కోయిల్ తిరువాయ్మొళి – సరళ వ్యాఖ్యానము – 1.1 – ఉయర్వఱ

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

కోయిల్ తిరువాయ్మొళి

తనియన్లు

bhagavan-nammazhwar

అనంత శుభ గుణాలకు నిలయుడు, దివ్య స్వరూపుడు, ఉభయ విభూతులకు నాయకుడు, వేదములచే వెల్లడి చేయబడినవాడు, అంతటా వ్యాపించి ఉన్నవాడు, ప్రతి ఒక్కరినీ నియంత్రించువాడు, చిదచిత్తులలో అంత్యరామిగా ఉండి వారిని పాలించు శ్రియః పతి అయిన సర్వేశ్వరుడు అందరి కంటే గొప్పవాడు. ఎంబెరుమాన్ గురించిన ఈ గుణాలను నమ్మాళ్వారులు ఈ పదిగములో వివరిస్తూ, భగవాన్ తనకి అనుగ్రహించిన దివ్యమైన జ్ఞాన భక్తులను తలచుకుంటూ ఆనందపడుతున్నాను.

తిరువాయ్మొళి అంతటికీ సారాంశము వంటిది ఈ దశాబ్దం. మొదటి మూడు పాశురములు ఈ దశాబ్దం యొక్క సారాంశం. ఈ పదిగములోని మొదటి పాశురము మొదటి మూడు పాశురములకు సారాంశమని, ఈ పదిగములోని మొదటి పంక్తి మొదటి పాశురము యొక్క సారాంశమని మన పెద్దలచే వివరించబడింది.

మొదటి పాశురము: ఈ పాశురములో భగవానుడి ఆధిపత్య గుణాలని వెల్లడిచేసే అపరిమితమైన శుభ లక్షణాలను, అప్రతిబంతితమైన దయ, నిత్యసూరుల‌ను నియంత్రించుట మరియు నిత్య మంగళ స్వరూపాలను వివరిస్తున్నారు. అలా చెప్పిన పిదప, నమ్మాళ్వారులు  తన హృదయాన్ని నిత్యము అలాంటి భగవానుడిని సేవించమని నిర్దేశిస్తున్నారు.

ఉయర్వఱ ఉయర్‌ నలం  ఉడైయవన్ యవన్ అవన్
మయర్వఱ  మదినలం అరుళినన్ యవనవన్
అయర్వఱుం అమరర్గళ్‌  అదిపతి యవనవన్
తుయరఱు శుడరడి తొళ్లుదెళిన్ మననే

ఓ నా మనసా! భగవాన్ పాదపద్మాల యందు చేతులు జోడించి నమస్కరించి, ఉద్ధరింపబడు. ఊహకి అందలేనంత గొప్పతనము ఉన్న భగవానుడి గురించి ప్రామాణిక గ్రంథాలలో పరి పరి విధాలుగా వర్ణించారు. నా అజ్ఞానాన్ని పూర్తిగా తొలగించి తన అపారమైన కృపతో అసలైన భక్తి జ్ఞానాలను నాకు అనుగ్రహించారు.  ఏ లోపాలు లేని నిత్యాసూరులకి కూడా స్వామి అతడే.

రెండవ పాశురము: భగవాన్ (“యవన్” అని వివరించబడింది) అన్ని ఇతర తత్వాలకు భిన్నమైనవాడని నమ్మాళ్వార్ వివరిస్తున్నారు.

మననగ మలమఱ మలర్‌ మిశై ఎళ్లుదరుం
మననుణ ర్వళవిలన్ పొఱియుణర్వవై ఇలన్
ఇననుణర్‌ ముళ్లు నలం ఎదిర్నిగళ్‌ కళి  వినుం
ఇననిల నెన నుయిర్ మిగునరై ఇలనే

కామ క్రోధ మదముల వంటి ఏ కల్మషాలు లేని వికసించిన మనస్సు కూడా కొలవలేని అపరిమితుడైనవాడు భగవానుడు. అచిత్ తత్వ సంబంధముతో ఉన్న ఈ బాహ్య ఇంద్రియాల ఊహకందనంత అపరిమితుడు భగవానుడు. అందువలన చిత్ మరియు అచిత్తులకు భిన్నమైన వాడతడు. భూత, వర్తమాన భవిష్యత్కాలములలో అతడికి సమానమైన వాడు గానీ అతడికంటే గొప్పవాడు గానీ ఎవ్వరూ లేని జ్ఞానానంద సంపూర్ణుడు. అతడే నా స్వామి. మొత్తం ఈ పది పాశురములలో, “అవన్ తుయరఱు సుడరడి తొళుదెళు” చివర్లో చేర్చాలి.

