కోయిల్ తిరువాయ్మొళి – 10.9 – శూళ్విశుంబు

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

కోయిల్ తిరువాయ్మొళి

<< 10.8 – తిరుమాలిరుంజోలై

ఆళ్వారు త్వరగా పరమపదము చేరుకోవాలని కోరుకుంటున్నారు, భగవానుడు  ఆళ్వారుని అంతకంటే త్వరగా పరమపదానికి తీసుకు వెళ్లాలని ఆశిస్తున్నాడు. కానీ దీనికి ముందు, పరమపదము చేరుకోవాలనే ఆళ్వారు కోరికను మరింత పెంచాలని భగవానుడు వారికి వేదాంతములో వివరించబడిన అర్చరాది గతిని (పరమపదానికి వెళ్ళే దారి) చూపిస్తారు. అర్చరాది మార్గాన్ని ఆళ్వారు దర్శించి తృప్తి చెంది, శ్రీవైష్ణవాలందరూ ఈ గొప్ప ఘనతను పొందుతారు అన్న విశ్వాసము కలిగించడానికి,  శ్రీవైష్ణవులు ఈ అర్చరాది మార్గములో ప్రయాణించి ఎలా  నిత్యసూరులతో (పరమపద నిత్య నివాసితులు) ఏకం అవుతారో ఈ పదిగములో ఆళ్వారు వివరిస్తున్నారు.

మొదటి పాశురము: తిరునాడు (పరమపదము) ని అధిరోహిస్తున్న శ్రీవైష్ణవులను చూసి చరాచర తత్వాలు పొందే సంతోషాన్ని ఆళ్వారు దయతో వివరిస్తున్నారు.

శూళ్ విశుంబణి ముగిల్‌ తూరియం ముళక్కిన
ఆళ్ కడల్‌ అలై తిరై కై ఎడుత్తాదిన
ఏళ్ పొళిళుం వాళమేందియ ఎన్నప్పన్‌
వాళ్ పుగళ్ నారణన్‌ తమరై క్కండుగందే

పరమానందాన్నికలిగించే విశేష గుణములు ఉన్న నా నిత్య బంధువు నారాయణుడు, ఆతడి విశేష బంధువులైన వారి భక్తులను చూసి సంతోషిస్తున్నారు. ఆకాశంలో అన్ని దిక్కులను కమ్మివేసిన మేఘాలు భయంకరమైన ఉరుములతో సంగీత ధ్వనులు చేశాయి; మహాసముద్రాలు ఎత్తైన అలలను తమ చేతులుగా చేసుకొని నాట్యము చేశాయి;  అద్భుతమైన వస్తువులను బహుమతుల రూపంలో ఏడు ద్వీపాలు అందించాయి.

రెండవ పాశురము: పై లోకాలు అందించిన స్వాగత సత్కారాలను ఆళ్వారు దయతో వివరిస్తున్నారు.

నారణన్‌ తమరై క్కండుగందు నల్నీర్‌ ముగిల్‌
పూరణ పొఱ్కుడం పూరిత్తదు ఉయర్‌ విణ్ణిల్‌
నీరణి కడల్గళ్‌ నిన్ఱార్తన  నెడువరై
తోరణం నిరైత్తు ఎంగుం తొళుదనర్‌ ఉలగే

నారాయణుని భక్తులను చూసి సంతోషించి, స్వచ్ఛమైన నీటితో నిండిన మేఘాలు, పై లోకాల గగనాలను బంగారు కలశములలా నింపి వేశాయి; మహాసముద్రాలు తమ నీటితో కర్ణభేరీ ధ్వనులను మ్రోగించాయి; ఎత్తైన పర్వతాలు ప్రపంచాన్ని స్వాగత తోరణాలులా అలంకరించాయి, సమస్థ లోకాల వాసులు ప్రతి చోటా వారికి పూజలు చేశారు. ఈ మొదటి రెండు పాశురములలో,  భూలోకము నుండి ఆకాశం వరకు వారికి అందించిన స్వాగత సత్కారాలను  ఆళ్వారు చూపించారు. ‘ఉలగం’ ప్రపంచ నాయకులు అని అర్థము.

