ఆళ్వార్ /ఆచార్యుల వాళి తిరునామాలు – కులశేఖర ఆళ్వార్ – సరళ వివరణ 

శ్రీః శ్రీమతే శఠగోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః 

పూర్తి వ్యాసమాలిక 

కులశేఖరాళ్వార్ ఒక మలయాళ దివ్యదేశమైన తిరుమూళికళం సమీపంలోని తిరువంజికళంలో అవతరించారు. ఆయన జన్మ నక్షత్రం మాఘ మాసంలోని పునర్వసు. శ్రీరామచంద్రుడి జన్మ నక్షత్రమైన పునర్వసులోనే తాను కూడా జన్మించడంతో, ఆయనకు శ్రీరామచంద్రుడిపై అమితమైన, అచంచలమైన భక్తిభావం ఏర్పడింది.ఆయన తమ జీవితకాలంతటిని శ్రీరామాయణ శ్రవణంలోనే అంకితం చేశారు. మహాపండితుల చేత రామాయణ ప్రవచనాలను ఏర్పాటు చేయించి, తన్మయత్వంతో ఆలకించేవారు. క్షత్రియ వంశంలో జన్మించిన ఆయన, రాజులకే రాజైనప్పటికీ… తనను తాను భగవంతుని సేవకుడిగా భావించడంలోనే అపరిమితమైన భాగ్యాన్ని, ధన్యతను పొందారు.ఆయనకు శ్రీరంగం క్షేత్రంపై అత్యంత అనురాగం ఉండేది. ప్రతిరోజూ శ్రీరంగాన్ని దర్శించాలనేది ఆయన నిరంతర అభిలాష. భగవంతుడితో పాటు, ఆయన భక్తులైన భాగవతోత్తములపై కూడా కులశేఖరాళ్వార్‌కు అచంచలమైన భక్తి, పరిపూర్ణ విశ్వాసం ఉండేవి.

కులశేఖర ఆళ్వార్ యొక్క వాళి తిరునామములు

అంజన మామలైప్ పిఱవి ఆదరిత్తోన్ వాళియే

అణి అరంగర్ మణత్ తూణై అడైన్దుయ్న్దోన్ వాళియే

వంజి నగరమ్ తన్నిల్ వాళ వన్దోన్ వాళియే

మాసి తనిల్ పునర్పూసమ్ వన్దుదిత్తాన్ వాళియే

అంజలెనక్ కుడప్ పామ్బిల్ అంగై ఇట్టాన్ వాళియే

అనవరదమ్ ఇరామ కదై అరుళుమువన్ వాళియే

సెంజొల్ మొళి నూట్రంజుమ్ సెప్పినాన్ వాళియే

సేరలర్ కోన్ సెంగమలత్ తిరువడిగళ్ వాళియే!