మూడవ పాశురము: భగవాన్ దేశ కాలాలకు పరిమితుడుకాడని, ఈ భౌతిక జగత్తుతో వారికున్న సంబంధాన్ని నమ్మాళ్వార్లు వివరిస్తున్నారు.

ఇలనదు వుడైయ నిదు ఎన నివై వఱియవన్
నిలనిడై విశుమ్బిడై ఉరువినన్  అరువినన్
పులనొడు పులనలన్ ఒళివిలన్ పరంద
అన్ నలనుడై ఒరువనై* నణుగినం నామే

భగవానుడిని కొన్ని వస్తువులకు తత్వములకు పరిమితం చేసి “అతడు ఆ వస్తువులకి దూరంగా ఉన్నాడు కాబట్టి అతడు అందులో లేడు”,  “అతను ఈ వస్తువుకి దగ్గర్లో ఉన్నాడు కాబట్టి అతడు అందులో ఉన్నాడు” అని చెప్పడంలో అర్థం లేదు.  అతడు క్రింది లోకాలు మరియు పై లోకాల్లోని చిత్ అచిత్తులన్నింటికీ అధిపతి.  చిదచిత్తుల రూపముగా అతడు అంతటా వ్యాపించి ఉన్నాడు. అటువంటి కళ్యాణ గుణాలతో నిండిన ఉన్న అత్యంత విశిష్ఠత ఉన్న భగవానుడిని ఆశ్రయించడం మన అదృష్ఠము.

నాల్గవ పాశురము: అన్ని తత్వస్వరూపాలను భగవానుడు సామానాధికరణ్యంతో  నియంత్రిస్తారని నమ్మాళ్వార్ వివరిస్తున్నారు..

గమనిక: సామానాధికరణ్యం అంటే ఒకటి కంటే ఎక్కువ గుణాలను ఒకే ఆధారముతో  కలిగి ఉండటం. అంటే ఒకటి కంటే ఎక్కువ పదాలు వాడి ఒక తత్వాన్ని వివరించడం అని అర్థం.

నాం అవన్ ఇవన్ ఉవన్ అవళ్‌ ఇవళ్‌ ఉవళ్‌ ఎవళ్
తాం అవర్‌ ఇవర్‌ ఉవర్ అదు విదు వుదు వెదు
వీం అవై ఇవై ఉవై అవై నలం తీంగవై
ఆం అవై ఆయ్ అవై ఆయ్‌ నిన్ఱ అవరే

‌అన్ని తత్వాలలో (మగ, ఆడ, చేతనాచేతనులలో) భగవాన్ అంతర్యామి రూపములో ఉండగా, అతడితో తమ సాన్నిహిత్యాన్ని (దగ్గరగా, దూరంగా, మధ్యగా) బట్టి వర్తమాన భూత భవిష్యత్కాలములలో మంచివైన చడువైన అనేక పదాలతో గుర్తించారు. సంక్షిప్తంగా చెప్పాలంటే అన్ని పదాలు భగవాన్నే సూచిస్తాయి. దీన్ని బట్టి అన్ని సమయాల్లో అన్ని తత్వాలు భగవాన్ పూర్తి నియంత్రణలో ఉంటాయని మనం అర్థం చేసుకోవాలి.

ఐదవ పాశురము: అన్నింటినీ భరించువాడిగా ఎంబెరుమాన్ మనల్ని సంరక్షించుటను వైయధికారణ్యంతో వివరించబడింది.

గమనిక: వైయధికారణ్యం అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ అంశాలకు వేర్వేరు ఆధారములు కలిగి ఉండుట. రెండు లేదా ఎక్కువ పదాలతో వేర్వేరు తత్వాలను వివరించుట అని కూడా అర్థము చేసుకోవచ్చు.

అవరవర్‌ తమదమదు అఱివఱి వగైవగై
అవరవర్‌ ఇఱైయవర్‌ ఎన అడి అడైవర్గళ్
అవరవర్‌ ఇఱైయవర్ కుఱైవిలర్‌ ఇఱైయవర్
అవరవర్‌ విదివళి అడైయ నిన్ఱనరే

‌విభిన్న అధికారులు (అర్హతగల వ్యక్తులు) వాళ్ళ జ్ఞానస్థాయిని బట్టి వారి కోరికల ప్రకారం వరాలిచ్చు దేవతలగా భావించి అయాదేవతలను ఆశ్రయిస్తారు. ఆ కోరికలు నెరవేర్చుట ఆయా దేవతలకి తగును కూడా. కానీ, సర్వాధికారి అయిన భగవాన్ ఆ దేవతలలో అంతరాత్మ (అంతర్యామి) గా ఉండి, వాళ్ళ కర్మానుసారంగా  ఆ అధికారులను వాళ్ళ లక్ష్యాలకి చేరుస్తాడు.

