ఆళ్వార్లు/ఆచార్యుల వాళి తిరునామాలు – పెరియ నంబి వైభవం 

పూర్తి వ్యాసమాలిక

<< ఆళవందార్

శ్రీ:  శ్రీమతే శఠగోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమతే వరవరమునయే నమః


పెరియ నంబి గారిని మహా పూర్ణులు, పరాంకుశ దాసులు అని కూడా పిలుస్తారు. వారు శ్రీరంగంలో నివాసం ఉండేవారు. వీరు తొండరడిప్పొడి ఆళ్వార్ అవతరించిన మార్గశీర్ష మాసం (మార్గళి మాసం), జ్యేష్ట (కెట్టై) నక్షత్రం నాడు అవతరించారు. 

ఆళవందార్ యొక్క శిష్యులలో పెరియ నంబి, తిరుక్కోష్ఠియూర్ నంబి, పెరియ తిరుమలై నంబి, తిరుమాలై ఆండాన్,  తిరువరంగ పెరుమాళ్ అరయర్, తిరుక్కచ్చి నంబి, మారనేరి నంబి  ఉన్నారు.వీరిలో పెరియ నంబి అత్యంత ప్రధాన శిష్యులు.

ఆళవందార్ ఇళయాళ్వార్ ను  (తరువాత రామానుజులుగా తెలియబడినారు)  తన శిష్యుడిగా చేసుకోవాలని కోరుకున్నారు. ఆ ఆజ్ఞను నెరవేర్చడానికి పెరియ నంబి గారు శ్రీరంగం నుండి కాంచీపురానికి బయలుదేరారు. కానీ రామానుజులు శ్రీరంగం చేరుకునేలోపే ఆళవందార్ పరమపదించారు. ఇళయాళ్వార్ తిరిగి కాంచీపురానికి వెళ్లిపోయారు. ఆళవందార్ పరమపదించిన అనంతరం, శ్రీరంగంలోని శ్రీవైష్ణవుల అభ్యర్థనపై, పెరియ నంబి కాంచీపురానికి వెళ్ళే దారిలో, మధ్యలో మధురాంతకం వద్ద ఇళయాళ్వార్లను కలసి, అక్కడే పంచసంస్కారం చేశారు. అందువల్ల పెరియ నంబి,ఇళయాళ్వార్ (రామానుజుల) యొక్క ఆచార్యులు అయ్యారు. ఇళయాళ్వార్ ఇటు కాంచీపురం నుండి బయలుదేరారు.పెరియ నంబి గారు శ్రీరంగం నుండి బయలుదేరారు.ఇరువురు మధ్య తోవలో ఉన్న మధురాంతకంలో కలుసుకున్నారు.ఇళయాళ్వార్ తనకి పంచ సంస్కారాలు కృప చేయమని ప్రార్ధించగా దేవ పెరుమాళ్ ఆజ్ఞతో మధురాంతకంలో ఇళయాళ్వార్లకు పంచ సంస్కారాలు కృప చేసి తిరుమంత్రం,ద్వయం మరియు చరమ శ్లోకం ఉపదేశించారు.తరువాత, పెరియ నంబి రామానుజులను తిరుక్కోష్ఠియూర్ నంబి వద్దకు పంపి, తిరుమంత్రం, ద్వయం, మరియు చరమశ్లోకానికి లోతైన అర్థాలు తెలుసుకోమని ఆజ్ఞాపించారు.వారు రామానుజుల వారిని ఎంతో గౌరవంగా భావించారు.

ఒకసారి శ్రీరంగంలో, రామానుజులు తమ శిష్యులతో నడుస్తుండగా, పెరియ నంబి గారు వారికి నమస్కరించారు. ఆచార్యులైన వారు, శిష్యులైన రామానుజుల పాదాలకు నమస్కరించడం ఆశ్చర్యం. ఎందుకంటే వారు రామానుజులలో ఆళవందార్ స్వరూపాన్ని దర్శించారు. భగవద్రామానుజుల పట్ల ఆయనకు ఉన్న భక్తి అటువంటిది. పెరియ నంబి గారి కుమార్తె అత్తుళాయ్ అమ్మగారు కూడా రామానుజుల వారి పట్ల అపార భక్తి కలిగి ఉండేవారు.పెరియ నంబి గారు తిరుప్పతిక్కోవై అనే గ్రంథాన్ని రచించారు. 

