ఆళ్వార్లు/ఆచార్యుల వాళి తిరునామాలు – తిరువాయ్మొళిప్పిళ్లై  వైభవం

శ్రీ:  శ్రీమతే శఠగోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమతే వరవరమునయే నమః

పూర్తి వ్యాసమాలిక

<< పిళ్ళై లోకాచార్యుల వైభవం

తిరువాయ్మొళి ప్పిళ్లై – కుంతీనగరం (కొంతగై)

తిరువాయ్మొళిప్పిళ్లై వారు వైశాఖ మాసము (వైకాసి), విశాఖ నక్షత్రం రోజున  మదురై దగ్గర కుంతీ నగరం (ప్రస్తుతం కొంతగై) అనే గ్రామంలో జన్మించారు. ఆయన అసలు పేరు శ్రీశైలేశర్.  ‘శ్రీశైలం’ అంటే తిరుమల, అందువల్ల ఆయనను తిరుమలై ఆళ్వార్ అని కూడా పిలిచేవారు. చిన్న వయస్సులోనే ఆయన పిళ్ళై లోకాచార్యులు వద్ద పంచసంస్కారం స్వీకరించి,  ఆయన శిష్యుడయ్యారు.  ఆయన యవ్వనంలోనే మహా పండితుడు కావడంతో, మదురై రాజు ఆయనను తన మంత్రిగా ఉండమని అభ్యర్థించి నియమించాడు.  రాజు మరణించిన తరువాత, ఆయన రాజకుమారుడికి సలహాదారుగా ఉండి, రాజ్యపాలనను అద్భుతంగా నిర్వహించారు.

శ్రీశైలేశర్  శ్రీవైష్ణవ సాంప్రదాయంలో పాలుపంచుకోని రోజుల్లో, కూర కులోత్తమ దాసర్ (పిళ్ళై లోకాచార్యుల మరొక శిష్యుడు) ఆయనను తిరిగి సంప్రదాయంలోకి తీసుకువచ్చి, గొప్ప ఆచార్యునిగా తీర్చిదిద్దారు. పిళ్ళై లోకాచార్యులు పరమపదానికి వెళ్లే ముందు, ఈ బాధ్యతను కూర కులోత్తమ దాసర్‌కు అప్పగించారు. మణక్కాళ్ నంబి యమునాచార్యుని ఆచార్యునిగా తీర్చిదిద్దినట్లే, కూర కులోత్తమ దాసర్ తిరుమలై ఆళ్వార్ను గొప్ప ఆచార్యునిగా తీర్చిదిద్దారు.తిరుమలై ఆళ్వార్ మంత్రి పదవిలో ఉన్నప్పుడు కూర కులోత్తమ దాసర్ ఆయన ఊర్లో మంత్రి ఉరేగింపుగా వెళ్ళే వీధులలో నిలబడి ఆళ్వార్ల పాసురాలను పఠిస్తూ ఉండేవారు. ఆ పాసురాల మాధుర్యానికి ఆకర్షితుడైన తిరుమలై ఆళ్వార్, ఆయనతో పరిచయం ఏర్పరచుకుని క్రమంగా సంప్రదాయ సంబంధిత విషయాలలో పాల్గొనడం ప్రారంభించారు.  కూర కులోత్తమ దాసర్ పరమపదానికి చేరేవరకు ఆయనకు సేవ చేశారు.

