శ్రీ: శ్రీమతే శఠగోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమతే వరవరమునయే నమః

శ్రీ రామానుజాచార్య స్వామి ఆదిశేషుని అవతారం. వీరిని జగదాచార్యులు (జగత్తుకు ఆచార్యులు) అని కూడా పిలుస్తారు. శ్రీవైష్ణవ సంప్రదాయంలో రామానుజులు కేంద్రస్థానంగా నిలిచారు. వారు ఈ సంప్రదాయాన్ని వటవృక్షంలా విస్తరింపజేసారు. నమ్మాళ్వార్లచే సంరక్షింపబడిన సంప్రదాయాన్ని భగవత్ రామానుజులు అత్యంత విస్తృతంగా వ్యాప్తి చేశారు.నమ్మాళ్వార్లని “ప్రపన్న జన కూటస్థులు” అని అంటారు.అంటే భగవంతునికి శరణాగతులైన వారందరిలో ప్రధానులు – అని ప్రసిద్ధి పొందారు. ఈ సంప్రదాయంలో ఎమ్పెరుమానార్‌కు ప్రత్యేక స్థానం ఉంది. నమ్మాళ్వార్లు!ఎమ్పెరుమానార్ యొక్క అవతారాన్ని కీర్తించి , ఆయన రూపాన్ని, భవిష్యదాచార్యుని రూపంగా (అర్చా మూర్తిగా) ఆయన ఆవిర్భావానికి ముందే ప్రసాదించారు. అలాగే, మన శ్రీవైష్ణవ సంప్రదాయాన్ని నలుదిశలా వ్యాపింపజేయడానికి భగవద్ రామానుజులు 74 మంది సింహాసనాధిపతులను (మఠాధిపతులు) ఏర్పాటు చేశారు.
మణవాళ మామునిగళ్ తమ ఉపదేశ రత్తిన మాలైలో రామానుజులు ఇలా ఆజ్ఞాపించారు అని పేర్కొన్నారు. —“ఆశై ఉడయోర్క్కు ఎల్లాం ఆరియార్గాళ్ కూఱుమ్ ఎన్ఱు పేసి వరంబు అఱుత్తార్ పిన్” అంటే — “ఓ ఆచార్యులారా! ఈ భూమిలో ఉన్న వారి ఎవరికైనా భగవంతుని చేరాలనే కోరిక ఉంటే,వారందరికీ జ్ఞానాన్ని ఉపదేశించండి.బోధనకు ఉన్న హద్దులను తొలగించండి.” అని రామానుజులు ఆజ్ఞాపించారు.భగవద్ రామానుజులు ప్రతి జీవాత్మకూ పరమాత్ముణ్ణి (ఎంపెరుమాన్) పొందే హక్కు ఉందని భావించారు. కుల, మత, వర్గ బేధాలు లేకుండా, భగవంతునిపై కోరిక (ఆసక్తి) ఉన్న ప్రతి ఒక్కరికీ ఆ జ్ఞానాన్ని అందించాలని, శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని అందరికీ వ్యాప్తి చేయాలని (వ్యాపింపజేయాలని) తలిచారు.వారి కరుణను “కారేయ్ కరుణై ఇరామానుశ” అని వర్ణిస్తారు.ఈ వాక్యానికి అర్థం — ఆయన దయ, కరుణతో వర్షాన్ని కురిపించే మేఘంలా ఉంటుంది . ఆయన దివ్యదేశాలన్నింటినీ సంస్కరించారు. దేవాలయ నిర్వహణ సక్రమంగా ఉండేలా చూసి, కైంకర్యాల్లో (తిరువారాధనం, తళిగై, పాశురాల పఠనం, ఉత్సవాలు) లోపం లేకుండా జరిగేలా చేశారు. ఎంబెరుమానార్ పెంపొందించిన సాంప్రదాయం, ఈనాటికీ భారత దేశమంతటా వ్యాప్తి చెంది, విస్తరించి, వృద్ధి చెందుతూనే ఉంది.
