కోయిల్ తిరువాయ్మొళి – 5.8 – ఆరావముదే

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

కోయిల్ తిరువాయ్మొళి

<< 5.7 – నోఱ్ఱ

సిరీవరమంగళనగర్లోని వానమామలై భగవానుడి వద్ద సంపూర్ణ శరణాగతి చేసిన తరువాత కూడా, తన ఎదుట భగవానుడు ప్రత్యక్షము కాలేదని నమ్మాళ్వార్లు గమనించి, “బహుశా తిరుక్కుడందైలోని భగవానుడు తన శరణాగతిని స్వీకరిస్తాడు” అని భావించి, తన అనన్యగతిత్వ (ఏ ఇతర ఆశ్రయం లేకపోవడం) స్థితి గురించి నొక్కి చెబుతూ తిరుక్కుడందై ఆరావముదన్ భగవానుడికి శరణాగతి చేస్తారు.

మొదటి పాశురము: “నీతో నాకున్న నిరపేక్ష సంబంధాన్ని మరియు నన్ను కరిగింపజేసి నాకు అతి సంతోషాన్ని కలిగించే  నీ అనన్య సౌందర్యాన్ని, నీవు తిరుకుడందైలో శయనించి ఉండగా నేను దర్శించాను” అని ఆళ్వారు తెలియజేస్తున్నారు.

ఆరావముదే అడియేన్‌ ఉడలం  నిన్‌ పాల్‌ అన్బాయే
నీరాయ్‌ అలైందు కరైయ ఉరుక్కుగిన్ఱ నెడుమాలే
శీరార్‌ శెన్నెల్‌ కవరి వీశుం శెళు నీర్‌ త్తిరుక్కుడందై
ఏరార్‌ కోలం తిగళ క్కిడందాయ్‌ కండేన్‌ ఎమ్మానే

నిరపేక్షుడైన ఆ దేవుడు నా భగవానుడు, నిత్యమూ అతడిని ఆస్వాదిస్తూ అనుభవిస్తూ ఉన్నా కూడా నాకు తృప్తి కలగటం లేదు; ఓ!  అపరిత పరమానందము ఉన్న భగవానుడా! నీ పట్ల ప్రేమంతా ఒక స్వరూపముగా రూపుదిద్దుకున్నా ఈ నా శరీరాన్ని కరిగించి నీరుగా మారాలని నీవు నన్ను కలవరపరచి ప్రేరేపిస్తున్నావు; పుష్కలమైన నీటి వనరులతో సమృద్ధమైన పంటలతో సుఖవంతముగా ఉన్న తిరుక్కుడందైలో నీవు విశ్రామిస్తున్నావు; దివ్య అలంకరణతో నీ సౌందర్యము దివ్యంగా ప్రకాశిస్తుంది; నేను నా స్వంత కళ్ళతో వీక్షించి ఆనందించాను. అంటే – ఆళ్వారు భగవానుడిని దర్శించారు కానీ, వారితో ఇంకా సంభాషించలేదు అని సూచిస్తుంది.

రెండవ పాశురము:  “నీవు భక్తవత్సలుడిగా నీ భక్తుల కోసమే ఎన్నో అవతారాలు ఎత్తావు, కానీ ఆ కరుణతో నా వైపు చూడటం లేదు; నేను ఏమి చేయాలి?” అని ఆళ్వారు అడుగుతున్నారు.

ఎమ్మానే ఎన్‌ వెళ్ళై మూర్తి  ఎన్నై ఆళ్వానే
ఎమ్మా ఉరువుం వేండుం ఆట్రాల్‌, ఆవాయ్‌ ఎళిల్‌ ఏఱే
శెమ్మా కమలం శెళు నీర్‌ మిసై క్కణ్‌ మలరుం  తిరుక్కుడందై
అమ్మా మలర్కణ్‌ వళర్గిన్ఱానే ఎన్నాన్‌ శెయ్గేనే?