పెరియ నంబి వాళి తిరునామములు

అమ్బువియిల్ పదిన్మర్ కలై ఆయ్న్దో రైప్పోన్ వాళియే

ఆళవందార్ తాళిణైయై అడైంతుయ్న్తోన్ వాళియే

ఉమ్బర్ తొళుం అరఙ్గేశర్క్కు ఉగప్పుడైయోన్ వాళియే

ఓఞ్గు తనుక్ కేట్టై తనిల్ ఉతిత్త పిరాన్ వాళియే

వమ్బవిళ్తార్ వరతర్ ఉరై వాళి శేయ్దాన్ వాళియే

మాఱనేర్ నమ్బిక్కు వాళ్ వళిత్తాన్ వాళియే

ఎమ్పెరుమానార్ మునివర్క్కు ఇతం ఉరైత్తాన్ వాళియే

ఎళిల్ పెరియనంబి శరణీనితూళి వాళియే

1. అమ్బువియిల్ పదిన్మర్ కలై ఆయ్న్దో రైప్పోన్ వాళియే

ఈ అందమైన ప్రపంచంలో పదిమంది ఆళ్వార్ల ప్రబంధాలను  ఆళవందార్ ద్వారా లోతుగా అధ్యయనం చేసి, వాటి అంతరార్థాలను ప్రపంచానికి తెలియజేసిన మరియు పెరియ నంబి గారు చిరకాలం వర్ధిల్లాలి (పల్లాండు).

2. ఆళవందార్ తాళిణైయై అడైంతుయ్న్దోన్ వాళియే

మణక్కాళ్ నంబి ఆళవందార్‌ను శ్రీరంగానికి తీసుకువచ్చి, పెరియ పెరుమాళ్ దర్శనం చేయించారు. ఆళవందార్ రాజ్యాన్ని విడిచి, సన్యాసిగా జీవించారు. ఆ మహానుభావుని పాదాలను చేరి మోక్షాన్ని పొందిన పెరియ నంబి గారు చిరకాలం వర్ధిల్లాలి (పల్లాండు).

3. ఉమ్బర్ తొళుం అరఙ్గేశర్క్కు ఉగప్పుడైయోన్ వాళియే

ఉంబర్ అనగా నిత్యసూరులు.నిత్యసూరు లు మరియు ముక్తులు శ్రీవైకుంఠంలో ఆరాధించే (పెరియ పెరుమాళ్) శ్రీరంగనాథుడికి ఆనందాన్ని కలిగించారు పెరియ నంబి గారు. ఒకసారి శ్రీరంగంలో పెరియ పెరుమాళ్ళకు దుర్మార్గులు వల్ల ప్రమాదం వాటిల్లింది. రామానుజులు ఏమి చెయాలి అని యోచిస్తుండగా, పెరియ నంబి గారు సప్త ప్రాకార ప్రదక్షిణం చేసి పెరుమాళ్ళను రక్షిస్తానని చెప్పారు. తనతో అహంకార, మమకార రహితులైన ఒక శ్రీ వైష్ణవుణ్ణి పంపవలసినదిగా కోరగా, రామానుజులు, కూరత్తాళ్వార్‌ను వారితో పంపారు. పెరుమాళ్ళకు రక్షణవలయంగా ఉండి, పెరుమాళ్ళ అర్చాముర్తిని రక్షించుకున్న పెరియ నంబి  చిరకాలం వర్ధిల్లాలి(పల్లాండు).

