ఆళ్వార్లు/ఆచార్యుల వాళి తిరునామాలు – మణవాళ మామునుల వైభవం

శ్రీ:  శ్రీమతే శఠగోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమతే వరవరమునయే నమః

పూర్తి వ్యాసమాలిక 

<< తిరువాయ్మొళిప్పిళ్లై  వైభవం

మణవాళ మామునులు – శ్రీరంగనాథుని సమక్షంలో కాలక్షేపం

మామునిగల్ శ్రీరంగనాథుని ఎదురుగా కూర్చుని కాలక్షేపం సాయిస్తున్న దృశ్యం

శ్రీ మణవాళ మామునులు ‘రమ్యజామాతృ ముని’ మరియు ‘వరవర ముని’ అని కీర్తింపబడ్డారు. వీరు ఆశ్వీయుజ మాసంలో, మూల నక్షత్రాన ఆళ్వార్ తిరునగరిలో అవతరించారు. శ్రీరంగనాథుని ఉత్సవమూర్తి నామధేయమైన ‘అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్’ అనేది వీరి పూర్వాశ్రమ నామం. బాల్యంలో వీరు తమ మాతృగ్రామమైన సిక్కిల్ కిడారంలో నివసించారు. తమ తండ్రి గారైన  తిరునావీరు ఉడైయ పిరాన్ తాదర్ అణ్ణన్ గారి వద్ద శాస్త్రాల యొక్క ప్రాథమికాంశాలను అభ్యసించారు.తదనంతరం, తిరువాయ్‌మొళి పిళ్లై గారి వైభవాన్ని ఆలకించిన వీరు, తిరిగి ఆళ్వార్ తిరునగరికి చేరుకున్నారు. అక్కడ తిరువాయ్‌మొళి పిళ్లై గారిని ఆశ్రయించి, వారిని తమ ఆచార్యునిగా స్వీకరించి శరణాగతి చేశారు. తిరువాయ్‌మొళి పిళ్లై గారు వీరికి—సాంప్రదాయిక రహస్యార్థాలను, ఆళ్వార్ల అరుళిచ్చెయల్ (4000 దివ్య ప్రబంధం) పాశురాలను, వాటి వ్యాఖ్యానాలను, మరియు అత్యంత ప్రధానంగా (వడక్కు తిరువీధి పిళ్లై గారిచే లిఖితమైన) తిరువాయ్‌మొళి యొక్క ‘36,000 పడి ఈడు వ్యాఖ్యానాన్ని’ ఉపదేశించారు.

వీరు సాక్షాత్ ఆ ఆదిశేషుని అవతారంగా భావించబడతారు. ఎంపెరుమానార్లు (శ్రీ రామానుజాచార్యులు) తమిళ ప్రబంధములకు ప్రత్యేకంగా వ్యాఖ్యానములు రచించలేదు. ఆ కొరతను తీర్చడానికే, వారు మరొక్కమారు మణవాళ మామునులుగా అవతరించి, తమిళ ప్రబంధములలో సంపూర్ణంగా నిమగ్నమై ఆళ్వార్ల దివ్య కృతులకు విశేష కైంకర్యములను సమర్పించారు. ముఖ్యంగా, ‘36,000 పడి ఈడు వ్యాఖ్యానాన్ని’ వీరు దేశమంతటా విస్తృతంగా ప్రచారం చేశారు.తిరువాయ్‌మొళి పిళ్లై గారు పరమపదించేంతవరకు వీరు ఆళ్వార్ తిరునగరిలోనే నివసించారు. శ్రీవచన భూషణ గ్రంథంలో వివరించబడిన పరమోత్కృష్టమైన ‘ఆచార్య భక్తి’కి వీరు ఒక నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. తమ హృదయంలోని ఆ అచంచలమైన ఆచార్య భక్తిని ప్రతిబింబిస్తూ, మణవాళ మామునులు తామే స్వయంగా ‘ఉపదేశ రత్తిన మాలై’ గ్రంథంలో ఈ క్రింది దివ్య పాశురాన్ని అనుగ్రహించారు:

తన్ అరియనుక్కు త్తన్ అడిమై సెయ్వదు అవన్
ఇన్నాడు తన్నిల్ ఇరుక్కుమ్ నాళ్ – అన్నేర్
అఱిందుం అదిల్ ఆసై ఇన్ఱి ఆచార్యనై
ప్పిరిందిరుప్పార్ ఆర్? మనమే! పేసు

అనగా “ఓ మనసా! నాకు ఒక సత్యాన్ని వివరించు. ఆచార్యులు ఈ భూమిపై వేంచేసి ఉన్నంత కాలమే వారికి కైంకర్యం చేసుకునే భాగ్యం తనకు దక్కుతుందని ఒక శిష్యుడికి బాగా తెలిసినప్పటికీ… ఆ ఆచార్య కైంకర్యంపై ఏమాత్రం అభిలాష లేనివాడిలా, ఏ శిష్యుడైనా తన ఆచార్యునికి దూరంగా విడిగా ఉండగలడా? (ఉండలేడు కదా!)

మణవాళ మామునులు తమ ‘ఉపదేశ రత్తిన మాలై’ గ్రంథంలో పూర్వాచార్యులు అనుగ్రహించిన పరమార్థాలన్నింటినీ కేవలం వివరించడమే కాకుండా… ఆ దివ్య బోధనలకు తమ జీవితాన్ని ఒక ప్రత్యక్ష నిదర్శనంగా మలచుకుని జీవించారని నిస్సందేహంగా చెప్పవచ్చు.

తిరువాయ్‌మొళి పిళ్లై గారు పరమపదించిన తర్వాత, వారు శ్రీరంగ క్షేత్రానికి చేరుకుని, అక్కడ ఆళ్వార్లు మరియు పూర్వాచార్యుల యొక్క అరుళిచ్చెయల్ (దివ్య ప్రబంధాలు) మరియు గ్రంథాలను అన్వేషించి, సేకరించి, లిఖితపూర్వకంగా భద్రపరిచారు. పెరియాళ్వార్ తిరుమొళికి పెరియ వాచ్చాన్ పిళ్లై గారు రచించిన వ్యాఖ్యానంలో కొంత భాగం చెదలు పట్టడం వల్ల దెబ్బతిన్నది. ఆ కొరతను పూరించడం కోసం, మణవాళ మామునులు ఆ నశించిపోయిన భాగం నుండి స్వయంగా సరికొత్త వ్యాఖ్యానాన్ని రచించారు.అంతేకాకుండా, వారు పిళ్లై లోకాచార్యుల వారి రహస్య గ్రంథాలైన ముఖ్యంగా—ముముక్షుప్పడి, శ్రీవచన భూషణం మరియు తత్వ త్రయం వంటి మహోత్కృష్ట కృతులకు దివ్య వ్యాఖ్యానాలను అనుగ్రహించారు. పిళ్లై లోకాచార్యుల వారి అనుజులైన (తమ్ముడైన) అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ రచించిన ‘ఆచార్య హృదయం’ గ్రంథానికి కూడా వీరు విస్తృతమైన వ్యాఖ్యానాన్ని అందించారు. ఒకవేళ మణవాళ మామునుల యొక్క ఈ దివ్య ఉపదేశాలు, వ్యాఖ్యానాలే గనుక లేకపోయి ఉంటే… ఆళ్వార్ల అరుళిచ్చెయల్ పాశురాలు మరియు పూర్వాచార్యుల రహస్య గ్రంథాలు ఈనాటి జనులకు ఎంతటికీ లభ్యమయ్యేవి కావు (అజ్ఞాతంలోనే ఉండిపోయేవి).