ఎంబెరుమానుడైన నా భగవానుడు, నాకు సత్వ గుణాన్ని ప్రసాదించగల శుద్ద స్వరూపుడు; అతడిని అనుభవిస్తూ ఆనందాన్ని పొంది, నా స్వభవాన్ని నేను కోల్పోకుండా ఉండేందుకు అతడు తన రూపాన్ని నాకు చూపిస్తున్నాడు; అతడు తన కోరిక మేరకు అన్ని జాతులలో అనేక రకాల అవతారములను ధరించాడు; “పుంసాం దృష్ఠి చిత్తాపహారిణమ్” లో చెప్పినట్లు, ఆ రూపాల్లోని సౌందర్యముతో చూసేవాళ్ళ  హృదయాలను బంధిస్తూ గంభీరంగా గోచరిస్తాడు; విశేషమైన దివ్య కమల నేత్రములతో,

ఎర్రటి పెద్ద పెద్ద తామర పువ్వులు పుష్కలంగా ఉన్న తిరుక్కుడందైలో విశ్రమిస్తున్నవాడా! నేను ఏమి చేయాలి? అనేక కమల పుష్పాలు  వికసిస్తున్నప్పటికీ, నీ రెండు కమల పువ్వులు (నేత్రాలు) నన్ను చూసి వికసించట్లేదు అని అర్థము.

మూడవ పాశురము:  “అకించనుడిని (ఖాళీ చేతులున్న) అయిన నేను, నీ ద్వారా తప్పా మరెవరి నుండి నా కోరికలు నెరవేరకూడదనుకుంటున్నాను; నన్ను ఇలా మలచిన నీవు, నేను ఎప్పటికీ నీ దివ్య పాదాలకు సేవ చేసేలా చేయాలి ” అని ఆళ్వారు అంటున్నారు.

ఎన్‌ నాన్ శెయ్గేన్‌ యారే కళై కణ్‌, ఎన్నైఎన్‌ శెయ్గిన్ఱాయ్
ఉన్నాల్‌ అల్లాల్‌ యావరాలుం ఒన్ఱుం కుఱై వేండేన్
కన్నార్‌ మదిళ్‌ శూళ్‌ కుడందై క్కిడందాయ్‌ అడియేన్‌ అరువాణాళ్
శెన్నాళ్‌ ఎన్నాళ్‌ అన్నాళ్‌ ఉన తాల్ పిడిత్తే శెలక్కాణే

నన్ను నేను రక్షించుకోవడానికి నేనేమి చేయాలి! ఇంకెవరు నాకు రక్షకుడు? నీవు నన్ను ఏమి చేయాలనుకుంటున్నావు? నా కోరికలు నెరవేర్చమని నిన్ను తప్పా మరెవరినీ ప్రార్థించను. దృఢమైన కోటతో చుట్టుముట్టి ఉన్న తిరుక్కుడందైలో దయతో విశ్రమిస్తున్న ఓ భగవానుడా! ఎన్ని రోజులైనా సరే, నేను విముక్తుడిని అయ్యే సమయం వరకు, మీ దాసుడనైన నేను నీ దివ్య పాదాలను పట్టుకొని ఉండేలా చూడుము. ‘అరు’ అనగా అణు స్వరూపములో ఉన్న ఆత్మని సూచిస్తుంది.

నాల్గవ పాశురము: “సర్వేశ్వరుడవైన నీవు ఇక్కడ తిరుకుడందైలోకి దిగివచ్చి శయనించి ఉన్నా నిన్ను చూడలేకపోతున్నానని బాధపడుతున్నాను. నిన్ను చూడాలని కోరుకుంటున్నాను” అని ఆళ్వారు ప్రార్థిస్తున్నారు.

శెల క్యాణ్గిబ్బార్‌ కాణుం అళవుం శెల్లుం కీర్తియాయ్‌
ఉలప్పిలానే  ఎల్లా ఉలగుం ఉడైయ ఒరు మూర్తి
నలత్తాల్‌ మిక్కార్‌ కుడందై క్కిడందాయ్‌  ఉన్నై క్మాణ్బాన్నాన్‌
అలప్పాయ్‌ ఆగాశత్తె నోక్కి అళువన్‌ తొళువనే ॥