4. ఓఞ్గు తనుక్ కేట్టై తనిల్ ఉతిత్త పిరాన్ వాళియే

పెరియ నంబి గారిని పిరాన్(ఉపకారం చేసినవారు) అని అంటారు. ఎందుకంటే వీరు  విశేషమైన మార్గశిర్ష (మార్గళి) మాసం, జ్యేష్ఠా (కెట్టై) నక్షత్రంలో అవతరించారు. వీరు ఉన్నతమైన గుణాలు కలిగిన రామానుజులను మన శ్రీవైష్ణవ సాంప్రదాయానికి  అందించి మనకి ఎంతో మేలు చేసిన మహోన్నతులు. భగవద్ రామానుజులకు చోళ రాజు అయిన కిరుమికణ్ఠుడు వల్ల ప్రమాదం ఉందని గమనించి, కూరత్తాళ్వాన్, పెరియ నంబి గారు, వారి కుమార్తె అయిన అత్తుళాయమ్మ గారు ఆ చోళరాజు ప్రాసాదానికి  వెళతారు. కూరత్తాళ్వాన్ భగవద్ రామానుజులుగా,పెరియ నంబి గారు వారి ఆచార్యులుగా అక్కడికి వెళతారు. కూరత్తాళ్వాన్ శ్రీమన్నారాయణుని పరత్త్వం చాటగా, చోళరాజు కోపగించి, రామానుజుల వేషధరణలో ఉన్న కూరత్తాళ్వాన్ కన్నులను పెరకించబోగా, కూరత్తాళ్వాన్లే తమని కండ్లను పెరకివెసుకోగ, తిరిగి శ్రీరంగానికి వస్తున్నప్పుడు, జరిగిన దానివల్ల కలిగిన వ్యధ వల్ల, వయసు పైబడటం వల్ల మార్గ మధ్యములోనే పెరియ నంబి గారు వారి ఆచార్యులు యొక్క తిరువడి చేరుకుంటారు అంటే పరమపదం చేరుకుంటారు. జగదాచార్యులైన రామానుజుల వారిని మనకి అప్పగించడంలో  ఎంతో ఉపకారం చేసిన పెరియ నంబి గారు చిరకాలం వర్ధిల్లాలి (పల్లాండు) 

5. వమ్బవిళ్తార్ వరతర్ ఉరై వాళి శేయ్దాన్ వాళియే

పువ్వుల నుండి తేనె జాలువారే పూల మాలికలను ధరించిన కాంచీపురం వరదరాజ స్వామి, తిరుక్కచ్చినంబి గారికి  ఆరు ఆజ్ఞలను (ఆరు వార్తలు) అనుగ్రహించారు.ఇందులో ఆఖరి ఆజ్ఞ — రామానుజుల వారు మహా పూర్ణులని ఆశ్రయించి , ఆచార్యునిగా స్వీకరించాలి అని.దేవ పెరుమాళ్ళు తిరుక్కచ్చినంబి గారి ద్వారా రామానుజుల వారికి ఆరు వార్తలు అనుగ్రహించారు.దేవ పెరుమాళ్ ఆజ్ఞ ప్రకారం పెరియ నంబి గారు రామానుజుల వారికి పంచ సంస్కారాలు అనుగ్రహించి,మంత్రోపదేశం చేసి,రామానుజులు గొప్ప ఆచార్యులు అయ్యేటట్లుగా తీర్చిదిద్దిన పెరియ నంబి గారు చిరకాలం వర్ధిల్లాలి (పల్లాండు).

