కోయిల్ తిరువాయ్మొళి – సరళ వ్యాఖ్యానము

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

తిరువాయ్మొళి

paramapadhanathan

శ్రీ మణవాళ మమునులు ఉపదేశ రత్న మాల 15 వ పాశురములో వైకాశి విశాఖం గురించి, నమ్మాళ్వార్, తిరువాయ్మొళి, తిరుక్కురుగూర్ (అళ్వార్ తిరునగరి) యొక్క వైశిష్యాన్ని గురించి కీర్తిస్తున్నారు.

ఉణ్ణోవైగాశి విశాగత్తుక్కు ఒప్పొరునాళ్
ఉణ్డో శడకోపర్కు ఒప్పొరువర్? * ఉణ్డో
తిరువాయ్మొళి కొప్పు తెన్కురుగైక్కుశడకోపర్కు ఉణ్డో
ఒరుపార్ దన్నిల్ ఒక్కుమూర్

సర్వేశ్వరుడైన శ్రీమన్నారాయణకు వారి వైశిష్యానికి గొప్పతనము తెచ్చేందుకు మంగళాశాసనములు చేసిన నమ్మాళ్వార్ల దివ్య జన్మదినం అయిన వైకాశి విశాఖ శుభ దినానికి సరితూగే రోజు మరొకటి ఉందా? (లేదు) నమ్మాళ్వార్ అని పిలవబడే మన శటగోప స్వామికి సరిపోలిన వారు ఉన్నారా? (లేరు. సర్వేశ్వరుడు, నిత్యసూరులు, ముక్తాత్మలు, ఈ భూలోక వాసులు వీరందరిలో వారికి సరితూగే ఎవ్వరూ లేరు). వేద సారమైన తిరువాయ్మొళికి సాటి ఉందా, (లేదు). మనకి ఆళ్వార్ని ఇచ్చిన తిరుక్కురుగూర్ గొప్పతనానికి సరిపోయే పట్టణం ఇంకొకటి ఉందా? (లేదు). ఈ దివ్య దేశములో ఆదినాధ పెరుమాళ్ళకు  నమ్మాళ్వార్కి సమానమైన ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది. ఎంబెరుమాన్ల ఆధిపత్య గుణాన్ని ఇక్కడి అర్చామూర్తిలో పుష్కలంగా చూడవచ్చు, పైగా ఇది నమ్మాళ్వార్ల జన్మస్థలము కూడా. నమ్మాళ్వార్ల కృప కారణంగా, తన అవతారానికి నాలుగు వేల సంవత్సరాలకు ముందే ఎంబెరుమానార్ల దివ్య విగ్రహం ఆవిర్భావం ఈ దివ్య దేశములోనే అయ్యింది. శ్రీ రామానుజుల పునరవతారమైన మణవాల మామునుల జన్మస్థలం కూడా ఇదే. ఇంతటి గొప్పతనము ఉన్న ప్రదేశము మరొకటుందదు. ఈ రకంగా ఎంబెరుమాన్, ఆళ్వార్ మరియు ఆచార్యలకు ఈ దేశము కీర్తి తెచ్చినది,  అందువల్ల మూడు రెట్లు గొప్ప ఔన్నత్యమున్న దేశమిది.

దివ్యమైన భక్తి జ్ఞానాలతో అనుగ్రహింపబడిన వారు మన ఆళ్వారులు. వారిలో ప్రముఖులు ప్రథానమైనవారు నమ్మాళ్వార్లు. వారు తిరువిరుత్తం, తిరువాసిరియం, పెరియ తిరువందాది మరియు తిరువాయ్మొళి అనే నాలుగు దివ్యప్రబంధాలను స్వరపరచి మనకనుగ్రహించారు. వీటిలో తిరువాయ్మొళిని ముఖ్యంగా మన పూర్వాచార్యులు కీర్తించారు. సామ వేదంతో సమానంగా ప్రశంసించబడిన ఈ తిరువాయ్మొళిని మన పూర్వాచార్యులు  ఎంతో అనుభవించారు, ఆనందించారు. ఇది మంత్ర రత్నంగా ఔన్నత్యమున్న ద్వయ మహామంత్రం యొక్క విస్తార వివరణగా పరిగణిస్తారు.