ఎంబెరుమాన్ అంతులేని గుణాలు, ఐశ్వర్యము ఉన్నవాడు. అతడు, ముందు చూపు సామర్థ్యము ఉన్నవారికి మించిన సామర్థ్యము కలవాడు;  సమస్థ లోకాలు తన సేవలో ఉన్నవాడు; మనకి అత్యున్నత లక్ష్యమైన ఒక విశేష స్వరూపాన్ని కలిగి ఉన్నవాడు; మీ పట్ల గొప్ప ప్రేమ ప్రపత్తులు ఉన్నవారితో తయారైన తిరుక్కుడందైలో విశ్రామిస్తున్న ఓ భగవానుడా!  గొప్ప భక్తి ప్రపత్తులతో నిన్ను ఆరాధించే వారిలా, నిన్ను చూసి ఆనందించాలనే కాంక్షతో ఆకాశం వైపు చూస్తూ దుఃఖిస్తున్నాను. చిన్నపిల్లవాడిలా ఏడ్చుట, పరిపక్వమైన వ్యక్తిలా ఆరాధించుట అని వివరించబడింది.

ఐదవ పాశురము:  “నిన్ను చూడాలనే కోరికతో, నీ దయను పొందాలని నేను ఎంతగానో ప్రయత్నించాను, కానీ ఇంకా నిన్ను చూసే భాగ్యము నాకు కలుగలేదు; నీ దివ్య పాదాలను నేను పొందేలా నీవే చూడాలి” అని ఆళ్వారు అభ్యర్థిస్తున్నారు.

అళువన్‌ తొళువన్‌ ఆడి క్కాణ్బన్‌ పాడి అలత్తువన్‌
తళువల్‌ వినైయాల్‌ పక్కం నోక్కి నాణి క్కవిళ్ న్దిరుప్పన్‌
శెళు వొణ్‌ పళన క్కుడందై క్కిడందాయ్‌  శెన్‌ తామరై క్కణ్ణా
తొళువనేనై ఉన తాల్ శేరుం వగైయే శూళ్‌ కండాయ్

నన్ను ఆవహించిన ఈ ప్రేమ కారణంగా దిక్కులు చూస్తూ నేను ఏడుస్తున్నాను, పూజిస్తున్నాను, నృత్యం చేస్తున్నాను, పాడుతున్నాను, అనవసరంగా వాగుతున్నాను, తరువాత సిగ్గుతో తలవంచుకుంటున్నాను. ఎర్రటి దివ్య కమల నేత్రాలతో, పుష్కలమైన నీటితో నిండిన ఆకర్షణీయమైన పొలాలు ఉన్న తిరుక్కుడందైలో విశ్రమిస్తున్న ఓ భగవానుడా! అతి అవసరమైన నీ దివ్య పాదాలను నేను చేరుకోవడానికి తగిన మార్గాన్ని దయచేసి వెదుకుము.

ఆరవ పాశురము: “నేను నీకు ఆకర్షితుడనై నీ అనుభవములో మునిగి ఉన్నందున, ఇతర ప్రాపంచిక వ్యవహారములలో నేనిక ఉండలేను,  కాబట్టి నిన్ను పొందడంలో నాతోవలో ఉన్న అడ్డంకులను తొలగించాలి, నిన్ను చేరగల సాధనాలను నాకు తెలియకుండానే నాకు అనుగ్రహించి దయతో ఆ మార్గాలు నాకు పని చేసేలా చూడు” అని ఆళ్వారు అంటున్నారు.

శూళ్ కండాయ్‌ ఎన్‌ తొల్లై వినైయై అఱుత్తు ఉన్‌ అడి శేరుం
ఊట్‌ కండిరుందే తూరాక్కుళి తూర్తు ఎనై నాళ్‌ అగన్ఱిరుప్పన్‌
వాళ్‌ తొల్‌ పుగళార్‌ కుడందై క్కిడందాయ్ వానోర్‌ కోమానే
యాళిన్‌ ఇశైైయే  అముదే అఱివిన్‌ పయనే అరియేఱే

