శ్రీ: శ్రీమతే శఠగోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమతే వరవరమునయే నమః

నంజీయర్ — తిరునారాయణపురం
పరాశర భట్టర్ తరువాత ఒరాణ్ వళి గురు పరంపరలో వచ్చినవారు నంజీయర్. వారిని “వేదాంతి” అని కూడా పిలుస్తారు. వీరి అవతార స్థలం తిరునారాయణపురం (మేల్కోటె). వీరు అవతరించినప్పుడు వీరికి పెట్టిన పేరు శ్రీ మాధవులు. వీరు శ్రీ మాధవాచార్యులుగా ప్రసిద్ధి పొందారు. శ్రీ మాధవులు మొదట్లో అద్వైత సిద్ధాంతంలో బాగా నిమగ్నులయ్యారు. రామానుజాచార్యులు వారిని శ్రీవైష్ణవ సంప్రదాయంలోకి తీసుకురావాలని ఆశించారు. కానీ అది రామానుజుల వారి జీవితకాలంలో జరగలేదు. కొంతకాలం తరువాత, కూరత్తాళ్వాన్ తిరుక్కుమారులైన పరాశర భట్టర్(ఓరాణ్ వళి గురు పరంపరలో రామానుజుల వారు,ఎంబార్,తరువాత పరాశర భట్టర్లు) తిరునారాయణపురానికి వెళ్లి, తిరునెడుందాండకం అర్థాలను వివరించి, మాధవాచార్యులను వాదంలో ఓడించి, వారిని శ్రీవైష్ణవ సంప్రదాయంలోకి తీసుకువచ్చారు.
మాధవాచార్యులు కన్నీళ్లతో, “శ్రీరంగరాజ పెరుమాళ్ కుమారుడా! నన్ను రక్షించడానికి అడవులు, పర్వతాలు దాటి వచ్చారు” అని చెప్పి భట్టర్ శిష్యుడయ్యారు. భట్టర్ కూడా ఆయనను ఎంతో ప్రేమతో స్వీకరించారు.
కొంతకాలం తిరునారాయణపురంలో నివసించిన తరువాత, మాధవాచార్యులు గృహస్థాశ్రమం మరియు లౌకిక జీవితంపై విరక్తి పొంది, తన సంపదను మూడు భాగాలుగా చేసి, రెండు భాగాలు తమ ఇరువురు భార్యలకు ఇచ్చి, మిగిలిన భాగం వారు ఉంచుకుని, సన్యాసం స్వీకరించి, తన ఆచార్యులైన భట్టర్లకు కైంకర్యం (సేవ) చేయాలనే సంకల్పంతో శ్రీరంగానికి వచ్చారు. సన్యాసరూపంలో మాధవాచార్యులను చూసిన భట్టర్ భావోద్వేగంతో, “వారుమ్ (గౌరవ పూర్వకంగా రండి అని పిలువుట) నం జీయర్!” అని గట్టిగా ఆలింగనం చేసుకున్నారు. ఆ రోజు నుండి శ్రీ మాధవాచార్యులకు“నంజీయర్” (మా జీయర్) అనే పేరు స్థిరపడింది నంజీయర్లు ఆళ్వార్ల పాశురాలను భట్టర్ వద్ద చాలా తక్కువ సమయంలో నేర్చుకొని, భట్టర్ల ను ఆశ్చర్యపరిచే స్థాయికి ఎదిగారు.
పెరుమాళ్ళకి తిరుమంజనం (పవిత్ర అభిషేకం) సమయంలో భట్టర్ నంపెరుమాళ్ ముందు నిలబడి పెరుమాళ్ యొక్క కీర్తిని పొగిడే కట్టియం చెప్పడం ఆనవాయితీ. కట్టియం చదవడం ఎక్కువగా ఆళ్వార్ల పాశురాల ఆధారంగానే జరుగుతుంది. భట్టర్, నంజీయర్‌ను ఆ పాశురాలు ఎంపిక చేయమని అడిగేవారు. నంజీయర్ ఎంపిక చేసిన పాశురాలనే భట్టర్లు కట్టియంగా సేవించేవారు. ఒకసారి నంజీయర్ కట్టియం చదువుతుండగా తిరువాయ్మొళి ఏడవ పత్తు, రెండవ దశకం అయిన, “కంగలుం పగలుం” లో తొమ్మిదవ పాశురం చదువుతున్నప్పుడు, “ఎన్ తిరుమగళ్ శేర్ మార్వనే ఎన్నుమ్ ఎన్నుడై ఆవియే ఎన్నుమ్” అనే రెండు పంక్తులను నంజీయర్ ఒకే పంక్తిలా చదివారు. ఈ పంక్తులకు అర్థం.“ శ్రీమహాలక్ష్మీ దేవి నిత్యవాసముగా అలంకరించిన నీ దివ్య వక్షస్థలం, అమ్మకే ప్రియమైన ఆలయం. ఆమె నివాసమునకు నీవు ఆధారమై ఉన్నందున, అదే మహిమతో నీవు నా హృదయంలోనూ ప్రాణాధారుడై నిలిచావు.” పరాంకుశ నాయకి భావనలో నమ్మాళ్వార్, శ్రీ మహాలక్ష్మీతో ఏకమై ఉన్న పరమాత్ముని ఉద్దేశించి, “నీవే నా ప్రాణాధారం” అని చెప్పారు.