తదనంతరం, వారు సన్న్యాసాశ్రమాన్ని స్వీకరించారు. శ్రీరంగనాథుని (శ్రీరంగం ఎంపెరుమాన్) దివ్య ఆజ్ఞానుసారం, వారు తమ ‘అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్’ అనే తిరునామాన్నే (నామధేయాన్నే) నిలుపుకున్నారు. తరువాతి కాలంలో ఆ దేవదేవుడే స్వయంగా వీరి వద్ద శిష్యుడిగా మారి కాలక్షేపం ఆలకించబోతున్నాడనే సత్యాన్ని ముందే ఎరిగి… ఒక శిష్యుడిగా తనకు, తన ఆచార్యులైన మణవాళ మామునుల యొక్క తిరునామమే ఉండాలనే సంకల్పంతోనే భగవంతుడు ఆ విధంగా ఆజ్ఞాపించినట్లు గోచరిస్తోంది.ఆ పెరుమాళ్ళ యొక్క తిరువుళ్ళమునకు (దివ్య సంకల్పానికి) అనుగుణంగానే, వీరు శ్రీవైష్ణవ సంప్రదాయాన్ని పరమోన్నత స్థానానికి చేర్చారు. వీరి మహిమాన్విత వైభవాన్ని ఆలకించి, దేశదేశాల నుండి అసంఖ్యాక జనులు తరలివచ్చి వీరిని తమ ఆచార్యునిగా ఆశ్రయించి శరణాగతి చేశారు.

ఒకానొక సందర్భంలో, నంపెరుమాళ్ యొక్క  (శ్రీరంగనాథుని) పవిత్రోత్సవములు ముగిసిన అనంతరం… ఆ దేవదేవుడు మణవాళ మామునులను పిలిపించి, తిరువాయ్‌మొళి యొక్క ‘ఈడు వ్యాఖ్యానం’పై దివ్య కాలక్షేపాన్ని అనుగ్రహించవలసిందిగా ఆజ్ఞాపించారు. పెరుమాళ్ళు తమ సమస్త పరివారముతో కలసి, మామునుల ఆ దివ్య ప్రవచనాలను నిరంతరాయంగా ఆలకించడం కోసం ఒక సంవత్సరం పాటు ఆలయంలోని అన్ని ఉత్సవాలను నిలిపివేశారు. ఆ కాలక్షేప పరంపర ముగింపు మహోత్సవాన (జ్యేష్ఠ మాసము, మూల నక్షత్రం నాడు), నంపెరుమాళ్ ఒక చిన్న బాలుని రూపంలో ఆవిర్భవించి, మణవాళ మామునులను తమ ఆచార్యునిగా స్వీకరించారు. ఆ సముత్కృష్ట తరుణంలో వారు “శ్రీశైలేశ దయాపాత్రం…” అనే ప్రశంసాత్మక తనియన్‌ను సమర్పించడమే కాక, తమ సొంత ఆదిశేష పర్యంకాన్ని (శేషపాన్పును) ఆచార్య సంభావనగా సమర్పించి, మామునులను అత్యంత వైభవంగా కీర్తించారు.అంతటితో ఆగక, పెరుమాళ్ళు అర్చక ముఖేన (దైవిక ప్రేరణతో) ఒక ‘శ్రీముఖాన్ని’ (దివ్య శాసనాన్ని) ప్రకటించారు. సమస్త దివ్యదేశాలలో మణవాళ మామునుల యొక్క శ్రీవిగ్రహాలను ప్రతిష్ఠించాలని వారు ఆజ్ఞాపించారు. అంతేకాకుండా, ప్రతి నిత్యం సేవకాలం (దివ్య ప్రబంధ పారాయణం) ప్రారంభంలోనూ, ముగింపులోనూ తప్పనిసరిగా “శ్రీశైలేశ దయాపాత్రం” అనే తనియన్‌ను పఠించాలని శాసించారు. సాక్షాత్ ఆ భగవానుడే స్వయంగా తన ఆచార్యునిగా కీర్తించిన అద్వితీయమైన, సాటిలేని మహోన్నత గౌరవం ఒక్క మణవాళ మామునులకే దక్కింది.