శ్రీశైలేశర్ తిరునాడుకు చేరిన తరువాత తిరుమలై ఆళ్వార్ మంత్రి పదవిని విడిచి, నమ్మాళ్వార్ గొప్పతనాన్ని గ్రహించి, ఆళ్వార్ తిరునగరికి చేరారు. అది దట్టంగా పెరిగిన చెట్లతో అడవిగా మారినందున, ఆయన దానిని శుభ్రపరచి,  కేరళ ప్రాంతంలో ఉన్న నమ్మాళ్వార్ విగ్రహాన్ని తిరిగి తీసుకువచ్చి ఆళ్వార్ మరియు ఆదినాథ పెరుమాళ్ దేవాలయాలను పునర్నిర్మించి, అద్భుతమైన కైంకర్యాలను ఏర్పాటు చేశారు.  ఒకసారి తిరుమలై ఆళ్వార్లుకు స్వప్నంలో నమ్మాళ్వార్ తిరుప్పులియాళ్వార్ (చింత చెట్టు) కింద భవిష్యదాచార్య (రామానుజులు) విగ్రహం ఉందని దర్శనం కలిగింది.  దాంతో ఆయన ఆ విగ్రహానికి పశ్చిమ భాగంలో ప్రత్యేక దేవాలయాన్ని నిర్మించారు.  దాని చుట్టూ చతుర్వేది మంగళం (నాలుగు వీధులు) నిర్మించి, శ్రీవైష్ణవుల నివాసాన్ని ఏర్పాటు చేశారు.  భవిష్యదాచార్యుని కైంకర్యాలు సక్రమంగా జరగేలా చూసుకున్నారు.

ఆయన అనేకమంది ఆచార్యుల వద్ద సంప్రదాయక పరమైన విషయాలు నేర్చుకున్నారు.  కూర కులోత్తమ దాసర్ వద్ద సంప్రదాయ మూల సూత్రాలను, విళాంజోలై పిళ్లై వద్ద శ్రీవచనభూషణం అర్థాలను వివరంగా అభ్యసించారు.  నంపిళ్లై వారు వడక్కుత్తిరువీధిప్పిళ్లై వద్ద నుండి 36,000 పడి తిరువాయ్మొళి వ్యాఖ్యానం పొందారు.  దానిని ఈయుణ్ణి మాధవ పెరుమాళ్‌కు ఇచ్చి,  అర్హుడైనవారికి అందించమని ఆజ్ఞాపించారు. ఆ వ్యాఖ్యానం ఈయుణ్ణి మాధవ పెరుమాళ్‌ నుండి ఈయుణ్ణి పద్మనాభ పెరుమాళ్‌కు , వారి నుండి  నాలూరు పిళ్లై గారికి, వారి నుండి  నాలూరాచ్చాన్ పిళ్లై గారికి ,వారినుండి  తిరువాయ్మొళి ప్పిళ్లై గారి వరకు పరంపరగా చేరింది.

శ్రీశైలేశర్ తన జీవితాన్ని నమ్మాళ్వార్ మరియు తిరువాయ్మొళికి అంకితం చేశారు. అందుకే ఆయనను తిరువాయ్మొళి ప్పిళ్లై అని పిలుస్తారు. అలాగే శఠగోప దాసర్ అని కూడా పిలుస్తారు – అంటే నమ్మాళ్వార్ (శఠగోపన్) కోసం జీవించినవారు అని అర్థం. తిరువాయ్మొళి ప్పిళ్లై వారి వంశస్థులు ఈనాటికీ ఆళ్వార్ తిరునగరిలో మరియు ఇతర దివ్యదేశాలలో కైంకర్యాలు చేస్తున్నారు. ఆళ్వార్ తిరునగరిని పునరుద్ధరణ చేయించటంలో శ్రీశైలేశర్ ముఖ్యమైన భూమిక వహించారు. దేవాలయాల నిర్మాణం, నమ్మాళ్వార్, ఎంపెరుమాన్, భవిష్యదాచార్య సన్నిధుల స్థాపన – ఇవి అన్నీ వారు చేబట్టిన ముఖ్యమైన సేవలు. వీరు మాత్రమే ఒరాణ్ వళి ఆచార్యులలో  శ్రీరంగంలో నివసించని ఆచార్యులు. మణవాళ మామునులు వారి వైభవం విని, ఆళ్వార్ తిరునగరికి వెళ్లి,  తిరువాయ్మొళి ప్పిళ్లై వద్ద పంచసంస్కారం స్వీకరించి, ఆయనను తన ఆచార్యునిగా స్వీకరించారు. తిరువాయ్మొళి ప్పిళ్లై పరమపదించేవరకు మణవాళ మామునులు  ఆళ్వార్ తిరునగరిలోనే వేంచేసి ఉండి సేవించుకున్నట్లు మనకు తెలుస్తుంది.  తిరువాయ్మొళి ప్పిళ్లై వారు పెరియాళ్వార్ తిరుమొళికి స్వాపదేశ వ్యాఖ్యానం రచించినట్లు తెలుస్తుంది.