నంజీయర్ చదివిన విధానం భట్టర్ ను ఎంతగానో భగవద్ గుణనుభవంలో మునిగి మూర్చిల్లారు. స్పృహ వచ్చిన తరువాత నంజీయర్‌ను ఎంతో ప్రశంసించారు. అలా మనం నంజీయర్ కు, భట్టర్ స్వామికి గల సాన్నిహిత్యం తెలుసుకోవచ్చు. ఆళ్వార్ల పాశురాల అర్థాల గురించి ప్రశ్నలు అడిగి, వాటికి వివరణ పొంది, నంజీయర్ మన సాంప్రదాయ వృద్ధికి ఒక మూలస్థంభంలా నిలచారు అని మనం చూడవచ్చు. నంజీయర్ ఫాల్గుణ మాసంలో వచ్చే ఉత్తర నక్షత్రం నాడు (పంగుని ఉత్తరం) తిరునారాయణపురంలో అవతరించారు. వారు ఎన్నో వ్యాఖ్యానాలను అందించారు. 6000 పడిగా తెలుపబడే తిరువాయ్మొళి మొదటి వ్యాఖ్యానం, తిరుక్కురుగైప్పిరాన్ పిళ్ళాన్ గారు ఎంపెరుమానార్ అనుజ్ఞతో అనుగ్రహించారు. తరువాత నంజీయర్ తిరువాయ్మొళి 9000 పడి పరాశర భట్టరుల ఆజ్ఞతో రచించారు. ఇంకా, నంజీయర్ తిరుప్పళ్లియళుచ్చి, కణ్ణినుణ్ శిరుత్తాంబు వంటి ఇతర ప్రబంధాలపై వ్యాఖ్యానాలు కూడా సాయించారు.
నంజీయర్ వాళి తిరునామములు:
తెణ్డిరై సూళ్ తిరువరంగం శెళిక్క వందోన్ వాళియే
శీమాదవనెన్నుం శెల్వనార్ వాళియే
పణ్డై మఱైత్ తమిళ్ ప్పొరుళైప్ పగర వందోన్ వాళియే
పంగునియిల్ ఉత్తరనాళ్ పారుతిత్తాన్ వాళియే
ఒణ్డొడియాళ్ కలవిదన్నై ఒళిత్తిట్టాన్ వాళియే
ఒన్బదినాయిరప్పొరుళై ఓదుమవన్ వాళియే
ఎణ్దిశైయుం శీర్ భట్టర్ ఇణైయడియోన్ వాళియే
ఎళిల్పెరుగుం నంజీయర్ ఇనిదూళి వాళియే
తెణ్డిరై సూళ్ తిరువరంగం శెళిక్క వందోన్ వాళియే
స్వచ్ఛమైన కావేరి నది అలలతో చుట్టబడిన శ్రీరంగం అభివృద్ధి చెంది వర్ధిల్లేలా ఈ లోకంలో అవతరించిన నంజీయర్ చిరకాలం వర్ధిల్లాలి (పల్లాండు)!
శీమాదవనెన్నుం శెల్వనార్ వాళియే
శ్రీమాధవన్ అనే జన్మనామం కలిగి, ఆచార్య సేవ అనే నిజమైన కైంకర్య సంపదను పొందిన నంజీయర్ చిరకాలం వర్ధిల్లాలి (పల్లాండు)! ఒకసారి పరాశర భట్టర్లు పల్లకిలో ప్రయాణిస్తుండగా, ఆచార్య అభిమానంతో, సన్యాశశ్రమంలో ఉన్న నంజీయర్ పల్లకి మోయటనికి సిద్దపడతారు. అక్కడ జరిగేది గమనించిన కొందరు వారు (భట్టరులు) మీ ఆచార్యులైన, మీరు సన్యాసాశ్రమంలోనూ, వారు గృహస్తాశ్రమంలోనూ ఉన్నందున, మీరు పల్లకి మోయటం సమంజసం కాదు అని పలుకగా, నంజీయర్ వారు, త్రిదండం తమ ఆచార్య సేవకు అడ్డంకి అయితే తనకు సన్యాసాశ్రమంకన్నా తన ఆచార్య సేవ భాగ్యమే కావాలి, అని పేరుకొంటారు. అంతటి అచార్య నిష్టులైన నంజీయరు వారి వైభవానికి పల్లాండు.
