శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
ఆళ్వారు భగవానుడికి నిత్య కైంకర్యాన్ని చేయాలనుకున్నారు. కానీ వారు ఈ ప్రపంచంలో ఇక్కడ చేయలేనని గ్రహించి, పరమపదానికి అధిరోహించి అక్కడ శాశ్వత కైంకార్యం చేయాలనుకున్నారు. తిరుమోగూర్లోని కలామేగ ఎంబెరుమానుడు తన అడ్డంకులను తొలగించి పరమపదము వైపు నడిపించగలడని భావించారు. పరమప
ద మార్గములో తనకు తోడుగా ఉండాలని కోరుతూ ఆ భగవానుడికి శరణాగతి చేశారు.
మొదటి పాశురము: “అడ్డంకులను నాశనం చేసే స్వభావం ఉన్న కాలమేగ భగవానుడు తప్పా ఇంకేక్కడా మనకి ఆశ్రయము లేదు”, అని ఆళ్వారు తెలియజేస్తున్నారు.
తాళ తామరై తడమణి వయల్ తిరుమోగూర్
నాళుం మేవి నన్గమర్ న్దు నిన్ఱు అశురరై త్తగర్కుం
తోళుం నాన్గుడై శురి కుళల్ కమల క్కణ్ కనివాయ్
కాళ మేగత్తె అన్ఱి మఱ్ఱొన్ఱిలం కదియే
దుష్ట శిక్షణకై కాలమేఘ పెరుమాళ్ళు పరమానందముతో ఎంతో తృప్తితో బలమైన కాండం కలిగి ఉన్న తామర పువ్వుల సరస్సుల తో ఉన్న తిరుమోగూర్లో నిత్య నివాసుడై ఉన్నాడు. అతడు చతుర్భుజాలతో దట్టమైన ఉంగరాల శిరోజాలతో, కమలము వంటి నేత్రములతో, పగడము వంటి దివ్య అధర సౌందర్యముతో ఉన్నాడు. నల్లని మేఘము వంటి గొప్ప స్వరూపాన్ని కలిగి ఉన్న అతడు తప్పా మనకు ఇతర ఆశ్రయము, గమ్యము లేదు.
రెండవ పాశురము: “పునరుజ్జీవింప చేసే భగవానుడి దివ్య పాదాలు తప్పా ఎప్పటికీ మనకు వేరే ఆశ్రయం లేదు. భగవానుడి దివ్య నామములు, భక్తులను ఆనందింపజేసి వారి అలసటను తీర్చి వారిని ఉద్ధరిస్తాయి, “, అని ఆళ్వారు తెలియజేస్తున్నారు.
ఇలంగది మఱ్ఱొన్ఱు ఎమ్మైక్కుం ఈన్ తణ్ తుళాయిన్
అలంగలంగణ్ణి ఆయిరం పేరుడై అమ్మాన్
నలంగొళ్ నాన్మఱై వాణర్గళ్ వాళ్ తిరుమోగూర్
నలంగళల్ అవనడి నిళల్ తడమన్ఱి యామే
కాలమేఘ పెరుమాళ్ళకు అందమైన తిరుత్తుళాయ్ (తులసి) హారంతో దివ్యాలంకరణ చేయబడి ఉన్నది. వీస్తున్న గాలితో ఆ తులసీ హారము అటూ ఇటూ ఊగుతూ ఉన్నది. స్థిరంగా ఉన్న పుష్పాలు వాటి చల్లదనముతో మరింత అనుభవవించేలా ఉన్నవి; నిరపేక్షుడైన ఆ భగవానుడికి లెక్కలేనన్ని దివ్య నామములు ఉన్నాయి; దయ మరియు అనేక సుగుణాలు కలిగి ఉన్న చతుర్వేద పండితులు, నిత్యము ఆ భగవానుడి సేవలో ఉండి ఆతడి విశిష్ట గుణాలను అనుభవిస్తూ సుసంపన్నముగా జీవిస్తున్న తిరుమోగూర్లో తానూ నివాసుడై ఉన్నాడు; అన్ని జన్మలలో, ఆతడి తిరువడి తప్పా వేరే గమ్యం మనకు లేదు; మరో మాటలో చెప్పాలంటే, విలువైన పాద అందెలతో, దివ్య ఆభరణాలతో అలంకరింపబడిన అతడి దివ్య పాదాలను, అతడు పక్షపాతము లేకుండా భక్తుల మధ్య చేరుకోవడానికి ఉపయోగించవచ్చు.