కులశేఖర ఆళ్వార్ యొక్క వాళి తిరునామములు— సరళ వివరణ 

అంజన మామలైప్ పిఱవి ఆదరిత్తోన్ వాళియే

‘అంజన మామలై’ అంటే పరమ పావన పుణ్యక్షేత్రమైన తిరుమల. తిరువేంకట గిరిపై ఏ రూపంలోనైనా జన్మించాలని కులశేఖరాళ్వార్ పరమ ఆర్తితో అభిలషించారు. ఆయన తన ‘పెరుమాళ్ తిరుమొళి’ ప్రబంధంలో, తిరువేంకడముడయాన్ (శ్రీనివాసుని) వైభవాన్ని కీర్తిస్తూ ‘ఊనేరు సెల్వత్తు’ అనే విశేష పదిగాన్ని (దశకాన్ని) అనుగ్రహించారు.  ఆ పదిగంలో, ఆళ్వార్ భగవంతునితో ఏదో ఒక రూపంలో నిరంతర సంబంధం కలిగి ఉండే జన్మను ప్రసాదించమని వేడుకున్నారు. స్వామివారి పుష్కరిణి అయిన స్వామి పుష్కరిణిలో ఒక కొంగగానో లేదా నారాయణ పక్షిగానో పుట్టాలని కోరుకున్నారు. తిరుమల కొండల్లోని కోనేటిలో ఒక చేపగా జన్మించాలని ఆశించారు. అర్చకులు పెరుమాళ్‌కు అర్ఘ్య పాద్యాలు సమర్పించేటప్పుడు, ఆ పవిత్ర జలాలను పట్టి ఉంచే సువర్ణ పాత్ర గా పుట్టాలని కోరుకున్నారు.  అంతేకాదు, ఆలయ ప్రాంగణంలో ఒక సంపంగి వృక్షంగానో, ఒక దివ్య స్థంభంగానో నిలవాలని కోరుకున్నారు. ఆఖరికి,  శ్రీవారి సన్నిధికి చేర్చే దారిగానో, లేదా భక్తుల పాదధూళి సోకేలా గర్భగుడి ముందు ఉండే ద్వార దేహళి (గడప) గానో మారాలని తపించారు. (అందుకే నేటికీ తిరుమల గర్భగుడి గడపను ‘కులశేఖర పడి’ అని పిలుస్తారు).  మొత్తం మీద, పెరుమాళ్ శాశ్వతంగా కొలువై ఉన్న ఆ తిరుమల కొండల్లో ఏదో ఒక రూపంలో సదా నిలిచిపోవాలన్నదే ఆళ్వార్ అంతరంగం. మన పూర్వాచార్యులు ఈ ‘పెరుమాళ్ తిరుమొళి’ కి అత్యంత సుందరమైన, గంభీరమైన దివ్యార్థాలతో వ్యాఖ్యానాలను అందించి, దీని విశిష్టతను మరింతగా వెలిగించారు.

మన పూర్వాచార్యులలో అత్యంత ప్రసిద్ధులు, పూజ్యులైనవారు అనంతాళ్వాన్.   శ్రీ భగవద్రామానుజుల వైభవాన్ని, దివ్యత్వాన్ని తెలుసుకున్న ఆయన, రామానుజుల వారి దివ్య తిరువడులను ఆశ్రయించి శరణాగతి చేశారు.  రామానుజుల వారి ఆజ్ఞానుసారం, ఆయన ‘అరుళాళ ప్పెరుమాళ్ ఎంపెరుమానార్’ కు ప్రియ శిష్యుడయ్యారు. ఆ తర్వాత, రామానుజుల వారి ఆదేశం మేరకు, తిరువేంకడముడయాన్ సేవకై ఆయన తిరుమల క్షేత్రానికి తరలివెళ్లారు.  అక్కడ స్వామివారి కోసం ఒక సుందరమైన ఉద్యానవనాన్ని  ఒక దివ్య పుష్కరిణిని నిర్మించి,  శ్రీవారికి పరమ భక్తితో పుష్ప కైంకర్యాన్ని నిరంతరం కొనసాగించారు.

తిరుమల క్షేత్రంపై ఆయనకు ఉన్న అనురాగం ఎంతటిదంటే –  తాను సాక్షాత్తు ఆ తిరువేంకడముడయాన్ స్వరూపమైనా సరే, లేదా మరే ఇతర రూపంలో ఉన్నా సరే… ఏ రూపంలోనైనా ఆ తిరుమల కొండల్లోనే నిలిచిపోవడం శ్రేష్ఠమని ఆయన భావించారు. తాను భగవంతునికి నిరుపాధిక దాసుడై (సేవకుడై) ఉంటూ, ఏ స్థితిలోనైనా సరే… ఆ పవిత్ర వేంకటాచలంపై ఉనికిని కలిగి ఉండటమే ఆయన పరమావధిగా భావించారు.రూపం ఏదైనా, స్థితి ఏదైనా… తిరుమలపై నివాసం ఉండటమే ఆయన జీవితానికి అత్యంత ప్రధానమైన, ప్రాణప్రదమైన విషయమై నిలిచింది.

అదే విధంగా, కులశేఖరాళ్వార్ పెరుమాళ్ సన్నిధి వెలుపల ఒక గడపగా ఉండిపోవాలని ఆ పరమాత్మని ప్రార్థించారు — ‘పడియాయ్ క్కిడందు ఉన్ పవళ వాయ్ కాణ్బేనే’ (నీ సన్నిధిలో ఒక గడపనై పడి ఉండి, నీ పగడపు పెదవుల దివ్య తిరుమందహాసాన్ని సదా వీక్షిస్తూ ఉంటాను). లౌకిక దృష్టిలో ఈ స్థితి అత్యల్పమైనదిగా అనిపించినా, ఆళ్వార్ మాత్రం దీనినే అన్నిటికంటే అత్యున్నతమైన, పరమోత్కృష్టమైన స్థానంగా భావించారు.