కృపతో తిరుక్కుడందైలో శయనిస్తున్న ఓ భగవానుడా! నిత్యసూరుల నియామకుడివి నీవు; సంగీత వాయిద్యం ‘యాళ్’ యొక్క అతి సుందర రమనీయమైన రాగము నీవు; నిత్యమూ రుచికరమైన తేనెలాంటివడవు నీవు, స్తుతులచే (ప్రశంసలు) నాలుకకు ఆనందకరమైనవాడవు నీవు;  జ్ఞానం యొక్క ఫలితము కనుక నీవు  మనసుకి ఆహ్లాదకరమైనవాడవు నీవు; అయినప్పటికీ, నీవు సింహాలలో ఉత్తముడవు, అవగాహనకి అందలేని గొప్పవాడవు; నీ దివ్య చరణాలను చేరుకోవటానికి ప్రాచీన మార్గాలని చూసిన తరువాత, కేవలము నీ కొరకే వేచి ఉన్న నేను, నాకు తగని ఈ కోరికల గొయ్యిలో నిన్ను విడిచి ఇంకా ఎన్ని రోజులు ఉండాలి? నా పై కృపతో నా గత పాపాలను నాశనము చేసి, నా స్వరూపానికి తగినదైన నీ దివ్య పాదాలను చేరుకోవడానికి నాకు సహాయపడుము.

ఏడవ పాశురము:  “కేవలము నీ కృప కారణంగానే, నీ సౌందర్యాన్ని నాకు వ్యక్తపరచి, నీకు సేవలు చేసుకుంటూ ఉండేలా నన్ను ఉంచారు; ఇప్పుడు, నీ దివ్య పాదాలు లేకుండా నేను ఉండలేను, కాబట్టి దయచేసి ఈ సంసారముతో నా సంబంధాన్ని తొలగించి నీ దివ్య పాదాలను నాకు ప్రసాదించుము”, అని ఆళ్వారు అభ్యర్థిస్తున్నారు.

అరియేఱే ఎన్నం పొఱ్చుడరే  శెంగణ్‌ కరు ముగిలే
ఎరియే పవళ క్కున్దే నాల్‌ తోళ్‌ ఎందాయ్‌ ఉనదరుళే
పిరియా అడిమై ఎన్నై క్కొండాయ్‌ కుడందై త్తిరుమాలే
తరియేన్‌ ఇని ఉన్‌ శరణం తందు ఎన్‌ శన్మం కళైయాయే

అంతులేని తన స్వాతంత్ర్యము కారణంగా భగవానుడు గంభీరంగా కనిపిస్తున్నాడు, ఎర్రటి దివ్య నేత్రలతో, ముదురు మేఘ వర్ణముతో,  అగ్నిని పోలిన ఎర్రటి పొడవైన ముత్యపు దృఢ పర్వతములా ఉన్న నా ప్రభువు చతుర్భుజాలతో దర్శనమిస్తూ నన్ను తన సేవకుడిగా స్వీకరించాడు; తన కృపకు నన్ను ఎన్నడూ వేరు కాకుండా నా వాక్కు సేవలను స్వీకరించాడు;  లక్ష్మీ సమేతుడిగా తిరుక్కుడందైలో దర్శనమిస్తూ, నా సేవలను అందుకుంటున్న ఓ నా స్వామీ! నీవు పిరాట్టి సమేతుడిగా నా స్వరసేవలను అందుకుంటుండగా చూసిన పిదప నేనిక విశ్రాంతి తీసుకోను. ఈ శరీరంతో నా సంబంధాన్ని తొలగించి నీ దివ్య తిరువడిని నాకు ప్రసాదించుము.

ఎనిమిదవ పాశురము: “తరియేన్” (నేను ఉండలేను) అని పలికిన తరువాత కూడా ఎంబెరుమార్లు కనిపించ నందున అతను ఎంబెరుమార్ల గురించి ఆలోచించలేకపోయాడని ఆశ్చర్యపోతున్నాడు; “నీవు నాకు రక్షణ ఇవ్వక పోయినా ఫరవాలేదు కానీ! నీవు దయతో నేను ఎప్పటికీ నీ దివ్య పాదాలను ధ్యానించేటట్లు చేయాలి; నాకు ఇప్పుడు ఇది కావాలి”, అని ఆళ్వారు ప్రార్థిస్తున్నారు.