మూడవ పాశురము: “మన దుఃఖాలన్నీ తొలగిపోయేలా, అన్ని శుభ లక్షణాలున్న సర్వేశ్వరుడు నివాసుడై ఉన్న తిరుమోగూర్కి మనందరమూ చేరుకుందాం; ఇదే ఉత్తమము”, అని ఆళ్వారు అంటున్నారు.
అన్ఱియాం ఒరు పుగలిడం ఇలం ఎన్ఱెన్ఱలఱ్ఱి
నిన్ఱు నాన్ముగన్ అరనొడు తేవర్గళ్ నాడ
వెన్ఱు మూవులగళిత్తు ఉళల్వాన్ తిరుమోగూర్
నన్ఱు నాం ఇని నణుగుదుం నమదిడర్ కెడవే
“నీవు తప్పా మాకు వేరే ఆశ్రయం లేదు” అని పదే పదే ఆర్తితో ప్రార్థిస్తూ బలహీనులైన దేవలోక వాసులు, బ్రహ్మ మరియు రుద్రునితో చేరి నిలబడి భగవానుడిని ఆశ్రయించినట్లే, ఈ ముల్లోకాల శత్రువులపై గెలుపు పొందిన వాడు, సర్వరక్షకుడు అయిన వాడు నివాసుడై ఉన్న తిరుమోగూర్కి మనం అనన్యప్రయోజనులుగా చేరుకుందాం. మన మానసిక ఒత్తిడిని తొలగించుకుందాం.
నాలుగవ పాశురము: “రండి, మన దుఃఖాలన్నీ తొలగిపోయేలా తిరుమోగూర్లో కొలువై ఉన్న భగవానుడికి శరణాగతి చేద్దాం”, అని ఆళ్వారు శ్రీ వైష్ణవులను ఆహ్వానిస్తున్నారు.
ఇడర్ కెడ ఎమ్మై ప్పోందళియాయ్ ఎన్ఱెన్ఱేత్తి
శుడర్ కొళ్ శోదియై తేవరుం మునివరుం తొడర
పడర్ కొళ్ పాంబణై పళ్ళి కొళ్వాన్ తిరుమోగూర్
ఇడర్ కెడ అడి పరవుదుం తొండీర్! వమ్మినే
భగవానుడి స్పర్శ సంబంధం ఉన్నందున ఆ సర్పము మరింత విశాలముగా విస్తరించి, దివ్య సర్ప జాతికి చెందిన వాటిలా దివ్య సువాసనలు వెదజల్లుతూ, శీతలమైన, మృదువైన దివ్య సర్ప శయ్యపై కృపతో శయనించి ఉన్న భగవానుడు, ప్రకాశవంతమైన స్వరూపము, దివ్య తేజస్సుని కలిగి ఉన్నాడు. తమను తాము దేవతలము అని పొగుడుకుంటూ ఉన్న దేవతలు మరియు ఋషులు ఈ దివ్య స్వరూపాన్ని అనుసరిస్తూ, “శత్రు బాధలను తొలగించమని నిన్ను ఆశ్రయించిన మమ్మల్ని రక్షించుము” అని పదే పదే శరణాగతి చేశారు. ఆటువంటి భగవానుడు ఇప్పుడు తిరుమోగూర్ నివాసుడు. అతడికి శరణాగతి చేయాలని కోరుకునేవాళ్ళారా! దయచేసి రండి! ఆతడి దివ్య చరణాలను స్తుతిద్దాం.
ఐదవ పాశురము: “మనందరి పైన దయతో దిగివచ్చి తిరుమోగూర్లో నిలబడి ఉన్న భగవానుడికి శరణాగతి చేయడానికి రండి” అని ఆళ్వారు పిలుస్తున్నారు.