నిజానికి, ఒక గడప అనేది ‘అచిత్తు’ — అంటే ప్రాణము, చేతనత్వము లేని ఒక జడపదార్థం. దానికి పరమాత్మను గురించిన ఎలాంటి జ్ఞానమూ ఉండదు. అయినప్పటికీ, ఆ స్థితిలో ఉంటూనే పెరుమాళ్ యొక్క తిరుముఖమండలంపై వికసించే ఆ  తిరుమురువల్ అంటే చిరునవ్వుని,ఆ ‘తిరుప్పవళం’ (పగడం వంటి దివ్యమైన పెదవుల) సౌందర్యాన్ని నిరంతరం తనివితీరా ఆస్వాదించాలని ఆయన అభిలషించారు. ‘ఊనేరు సెల్వత్తు’ పదిగం ముగింపులో ఆయన తిరువేంకడముడయాన్‌ను వేడుకున్న పరమ రహస్యం ఇదే!

ఈ దివ్య కారణం చేతనే, నేటికీ ప్రతి వైష్ణవాలయంలోనూ భగవంతుని గర్భగుడి ముందు ఉండే ముఖద్వారపు గడపను అత్యంత భక్తితో ‘కులశేఖర పడి’ అని పిలుస్తారు. తిరుమల పుణ్యక్షేత్రంలో ఇంతటి పరమోన్నతమైన భక్తి సామ్రాజ్యాన్ని అధిరోహించాలని కాంక్షించిన ఈ కులశేఖరాళ్వార్… చిరకాలం వర్ధిల్లుగాక (పల్లాండు)(మంగళాశాసనాలు)!

అణి అరంగర్ మణత్ తూణై అడైన్దుయ్న్దోన్ వాళియే

శ్రీరంగ ధామంలో పెరియ పెరుమాళ్ మూలవిరాట్టుకు అభిముఖంగా రెండు దివ్య స్తంభాలు ఉన్నాయి. వీటిని అత్యంత పవిత్రంగా ‘తిరుమణత్ తూణ్గళ్’ (మంగళ ప్రదమైన స్తంభాలు) అని పిలుస్తారు. పూర్వం ఆళ్వారులు, ఆచార్యులు పెరుమాళ్‌కు మంగళాశాసనములు సమర్పించేటప్పుడు, ఈ స్తంభాలకు ఆనుకుని నిలబడేవారట.  నిజానికి, వారు పెరుమాళ్‌ను దర్శించుకునే సమయంలో ఆ స్వామి దివ్య సౌందర్య లహరి వారి హృదయాలను, శరీరాలను పూర్తిగా కరిగించివేసేది. ఆ దివ్యానుభూతిలో వారు మైమరచి, కనీసం నిలబడలేని పరవశ స్థితికి చేరుకునేవారు. ఆ సమయంలో కింద పడిపోకుండా ఉండటానికి, ఈ పవిత్ర స్తంభాలు వారికి ఒక అవలంబనగా నిలిచి, వారిని సంరక్షించేవని చెప్పడం ఎంతైనా సత్యం. కేవలం స్వామివారిని కనులారా కాంచేందుకు, ఆ పరమానంద భరిత స్థితిని తట్టుకునేందుకే వారు ఈ స్తంభాల ఆసరాను ఆశ్రయించేవారు.

ఈ పవిత్రమైన ‘తిరుమణత్ స్తంభాలను’ ఆశ్రయించి శరణాగతి వేడితే, మనం కూడా జన్మరాహిత్యాన్ని లేదా అత్యున్నతమైన దివ్య జన్మను పొందవచ్చు. తన చరమ దశలో (జీవిత ముగింపులో) ఆ శ్రీరంగ ధామానికి చేరుకుని, తాను హృదయపూర్వకంగా కాంక్షించిన ఆ పరమోన్నతమైన వైభవాన్ని, నిత్య కైంకర్య ప్రాప్తిని పొందిన ఈ కులశేఖరాళ్వార్ చిరకాలం వర్ధిల్లుగాక (పల్లాండు)!