6. మాఱనేర్ నమ్బిక్కు వాళ్ వళిత్తాన్ వాళియే

మారనేరి నంబి గారు ఒక గొప్ప శ్రీ వైష్ణవుడు మరియు ఆళవందార్ యొక్క శిష్యులలో ఒకరు. ఆ కాలంలో తక్కువగా భావించబడిన వర్ణంలో జన్మించినప్పటికీ, శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో బాగా మునిగి  శ్రీరంగంలో దేవాలయ ప్రాకారాల మధ్య నివసిస్తూ, ఎల్లప్పుడూ ఎమ్పెరుమానుకు కైంకర్యం చేస్తుండేవారు. తన చివరి రోజుల్లో,మాఱనేరి నంబి తన తిరుమేనిని (శరీరం) తన శారీరక బంధువులకు అప్పగించవద్దని కోరారు. ఎందుకంటే తన అంత్యక్రియలు శ్రీవైష్ణవ సంప్రదాయం ప్రకారం జరగాలని ఆయన ఆకాంక్షించారు. ఆయన ఇలా అన్నారు: “దేవర్కు పురోడాసమానవత్తై నాయ్క్కు ఇడుమా పోలే” – అంటే, దేవతలకు సమర్పించాల్సిన హవిస్సును కుక్కలకు ఇవ్వకూడదు. తన శరీరాన్ని యాగంలో సమర్పించే హవిస్సుతో పోల్చి, అది “కుక్క తిన్నది” అయితే దేవతలకు సమర్పించలేమని చెప్పినట్లే, తన తిరుమేని అంతిమ సంస్కారం కూడా శ్రీవైష్ణవ సంప్రదాయం ప్రకారమే నిర్వహించాలనే తన సంకల్పాన్ని పెరియ నంబికి తెలియజేశారు.ఎందుకంటే తమ తిరుమేని పెరుమాళ్ళకి చెందినది కాబట్టి. పెరియ నంబి ఆయన కోరికను గౌరవించి, మాఱనేరి నంబి పరమపదించిన తర్వాత, ఆయనకు చరమ కైంకర్యాలు (అంత్యక్రియలు) స్వయంగా చేశారు. అయితే, ఆయన వర్ణం బ్రాహ్మణుడు కాకపోవడంతో, స్థానిక శ్రీవైష్ణవులు దీనిని అంగీకరించలేదు. వారు ఈ విషయాన్ని భగవత్ రామానుజుల వద్ద ఫిర్యాదు చేశారు.ఇది విన్న రామానుజులు, పెరియ నంబి గారు తప్పు చేయలేదని తెలిసినా, వారి మాటలు వినాలనే ఉద్దేశంతో, పెరియ నంబిని కలిసి ప్రశ్నించారు. అప్పుడు పెరియ నంబి ఇలా సమాధానమిచ్చారు: “శ్రీరామపిరాన్ జటాయువు మహారాజుకు అంత్యక్రియలు చేశాడు. ధర్మపుత్రుడు విదురునికి అంత్యక్రియలు చేశాడు.  అలాగే, నేను ఒక గొప్ప శ్రీవైష్ణవుడికి భక్తితో కైంకర్యం చేశాను.  ‘భాగవత శేషత్వం’ అనే సిద్ధాంతాన్ని ఆళ్వార్లు తమ పాశురాల్లో బలంగా చెప్పారు.  అందువల్ల ఆళ్వార్ల వాక్యాలను సముద్రపు అలల శబ్దంలా నిర్లక్ష్యం చేయలేం.”  ఇది విన్న రామానుజులు ఎంతో సంతోషించి, పెరియ నంబికి నమస్కరించి, “పెరియ నంబి చేసినది నిజంగా మహోన్నత కార్యం” అని ప్రకటించారు.   మాఱనేరి నంబి చివరి కోరికను  నెరవేర్చి, వారి జీవితానికి మహత్తరమైన అర్థం ఇచ్చిన పెరియ నంబి చిరకాలం వర్ధిల్లాలి (పల్లాండు)!

7. ఎమ్పెరుమానార్ మునివర్క్కు ఇతం ఉరైత్తాన్ వాళియే

ఆచార్య స్థానంలో ఉండి,రామానుజ మునికి ఉపదేశం చేసిన పెరియ నంబి గారు చిరకాలం వర్ధిల్లాలి (పల్లాండు).

8. ఎళిల్ పెరియనంబి శరణ్ ఇనిదూళి వాళియే

పెరియ నంబి యొక్క దివ్య చరణారవిందాలు  యుగయుగాల పాటు నిలిచి ఉండాలి. (పల్లాండు)!

అడియేన్ లక్ష్మి సేనాపతి రామానుజ దాసి

మూలం: https://divyaprabandham.koyil.org/index.php/2026/01/vazhi-thirunamams-periyanambi-simple/

పొందుపరచిన స్థానము – https://divyaprabandham.koyil.org

ప్రమేయము (లక్ష్యము) – https://koyil.org 
ప్రమాణము (గ్రంథములు) – http://granthams.koyil.org 
ప్రమాత (పూర్వాచార్యులు) – http://acharyas.koyil.org 
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org