తొండీర్! వమ్మిన్ నం శుడరొళి ఒరు తని ముదల్వన్
అండ మూవులగళందవన్ అణి తిరుమోగూర్
ఎణ్ దిశైయుం ఈన్ కరుంబొడు పొరుంజెన్నెల్ విళైయ
కొండ కోయిలై వలంజెయ్దు ఇంగాడుదుం కూత్తే
కోరిక ఉన్న వాళ్ళారా! రండి! నిమిత్త కారణం, ఉపాదాన కారణం మరియు సహాయక కారణాలైన మూడు రకాల కారణాలకు మూల భూతుడు, అండాకారపు విశ్వాము యొక్క మూడు పొరలను కొలిచి స్వీకరించినవాడు, అనంతంగా ప్రకాశించే ప్రకాశవంతమైన దివ్య స్వరూపముతో మనకి ఆనందింపజేసేవాడు, తీపి చెరకు పొలాలు మరియు పొడవైన ఎర్రటి వరి చేనులు అన్ని దిక్కులలో వ్యాపించి ఉన్న తిరుమోగూర్లోని ఆలయాన్ని తన నివాసంగా స్వీకరించాడు. ఇక్కడే ఈ భూమిపైనే, అలాంటి ఆలయానికి మనము ప్రదక్షిణలు చేసి, భక్తిలో మునిగి నాట్యము చేద్దాం, రండి!
ఆరవ పాశురము: “మనము నమ్మ దగిన వాడు భగవానుడు. అతడి దివ్య పాదాలు తప్ప మనకు రక్షణ లేదు, ఆతడు మనపై కృపతో తిరుమోగూర్లో నిలబడి ఉన్నాడు”. అని ఆళ్వారు తెలియజేస్తున్నారు.
కూత్తన్ కోవలన్ కుదఱ్ఱు వల్లశురర్గళ్ కూఱ్ఱం
ఏత్తుం నంగట్కుం అమరర్కుం మునివర్కుం ఇన్బన్
వాయ్ త్త తణ్ పణై వళ వయల్ శూళ్ తిరుమోగూర్
ఆత్తన్ తామరై అడియన్ఱి మఱ్ఱిలం అరణే
పరమాత్మ ఒక నిపుణ నర్తకిలా అందంగా నడుస్తారు; రక్షణ అవసరమైన వారిని రక్షిస్తారు; మానవాళిని హింహపెట్టే కేశి, ధేనుకాసురుల వంటి శక్తి ఉన్న రాక్షసులకు మరణము వంటివాడు; కైంకర్యము తప్ప వేరే ఇతర ఇచ్ఛ లేకుండా అతడినే స్తుతించే మనకు, ఆయనను నిత్యమూ ఆస్వాదించే నిత్యసూరులకు మరియు ఋషులకు ఆతడు ఆనందదాయకుడు. అత్యంత విశ్వసనీయుడు అయిన ఆ భగవానుడి కమలము వంటి ఆ దివ్య పాదాలు తప్పా మనకు వేరే రక్షణ లేదు. ఆ భగవానుడే, చుట్టూ చల్లటి నీటి వనరులు మరియు అందమైన పొలాలు ఉన్న తిరుమోగూర్లో భక్తులు శరణాగతి చేయుటకై కొలువై ఉన్నాడు.
ఏడవ పాశురము: “సర్వకారకుడైన సర్వేశ్వరుడు కొలువై ఉన్న తిరుమోగూర్ని చేరుకున్న తరువాత, ఆతడు మమ్మల్ని రక్షించకుండా ఉండలేడు, మన బాధలన్నీ వెంటనే తొలగించబడతాయి”. అని ఆళ్వారు తెలియజేస్తున్నారు.