వంజి నగరమ్ తన్నిల్ వాళ వన్దోన్ వాళియే

తిరువంజికళం అనే దివ్య క్షేత్రంలో అవతరించి, శ్రీరామావతార లీలల్లో అమితమైన భక్తిప్రపత్తులతో తన్మయత్వం చెంది, చివరకు ఆ రంగనాథుని దివ్య సన్నిధియైన శ్రీరంగాన్ని చేరుకున్న  కులశేఖరాళ్వార్ వేలాది సంవత్సరాల పాటు వర్ధిల్లుగాక (పల్లాండు) !

మాసి తనిల్ పునర్పూసమ్ వన్దుదిత్తాన్ వాళియే

మాఘ మాసంలో, పరమ పవిత్రమైన పునర్వసు నక్షత్రంలో అవతరించిన  కులశేఖరాళ్వార్ రాబోవు వేలాది యుగాల పాటు, కోట్లాది సంవత్సరాల పాటు చిరకాలం వర్ధిల్లుగాక (పల్లాండు)!

అంజలెనక్ కుడప్ పామ్బిల్ అంగై ఇట్టాన్ వాళియే

కులశేఖరాళ్వార్ అత్యంత విషపూరితమైన సర్పాలు ఉన్న ఒక కుండలో తన చేతిని ఉంచిన ఘట్టం, ఆయన దివ్య భక్తి సామ్రాజ్యంలో ఒక అద్భుతమైన, చిరస్మరణీయమైన ఘట్టం. కులశేఖరాళ్వార్‌కు శ్రీరామ భక్తులన్నా, భాగవతోత్తములన్నా అమితమైన వాత్సల్యం. ఆ భక్తుల నిష్కల్మషమైన హృదయం, పవిత్రత ఆయనను ఎంతగానో ఆకట్టుకునేవి.  అయితే, ఒక మహారాజు అయి ఉండి భాగవతుల పట్ల ఇంతటి పరవశత్వాన్ని ప్రదర్శించడం తగదని ఆయన కొలువులోని మంత్రులు భావించారు. ఆళ్వార్ మనస్సును ఆ భక్తుల నుండి మళ్లించడం కోసం, వారు ఒక కుతంత్రాన్ని పన్నారు. పెరుమాళ్‌ యొక్క దివ్యాభరణాలను (తిరు ఆభరణంగళ్) రహస్యంగా దాచిపెట్టి, ఆ దొంగతనం నిందను శ్రీవైష్ణవులపై మోపారు.కానీ, సర్వస్వం ఆ పరమాత్ముడే అని నమ్మి జీవించే ఆ నిష్కపట భాగవతోత్తములకు ఆభరణాలు దొంగిలించాల్సిన అవసరమే లేదని ఆళ్వార్ గట్టిగా విశ్వసించారు. వారి పవిత్రతపై ఆయనకు ఉన్న నమ్మకం అంత అచంచలమైనది.

ఆ శ్రీవైష్ణవులు ఎంతమాత్రం దొంగలు కారని ఆళ్వార్‌ మనస్సాక్షికి పూర్తిగా తెలుసు. ఈ సత్యాన్ని నిరూపించాలని ఆయన సంకల్పించారు. అందుకోసం, అత్యంత విషపూరితమైన సర్పాలు ఉన్న ఒక కుండను తీసుకురావలసిందిగా తన మంత్రులను ఆజ్ఞాపించారు. “ఒకవేళ ఆ భాగవతోత్తములు నిజంగానే దొంగతనానికి పాల్పడి ఉంటే, నేను ఈ కుండలో చెయ్యి పెట్టగానే ఈ నాగుపాములు నన్ను కరవాలి; అలా జరగని పక్షంలో మీరంతా మీ తప్పును అంగీకరించాలి” అని ఆయన సగర్వంగా ప్రతిజ్ఞ చేశారు. ఆ రోజుల్లో, తమ  నిష్కల్మషమైన సత్యాన్ని నిరూపించుకోవడానికి ఇటువంటి సర్ప పరీక్షను ఎదుర్కోవడం ఒక ఆచారంగా ఉండేది.