కళైవాయ్‌ తున్బం కళైయాదొళివాయ్  కలైకణ్‌ మఱ్ఱిలేన్
వళై వాయ్‌ నేమి ప్పడైయాయ్‌ కుడందై క్కిడంద మా మాయా
తళరా ఉడలం ఎనదావి శరిందు పోం పోదు
ఇళైయాదున తాళ్‌ ఒరుంగ ప్పిడిత్తు  పోద ఇశై నీయే

‌ నీవు నా దుఃఖాలను తొలగించినా తొలగించక పోయినా నీవు తప్పా నాకు వేరే రక్షణ లేదు; దివ్య చక్రాయుధాన్ని ధరించి అద్భుత సౌందర్యము కలిగి తిరుక్కుడందైలో దయతో విశ్రమిస్తున్న ఓ భగవానుడా! నా శరీరము బలహీనపడినప్పుడు, ప్రాణము వణుకుతూ ఈ శరీరాన్ని విడిచిపెట్టే అంతిమ దశ వచ్చినప్పుడు, ఎట్టి పరిస్థితిలో మానసిక స్థితిని నేను కోల్పోకుండా నీ దివ్య పాదాలను  పట్టుకొని ఉండేలా అనుమతించుము.

తొమ్మిదవ పాశురము: “నిన్ను నేను స్వీకరించేలా కల్పించి, నీ దివ్య చరణములే నా లక్ష్యంగా నేను భావించేలా నీవు చేసి చూసి అనందించిన నీవు, నీ అందమైన శయనావస్థను నాకు చూపించినట్లే నీ అందమైన నడకను కూడా చూపించాలి”, అని ఆళ్వారు ప్రార్థిస్తున్నారు.

ఇశైచిత్తెన్నై ఉన్‌ తాళ్‌ ఇణైక్కీళ్ ఇరుత్తుం అమ్మానే
అశైవిల్‌ అమరర్‌ తలైవర్‌ తలైవా ఆది ప్పెరుమూర్తి
తిశై విల్‌ వీశుం శెళు మా మణిగళ్‌ శేరుం తిరుక్కుడందై
అశైవిల్‌ ఉలగం పరవ క్కిడందాయ్‌ కాణ వారాయే

నీవు నా భగవానుడిగా, నీ దివ్య పాదాల యందు నన్ను ఉంచి ఆ దివ్య పాద యుగళియే నా లక్ష్యము మరియు సాధనమని అంగీకరించేలా చేశావు. నిత్య ముక్తులైన అనంత, గరుడ, విశ్వక్సేనులు, మరియు ఇతర నిత్యసూరుల నాయకులకు నాయకుడివి నీవు. నీవు సర్వకారకుడవు; నీవు అన్నింటి కన్నా గొప్ప రూపాన్ని కలిగి ఉన్నావాడవు;  అతి ఖరీదైన, అరుదైన, ఆకర్షణీయమైన రత్నాలు చేరి ఉండి, అన్ని దిశలలో తమ ప్రకాశాన్ని వ్యాప్తి చేస్తూ, నిన్ను సాధించుట కష్టకరమన్న సందేహాన్ని తొలగించి, ఈ ప్రపంచము మొత్తము ప్రశంసించేలా చేస్తున్న తిరుక్కుడందైలో విశ్రమిస్తున్న ఓ భగవానుడా! నిన్ను నేను దర్శించడానికి నీవు రావాలి. ‘అసైవు ఇల్ ఉలగం’ – అసైవు – దుఃఖ సాగరములో కొట్టుమిట్టాడుతున్న ఈ ప్రపంచము అతడి సౌందర్యానికి ఆకర్షితమై అతడిని ప్రశంసిస్తుంది. ఇది పరమపదముని కూడా సూచిస్తుంది. లేదా తాను శయనించి ఉండగా తన దివ్య తిరుమేనిని (శరీరాన్ని) ఎడమ నుండి కుడికి పక్కకి మర్చుతుండగా ఆ భగవానుడిని ప్రశంసిస్తున్నట్లు చెప్పవచ్చు.

పదవ పాశురము:  “నీవు నాలో ఉన్నావు, అతి రుచిగా ఉన్నావు, కానీ నేను నిన్ను శారీరకంగా చూడలేకపోతున్నాను; నీవు అతిసులభునిగా ఉన్న అర్చావతారమునకు నేను శరణాగతి చేస్తున్నాను, నేను ఇంకా ఎంత కాలం ఈ దుఃఖముతో బాధపడాల్సి ఉంది?”, అని ఆళ్వారు ప్రశ్నిస్తున్నారు.