శ్రీ రామానుజులు శ్రీపెరుంబుదూరులో చిత్తిరై (చైత్ర) మాసంలో తిరువాదిరై (ఆర్ద్ర) నక్షత్రంలో అవతరించారు. అతి దయతో రామానుజాచార్య స్వామి వారు మనకు తొమ్మిది గ్రంథాలను అందించారు — ఇవి నవరత్నాలు అని ప్రసిద్ధి. శ్రీ భాష్యం, గీతాభాష్యం, వేదార్థ సంగ్రహం, వేదాంత దీపం, వేదాంత సారం, శరణాగతి గద్యము, శ్రీరంగ గద్యము, శ్రీవైకుంఠ గద్యము, నిత్య గ్రంథం (తిరువారాధన క్రమం), ఇవి అన్నీ సంస్కృత గ్రంథాలు; రామానుజుల వారు తమిళంలో ఏ గ్రంథమూ రచించలేదు. వేదం యొక్క సారాన్ని శ్రీభాష్యం, వేదార్థ సంగ్రహం, వేదాంత దీపం, వేదాంత సారంలో వివరించారు. శ్రీ మద్భగవద్గీతకు గీతా భాష్యం అనే ప్రత్యేక వ్యాఖ్యానం అందించారు.తమ గద్యత్రయం ద్వారా, ఎమ్పెరుమానార్ మన సంప్రదాయంలోని అత్యంత ముఖ్యమైన భావనను – శరణాగతిని – స్థాపించారు. నిత్యగ్రంథంలో తిరువారాధన విధానాన్ని తెలిపారు. తిరువాయ్మొళికి వ్యాఖ్యానం రాసే పద్ధతిని కూడా ఆయనే రూపొందించారు. ఈ విధంగా ఎంపెరుమానార్ల గొప్పతనం , కీర్తి ప్రతిష్టలు అపారం.
ఎమ్పెరుమానార్ వాళి తిరునామములు
అత్తిగిరి అరుళాళర్ అడిపణిందోన్ వాళియే
అరుట్కచ్చి నంబియురై ఆఱు పెత్తోన్ వాళియే
పత్తియుడన్ పాడియత్తైప్ పగర్న్దిత్తాన్ వాళియే
పతిన్మర్కలై ఉట్పొరుళైప్ పరిందుకఱ్ఱాన్ వాళియే
సుత్తమగిళ్ మాఱనడి తొళుదుయ్ందోన్ వాళియే
తొల్ పెరియ నంబి శరణ్ తోన్ఱినాన్ వాళియే
చిత్తిరైయిల్ ఆదిరైణాళ్ సిఱక్కవందోన్ వాళియే
శీర్ పెరుంబూతూర్ మునివన్ తిరువడిగళ్ వాళియే
1. అత్తిగిరి అరుళాళర్ అడి పణిందోన్ వాళియే
శ్రీ రామానుజులు ఇళయాళ్వార్‌గా ఉన్నప్పుడే, తిరుక్కచ్చి నంబి మార్గదర్శకత్వంలో దేవప్పెరుమాళ్‌కు కైంకర్యం చేశారు. దేవప్పెరుమాళ్ నుంచే ఆయన సన్యాసాశ్రమం స్వీకరించారు. “యతిరాజ” అనే నామం కూడా పేరరుళాళ పెరుమాళ్ ప్రసాదమే. యతిరాజ అంటే యతులకు రాజు అని అర్థం.అత్తిగిరి (కాంచీపురంగా పిలువబడే హస్తిగిరి) పెరరుళాళన్ దివ్య తిరువడిని సేవించుకున్న ఎమ్పెరుమానార్ చిరకాలం వర్ధిల్లాలి (పల్లాండు)!
2. అరుట్కచ్చి నంబియురై ఆఱుపెత్తోన్ వాళియే
రామానుజులకు కొన్ని సందేహాలను కలిగినప్పుడు, తిరుక్కచ్చి నంబి గారి వద్దకు వెళ్ళి, దేవరాజ పెరుమాళ్ ని అడగవలసినదిగా కొన్ని సందేహాలను చెప్తారు. తిరుక్కచ్చినంబి గారు పెరుమాళ్ళతో, ఇళైయాళ్వార్కి కొన్ని సందేహాలు ఉన్నయి అనగానే, సందేహాలు ఏమిటొ చెప్పకుండానే, దేవపెరుమాళ్ ఆరు ఆజ్ఞలు (ఆరు వర్త్తైగళ్) తిరుక్కచ్చి నంబి గారి ద్వారా ఇళైయాళ్వార్కు ఇచ్చారు.అవి ఏమిటి అంటే :
1.అహమేవ పరం తత్త్వం – నేనే (పెరుమాళ్) పరమతత్త్వం. నాకన్నా గొప్పదైనది కాని, సమమైన దైవం కాని లేరు.