ఆ మహోత్కృష్టమైన క్షణంలో ఆళ్వార్ ఏమాత్రం జంకకుండా ఆ సర్పాల కుండలో తన హస్తాన్ని ఉంచారు. కానీ ఆశ్చర్యకరంగా, ఆ విషసర్పాలు ఆయనకు ఎలాంటి హానీ చేయలేదు కదా నమస్కరించాయి (ఆయనను కరవలేదు). ఈ అద్భుత దివ్య లీలను కన్నులారా గాంచిన మంత్రులు భయకంపితులై, తమ కుతంత్రాన్ని ఒప్పుకుంటూ ఆళ్వార్ పాదాలపై పడి క్షమాపణలు వేడుకున్నారు.అటువంటి కులశేఖర ఆళ్వార్ చిరకాలం వర్ధిల్లుగాక (పల్లాండు)!

అనవరదమ్ ఇరామ కథై అరుళుమువన్ వాళియే

ఈ ఆళ్వార్లు ఎల్లప్పుడూ శ్రీరామచంద్రుని దివ్య గాథలను ఆలకించడంలోనే నిమగ్నమై ఉండేవారు. శ్రీమద్రామాయణ శ్రవణం చేస్తున్నప్పుడు, తాము కూడా ఆనాటి త్రేతాయుగంలోనే ఉన్నట్లు భావన చేసేవారు. ఒకానొక సందర్భంలో, ప్రవచనాకర్త రావణుడు సీతా పిరాట్టిని అపహరించిన ఘట్టాన్ని అత్యంత కరుణాజనకంగా వివరిస్తున్నారు. ఆ సమయంలో, కాలదేశాలను విస్మరించిన ఆళ్వార్లు సీతా పిరాట్టిని రావణుడి బంధీల నుండి విడిపించి, శ్రీరామునికి సహాయపడటం కోసం వెంటనే తన సైన్యాన్ని సమాయత్తం కావాల్సిందిగా ఆజ్ఞాపించారు.  ఆళ్వార్ల యొక్క ఆ తీవ్ర భక్తి పారవశ్యాన్ని గమనించిన ప్రవచనాకర్త  శ్రీరాముడు రావణుడిపై విజయం సాధించాడని, సీతాపిరాట్టి సురక్షితంగా ఉన్నారని తెలియజేశారు. ఆ మాటలతోనే ఆళ్వార్లు బాహ్యస్మృతిలోకి వచ్చి, తాము వేరొక కాలఖండంలో ఉన్నామనే సత్యాన్ని గ్రహించారు.  శ్రీరామావతార భక్తి రసంలో అంతగా లీనమైపోయిన ఈ పరమ భక్తులైన ఆళ్వార్లు చిరకాలం వర్ధిల్లుగాక (పల్లాండు)!

సెంజొల్ మొళి నూట్రంజుమ్ సెప్పినాన్ వాళియే

మన సంప్రదాయంలో శ్రీరామచంద్రుడిని ‘పెరుమాళ్‌’ అని అంటారు. ఆళ్వార్లకు శ్రీరామునిపై ఉన్న అనన్యమైన, నిగూఢమైన అనురాగం కారణంగా ఆయనకు ఆ పెరుమాళ్‌తో గల ఆత్మీయ బంధాన్ని ప్రతిబింబిస్తూ, ఆయన ‘కులశేఖర పెరుమాళ్‌’గా ప్రసిద్ధి చెందారు.అమృతతుల్యమైన దివ్య పదాలతో, ‘పెరుమాళ్ తిరుమొళి’  అనే ప్రబంధం రూపంలో నూట ఐదు (105) పాశురాలను అనుగ్రహించి, ఈ జగత్తును ధన్యం చేసిన ఈ ఆళ్వార్లు చిరకాలం వర్ధిల్లుగాక (పల్లాండు)!

సేరలర్ కోన్ సెంగమలత్ తిరువడిగళ్ వాళియే!

చేర సామ్రాజ్య సార్వభౌముడైన ఆ మహారాజు యొక్క ఎర్రని తామరల వంటి దివ్య చరణారవిందములు (తిరువడిగళ్) శాశ్వతంగా వర్ధిల్లుగాక (పల్లాండు)!

అడియేన్ శ్రీ తేజ రామానుజ దాసి 

అడియేన్ లక్ష్మీ సేనాపతి రామానుజ దాసి

పొందుపరచిన స్థానము – https://divyaprabandham.koyil.org

ప్రమేయము (లక్ష్యము) – https://koyil.org 
ప్రమాణము (గ్రంథములు) – http://granthams.koyil.org 
ప్రమాత (పూర్వాచార్యులు) – http://acharyas.koyil.org 
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org