తిరువాయ్మొళిప్పిళ్లై వాళి తిరునామములు:

వైయగమెణ్ శడగోపన్ మఱై వళర్తోన్ వాళియే

వైగాసి విసాగత్తిల్ వందుదిత్తాన్ వాళియే

అయ్యన్ అరుణ్మారి కలై ఆయందురైప్పోన్ వాళియే

అళగారుం ఎతిరాసర్ అడిపణివోన్ వాళియే

తుయ్య ఉలగారియన్ తన్ తుణైప్పదత్తోన్ వాళియే

తొల్ కురుగాపురి అదనైత్ తులక్కినాన్ వాళియే

దైవనగర్ కుంది తన్నిల్ శిఱక్క వందోన్ వాళియే

తిరువాయ్మొళిప్ పిళ్ళై తిరువడిగళ్ వాళియే

తిరువాయ్మొళిప్పిళ్లై వాళి తిరునామములు – సరళ వివరణ:

వైయగమెణ్ శడగోపన్ మఱై వళర్తోన్ వాళియే

ఈ భూలోకంలోని  గొప్పవారు ధ్యానించి ఆనందించేలా, తమిళ వేదంగా పిలవబడే నమ్మాళ్వార్ల దివ్య ప్రబంధాలను పోషించి, ప్రచారం చేసిన తిరువాయ్మొళి పిళ్ళై గారు వర్ధిల్లాలి (పల్లాండు)!”

వైగాసి విసాగత్తిల్ వందుదిత్తాన్ వాళియే

నమ్మాళ్వార్ల తిరునక్షత్రం రోజునే, అంటే వైశాఖ మాసంలో విశాఖ నక్షత్రం రోజున ఈ భూమిపై అవతరించిన మహిమాన్వితులైన తిరువాయ్మొళి పిళ్ళై గారు చిరకాలం వర్ధిల్లాలి (పల్లాండు)!

అయ్యన్ అరుణ్మారి కలై ఆయందురైప్పోన్ వాళియే

అయ్యన్ అనగా తండ్రి అని అర్థం.  ఒక తండ్రి లాగా తిరుమంగై ఆళ్వార్ (అరుల్మారి) మనకు దివ్య ప్రబంధాలను ప్రసాదించారు. ఆ ప్రబంధాల లోతైన అర్థాలను పరిశీలించి వివరించిన తిరువాయ్మొళి ప్పిళ్లై చిరకాలం వర్ధిల్లుగాక!   మనం ఇంతకు ముందర తెలుసుకున్నట్లు, ఆచార్యులు అన్ని శాస్త్రాలలో, సంస్కృత గ్రంథాలలో, వేదములలో, తమిళ్వా ప్రబంధములలో లోతైన ప్రావీణ్యం కలిగి ఉండాలి. తిరువాయ్మొళి ప్పిళ్లైగా పిలువబడినప్పటికీ, వారు అందరు ఆళ్వార్ల ప్రబంధాలలోనూ చక్కటి అవగాహన కలిగి ఉండేవారు. తిరుమంగై ఆళ్వార్ ప్రబంధాలు నమ్మాళ్వార్ ప్రబంధాలకు ఆరు అంగాలుగా పరిగణించబడతాయి.  తిరువాయ్మొళి ప్పిళ్లై వాటి సారాన్ని లోతుగా విశ్లేషించి ప్రపంచానికి అందించారు. వారి వైభవం చిరకాలం వర్ధిల్లాలి (పల్లాణ్డు)!