2.దర్శనం భేదం ఏవ – జీవాత్మ, అచేతనాలు నాకంటే వేరైనవే
3.ఉపాయం ప్రపత్తి (శరణాగతి) — నన్ను మాత్రమే శరణు వేడుకోవడం, నన్ను చేరుకోవడానికి ఉన్న ఏకైక మార్గం.
4.దేహావసానే ముక్తి – ప్రపన్నులు ఈ ప్రస్తుత దేహం వదలగానే మోక్షం పొందగలరు
5.అంతిమ స్మృతి వర్జనం – శరణాగతుడికి చివరి క్షణంలో స్మరణ అవసరం లేదు, స్మరణ చేయకపోయినందువల్ల లోటు లేదు, వారి గురించి నేను ఎప్పుడూ అలోచిస్తూనే ఉంటాను కనుక చివరి క్షణంలో నేనే వారి రక్షణ చూసుకుంటాను.
6.పూర్ణాచార్య పదాశ్రితః – “మహాపూర్ణుని (పెరియ నంబి గారిని) ఆచార్యునిగా స్వీకరించు”( ఇది ఎంపెరుమానార్‌కి నేరుగా జరిగిన ఉపదేశం).
ఆరు ఆజ్ఞలను దేవరాజ పెరుమాళ్ నుండి తిరుక్కచ్చినంబి ముఖతః అందుకున్న ఎమ్పెరుమానార్ చిరకాలం వర్ధిల్లాలి (పల్లాండు).
3. పత్తియుడన్ పాడియత్తైప్ పగర్న్దిత్తాన్ వాళియే
శ్రీభాష్యాన్ని తమిళంలో “పాడియం” అని అంటారు. భగవద్ రామానుజులు ఎంతో భక్తితో శ్రీ భాష్యాన్ని రచించారు. ఈ గ్రంథాన్ని రచించటానికి, శ్రీ రామానుజులు కూరత్తాళ్వాన్లతో కలిసి కాశ్మీర్‌లో బోధాయన వృత్తిని శ్రీ శారదా పీఠం నుండి సంపాదించి తెస్తుండగా ఆ గ్రంథం వారికి లభించినప్పటికీ, తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో ఎంపెరుమానార్ (రామానుజుల) నుండి అది లాక్కోబడింది. గ్రంథం అప్పటికే కూరత్తాళ్వాన్ సేవించి ఆ స్మరణతో తిరిగి శ్రీరంగం చేరుకున్నారు. రామానుజులు కూరత్తాళ్వాన్ యొక్క సహకారంతో శ్రీభాష్యం రచించారు. ఇందులో వేదాంతములో చెప్పబడినట్లుగా, ఎంపెరుమాన్ (శ్రీమన్నారాయణుడు) ను చేరుకోవడానికి భక్తి యోగం ముఖ్యమైన ఉపాయము అని తెలిపారు.తరువాత, శరణాగతి గద్యంలో, శ్రీ వైష్ణవ సంప్రదాయంలో పెరుమాళ్‌ను చేరుకోవడానికి పెరుమాళ్ యొక్క పాద పద్మాల వద్ద శరణాగతి చేయడమే అత్యుత్తమ మార్గమని ఆయన నిరూపించారు.ఒక వేదాంతికి భక్తి యోగం అనేది పరమాత్మని చేరుకోవడానికి ఒక మార్గం అని ఆయన చెప్పారు.అటువంటి గొప్ప ఎమ్పెరుమానార్ చిరకాలం వర్ధిల్లాలి (పల్లాండు)!
4. పతిన్మర్కలై ఉట్పొరుళైప్ పరిందుకఱ్ఱాన్ వాళియే
పెరియ నంబి మరియు తిరుక్కోష్ఠియూర్ నంబి గార్ల ఆజ్ఞతో, తిరుమాలై ఆండాన్ల వద్ద పదిమంది ఆళ్వార్ల ప్రబంధాలను శ్రీరంగంలో అభ్యసించారు. ఆళ్వారుల ప్రబంధ అంతరార్థాలను, అత్యంత నిమగ్నతతో (జ్ఞానంతో) అభ్యసించిన రామానుజులు చిరకాలం వర్ధిల్లాలి (పల్లాండు).