పణ్డై మఱైత్ తమిళ్ ప్పొరుళైప్ పగర వందోన్ వాళియే
తమిళ వేదమైన నాలాయిర దివ్యప్రబంధార్థాలను ప్రపంచానికి అందించిన నంజీయర్ చిరకాలం వర్ధిల్లాలి! నంజీయరులు ఆళ్వారుల పశురాలకెన్నిటికో వ్యాఖ్యానం అందించారు. పరాశర భట్టరు మరియు నంజీయరుల మధ్య ఎలా ప్రబంధ సంబంధిత సంవాదనలు జరిగాయో, నంజీయర్, నంపిళ్ళై మధ్య కూడా అలాగె జరిగేవట. ఆ చర్చలు, సంవాదనల విశేషాలు వ్యాఖ్యానాలలో మనకు విశదమవుతాయి.అటువంటి తమిళ వేదానికి (దివ్య ప్రబంధం) వ్యాఖ్యానాలు అందించిన నంజీయర్ చిరకాలం వర్ధిల్లాలి (పల్లాండు)!
పంగునియిల్ ఉత్తరనాళ్ పారుతిత్తాన్ వాళియే
పంగుని ఉత్తరం (ఫాల్గుణంలో వచ్చే ఉత్తర నక్షత్రంలో) ఈ భూమండలం మీద అవతరించిన నంజీయర్ చిరకాలం వర్ధిల్లాలి (పల్లాండు)!
ఒణ్డొడియాళ్ కలవిదన్నై ఒళిత్తిత్తాన్ వాళియే
సుందర హస్తాలున్న భార్యలను,వివాహ జీవితాన్ని విడిచి సన్యాసం స్వీకరించిన నంజీయర్ చిరకాలం వర్ధిల్లాలి (పల్లాండు)!
ఒన్బదినాయిరప్పొరుళై ఓదుమవన్ వాళియే
పరాశర భట్టర్లు యొక్క ఆజ్ఞను అనుసరించి నంజీయర్ తిరువాయ్మొళికి 9000 పడి వ్యాఖ్యానం రచించారు.6000 పడిగా చెప్పబడే మొట్ట మొదటి వ్యాఖ్యానం, ఎంపెరుమానార్ల అదేశానుసారం పిళ్ళాన్ రచించగా, పరాశర భట్టర్ల అదేశనుసారం నంజీయర్లు 9000 పడిగా రెండవ వ్యాఖ్యానాన్ని, నంపిళ్ళై అనుజ్ఞతో పెరియవాచ్చాన్ పిళ్ళై 24000 పడిగా మూడవ వ్యాఖ్యానాన్ని, ఈడు అని పిలువబడే 36000 పడి వడక్కుతిరువీధిపిల్లై, నంపిళ్ళై వారి కాలక్షేపాల అధారంగానూ, చివరగ 12000 పడి వాదికేసరి మణవాళ జీయర్ వారు అనుగ్రహించారు. ఈ విధంగా తిరువాయిమొళి దివ్య ప్రబంధానికి 5 వ్యాఖ్యానాలు ఉన్నవి. నంజీయర్ వారు తిరువాయ్మొళి కాలక్షేపం 100 సార్లు చేసారని చెబుతారు. ఒకసారి ఒకరు మీ ఆచార్యులు మీకు ఈ పాశురానికి ఏమి వ్యాఖ్యానం అందించారు అని అడుగగా, 100 సార్ల కాలక్షేపంలో ఏ వ్యాఖ్యానం కావాలి అని అడిగారట. తిరువాయ్మొళి అర్థ అనుభవంలో సదా మునిగి ఉండే నంజీయర్లకు పల్లాండు.
ఎణ్దిశైయుం శీర్ భట్టర్ ఇణైయడియోన్ వాళియే
ఎనిమిది దిక్కులలో ప్రసిద్ధి చెందిన భట్టర్ తిరువడిని సేవించిన నంజీయర్ చిరకాలం వర్ధిల్లాలి! సాధారణంగా ఆచార్యుల తిరువడిగా (తిరువడి నిలై) వారి శిష్యులు భావింపబడతారు. ఆ రకంగా పరాశర భట్టరుల పాదుకలుగా భావింపబడిన నంజీయర్లకు పల్లాండు.
ఎళిల్పెరుగుం నంజీయర్ ఇనిదూళి వాళియే
ఈ వాళి తిరునామం – సౌందర్యంతో నిండిన నంజీయర్ కాలం ఉన్నంతవరకు సంతోషంగా చిరకాలం వర్ధిల్లాలి (పల్లాండు) !
ఆళ్వార్, రామానుజార్, జీయర్ తిరువడిగళే శరణం
అడియేన్ లక్ష్మీ సేనాపతి రామానుజ దాసి
శ్రీ తేజ రామానుజ దాసి