని ‘తిరుపుళి ఆళ్వార్’ (పవిత్రమైన చింతచెట్టు) కింద కూర్చుని, నమ్మాళ్వార్ దర్శనం పొందాలని మరియు ఆయన తిరువాయ్మొళి పాశురాలను గ్రహించాలనే సంకల్పంతో ‘కణ్ణినుణ్ శిరుత్తాంబు’ను 12000 సార్లు పఠించారు. అప్పుడు నమ్మాళ్వార్ ఆయనకు ప్రత్యక్షమై, తన తిరువాయ్మొళి పాశురాలతో పాటు మొత్తం 4000 పాశురాలను ప్రసాదించారు.  మిగిలిన ఆళ్వారులు అందరూ నమ్మాళ్వారుల తిరుమేనిలో (దివ్య శరీరంలో) భాగంగా పరిగణించబడతారు (అవయవి – అవయవ భావం). మరియు నమ్మాళ్వారులకు భూత, భవిష్యత్, వర్తమాన కాలముల జ్ఞానం ఉన్న దివ్యజ్ఞాని కాబట్టి, ఆయన శ్రీమన్నాథమునులకు సమస్త ప్రబంధములను అనుగ్రహించగలిగారు.  దివ్య ప్రబంధం నేటి వరకు మనకు ఈ పద్ధతిలోనే అందించబడుతోంది. నమ్మాళ్వార్ శ్రీమన్నాథమునులకు దివ్య ప్రబంధం యొక్క అంతరార్థాలను కూడా బోధించారు.  ఆళ్వార్ అంతటితో తన కరుణను ఆపలేదు! ఆయన శ్రీ శఠారి రూపంలో ఉంటూ, మనకు ఆ ఎంపెరుమాన్ (భగవంతుని) చేరుకునే మార్గాన్ని చూపిస్తున్నారు. ఆయన శ్రీ శఠారి రూపంలో వేంచేసి ఉండి, ఎంపెరుమాన్ దివ్య చరణారవిందాల (పద్మముల వంటి  పాదాల) అనుగ్రహం మనకు లభించేలా చేస్తున్నారు! ఇంతటి ఉదార గుణం కలిగిన ఆ నమ్మాళ్వార్ గారు చిరకాలం వర్ధిల్లాలి (పల్లాండు)!

తిరుక్కురుగైచ్ చడగోపన్ తిరువడిగళ్ వాళియే

తిరుక్కురుగూర్ చడగోపన్‌గా కీర్తింపబడే నమ్మాళ్వార్ చిరకాలం వర్ధిల్లుగాక.  నమ్మాళ్వార్లు దోషరహితమైన జ్ఞానము మరియు భక్తితో అనుగ్రహింపబడినవారు.  అందువల్లనే ఆయన పుట్టే సమయంలో గర్భాన్ని ఆవరించి ఆత్మను అజ్ఞానంతో కప్పే “శఠవాయువు” పట్ల తమ కోపాన్ని ప్రదర్శించారు.  ఆ కారణం చేత అతను శఠకోపన్ గా ప్రసిద్ధి చెందారు. ఒక ఆత్మ తల్లి గర్భంలో ప్రవేశించినప్పుడు, అది ఎన్నో కష్టాలను అనుభవిస్తుంది. ఆత్మ జన్మించగానే తనకు మోక్షాన్ని ప్రసాదించమని అది సర్వేశ్వరుడిని (ఎంపరుమాన్) ప్రార్థిస్తుంది.అయినప్పటికీ, జన్మ సమయంలో ‘శఠ వాయువు’  ఆత్మ యొక్క నిజమైన జ్ఞానాన్ని కప్పివేస్తుంది.  దీనివల్లనే ఆత్మ అజ్ఞానంతో నిండిపోయి, ఈ సంసారిక (భౌతిక) ప్రపంచంలో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.  అయితే, మన నమ్మాళ్వార్ జన్మ సమయములోనే ఆ శఠ వాయువు యొక్క పొరను తరిమికొట్టి, అది తన నిజమైన జ్ఞానాన్ని కప్పివేయకుండా అడ్డుకున్నారు. అందువల్లనే ఆయన ‘శఠకోపన్’ అని ప్రసిద్ధి చెందారు. అటువంటి శఠకోపన్ చిరకాలం వర్ధిల్లాలి (పల్లాండు)!