మణవాళ మామునుల వాళి తిరునామములు

ఇప్పువియిల్ అరంగేసర్కు ఈడళిత్తాన్ వాళియే

ఎళిల్ తిరువాయ్‌మొళిప్పిళ్ళై ఇణైయడియోన్ వాళియే

ఐప్పసియిల్ తిరుమూలత్తవదరిత్తాన్ వాళియే

అరవరసప్పెరుంజోది అనంతనెన్ఱుమ్ వాళియే

ఎప్పువియుమ్ శ్రీశైలమ్ ఏత్తవందోన్ వాళియే

ఏరారుమ్ ఎతిరాసర్ ఎనవుదిత్తాన్ వాళియే

ముప్పురినూల్ మణివడముమ్ ముక్కోల్ తరిత్తాన్ వాళియే

మూదరియ మణవాళ మామునివన్ వాళియే

మణవాళ మామునుల వాళి తిరునామములు — సరళ వివరణ 

ఇప్పువియిల్ అరంగేసర్కు ఈడళిత్తాన్ వాళియే

ఈ భూమండలంపై సాక్షాత్తు ఆ శ్రీరంగనాథ స్వామికే పరమ పవిత్రమైన ‘తిరువాయ్‌మొళి ఈడు’ వ్యాఖ్యానాన్ని ఉపదేశించిన మణవాళ మామునులు చిరకాలం వర్ధిల్లుగాక (పల్లాండు)!

ఎళిల్ తిరువాయ్మొళిప్పిళ్లై ఇణైయడియోన్ వాళియే

సుందర రూపులు, తన ఆచార్యులు అయిన తిరువాయ్మొళి ప్పిళ్లై గారి దివ్య తిరువడిగా నిలిచిన మణవాళ మామునిగళ్ చిరకాలం వర్ధిల్లుగాక (పల్లాండు)!

ఐప్పసియిల్ తిరుమూలత్తవదరిత్తాన్ వాళియే

ఐప్పసి (ఆశ్వయుజం మాసం), తిరుమూలం (మూలా) నక్షత్రం రోజున ఈ లోకంలో అవతరించిన  మణవాళ మామునిగళ్ చిరకాలం వర్ధిల్లుగాక (పల్లాండు)!

అరవరసప్ పెరుంజోది  అనంతనెన్ఱుమ్ వాళియే

‘అరవు’ అంటే సర్పము. సర్పరాజైన ఆదిశేషుడు పరమ పవిత్రమైన, అపరిమితమైన దివ్య తేజస్సుతో (పెరియ జోది) విరాజిల్లుతూ ఉంటారు. ‘అనంతుడు’ అంటే అంతము లేనివాడు, అనంతమైనవాడు అని అర్థం. ఆ అనంత పద్మనాభుడైన ఎంపెరుమాన్‌ను తన శేషతల్పంపై (ఒడిలో) శయనింపజేసుకునే పరమోన్నతమైన భాగ్యం, వైభవం ఒక్క ఆదిశేషుల వారికే దక్కింది.ఈ వాక్యం దేనిని స్పష్టం చేస్తోందంటే… సాక్షాత్తు ఆ ఆదిశేషుని యొక్క దివ్య అవతారంగా కీర్తించబడుతున్న శ్రీ మణవాళ మామునులు… చిరకాలం వర్ధిల్లుగాక (పల్లాండు)! 

ఎప్పువియుం శ్రీశైలం ఏత్తవందోన్ వాళియే

తన ఆచార్యులైన శ్రీ తిరువాయ్‌మొళి పిళ్లై (శ్రీశైలేశులు) గారి కీర్తి ప్రతిష్ఠలను ఈ భూమండలమంతటా  వ్యాపింపజేసిన శ్రీ మణవాళ మామునులు చంద్రతారార్కం వర్ధిల్లుదురు గాక (పల్లాండు)! ఈ వాక్యానికి ఉన్న మరొక  అంతరార్థం ఏమిటంటే, ఒకానొక సమయంలో మణవాళ మామునులు తిరుమల (శ్రీశైలం) క్షేత్రానికి దివ్య యాత్రను గావించారు. ఆ సమయంలో, ఆ వేంకటాచలపతిని మేల్కొలిపేందుకు ఒక మధురమైన సుప్రభాత స్తోత్రం ఉంటే ఎంత బాగుంటుంది అనే దివ్య సంకల్పం వారి హృదయంలో మెదిలింది. అప్పట్లో తిరుమలలో దీర్ఘకాలంగా నివసిస్తున్న ప్రతివాది భయంకరం అణ్ణా గారు మహాపండితులు, వాదాల్లో ఎందరినో జయించిన ప్రసిద్ధ వేదాంతి. శ్రీ మణవాళ మామునుల వైభవాన్ని, జ్ఞానాన్ని తెలుసుకున్న అణ్ణా గారు వారికి పరమ శిష్యుడయ్యారు. మామునులు తన మనసులోని సంకల్పాన్ని- తిరు మలయప్పన్ (శ్రీ వేంకటేశ్వర స్వామి) కోసం ఒక విశిష్ట సుప్రభాతాన్ని సృజించాలనే అభిలాషను – అణ్ణా గారికి తెలియజేశారు. తన ఆచార్యుల ఆజ్ఞను శిరసావహించి, అణ్ణా గారు పరమ భక్తిప్రపత్తులతో ‘శ్రీ వేంకటేశ సుప్రభాతం’ ను అత్యంత సుందరంగా కూర్చారు. నేటికీ మనం నిత్యం ఆలకించే ఆ దివ్య సుప్రభాతం అదే!