మూడవ పాశురము: ఆదివాహిక (పరమపద మార్గంలో ఆత్మకి దారి చూపించే వారి నివాసం) లోక వాసులు పరమపదాన్ని అధిరోహిస్తున్న శ్రీవైష్ణవులను స్వాగతించడానికి ఎదురు వచ్చి వారిపై పువ్వులు కురిపించి వారిని ఎలా కీర్తిస్తారో ఆళ్వారు దయతో వివరిస్తున్నారు.

తొళుదనర్‌ ఉలగర్గళ్‌ తూబనల్‌ మలర్‌ మళై
పొళివనర్‌ బూమి అన్ఱళందవన్‌ తమర్‌ మున్నే
ఎళుమిన్‌ ఎన్ఱు ఇరు మరుంగిశైత్తనర్‌ మునివర్గళ్‌
వళియిదు వైగుందఱ్కు ఎన్ఱు  వందెదిరే

ఈ భూలోకాన్ని మహాబలి “నాది” అని చెప్పిన్నప్పుడు, ఈ భూమిని కొలిచిన ఆ భగవానుడి మహా భక్తుల సమక్షములో మునివరులందరూ మౌనముగా నిలుచొని పుష్ప వర్షాన్ని కురిపించి, ధూప దీపాలు చూపించి, వారి దాస్య స్వభావాన్ని ప్రదర్శిస్తూ చేతులు జోడించి అంజలి ఘటించారు; పరమపదాన్ని అధిరోహిస్తున్న శ్రీవైష్ణవులను స్వాగతించడానికి మార్గము ఇరువైపులా నిలుచొని “ఇది శ్రీవైకుంఠ మార్గము” అని చెప్పి, వారు ఆసక్తిగా “దయతో మీరు వస్తారా?” అని ఆహ్వానిస్తారు.

నాలుగవ పాశురము: శ్రీవైష్ణవులు విశ్రాంతి తీసుకోవడానికి పైలోక దేవతలు అన్ని చోట్లా ఉద్యానవనములను ఎలా ఏర్పాటు చేస్తారో,  సంగీత వాయిద్యాల సహాయముతో వారు మంగళ ధ్వనుల చేస్తూ శ్రీవైష్ణవులను ఎలా ప్రశంసిస్తారో ఆళ్వారు వివరిస్తున్నారు.

ఎదిర్‌ ఎదిర్‌ ఇమైయవర్‌ ఇరుప్పిడం వగుత్తనర్‌
కదిరవర్ అవర్‌ అవర్‌ కైన్నిరై కాట్టినర్‌
అదిర్‌ కురల్‌ మురశంగళ్‌ అలై కడల్‌ ముళక్కొత్త
మదు విరి తుళాయ్‌ ముడి మాదవన్‌ తమర్కే

కళ్ళ రెప్ప వార్చని దేవతలు, తేనెలు కార్చే తులసి ఉన్న దివ్య కిరీటాన్ని ధరించిన శ్రియఃపతి సేవకులు విశ్రాంతి తీసుకునే ప్రదేశాలుగా భవంతులను తయారు చేశారు: పన్నెండు ఆదిత్యులు వారి వారి సామర్థ్యం మేరకు దారిగుండా వారి కిరణాలను వరుసలుగా వెదజల్లుతూ అలంకరించారు; వారు తుమ్బుర వాయిధ్యాలతో మ్రోగిస్తున్న కర్ణభేరీల ధ్వనులు, మహాకెరటాలతో మహాసాగరాలు చేస్తున్న మహా ధ్వనులను పోలి ఉంది.