5. సుత్తమగిళ్ మాఱనడి తొళుదుయందోన్ వాళియే
“మగిళ్ మారన్” అంటే నమ్మాళ్వార్. నమ్మాళ్వార్ పాద పద్మాలను ఆశ్రయించి అందులో నిమగ్నమయ్యారు రామానుజుల వారు.నమ్మాళ్వార్లు పెరుమాళ్ళే ఉపాయం , ఉపేయం అని నమ్మి మోక్షాన్ని పొందిన వారు.అటువంటి నమ్మాళ్వార్ల యొక్క తిరువడిని ఆశ్రయించిన ఎమ్పెరుమానార్ చిరకాలం వర్ధిల్లాలి (పల్లాండు).
శఠకోపుల (నమ్మాళ్వార్) దివ్య పాదాలను నిత్యం ధ్యానిస్తూ, వారి పాదాలను ఆశ్రయించి తరించిన వారు మన రామానుజుల వారు అని తిరువరుంగత్తముదనార్ తమ ఇరామానుశ నూత్తందాది గ్రంథమున మొదటి పాశురములో తెలిపారు.
“పూమన్ను మాదు పొరుందియ మార్బన్,పుగళ్ మలింద పామన్ను మారన్ అడి పణిందు ఉయందవన్” —– అర్థం.
ఓ హృదయమా! పద్మమును నివాసస్థానముగా కలిగిన పెరియ పిరాట్టి (మహాలక్ష్మి), ఎంపెరుమాన్ దివ్య వక్షస్థల మాధుర్యమును అనుభవించిన తర్వాత, తన నివాసమును వదిలి ఆ దివ్య వక్షస్థలమునందే నివసించసాగెను. అట్టి పిరాట్టితో కూడిన ఎంపెరుమాన్ యొక్క కల్యాణ గుణములతో నిండిన తిరువాయిమొళిలో సంపూర్ణముగా నిమగ్నమైన నమ్మాళ్వార్ల దివ్య పాదపద్మములను ఆశ్రయించి, రామానుజులు తనను తాను ఉద్ధరించుకున్నారు.
నమ్మాళ్వార్లకు మంగళాశాసనము చేయడానికి గాను ఒకసారి రామానుజుల వారు ఆళ్వార్ తిరునగరికి వెళ్ళారు.ఎంపెరుమానార్ (రామానుజుల) యొక్క భక్తికి మిక్కిలి సంతోషించిన ఆళ్వార్లు, ఒక దివ్య ఆజ్ఞను అనుగ్రహించారు – “ఇకపై నా తిరువడిని/పాదుకలను ‘శ్రీ రామానుజం’ అని పిలవబడతాయి. అందువల్ల, నాటి నుండి నేటి వరకు, ఆళ్వార్ తిరునగరిలో మాత్రమే, నమ్మాళ్వారుల స్వయంత ఆజ్ఞను అనుసరించి ఆయన తిరువడిని “శ్రీ రామానుజం” అని పిలవబడుతున్నాయి. అయితే, ఇతర ప్రదేశాలలో వారి తిరువడిని “మధురకవిగళ్” అని పిలుస్తారు.
6. తొల్ పెరియ నంబి చరణ్ తోన్ఱినాన్ వాళియే
మహనీయులైన పెరియ నంబిగళుల పాదపద్మముల యందు అత్యంత అనురాగము,భక్తి కలిగిన భగవద్ రామానుజులు చిరకాలం వర్ధిల్లాలి (పల్లాండు)
7. చిత్తిరైయిల్ ఆదిరైణాళ్ సిఱక్కవందోన్ వాళియే
ఆదిరై (ఆర్ద్ర) నక్షత్రం శ్రీ రామానుజుల జన్మ నక్షత్రం కావటం చేత తిరువాదిరై అని ప్రసిద్ది చెందినది. చిత్తిరై (చైత్ర) మాసానికి, ఆదిరై (ఆర్ద్ర)నక్షత్రానికి, తన జన్మ వలన గొప్పతనాన్ని ఇచ్చిన ఎమ్పెరుమానార్ చిరకాలం వర్ధిల్లాలి (పల్లాండు)!
8. శీర్ పెరుంబూతూర్ మునివన్ తిరువడిగళ్ వాళియే
సుప్రసిద్ధమైన శ్రీ పెరుంబూదూరులో అవతరించిన భగవద్ రామానుజుల దివ్య పాద పద్మాలు చిరకాలం వర్ధిల్లాలి (పల్లాండు).
అడియేన్ లక్ష్మి సేనాపతి రామానుజ దాసి
పొందుపరచిన స్థానము – https://divyaprabandham.koyil.org
ప్రమేయము (లక్ష్యము) – https://koyil.org
ప్రమాణము (గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (పూర్వాచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org