​ఈ విధంగా, తన ప్రియ శిష్యుని ద్వారా శ్రీ వేంకటేశ్వర స్వామికి సుప్రభాతాన్ని కానుకగా సమర్పించి, ఆ తిరుమల క్షేత్ర మహత్యాన్ని, విశిష్టతను అఖిల విశ్వానికి చాటిచెప్పిన శ్రీ మణవాళ మామునులు – చిరకాలం వర్ధిల్లుగాక (పల్లాండు)! 

ఏరారుం ఎతిరాసర్ ఎనవుదిత్తాన్ వాళియే

సాక్షాత్తు ఆ పరమ వైభవశాలియైన ఎంపెరుమానార్ పునరవతారంగా కీర్తించబడుతున్న  శ్రీ మణవాళ మామునులు చిరకాలం వర్ధిల్లుగాక (పల్లాండు)! 

మామునులు స్వయంగా రామానుజుల వారి అవతారమే అయినప్పటికీ, ఆయన ఆళ్వార్ తిరునగరి క్షేత్రంలోని ‘భవిష్యదాచార్యుల’ (రామానుజుల వారి) సన్నిధిలో నిత్యం పరమ నిష్ఠతో తిరువారాధనము నిర్వహించేవారనే సత్యం మనకు అవగతమవుతోంది. “తనకు తానే తిరువారాధన చేసుకోవడం ఎలా సాధ్యం?” అనే సందేహం ఇక్కడ కలగవచ్చు. కానీ, ఇక్ష్వాకు వంశంలో అవతరించిన శ్రీరామచంద్రుడు, సత్యలోకం నుండి భూమికి దిగివచ్చిన తమ కులదైవమైన శ్రీరంగనాథుడిని నిత్యం ఆరాధించలేదా? తన పట్టాభిషేక మహోత్సవ సమయంలో, తాను అంతకాలం పూజించిన ఆ శ్రీరంగనాథ స్వామిని, ప్రణవాకార విమానంతో సహా శ్రీ విభీషణాళ్వార్‌కు కానుకగా సమర్పించారు శ్రీరాముడు.

ఆ తర్వాత, విభీషణుడు ఆ స్వామిని లంకకు తీసుకువెళుతూ, విశ్రాంతి కోసం మార్గమధ్యంలో కింద ఉంచగా, కావేరీ నదీ తీరంతో శోభిల్లుతున్న ఆ శ్రీరంగ క్షేత్రం నచ్చి, పెరియ పెరుమాళ్ అక్కడే శాశ్వతంగా కొలువై ఉండిపోయారని చరిత్ర మనకు చెబుతోంది.

సాక్షాత్తు భగవదవతారమైన శ్రీరాముడు పెరియ పెరుమాళ్‌కు ఏ విధంగానైతే తిరువారాధన చేశారో – అదే విధంగా భగవద్రామానుజుల పునరవతారమైన శ్రీ మణవాళ మామునులు కూడా, ఒక ఉత్తమ శిష్యుడు తన పరమాచార్యుని పట్ల ఎంతటి భక్తిశ్రద్ధలతో తిరువారాధన చేయాలో స్వయంగా ఆచరించి, లోకానికి ఒక మహోన్నతమైన మార్గాన్ని చూపించారు.