మఱ్ఱిలం అరణ్ వాన్ పెరుం పాళ్తని ముదలా
శుఱ్ఱుమ్ నీర్ పడైత్తు అదన్ వళి త్తొల్ ముని ముదలా
ముఱ్ఱుమ్ దేవరోడు ఉలగు శెయ్వాన్ తిరుమోగూర్
శుఱ్ఱి నాం వలంశెయ్య నం తుయర్ కెడుం కడిదే
భగవానుడికి అత్యున్నత గొప్పతనము, ప్రత్యేకత ఉంది. అతడు భౌతిక జగత్తులో సమస్థ ప్రభావాలను సృష్టించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నవాడు. ఆది తత్వముతో ప్రారంభమయ్యే ప్రతిదాన్ని, అన్నింటికీ కారణమైన నీరు, ఇతర దేవతలతో సహా సృష్టి ప్రక్రియ గురించి యోచించు బ్రహ్మను సృష్టించగల ప్రత్యేక సామర్థ్యాన్ని కలిగి ఉన్నవాడు అతడు; అతడికి తిరుమోగూర్లో ప్రదక్షిణలు వంటివి చేస్తే, ఒంటరితనము కారణంగా ఏర్పడిన మన బాధలు వెంటనే పోతాయి. అందువల్ల, మనకి వేరే రక్షణ లేదు.
ఎనిమిదవ పాశురము: “తిరుమోగూర్లో దయతో నిలబడి ఉన్న దశరథుని వీర పుత్రుడికి మనము శరణాగతులైనప్పుడు, మన బాధలన్నీ మటుమాయమై పోతాయి”. అని ఆళ్వారు తెలియజేస్తున్నారు.
తుయర్ కెడుం కడిదడైందు వందు అడియవర్ తొళుమిన్
ఉయర్ కొళ్ శోలై ఒణ్ తడమణి యొళి తిరుమోగూర్
పెయర్గళ్ ఆయిరం ఉడైయ వల్లరక్కర్ పుక్కళుంద
దయరదన్ పెఱ్ఱ మరదగ మణి త్తడత్తినైయే
ఎత్తైన తోటలు, అరుదైన విశేష సరస్సులు అలంకరణగా కలిగి, వాటి వల్ల ప్రకాశిస్తున్న తిరుమోగూగుర్లో ఉన్న భగవానుడు, దశరథుని చేత గౌరవింపబడ్డాడు, పచ్చ (రత్నము) రత్న వర్ణము కలిగిన చెరువు లా ఉన్నాడు, లెక్కలేనన్ని బిరుదులు కలిగి ఉన్న అతి బలశాలులైన రాక్షసులను ముంచగల సామర్థ్యము ఉన్నవాడు; శ్రీ రామాయణం కిష్కింద కాండం 4.12లో “గుణైర్దాస్యం ఉపాగతః” అని చెప్పినట్లు మీరందరూ ఇక్కడకు చేరుకుని ఆయనను ఆరాధించండి. మీ దుఃఖాలు మీ ప్రయత్నం లేకుండా సునాయాసంగా వెంటనే నాశనం అవుతాయి. ఉదాహరణకి, ఆభరణంగా అలంకరించు కోగలిగిన మరదగ రత్నాన్ని విషాన్ని తొలగించేదుకు కూడా వాడతారు. అలాగే శత్రు నాశనము చేయగల భగవానుడు భక్తులకు ఆశ్రయం కూడా అనుగ్రహిస్తాడు.
తొమ్మిదవ పాశురము: తన రక్షణ కొరకై తిరుమోగూర్కి చేరుకున్న తరువాత తనకి కలిగిన ప్రయోజనం గురించి ఆళ్వారు తెలుపుతున్నారు.
