శ్రీః శ్రీమతే శఠగోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః

తిరుమళిశై ఆళ్వార్
తిరుమళిశై ఆళ్వార్ తిరుమళిశై అనే క్షేత్రంలో అవతరించారు. వీరి తిరునక్షత్రం పుష్య మాసంలో వచ్చే మఖ నక్షత్రం నాడు. ఆయన అనేక ప్రబంధాలతో ఈ లోకాన్ని అనుగ్రహించారు. కానీ దురదృష్టవశాత్తు, ఇప్పుడు రెండు ప్రబంధాలు మాత్రమే లభిస్తున్నాయి. అవి నాన్ముగన్ తిరువందాది మరియు తిరుచ్చందవిరుత్తం. తిరుమళిశై ఆళ్వార్ ఎంపెరుమాన్ యొక్క అంతర్యామిత్వంలో (లోపల కొలువై ఉన్న పరమాత్మ తత్వంలో) లోతుగా మునిగిపోయారు. సర్వశక్తిమంతుడైన భగవంతుడు గొప్ప యోగులకు, భక్తులకు వారి హృదయాల లోపల స్వయంగా ప్రత్యక్షమవుతారని ఆయన నమ్ముతారు. ఎంపెరుమాన్ ఈ విధంగా ఆళ్వార్లకు తనని తాను ప్రత్యక్షం చేసుకున్నాడు. ఆళ్వార్ దీనిలో పూర్తిగా లీనమైపోయారు. అంతేకాకుండా శ్రీ వైష్ణవులు శ్రీమన్నారాయణుడికి మాత్రమే శరణాగతి చేయాలి అనే దృఢమైన అభిప్రాయం తిరుమళిశై ఆళ్వార్ కు ఉంది. శ్రీమన్నారాయణుడిని మర్చిపోయినా కూడా దేవతాంతరాలు (ఇతర దేవతలు) గురించి ఆలోచించకూడదు అని వారు పూర్తిగా నమ్మే వారు.
తిరుమళిశై ఆళ్వార్ యొక్క వాళి తిరునామములు:
అన్బుడన్ అందాది తొణ్ణూఱాఱు ఉరైత్తాన్ వాళియే
అళగారుం తిరుమళిశై అమర్న్ద శెల్వన్ వాళియే
ఇన్బమిగు తైయిల్ మగత్తింగు వందాన్ వాళియే
ఎళిల్చందవిరుత్తం నూఱ్ఱిరుపదు ఈందాన్ వాళియే
మున్బుగత్తిల్ వందుదిత్త మునివనార్ వాళియే
ముళుప్ పెరుక్కిల్ పొన్ని ఎదిర్ మిదంద శొల్లోన్ వాళియే
నన్పువియిల్ నాలాయిరత్తు ఎళునూఱ్ఱాన్ వాళియే
నంగళ్ పత్తి సారన్ ఇరు నఱ్పదంగళ్ వాళియే
తిరుమళిశై ఆళ్వార్ యొక్క వాళి తిరునామములు – సరళ వివరణ:
అన్బుడన్ అందాది తొణ్ణూఱాఱు ఉరైత్తాన్ వాళియే
సంసారుల పట్ల తిరుమళిశై ఆళ్వార్కున్న కరుణ వలన, ఎంపెరుమాన్ పట్ల ఆయనకున్న అపారమైన ప్రేమ వలన, 96 పాశురాలు కలిగిన నాన్ముగన్ తిరువందాదిని ఆయన అనుగ్రహించారు.ఈ ప్రబంధం ‘నాన్ముగన్ నారాయణన్ పడైత్తాన్’ అని ప్రారంభమవుతుంది కనుక దీనికి నాన్ముగన్ తిరువందాది అనే పేరు వచ్చింది.
ఈ ప్రబంధం అంతాది క్రమంలో అమర్చబడింది. తిరుమళిశై ఆళ్వార్కు ఎంపెరుమాన్ పట్ల అపారమైన ప్రేమ ఉండేది, అందుకే ఈ ప్రబంధాన్ని అనుగ్రహించారు. ఇది ఒక రకమైన కారణం. మనం ఇంకో విధంగా కూడా చెప్పుకోవచ్చు. ఈ భౌతిక ప్రపంచంలో సంసారులు చాలా కష్టాలు పడుతున్నారు. వారు పెరుమాళ్ యొక్క అనుగ్రహం పొందటానికై ప్రార్థించటానికి ఈ ప్రబంధం ఆళ్వార్ అందించారని రెండవ కారణంగా చెప్పుకోవచ్చు.
అళగారుం తిరుమళిశై అమర్న్ద శెల్వన్ వాళియే
తిరుమళిశై క్షేత్రం చాలా అందమైనది.దీనినే మహీసార క్షేత్రం అని కూడా అంటారు. ఇక్కడ ఆళ్వార్ను ‘సెల్వన్’ అని సంబోధిస్తారు.అంటే ఐశ్వర్యవంతుడు అని అర్థం. ఈ ఆళ్వార్కు ఐశ్వర్యం ఏమిటి అంటే – ఇక్కడ మనం డబ్బు గురించి మాట్లాడడం లేదు. మనం కైంకర్యం అనే సెల్వం గురించి మాట్లాడుతున్నాం. కైంకర్యం అనే ఐశ్వర్యం కలిగిన ఆ సెల్వన్ (ఆళ్వార్) వేల వేల సంవత్సరాలు వర్ధిల్లాలి(పల్లాండు)!