ఐదవ పాశురము:  శ్రీవైష్ణవులకు వరుణ, ఇంద్ర మొదలైన దేవతలు ఇచ్చిన స్వాగత సత్కారములను ఆళ్వారు దయతో వివస్తున్నారు. వీరంతా ఆదివాహిక (పరమపద మార్గంలో ఆత్మకి దారి చూపించే వారు) యొక్క విధిని నిర్వర్తిస్తారు.

మాదవన్‌ తమర్‌ ఎన్ఱు  వాశలిల్‌ వానవర్‌
పోదుమిన్‌ ఎమదిడం పుగుదుగ ఎన్ఱలుం
గీదంగళ్‌ పాడినర్‌ కిన్నరర్‌ కెరుడర్గళ్‌
వేదనల్‌ వాయవర్ వేళ్వియుళ్‌ మడుత్తే

వరుణుడు, ఇంద్రుడు, ప్రజాపతి మొదలైన ఆదివాహిక దేవతలు వారి వారి నివాస ప్రవేశద్వారముల వద్ద నిలబడి వస్తున్న శ్రియఃపతి సేవకులకు దండాలు పెడుతూ తమ భక్తి చూపించి, “కృపతో ఇలా రండి, దయచేసి మీ అధీనములో ఉన్నఈ నివాసములోకి ప్రవేశించండి” అని ఆహ్వానిస్తారు; ఈ గౌరవ పలుకులు పలుకుతూ వాళ్ళని బహుమతులతో సత్కరిస్తూ, వేద పఠనముతో, యజ్ఞ కర్మలు మొదలైనవి శ్రీవైష్ణవుల పాద పద్మముల యందు గౌరవముతో అర్పించి “మా పఠనము ఈ నాటికి ధన్యమైంది” అని గొప్పగా భావిస్తారు; కిన్నరులు గంధర్వులు కీర్తనలు పాడుతారు.

ఆరవ పాశురము: “దేవస్త్రీలు శ్రీవైష్ణవులను ఆనందంగా స్వాగతించి ఆశీర్వదిస్తారు”, అని ఆళ్వారు తెలుపుతున్నారు.

వేళ్వియుళ్‌ మడుత్తలుం విరై కమళ్ నఱుం పుగై
కాళంగళ్‌ వలంబురి కలందెంగుం ఇశైైత్తనర్‌
ఆణ్మింగళ్ వానగం ఆళియాన్‌ తమర్‌ ఎన్ఱు
వాళొణ్‌ కణ్‌ మడందైయర్‌ వాళ్ త్తినర్‌ మగిళ్ న్దే

వైధికులు తమ ధర్మాలను అర్పించిన తరువాత, మంచి ధూప సుగంధములు అన్ని చోట్లా వ్యాపింప జేస్తారు. శంఖాలు మొదలైన వాయు వాయిద్యాలు ఊద బడ్డాయి; అందమైన మెరిసే కళ్ళు ఉన్న ఆ దేవ స్త్రీలు ఆనందముతో  “మీరు స్వర్గాలను ఏలాలి” అని తిరువాళి ఉన్న సర్వేశ్వరుని దాసులను ఆశీర్వదిస్తారు.

ఏడవ పాశురము: “మరుతులు మరియు వసువులు సమూహాలుగా తమ సరిహద్దులను దాటి తమకు సాధ్యమైనంత దూరము వరకు వెళ్లి, శ్రీవైష్ణవులను ప్రశంసించారు”,  అని ఆళ్వారు వివరిస్తున్నారు.