ఈ ప్రబంధానికి ఎన్నో వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఉపదేశ రత్నమాల 39 వ పాశురములో మామునుల ద్వారా ఈ విషయము స్పష్టంగా నొక్కి చెప్పబడింది.

పిళ్ళాన్ నఞ్జీయర్ పెరియవాచ్చాన్ పిళ్ళై!
తెళ్ళార్ వడక్కుత్తిరివీధిపిళ్ళై!  మణవాళ యోగి
తిరువాయ్ మొళియై క్కాత్త!
గుణవాళరెన్ఱు నెఞ్జే! కూఱు!!

ఓ హృదయమా! ఎంబెరుమానార్ల ప్రియ పుత్రులవంటి తిరుక్కురుగై పిరాన్ పిళ్ళాన్, పరాశర భట్టర్ యొక్క శిష్యుడైన వేదాంతి (నంజీయర్), వ్యాఖ్యాన చక్రవర్తిగా కీర్తించబడే పెరియ వాచ్చాన్ పిళ్ళై, నంపిళ్ళై ప్రియ శిష్యులైన వడక్కు తిరువీధి పిళ్ళై,  పెరియ వాచ్చాన్ పిళ్ళై చేత ఆశీర్వదించబడిన అళగియ మణవాళ జీయర్ వీరందరూ నమ్మాళ్వార్ యొక్క దివ్య ముఖము నుండి ప్రవహించిన తిరువాయ్మొళికి వ్యాఖ్యానాలు వ్రాశారు. సాంప్రదయానికి మూలమైన ద్వయ మహామంత్రానికి విస్తరణగా పరిగణించబడిన అటువంటి తిరువాయ్మొళికి వ్యాఖ్యానములు వ్రాసి ఆ మహా ప్రబంధాన్ని రక్షించి పోషించిన ఈ మహా వ్యక్తులను అభినందించాలి.

ఇంకా,  తిరువాయ్మొళిని నమ్మాళ్వార్ల కీర్తిని అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ తమ అచార్య హృదయం అనే గ్రంధము 37 వ చూర్ణికలో, “సంధంగల్ ఆయిరముం  అఱియక్ కఱ్ఱు వల్లారానాల్ వైష్ణవత్వ సిద్ది” – ఎవరైతే ఈ తిరువాయ్మొళిని అర్థములతో సహా నేర్చుకొని ఆ సూత్రాలను ఆచరణలో పెడతారో, వాళ్ళు శ్రీ వైష్ణవులు అనబడతారు అని వివరించారు.

ఈ విధంగా, శ్రీవైష్ణవులందరూ ఈ తిరువాయ్మొళిని తప్పక నేర్చుకోవాల్సిన అవసరం ఉందని అర్థం చేసుకోవాలి. మన సాంప్రదాయములో, ప్రతిదీ ఆచార్యుల ద్వారానే నేర్చుకోవాలని అన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి.

ఇప్పటి పరిస్థితుల్లో మనం తిరువాయ్మొళిని పూర్తిగా పఠించలేకపోతున్నప్పుడు, మన పెద్దలు అనుగ్రహించిన అమరిక ప్రకారం ముఖ్యమైన పదిగముల సమాహారమైన కోయిల్ తిరువాయ్మొళిని కనీస రూపంగా పఠించవచ్చు. కొన్ని ప్రాంతాలను బట్టి ఆ దివ్య దేశ పరిపాటిని బట్టి కొన్ని పాదిగములలో తేడా ఉండవచ్చని  గమనించాలి. కొంతవరకు, ఎక్కువ మటుక్కు దివ్య దేశాలలో పఠించబడే పదిగములను మన పూర్వాచార్యుల  వ్యాఖ్యానాల సహాయంతో సరళ అర్థాలను ఇక్కడ అందించబడ్డాయి.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము : https://divyaprabandham.koyil.org/index.php/2020/05/koyil-thiruvaimozhi-simple/

పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a Comment