మణిత్తడ త్తడి మలర్కణ్గళ్ పవళ చ్చెవ్వాయ్
అణిక్కొళ్ నాల్ తడందోళ్ తెయ్వం అశురరై ఎన్ఱుం
తుణిక్కుం వల్లరట్టన్ ఉఱై పొళిల్ తిరుమోగూర్
నణిత్తు నమ్ముడై నల్లరణ్ నాం అడైందనమే
పరిశుద్దమైన సరస్సు వంటి దివ్య పాదాలు, వికసించిన తామర పుష్పముల వంటి దివ్య నేత్రాలు, ఎర్రటి పగడము వంటి దివ్య అధరములు, సమస్థ ఆభరణాలతో అలంకరించబడటానికి అర్హతగల చతుర్భుజాలు కలిగి ఉన్నవాడు కాళమేఘ ఎంబెరుమానుడు. ఎల్లప్పుడూ రాక్షసులను చీల్చి ఛేదింగల అతి బలవంతుడు, గర్వించదగినవాడు, ఆహ్లాదకరమైన తిరుమోగూర్లో నిత్య నివాసుడై ఉన్నాడు. అటువంటి విశిష్ట రక్షణ నివాసమైన తిరుమోగూర్ అతి దగ్గర్లో ఉంది; మనము అక్కడికి చేరుకున్నాము.
పదవ పాశురము: “ఓ నా బందువులారా! సర్వరక్షకుడు అయిన భగవానుడు నివాసుడై ఉన్న తిరుమోగూర్ పట్ల ఆసక్తి పెంచుకోడి, దాని గురించి ధ్యానించండి, కీర్తిచండి”, అని ఆళ్వారు సమస్థ జనావళి కి తెలియజేస్తున్నారు.
నాం అడైంద నల్లరణ్ నమక్కెన్ఱు నల్లమరర్
తీమై శెయ్యుం వల్లశురరై అంజి చ్చెన్ఱడైందాల్
కామ రూపం కొండు ఎళుదళిప్పాన్ తిరుమోగూర్
నామమే నవిన్ఱు ఎణ్ణుమిన్ ఏత్తుమిన్ నమర్గాళ్
గొప్ప గొప్ప విషయాలు తెలిసిన దేవతలు కూడా అతి బలశాలులైన అసురులకు భయపడి, “అతడు ఆశ్రిత వత్సలుడు, సర్వ రక్షకుడు” అని భావించి భగవానుడిని ఆశ్రయించినప్పుడు, అతడు ఆయా సమయ కాలముల బట్టి సముచిత స్వరూపాన్ని దాల్చి మనలను రక్షిస్తాడు. మనతో సంబంధం ఉన్న మీరందరూ! అటువంటి భగవానుడి నివాసమైన తిరుమోగూర్ యొక్క అద్భుతమైన కీర్తి గురించి ధ్యానించండి మరియు స్తుతించండి; ప్రేమతో ప్రశంసించండి. ‘కామ రూపము’ అనగా దేవతలకి అమృతాన్ని ఇవ్వడానికి మోహిని అవతారాంలో వచ్చిన భగవానుడి యొక్క స్త్రీ స్వరూపాన్ని సూచిస్తుంది.
పదకొండవ పాశురము: “తిరుమోగూర్కి సమర్పించబడిన ఈ పదిగాన్ని ఇష్టపడేవారికి, వారి బాధలన్నీ తొలగింపబడతాయి”, అని ఆళ్వారు తెలియజేస్తున్నారు.
ఏత్తుమిన్ నమర్గాళ్ ఎన్ఱు తాన్ కుడమాడు
కూత్తనై కురుగూర్ చ్చడగోబన్ కుఱ్ఱేవల్గళ్
వాయ్ త్త ఆయిరత్తుళ్ ఇవై వణ్ తిరుమోగూర్ క్కు
ఈత్త పత్తివై ఏత్త వల్లార్కు ఇడర్ కెడుమే
ఆళ్వార్తిరునగరికి స్వామి అయిన నమ్మాళ్వార్లు, ఈ వెయ్యి పాశురములను రహస్య కైంకర్యముగా “నాకు సంబంధించిన వారందరు! నన్ను స్తుతించండి” అంటూ కుండలతో నాట్యమాడే ఆ నర్తకికి అందజేశారు; వాటిలో, ఈ పదిగము విశిష్టమైన తిరుమోగూర్కి సమర్పించబడింది. ప్రేమతో ఈ పదిగాన్ని సేవించగలిగిన వారి దుఃఖాలు తొలగుతాయి.
అడియేన్ శ్రీదేవి రామానుజదాసి
మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2020/06/thiruvaimozhi-10-1-simple/
పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org