మడందైయర్‌ వాళ్ త్తలుం మరుదరుం వశుక్కళుం
తొడర్ందు ఎంగుం తోత్తిరం శొల్లినర్‌ తొడుగడల్‌
కిడంద ఎంకేశవన్‌ కిళర్‌ ఒళి మణిముడి
కుడందై ఎంకోవలన్‌ కుడియడి యార్కే

అగాధమైన మహాసముద్రంలో దయతో విశ్రాంతి తీసుకుంటూ, కేశవునిగా బ్రహ్మతో ప్రారంభించి, నా వంటి వారిని నుండి, నిత్యసూరుల వరకు సృష్టించి, అమూల్యమైన రత్నాల కిరీటాన్ని ధరించి కృపతో తిరుక్కుడందైలో కృష్ణుడిగా విశ్రాంతి తీసుకుంటున్నాడు; తరతరాలుగా అటువంటి భగానుడికి సేవ చేస్తున్న సేవకులను మరుతులు మరియు అష్ట వసువుల పత్నులు ప్రశంసించారు; వారు ప్రశంసిస్తుండగా, మరుతులు మరియు అష్ట వసువులు ప్రతి చోటా శ్రీవైష్ణవులను  అనుసరించి వారికి ప్రశంసలు పలికారు. తొడుదల్ – తొణ్డుదల్ (త్రవ్వడం) – లోతుని సూచిస్తుంది.

ఎనిమిదవ పాశురము: లీలావిభూతిని దాటి పరమపద సరిహద్దులో నిత్యసూరులు ఎలా ముందుకు వచ్చి శ్రీవైష్ణవులను స్వాగతిస్తారో ఆళ్వారు వివరిస్తున్నారు.

కుడియడియార్‌ ఇవర్‌ కోవిందన్‌ తనక్కెన్ఱు
ముడియుడై వానవర్‌ ముఱై ముఱై ఎదిర్‌ కొళ్ళ
కొడియణి నెడు మదిళ్‌ కోపురం కుఱుగినర్
వడి వుడై మాదవన్‌ వైగుందం పుగవే

ఈశ్వరుని పోలిన సమాన రూపముతో కిరీటము, పీతాంబరములు మొదలైనవి ధరించిన నిత్యసూరులు ముందుకు వచ్చి, తన భక్తుల కోసమే అవతరించిన కృష్ణుడి  కోసమే ఉన్న గొప్ప కోవకు చెందిన భక్తులని భావించి వారిని స్వాగతిస్తారు. వాళ్ళు సర్వేశ్వరునికి చెందిన ఎత్తైన కోట, ధ్వజముతో అలంకరించి ఉన్న శ్రీవైకుంఠము ప్రధాన ద్వారం వద్దకు వచ్చి శ్రీవైష్ణవులను లోపలికి ప్రవేశింపజేస్తారు.

తొమ్మిదవ పాశురము: “శ్రీవైకుంఠము యొక్క ప్రవేశ ద్వారం వద్దకు చేరుకుని, పెద్దలచే స్వాగతింపబడిన తరువాత, అక్కడ ఉన్న నిత్యాసూరులు దిగ్బ్రాంతులై, ‘సంసారులు (అంతకు ముందు సంసారంలో ఉన్నవారు) శ్రీవైకుంఠానికి చేరుకున్నారు! ఎంతటి అద్భుతమిది! ఎంత అదృష్ఠము! అని ఆశ్చర్యపోతారు” అని ఆళ్వారు వివరిస్తున్నారు.

వైగుందం పుగుదలుం వాశలిల్‌ వానవర్‌
వైగుందన్‌ తమర్‌ ఎమర్‌ ఎమదిడం పుగుదెన్ఱు
వైగుందత్తు అమరరుం మునివరుం వియందనర్‌
వైగుందం పుగువదు మణ్ణవర్‌ విదియే

శ్రీవైకుంఠములోకి శ్రీవైష్ణవులు ప్రవేశించినప్పుడు, దివ్య ద్వారపాలకులు “శ్రీవైకుంఠాన్ని సాధించిన ఈ శ్రీవైష్ణవులు మనకు కావాల్సిన వాళ్ళు” అని భావించారు; “వారు మన రాజ్యంలోకి ప్రవేశించాలి” అని తలచి ఆతృతతో సంతోషించారు; “భూమిపై లౌకిక విషయాలలో మునిగి ఉన్న ఈ శ్రీవైష్ణవులు పరమపదములోకి ప్రవేశిస్తున్నారు, ఎంత అదృష్టం!” అని అమరులు (కైంకర్యములో పాల్గొనేవారు) మరియు మునివర్లు (భగవత్గుణాలను ధ్యానించేవారు) భావించారు.