ఆరవ పాశురము: . అన్ని కార్య అకార్యములను భగవాన్ సామానాధికరణ్యంతో నియంత్రిస్తాడు అని నమ్మాళ్వార్లు వివరిస్తున్నారు.

నిన్ఱనర్‌ ఇరుందనర్‌  కిడందనర్‌ తిరిందనర్
నిన్ఱిలర్‌ ఇరుందిలర్‌  కిడందిలర్‌ తిరిందిలర్
ఎన్ఱుమోర్‌ ఇయల్వినర్‌ ఎన నినైవరియవర్
ఎన్ఱుమోర్‌ ఇయల్వొడు నిన్ఱవెందిడరే

‌ ‌సమస్థ తత్వముల క్రియలను (నిలబడటం, కూర్చోవడం, పడుకోవడం, నడవడం మొదలైనవి) మరియు నిష్క్రియాత్మకత చర్యలను (నిలబడకపోవడం, కూర్చోవకపోవడం, పడుకోక పోవడం, నడవక పోవడం) భగవానుడు నియంత్రిస్తాడు. ఇటువంటి ఎంబెరుమాన్ గ్రహించ శక్యం కాని విశిష్థతగలిగినవాడు. ప్రామాణిక ఋజువులైన శాస్త్రముచే దృఢీకరించబడిన అతడు నా ప్రభువు.

ఏడవ పాశురము: భౌతిక ప్రపంచము మరియు భగవాన్ మధ్య శరీర – ఆత్మ సంబంధ బంధనను సామానాధికరణ్యం అని వివరిస్తారు.  

తిడ విశుమ్బెరి వళి నీర్‌ నిలం ఇవై మిశై
పడర్‌ పొరుళ్‌ ముళువదుమాయ్ అవై ఆవై దొఱుం
ఉడల్మిశై ఉయిర్‌ ఎన క్కరందెంగుం పరందుళన్
శుడర్‌ మిగు శురుదియుళ్ ఇవై యుండ శురనే

మహోన్నతుడైన భగవానుడు సృష్థి ఆరంభములో మూల తత్వాలుగా మొదట భూమి, ఆకాశము, అగ్ని, వాయువు, నీరుని  సృష్టించి అంతటా వ్యాపించాడు. ఆత్మ ఈ శరీరాన్ని వ్యాపించి నట్లుగా అతడు అంతటా వ్యాపిస్తారు. అంతే కాదు, అతడు అన్నింటి లోపల వెలుపల కూడా ఉంటాడు. అతడు దివ్య తేజోమయమైన వేదముకి మూలాధారము. ఇటువంటి ఎంబెరుమాన్ ప్రళయ కాలములో అన్నింటినీ తనలోకి తీసుకొని “సుర” (దేవుడు) గా కీర్తింపబడ్డాడు.

ఎనిమిదవ పాశురము: వ్యష్టి సృష్టి ( సృష్టించడం), వ్యష్టి సంహారము (సంహరించడం) బాధ్యతలను వహిస్తున్న బ్రహ్మ రుద్రులను సంపూర్ణంగా నియంత్రించువాడు భగవానుడని నమ్మాళ్వార్లు వివరిస్తున్నారు.

శురర్‌ అఱివరు నిలై  విణ్‌ ముదల్‌ ముళువదుం
వరన్ముదలాయ్‌ అవై  ముళుదుండ పర పరన్
పురం ఒరు మూన్ఱెరిత్తు అమరర్‌క్కుం అఱివియందు
అరన్‌ అయన్‌ ఎన  ఉలగళిత్తమైత్తుళనే

బ్రహ్మ, శివుడు మొదలైన ఇతర దేవతలు కూడా అవగాహ్యుడు కాని భగవానుడు మూల ప్రకృతికి కారణ భూతుడు. ఈ దేవతలందరికీ సర్వాధికారిగా ఉండి ఈ భౌతిక సంసారాన్ని తనలోకి తీసుకుంటాడు (మ్రింగుతాడు), మూడు పట్టణాల (త్రిపుర సంహారం) నాశనం చేయడానికి రుద్ర రూపాన్ని ధరిస్తాడు, సమస్థ జగత్తుని నాశనం చేసి, మరళా సృష్టించి ఆయా దేవతలకి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ఇవన్నీ అయా దేవతలకి అంతర్యామిగా ఉండి ఆ కార్యములను వహిస్తాడతడు.