అళగారుం ఎతిరాసర్ అడిపణివోన్ వాళియే

కలువ పువ్వులు వలె  ఆధ్యాత్మిక సౌందర్యంతో నిండిన ఎతిరాసర్ (శ్రీ రామానుజాచార్యులు) యొక్క దివ్య తిరువడి సేవించే తిరువాయ్మొళి ప్పిళ్లై చిరకాలం వర్ధిల్లుగాక (పల్లాండు)!

ఆయన తన శిష్యుడైన మణవాళ మామునులుకు రామానుజుల వారి యొక్క మహిమను తెలిపి, తాను ఆళ్వార్ తిరునగరిలో స్థాపించిన భవిష్యదాచార్య సన్నిధిలో కైంకర్యం ఎల్లప్పుడూ ఘనంగా జరగాలని ఆజ్ఞాపించారు.  మణవాళ మామునులు తన ఆచార్యుని ఆజ్ఞను  తన జీవిత ధ్యేయంగా స్వీకరించారని మనకి తెలుసు. అదే భవిష్యదాచార్య సన్నిధిలో ఆయన యతిరాజ వింశతి (రామానుజులపై 20 శ్లోకాలు)అనే గ్రంథాన్ని  సమర్పించారు.  అటువంటి వైభవం గల తిరువాయ్మొళి ప్పిళ్లై చిరకాలం వర్ధిల్లుగాక (పల్లాండు)!

తుయ్య ఉలగారియన్ తన్ తుణైప్పదత్తోన్ వాళియే

ఈ లోకంలోని ప్రతి జీవికి ఉజ్జీవన మార్గం చూపే రహస్య గ్రంథాలను రచించిన పరమ కారుణికులు అయిన పిళ్ళై లోకాచార్యులు (ఉలగారియన్). యొక్క దివ్య తిరువడి ఛాయగా ఉన్న తిరువాయ్మొళి ప్పిళ్లై చిరకాలం వర్ధిల్లుగాక (పల్లాండు)!

తొల్ కురుగాపురి అదనైత్ తులక్కినాన్ వాళియే

ఆదినాథన్ ఎంపెరుమాన్ కొలువై ఉన్న ఆళ్వార్ తిరునగరియే ఈ కురుగాపురి. అటువంటి పురాతన తిరుక్కురుగూర్ (ఆళ్వార్ తిరునగరి) నగరాన్ని పునర్నిర్మాణము (జీర్ణోద్ధరణ) గావించిన తిరువాయ్మొళి పిళ్ళై గారు చిరకాలం వర్ధిల్లాలి (పల్లాండు)!

దైవనగర్ కుంది తన్నిల్ శిఱక్క వందోన్ వాళియే

దివ్యమైన కుందీనగరం (ప్రస్తుతం కొందగై)లో అవతరించి, ఆ పవిత్ర స్థలానికే వైభవం చేకూర్చిన తిరువాయ్మొళి ప్పిళ్లై గారు చిరకాలం వర్ధిల్లుగాక (పల్లాండు)!

తిరువాయ్మొళిప్ పిళ్ళై తిరువడిగళ్ వాళియే

తిరువాయ్మొళి పిళ్ళై గారి సాటిలేని తిరువడిగళ్ (దివ్య చరణారవిందములు) చిరకాలం వర్ధిల్లాలి (పల్లాండు)! అని ప్రకటిస్తూ ఈ వాళి తిరునామం ముగుస్తుంది.

ఆళ్వార్ ఎంపెరుమానార్ జీయర్ తిరువడిగళే శరణం

అప్పిళ్లై తిరువడిగళే శరణం

అడియేన్ లక్ష్మీ సేనాపతి రామానుజ దాసి 

అడియేన్ శ్రీ తేజ రామానుజ దాసి 

పొందుపరచిన స్థానము – https://divyaprabandham.koyil.org

ప్రమేయము (లక్ష్యము) – https://koyil.org 
ప్రమాణము (గ్రంథములు) – http://granthams.koyil.org 
ప్రమాత (పూర్వాచార్యులు) – http://acharyas.koyil.org 
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org