శ్రీ భగవద్రామానుజుల పట్ల అపరిమితమైన, అచంచలమైన భక్తిప్రపత్తులు కలవారవడంతో శ్రీ మణవాళ మామునులు ‘యతీంద్ర ప్రవణులై’ కీర్తించబడ్డారు. సాక్షాత్తు నమ్మాళ్వార్‌ను శ్రీకృష్ణ భక్తికి నిలువెత్తు నిదర్శనంగా ఎలా పేర్కొంటామో – అదే విధంగా మణవాళ మామునులను రామానుజ భక్తికి పరమోన్నత ఉదాహరణగా అభివర్ణిస్తారు.

రామానుజుల వారి వైభవాన్ని కీర్తిస్తూ ఆయన రచించిన ప్రథమ దివ్య ప్రబంధం ‘యతిరాజ వింశతి’ కాగా, ఆయన అనుగ్రహించిన చరమ (చివరి) గ్రంథం ‘ఆర్తి ప్రబంధం’. దీనిని బట్టి మనకు స్పష్టంగా అర్థమయ్యే సత్యం ఏమిటంటే… తన జీవిత ప్రారంభం నుండి ముగింపు వరకు, మామునులు ఎంపెరుమానార్ల పట్ల అచంచలమైన ‘ఆచార్య నిష్ఠ’ (పరిపూర్ణ శరణాగతి) కలిగి సదా నిలిచారు.

ఈ విధంగా, సాక్షాత్తు ఆ యతిరాజరాజైన రామానుజుల వారి పునరవతారంగా విచ్చేసి, లోకానికి ఆచార్య భక్తిని చాటిన శ్రీ మణవాళ మామునులు పల్లాండు పల్లాండు – యుగయుగాల పాటు చిరకాలం వర్ధిల్లుగాక (పల్లాండు)!

ముప్పురినూల్ మణివడముం ముక్కోల్ తరిత్తాన్ వాళియే

పరమ పవిత్రమైన యజ్ఞోపవీతాన్ని (ముప్పురినూల్ – మూడు పోగుల జంధ్యాన్ని) ధరించి, తులసి మాలలతోను, పద్మాక్ష మాలలతోను నయనానందకరంగా అలంకృతులైన శ్రీ మణవాళ మామునులు వర్ధిల్లుదురు గాక! సన్యాసాశ్రమ ధర్మానికి ప్రతీకయైన, మూడు దండములు కలిసికట్టుగా ఉండే విశిష్టమైన ‘ముక్కోల్’ (త్రిదండమును) తన దివ్య హస్తమున ధరించి, భక్తకోటికి ముక్తిమార్గాన్ని చూపే ఆ శ్రీ మణవాళ మామునులు… పల్లాండు పల్లాండు… యుగయుగాల పాటు నిరంతరం వర్ధిల్లుదురు గాక!

మూదరియ మణవాళ మామునివన్ వాళియే

మన సత్సంప్రదాయానికి చెందిన విశిష్ట గురుపరంపర అయిన ‘ఓరాణ్ వళి’ (ఏకశిష్య క్రమమైన ప్రత్యక్ష గురు పరంపర) లోనే అత్యంత ప్రాచీనమైన, అరుదైన నిధిగా విరాజిల్లుతున్న  శ్రీ మణవాళ మామునులు వర్ధిల్లుదురు గాక! ఎవరి దివ్య ప్రవచనాల ద్వారా, కారుణ్యం ద్వారా మన సంప్రదాయంలోని గంభీరమైన రహస్యార్థాలు, విశిష్ట దివ్యార్థాలు నేటికీ చెక్కుచెదరకుండా మనకు లభ్యమవుతున్నాయో ఆ మహోపకారియైన శ్రీ మణవాళ మామునిగల్ –  అనంత కాలం పాటు నిరంతరం వర్ధిల్లుదురు గాక (పల్లాండు)!

ఆళ్వార్ ఎంపెరుమానార్ జీయర్ తిరువడిగళే శరణం

అడియేన్ లక్ష్మీ సేనాపతి రామానుజ దాసి 

అడియేన్ శ్రీ తేజ రామానుజ దాసి 

పొందుపరచిన స్థానము – https://divyaprabandham.koyil.org

ప్రమేయము (లక్ష్యము) – https://koyil.org 
ప్రమాణము (గ్రంథములు) – http://granthams.koyil.org 
ప్రమాత (పూర్వాచార్యులు) – http://acharyas.koyil.org 
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org