తిరుక్కురుగూర్ యొక్క వైభవం:

తిరుక్కురుగూర్ 108 దివ్యదేశాలలో ఒకటిగా మరియు నమ్మాళ్వార్ అవతార స్థలంగా ప్రసిద్ధి చెందింది.ఈ దివ్యదేశం గొప్పది అని గర్వపడటానికి మరో కారణం కూడా ఉంది. అది ఏమిటంటే ఇక్కడే ఎంపెరుమానార్ (రామానుజాచార్యులు) యొక్క భవిష్యదాచార్య విగ్రహం లభించింది! మధురకవి ఆళ్వార్ నమ్మాళ్వార్ యొక్క దివ్య తిరుమేనిని పొందాలని కోరుకున్నప్పుడు, ఆయనను తామ్రపర్ణి నదీ జలాలను మరిగించమని నమ్మాళ్వార్లు ఆదేశించారు. అతను అలా చేసినప్పుడు, అంజలి ముద్రతో (చేతులు జోడించి) ఉన్న భవిష్యదాచార్యుల వారి మొదటి విగ్రహం కనిపించింది. మధురకవి ఆళ్వార్ ఆశ్చర్యపోయి, ఈ ఆచార్యులు ఎవరో చెప్పమని నమ్మాళ్వార్‌ను ప్రార్థించగా, నమ్మాళ్వార్ ఇలా సమాధానమిచ్చారు.“ఆయన నా తిరువడి సమానమైన ఆచార్యులు. మన సంప్రదాయాన్ని రక్షించి, అభివృద్ధి చేయడానికి ఈ లోకంలో 4000 సంవత్సరాల తర్వాత ఆయన అవతరిస్తారు. మధురకవి ఆళ్వార్ తామ్రపర్ణి నదీ జలాలను మరలా మరిగించి నమ్మాళ్వార్ విగ్రహాన్ని పొందారు. ఈనాడు మనం ఆళ్వార్ తిరునగరిలో ఆరాధించే విగ్రహం అదే.  నేటికి ఆళ్వార్ తిరునగరిలో భవిష్యదాచార్యాన్ దర్శనం మనం చేసుకోవచ్చు. ఈ సన్నిధి ఆళ్వార్ తిరునగరిలోని ఆదినాథర్/ఆళ్వార్ ఆలయానికి పడమర వైపున ఉంది.  మధురకవి ఆళ్వార్ పొందిన విగ్రహం ఇదే.

ఆళ్వార్ తిరునగరిగా ప్రసిద్ధి చెందిన ఈ తిరుక్కురుగూర్, మణవాళ మామునిగళ్ జన్మస్థానం కూడా. ఆయన తన తల్లి స్వగ్రామమైన ‘శిక్కిల్ కిడారం’లో కొన్ని సంవత్సరాలు జీవించారు. తిరువాయ్మొళి పిళ్ళై వైభవం గురించి విని ఆయన తిరుక్కురుగూర్ చేరుకుని, తనను శిష్యుడిగా స్వీకరించాలని ఆయన్ను కోరారు.ఆయన వద్దనే మామునిగళ్‌ మన సంప్రదాయంలోని సూత్రాలన్నింటినీ నేర్చుకుని, కైంకర్యాలు చేసేవారు.చతుర్వేది మంగళాన్ని స్థాపించి, భవిష్యదాచార్యన్ సన్నిధి నిర్మించి,ఆ సన్నిధిలో కార్యక్రమాలు శాస్త్ర ప్రకారం జరిగేలా చూసింది తిరువాయిమొళి పిళ్ళై గారే. ఆయన ఆదేశానుసారం, రామానుజులవారి అవతారంగా (యతీ పునరవతారం) పరిగణించబడే మాణవాళ మామునిగళ్, భవిష్యాదాచార్యులకు తిరువారాధనం నిర్వహించేవారు.  తిరువాయిమొళి పిళ్ళై గారు పరమపదించిన తర్వాత, మణవాళ మామునులు శ్రీరంగానికి చేరుకుని సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తారు. ఆయన తన అసలు పేరైన ‘అళగియ మణవాళ ప్పెరుమాళ్ నాయనార్’ అనే పేరును కోల్పోయి, ‘అళగియ మణవాళ మామునులు’గా ప్రసిద్ధి చెందుతారు.

భవిష్యదాచార్యన్ విగ్రహం, రామానుజుల వారు శ్రీపెరంబుదూరులో అవతరించడానికి చాలా కాలం ముందే లభించినందున, ఈ తిరుక్కురుగూర్ దివ్యదేశం ఆళ్వార్ (నమ్మాళ్వార్), ఎంపెరుమానార్ (రామానుజర్), జీయర్ (మణవాళ మామునులు) లకు అవతార స్థలంగా కీర్తింపబడుతుంది.

ఆళ్వార్, ఎంబెరుమానార్, జీయర్ తిరువడిగళే శరణం

అడియేన్ శ్రీ తేజ రామానుజ దాసి 

అడియేన్ లక్ష్మీ సేనాపతి రామానుజ దాసి 

పొందుపరచిన స్థానము – https://divyaprabandham.koyil.org

ప్రమేయము (లక్ష్యము) – https://koyil.org 
ప్రమాణము (గ్రంథములు) – http://granthams.koyil.org 
ప్రమాత (పూర్వాచార్యులు) – http://acharyas.koyil.org 
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org 

Leave a Comment