శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
ఆళ్వారుని పరమపదానికి తీసుకెళ్లేందుకు ఎంతో కృపతో భగవానుడు తన గరుడ వాహనంలో వచ్చాడు. ప్రారంభము నుండి భగవానుడు తనకు చేసిన ఉపకారాలను ఆళ్వారు తలంచుకుంటూ, “నేను భగవానుడికి ఏమీ చేయనప్పటికీ, భగవానుడు నన్ను స్వీకరించాడు” అని తనలో తాను మననము చేసుకుంటున్నారు. “నేను అంతగా ఏమీ చేయకపోయినా, భగవానుడి దయా దృష్టి నాపై ఎలా ఫలించింది?” అని అనుకుంటూ, అదే భగవానుడిని అడిగారు. భగవానుడు ఒక కచ్చితమైన సమాధానం అంటూ ఇవ్వలేకపోకపోయారు. భగవానుడి నిర్హేతుక కృపను, వారి చల్లని దయా దృష్టిని అర్థము చేసుకొని దాని గురించి ధ్యానిస్తూ ఆనందపడ్డారు.
మొడటి పాశురము: “ఏదో యాదృచ్ఛికంగా నేను తిరుమాలిరుంజోలై అని అన్నాను; అణుమాత్రము కూడా అపేక్ష లేని భగవానుడు పిరాట్టితో పాటు దయతో వచ్చి నాలోకి ప్రవేశించాడు”, అని ఆళ్వారు వివరిస్తున్నారు.
తిరుమాలిరుంజోలై మలై ఎన్ఱేన్ ఎన్న
తిరుమాల్ వందు ఎన్ నెంజు నిఱైయ పుగుందాన్
కురుమా మణియుందు పునల్ పొన్ని త్తెన్పాల్
తిరుమాల్ శెన్ఱు శేర్విడం తెన్ తిరుప్పేరే
తిరుమాలిరుంజోలై అని పలికిన వెంటనే, శ్రియఃపతి అయిన భగవానుడు వచ్చి నా హృదయంలోకి పూర్ణముగా ప్రవేశించాడు. “శ్రియాసార్ధం జగత్పతిః” అని చెప్పినట్లుగా, దివ్య దామమైన పరమపదంలో పిరాట్టితో పాటు ఉంటున్న భగవానుడు, అతి విలువైన, ఉత్తమమైన రత్నాలను తన ప్రవాహముతో కొట్టుకు తీసుకొని వెళ్ళే ‘పొన్ని’ నది యొక్క దక్షిణ ఒడ్డున ఉన్న అందమైన తిరుప్పేర్ లోకి దయతో దిగివచ్చి నివాసముంటున్నాడు.
రెండవ పాశురము: “ఆతడు మునుపు కూడా సర్వేశ్వరుడే, అయినప్పటికీ, నాతో సమైక్యము కానంత వరకు, ఆతడిలో లోపం ఉండింది. ఏ కారణం లేకుండా నా హృదయంలోకి ప్రవేశించిన తరువాత, ఆతడు సంపూర్ణుడు అయ్యాడు”. అని ఆళ్వారు వివరిస్తున్నారు.
పేరే ఉఱైగిన్ఱ పిరాన్ ఇన్ఱు వందు
పేరేన్ ఎన్ఱు ఎన్ నెంజు నిజైయ ప్పుగుందాన్
కారేళ్ కడలేళ్ మలై ఏళులగుండుం
ఆరా వయిఱ్ఱానై అడంగ ప్పిడిత్తేనే
తిరుప్పేర్లో నిత్య నివాసముంటున్న సర్వేశ్వరుడు, “నిన్ను నేను వదలను” అని చెప్పి నా హృదయంలోకి ప్రవేశించి ఈ రోజు నాకు సంపూర్ణత చేకూర్చారు; ఏడు రకాల మేఘాలు, ఏడు మహా సముద్రాలు మరియు ఏడు పర్వతాలను కలిగి ఉన్న సమస్థ ప్రపంచాలన్నింటినీ మ్రింగిన పిదప కూడా, ఆతడి కడుపు నిండలేదు; నాలో ప్రవేశించి అన్ని విధాలుగా సంపూర్ణత చేకూర్చుకున్న ఆతడిని నేను ఆస్వాదించాలి, అనుభవించాలి.