తొమ్మిదవ పాశురము:  వేద బాహ్యులలో (వేదాలను తిరస్కరించేవారు) ప్రథములైన  మాధ్యమిక బౌద్ద తత్వవేత్తలను (ఒక రకమైన శూన్యవాదులు) నమ్మాళ్వార్ ఇక్కడ  ఖండిస్తున్నారు.

ఉళన్ ఎనిల్‌ ఉళన్ అవ ఉరువం ఇవ్వురువుగళ్
ఉళన్ అలన్ ఎనిల్‌ అవన్ అరువం ఇవ్వరువుగళ్
ఉళన్ ఎన ఇలన్ ఎన ఇవై గుణం ఉడైమైయిల్
ఉళన్ ఇరు తగైమైయొడు ఒళివిలన్ పరందే

భగవాన్ అనేవాడు ఉనికిలో ఉన్న (ఆళ్వార్ల వైధిక శాస్త్రం ప్రకారం) వాటికి, ఉనికిలో లేని (అవైధిక శాస్త్రం ప్రకారం) వాటికి రెండింటికీ ఆధారభూతుడు – కాబట్టి, భగవాన్ గురించి సంబోధించినపుడు అతడు ఉన్నట్లుగా అర్థం చేసుకొని అంగీకరించాలి. అతడు ఎప్పుడూ ఉనికిలో ఉండే సర్వవ్యాపి. అతడి సంపూర్ణ స్వరూపత్వాన్ని  నిరూపత్వాన్ని  ఈ భౌతిక జగత్తు యొక్క రూపం నిరూపం అభివ్యక్త పరుస్తాయి. ఈ రెండు అంశాలు అతన్ని కొన్ని  కొన్ని సార్లు దర్శింపజేస్తాయి, మరికొన్ని సార్లు దాచి పెడతాయి.

పదవ పాశురము:  నమ్మాళ్వారులు ఈ పాశురములో భగవాన్ యొక్క సర్వవ్యాపకత్వాన్ని వర్ణింస్తున్నారు.

పరంద తణ్‌ పరవైయుళ్‌  నీర్ తొఱుం పరందుళన్
పరంద అండం ఇదెన  నిల విశుంబు ఒళివఱ
కరంద శిల్‌ ఇడందొఱుం  ఇడం తిగళ్ పొరుళ్ ‌ తొఱుం
కరందెంగుం పరందుళన్  ఇవైయుండ కరనే

ఈ విశాల విశ్వంలో ఎంత సులభంగా ఉంటాడో అంతే సహజంగా సముద్రంలోని ప్రతి నీటి బిందువులోనూ అతి సూక్ష్మంగా కూడా ఉంటాడు. అతడు అతి సూక్ష్మ ప్రదేశాలలో కూడా వ్యాపించి ఉంటాడు. తాను వ్యాపించి ఉన్నట్టు గ్రహించలేని జీవాత్మలలో కూడా ఉన్నాడు. అతడు సర్వాంతర్యామిగా ఉండి ప్రళయ కాలములో అన్నింటినీ తనలోకి తీసుకుంటాడు.

పదకొండవ పాశురము: ముందు వివరించిన భగవాన్ యొక్క ఆధిపత్యాన్ని సంగ్రహించి, ఈ పదిగాన్ని నేర్చుకొని  పఠించి అర్థం చేసుకొన్న వారికి ఫలితం మోక్షమని ఆళ్వార్ ప్రకటిస్తున్నారు.

కర విశుమ్బెరి వళి నీర్‌ నిలం ఇవై మిసై
వరనవిల్‌ తిఱల్‌ వలి అళి పాఱైయాయ్‌ నిన్ఱ
పరన్ అడిమేల్‌ కురుగూర్‌ చ్చడగోపన్ శొల్
నిరనిఱై ఆయిరత్తు ఇవై పత్తుం వీడే

పంచ భూతాలలో (ఆకాశము, వాయు, అగ్ని, జలం, భూమి) వాటి గుణాలలో (శబ్దం, శక్తి, సీతోష్ణములు, సహనం) నివాసమున్న భగవాన్ యొక్క పాద పద్మాల యందు నమ్మాళ్వర్ ఈ పది పాశురాలను సమర్పిస్తున్నారు.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2020/05/thiruvaimozhi-1-1-simple/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a Comment