కోయిల్ తిరువాయ్మొళి – సరళ వ్యాఖ్యానము – తనియన్లు

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

కోయిల్ తిరువాయ్మొళి

Nammalwar-emperumanar

భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్థదం శ్రీశఠకోప వాఙ్మయం।
సహస్ర శాఖోపనిషత్సమాగమం నమామ్యహం ద్రావిడ వేదసాగరం॥

శ్రీమన్నారాయణుడి ప్రతి భక్తుడికి సంతృప్తికరమైనది, అతి మాధుర్యమైనది, నమ్మాళ్వార్ల దివ్య వాక్కులతో నిండి ఉండి సామవేదము ఛాందోగ్య ఉపనిషత్తుల వెయ్యి శాఖలకు సమానమైనది, అన్ని వరాలను ఇవ్వగలిగే ద్రావిడ వేద మహాసాగరమైన తిరువాయ్మొళిని నేను ఆరాధిస్తాను.

తిరువళుది నాడిన్ఱుం  తెన్కురుగరూర్‌ ఎన్ఱు
మరువినియ వణ్పొరునల్‌ ఎన్ఱుం అరుమఱైగళ్
అందాది శెయ్దాన్ అడి యిణైయే వెప్పాళుదుం
శిందియాయ్‌ నెఞ్జే ! తెళిందు

ఓ నా మనసా! అతి సుందరమైన తామిరబరణి నది ఒడ్డున ఉన్న అతి పవిత్రమైన, అందమైన తిరువళుదినాడు అని తిరుక్కురుగూర్ అని పిలువబడే ఆళ్వార్తిరునగరి గురించి చింతన చేస్తూ అతి అరుదైన క్లిష్ఠమైన వేదసారములను వెలికి తీసి అందాది రీతిలో తిరువాయ్మొళిని మనకనుగ్రహించిన నమ్మాళ్వార్ల దివ్య పాద పద్మముల యందు ధ్యానించుము.

మనత్తాలుం వాయాలుం  వణ్కురుగూర్‌ పేణుం
ఇనత్తారై యల్లా దిఱైఞ్జేన్  తనత్తాలుం
ఏదుం కుఱైవిలేన్  ఎందై శడగోబన్
పాదఙ్గళ్‌ యాముడైయ పఱ్ఱు

నా స్వామి నమ్మాళ్వార్ యొక్క పాదపద్మముల ఆశ్రయం పొందిన పిదప ఏ ఐశ్వర్యానికి కొదువ లేని నేను ఆళ్వార్తిరునగరిని సేవించని / ఇష్టపడని వారిని  ఆరాధించవలసిన అవసరము నాకు లేదు.

ఏయ్ న్ద పెరుం కీర్తి ఇరామానుశ ముని తన్
వాయ్ న్ద మలర్ పాదం వణంగుకిన్ఱేన్ ఆయ్ న్ద పెరుం
శీరార్ శడకోపన్ శెన్దమిళ్ వేదం దరిక్కుం
పేరాద ఉళ్ళం పెఱ    ‌

నిష్కలంకమైన, కల్యాణ గుణ సంపూర్ణులగు నమ్మాళ్వార్లచే రచించబడిన అతి సుందర తమిళ వేదమైన తిరువాయ్మొళి మీద తప్ప మరి ఏ విషయం నందు ఆసక్తి  లేకుండా ఉండేటట్టుగా అనుగ్రహించగల సర్వశ్రేష్ఠ కల్యాణ గుణాలతో నిండి ఉన్న ఎంబెరుమానార్ల దివ్య చరణ కమలాలను నేను ఆరాధిస్తాను.

వాన్ తిగళుం శోలై మదిళరంగర్‌ వణ్‌ పుగళ్ ‌మేల్
ఆన్ఱ తమిళ్‌ మఱైగళ్‌ ఆయిరముమ్  ఈన్ఱ
ముదల్దాయ్‌ శడగోపన్ మొయ్ంబాల్ వళర్‌త్త
ఇదత్తాయ్‌ ఇరామానుశన్

‌చెట్లు ఆకాశానికి అంటుకునే తోటలతో ఏడు ప్రాకారములతో కప్పబడి ఉన్న శ్రీ రంగములో పవళించి ఉన్న పెరియ పెరుమాళ్ళ దివ్య గుణాలను కీర్తించే తమిళ వేదముగా కీర్తించబడే తిరువాయ్మొళికి (1000 పాశురముల) జన్మనిచ్చిన మొదటి తల్లి నమ్మాళ్వార్ అయితే పోషించిన తల్లి ఎంబెరుమానార్లు .

మిక్క ఇఱై నిలియుం మెయ్యాం ఉయిర్నిలైయుం
తక్క నెఱియుం తడైయాగి త్తొిక్కియలుం
ఊళ్ ‌వినైయుం వాళ్ ‌వినైయుం ఓదుం కురురైయర్‌ కోన్
యాళి నిశై వేదత్తియల్ ‌

ఆళ్వార్తిరునగరి నివాసులకు  నాయకులు నమ్మాళ్వారులు.  వీణావాద్యములా తీయగా అనిపించే నమ్మాళ్వార్ల తిరువాయ్మొళి  అతి ముఖ్యమైన 5 సూత్రాల గురించి చెబుతుంది –  శ్రీమన్నారాయణ యొక్క నిజ స్వరూపము (పరమాత్మ స్వరూపం), నిత్యుడైన జీవాత్మ యొక్క నిజ స్వభావం (జీవాత్మ స్వరూపం), సముచితమైన మాధ్యమము యొక్క స్వభావం (ఉపాయ స్వరూపం), అనేకానేక కర్మల రూపంలో ఉన్న అడ్డంకుల నిజ స్వభావం (విరోధి స్వరూపం), అత్యున్నత లక్ష్యం యొక్క నిజ స్వభావం (ఉపేయ స్వరూపం). ఈ ఐదు విషయములను మనకు తిరువాయ్మొళి బోధిస్తుంది.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2020/05/thiruvaimozhi-thaniyans-simple/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a Comment