ఇన్బమిగు తైయిల్ మగత్తింగు వందాన్ వాళియే
ఈ వాక్యం ఆళ్వార్ జన్మ నక్షత్రాన్ని మరియు అవతరించిన మాసం గురించి తెలుపుతుంది. ఆళ్వార్ అవతారం ‘తై’ (పుష్య) మాసంలో జరిగింది. వారి తిరు నక్షత్రం ‘మఖ’. ఆళ్వార్ అవతారం కారణంగా, పుష్య మాసం మరియు మఖ నక్షత్రం ఎంతో శోభాయమానంగా మారాయి. ఇంతటి ఆనందానికి కారణమైన ఈ ఆళ్వార్ చిరకాలం వర్ధిల్లాలి (పల్లాండు)!
ఎళిల్చందవిరుత్తం నూఱ్ఱిరుపదు ఈందాన్ వాళియే
తిరుమళిశై ఆళ్వార్ రచించిన ప్రబంధాలలో ఒకటైన ‘తిరుచ్చందవిరుత్తం’ ఎంతో కవితాత్మకమైనది. ఇందులో వాడిన పదాలు ఎంతో అర్థవంతమైనవి మరియు గొప్పగా ఉంటాయి. అంతేకాక, ఈ ప్రబంధం ‘విరుత్తం’ (వృత్తం) అనే ఛందోరూపంలో సాగుతుంది. వీటిని రాగం, తాళంతో గానం చేయవచ్చు. ఈ రెండు అంశాలు ఈ ప్రబంధాన్ని మరింత మనోహరంగా మారుస్తాయి. ఈ తిరుచ్చందవిరుత్తంలో మొత్తం 120 పాశురాలు ఉన్నాయి. ఎంతో అందమైన ఈ ప్రబంధాన్ని మనకందించిన ఆళ్వార్ చిరకాలం వర్ధిల్లాలి (పల్లాండు)!
మున్బుగత్తిల్ వందుదిత్త మునివనార్ వాళియే
తిరుమళిశై ఆళ్వార్ ద్వాపర యుగంలో జన్మించి, కలియుగంలో చాలా సంవత్సరాలు తపస్సులో ఉన్నారు. ఆయన 4,700 సంవత్సరాలు జీవించారని చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఆయన ఎల్లప్పుడూ ధ్యానంలో ఉంటూ, భగవంతుని (ఎంపెరుమాన్) కళ్యాణ గుణాలలో నిమగ్నమై ఉండేవారు. ఆళ్వార్లు మునుపటి యుగంలో జన్మించారు. వారు మరెన్నో సంవత్సరాలు వర్ధిల్లుదురు గాక (పల్లాండు)!
ముళుప్ పెరుక్కిల్ పొన్ని ఎదిర్ మిదంద శొల్లోన్ వాళియే
తిరుమళిశై ఆళ్వార్ అనేక ప్రబంధాలు రచించారు.ఈ లోకంలో ఏవి ఉండాలో నిర్ణయించాలని వారు భావించారు. పొన్ని నదికి (కావేరి) వరద వచ్చినప్పుడు, వారు తమ ప్రబంధాలు అన్నిటినీ ఆ వరదలో వేసేశారు. తిరుచ్చందవిరుత్తమ్ మరియు నాన్ముగన్ తిరువందాది గ్రంథాలు మాత్రం ఆళ్వార్ వద్దకు తేలి వచ్చాయి. మిగిలిన గ్రంథాలన్నీ నీటిలో కొట్టుకుపోయాయి. ‘సొల్లోన్’ అంటే – ఆ మాటలకు అధిపతి, అలాంటి ఈ ఆళ్వార్ వేల వేల సంవత్సరాలు వర్తిల్లాలి (పల్లాండు)!
నన్పువియిల్ నాలాయిరత్తు ఎళునూఱ్ఱాన్ వాళియే
తిరుమళిశై ఆళ్వార్ ఈ లోకంలో 4700 సంవత్సరాలు జీవించారు. ఈ ఆళ్వార్ చిరకాలం వర్ధిల్లాలి (పల్లాండు)!
నంగళ్ పత్తి సారన్ ఇరు నఱ్పదంగళ్ వాళియే
ఈ ఆళ్వార్కు మరొక తిరునామం భక్తిసారులు. ఈయన దివ్య తిరువడి శాశ్వతంగా వర్ధిల్లాలి (పల్లాండు)!
తిరుమళిశై ఆళ్వార్ను ‘తిరుమళిశై పిరాన్’ అని కూడా పిలుస్తారు. వారు తిరుక్కుడందై ఆరావముదన్ పట్ల ఎంతో ఆరాధనాభావంతో ఉండేవారు. సాధారణంగా, మనకు సహాయం చేసేవారిని లేదా మానవ శ్రేయస్సుపై ఆసక్తి ఉన్నవారిని సూచించడానికి భగవంతునికి ‘పిరాన్’ అనే పేరు ఉంటుంది. అయితే, ఈ ఆళ్వార్కు, భగవంతునికి మధ్య ఉన్న ప్రత్యేకమైన బంధం మరియు అప్యాయత కారణంగా ‘పిరాన్’ అనే బిరుదు ఈ ఆళ్వార్కే దక్కింది. ఫలితంగా భగవంతుడు ‘ఆరావముదాళ్వార్’ అని పిలువబడుతున్నాడు.
ఆళ్వార్, ఎంబెరుమానార్, జీయర్ తిరువడిగళే శరణం
అడియేన్ శ్రీ తేజ రామానుజ దాసి
అడియేన్ లక్ష్మీ సేనాపతి రామానుజ దాసి
మూలం: https://divyaprabandham.koyil.org/index.php/2024/03/vazhi-thirunamams-thirumazhisai-azhwar-simple/
పొందుపరచిన స్థానము – https://divyaprabandham.koyil.org
ప్రమేయము (లక్ష్యము) – https://koyil.org
ప్రమాణము (గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (పూర్వాచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org