పదవ పాశురము: ఈ సంసారం నుండి శ్రీవైకుంఠానికి చేరుకున్న శ్రీవైష్ణవులను నిత్యసూరులు ప్రశంసించిన తీరును దయతో ఆళ్వారు వివరిస్తున్నారు.

విదివగై పుగుందనర్‌ ఎన్ఱు నల్‌ వేదియర్‌
పదియినిల్‌ పాంగినిల్‌ పాదంగళ్‌ కళువినర్‌
నిదియుం నఱ్చుణ్ణముం నిఱై కుడ విళక్కముం
మది ముగ మడందైయర్‌ ఏందినర్‌ వందే

ఏనాటి అదృష్టమో  ఈశ్వర సంకల్పముతో శ్రీవైష్ణవులు పరమపదాన్ని చేరుకొని లోనికి  ప్రవేశించారు; వేద ప్రావీణ్యం ఉన్న నిత్యసూరులు సంతోషించి గౌరవప్రదంగా శ్రీవైష్ణవుల దివ్య పాదాలను కడుగుతారు;  స్తోత్ర రత్నంలో “ధనం ​​మదీయం” – భగవానుడి పాదుకలు భక్తులకు గొప్ప సంపద అని చెప్పబడినట్లుగా, భగవానుడి పాదుకలతో, తిరుచూర్ణము, పూర్ణ కుంబములు మరియు మంగళ దీపములతో దివ్య ముఖ తేజముతో మెరుస్తున్న దివ్య అప్సరసలు అతి వినయ గౌరవాలతో శ్రీవైష్ణవులను స్వాగతించడానికి ముందుకు వస్తారు.

పదకొండవ పాశురము: ఈ దశాబ్దంలో బాగా ప్రావీణ్యం ఉన్నవారిని వైకుంఠపు మునివర్లతో (పరమపదంలో ఎల్లప్పుడూ భగవానుడిని ధ్యానించే నిత్యసూరులు) పోల్చారు.

వందవర్‌ ఎదిర్‌ కొళ్ళ మామణి మండబత్తు
అందమిల్‌ పేరిన్బత్తు  అడియరోడిరుందమై
కొందలర్‌ పొళిల్ కురుగూర్‌ చ్చడగోబన్‌ శొల్‌
శందంగళ్‌ ఆయిరత్తు  ఇవై వల్లార్‌ మునివరే

ఆళ్వార్తిరునగరికి స్వామి అయిన నమ్మాళ్వార్లు దయతో ఈ పదిగములో, భగవానుడు స్వయంగా ముందుకు వచ్చి తిరుమామణి మండపములో శ్రీవైష్ణవులను స్వీకరించే విధానాన్ని వివరిస్తున్నారు. ఆళ్వారు పాడిన వేయి పాశురములలో  అంతులేని నిత్య పరమానందమయులైన సూరులతో ఉన్న శ్రీవైష్ణవులను అ పదిగములో వివరిస్తున్నారు. ఈ పదిగాన్ని సాధన చేయగలిగిన వారు, భగవానుడి యొక్క నిత్య మంగళ గుణాలను ధ్యానించేవారు అవుతారు. ‘వందవర్ ఎదిర్కొళ్ళ’ భగవానుడి ప్రథమ సేవకుడైన విశ్వక్సేనులు మొదలైన ఇతరులు అని అర్థము.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2020/06/thiruvaimozhi-10-9-simple/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a Comment