వారావరువాయ్‌ వరుమెన్‌ మాయా  మాయా మూర్తియాయ్
ఆరావముదాయ్‌ అడియేన్‌ ఆవి అగమే తిత్తిప్పాయ్
తీరా వినైగళ్‌ తీర ఎన్నై ఆండాయ్‌ తిరుక్కుడందై
ఊరా ఉనక్కాట్‌ పట్టుం అడియేన్‌ ఇన్నం ఉళల్వేనో

నీ అతి సుందరమైన రూపం తో మా వైపు వస్తే  కళ్ళు చూసి ఆనందించడానికి  బదులుగా, నీ ఈ స్వరూపాన్ని దాటి  నీ అద్భుత గూణాలతో నా లోపల దర్శనమిస్తున్నావు; నా ఆత్మ యొక్క నివాసమైన నా హృదయంలో క్షీణించని నశించని నీ నిత్య మంగళ స్వరూపంతో  ఈ దాసుని మనస్సులో ఎంతో రుచిని కలిగిస్తున్నావు! తరగని నా పాపాలను నాశనం చేయడానికి నా స్వరసేవను స్వీకరించావు; విశిష్ట దివ్య దేశమైన తిరుక్కుడందైలో కొలువున్న ఓ నా భగవానుడా! వేరే ఏ ఆశ్రయము లేకుండా కేవలము నీ కోసమే ఉన్న నేను, నీ దాసుడను అయిప్పటికీ, మన మధ్య పరస్పరము ఎటువంటి దూరాలు ఉండకుండా, ఇంకా నేనిలా బాధపడుట అవసరమా?

పదకొండవ పాశురము: “ఈ పదిగాన్ని ఎటువంటి లోపాలు లేకుండా నేర్చుకున్నవారు, కాముక (ప్రియుడు) ని కామినులు (ప్రేయసి) కోరుకున్నట్లు, శ్రీవైష్ణవులకు ఆనందాన్ని కలుగచేస్తారు”, అని ఆళ్వారు అంటున్నారు.

 ఉళలై ఎన్బిన్‌ పేయ్బి ములైయూడు అవళై ఉయిర్‌ ఉండాన్‌
కళల్గళ్ అవైయే శరణాగ క్కొండ  కురుగూర్‌ చ్చడగోబన్‌
కుళలిన్‌ మలియ చ్చోన్న ఓర్‌ ఆయిరత్తుళ్‌ ఇప్పత్తుం
మళలై తీర వల్లార్ కామర్‌ మానేయ్‌ నోక్కియర్కే

పెద్ద చెక్క కమ్మీలను పోలిన ఎముకలున్న రాక్షసి స్థనము నుండి పాలు త్రాగినట్లు ప్రాణాన్నే త్రాగేసి సంకటముని తొలగించాడు కృష్ణ పరమాత్మ; ఆళ్వార్తిరునగరికి నాయకుడైన నమ్మాళ్వార్లు అటువంటి కృష్ణుడి దివ్య చరణాలను తన కోరిక తీరడానికి ఏకైక సాధనముగా భావించారు; అటువంటి ఆళ్వారు ఎంతో కృపతో పాడిన వేయి పాశురములలో రాగ శబ్దాలకు మూలమైన వేణువు కంటే తీయనైన ఈ విశిష్ట పదిగాన్ని పాడారు. ఈ పదిగాన్ని పఠించే వారికి అజ్ఞానము తొలగుతుంది. బ్రహ్మాలంకారాము [ముక్తి పొందిన ఆత్మలను అలంకరించడం] చేయు మృగ నయనీ అప్సరసలచే సేవించబడతారు.  అప్సరసలు తమ ప్రియమైనవారిని కోరుకునేట్లే, ఈ దశాబ్దాన్ని పఠించే భక్తులను శ్రీవైష్ణవులు కోరుకుంటారు – అని కూడా వివరించబడింది.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము:http://divyaprabandham.koyil.org/index.php/2020/05/thiruvaimozhi-5-8-simple/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a Comment