మూడవ పాశురము: భగవానుడి నిర్హేతుక సంశ్లేషాన్ని (కారణం లేకుండా సంబంధము) ధ్యానిస్తూ ఆళ్వారు, “ఇటువంటి భగవానుడి దివ్య పాదాలు నాకు ఎంత సులభంగా ప్రాప్తించాయి!” అని ఆళ్వారు మననము చేసుకుంటున్నారు.
పీడిత్తేన్ పిఱవి కెడుత్తేన్ పిణి శారేన్
మడిత్తేన్ మనై వాళ్కైయుళ్ నిఱ్పదోర్ మాయైయై
కొడి క్కోబుర మాడంగలళ్ శూళ్ తిరుప్పేరాన్
అడిచ్చేర్వదు ఎనక్కు ఎళిదాయినవాఱే
సౌలభ్య గుణము ఉన్న భగావానుడి దివ్య పాదాలను నేను అతి సులభముగా చేరుకోగల మార్గాన్ని చూసిన తరువాత, ఎత్తైన భవనాలు, ఎత్తైన ధ్వజములు ఉన్న తిరుప్పేర్ ని అతడి నివాసంగా చేసుకున్న భగవానుడిని నేను చేరుకోవాలి; పుట్టుకతో; నా జన్మతో సంబంధాన్ని నేను తొలగించుకున్నాను; ఇక ఎలాంటి బాధలు నాకు ఉండవు; ఈ సంసారంలో ఉండాలన్న అజ్ఞానాన్ని, ఆసక్తిని నేను మానుకున్నాను.
నాలుగవ పాశురము: తిరునాడు (పరమపదము) ని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్న భగవానుడి స్వభావాన్ని గురించి ఆళ్వారు ధ్యానిస్తూ, “ఎంత సులభమిది!”, “నా ఇంద్రియాలతో పాటు అనుభవించిన నా మనస్సుతో నేను ఆనందిస్తున్నాను”, ఆళ్వారు మననము చేసుకుంటున్నారు.
ఎళిదాయినవాఱెన్ఱు ఎన్ కణ్గళ్ కళిప్ప
కళిదాగియ శిందైయనాయ్ కళిక్కిన్ఱేన్
కిళి తావియ శోలైగళ్ శూళ్ తిరుప్పేరాన్
తెళిదాగియ శేణ్ విశుంబు తరువానే
ఆనందభరిత హృదయము కలిగి ఉన్న వారితో ఉంటూ, “ఎంతో కష్ట సాధ్యమైన లక్ష్యము నా పట్ల ఇంత తేలికగా మారింది!” అని దాహముతో ఉన్న నా కళ్ళు ఆనందిస్తున్నాయి; చిలుకలు విహరిస్తున్న దట్టమైన తోటలతో చుట్టుముట్టబడి ఉన్న తిరుప్పెర్లో తన సౌలభ్యాన్ని వ్యక్త పరుస్తూ, శ్రేష్టత్వముతో నిండిన ‘పరమ వ్యోమ’ ని నాకు ఇవ్వడానికి సిద్ధంగా అక్కడ నివాసుడై ఉన్నాడు.
ఐదవ పాశురము: “తిరుప్పేర్ నగర్లో ఉన్న భగవానుడు నన్ను బాధపెట్టే అడ్డంకులను తొలగించి నాకు తిరునాడు (పరమపదం) ని ప్రసాదించాలని నిర్ణయించుకున్నారని నాకు మాట ఇచ్చాడు.
వానే తరువాన్ ఎనక్కా ఎన్నోడొట్టి
ఊనేయ్ కురంబై ఇదనుళ్ పుగుందు ఇన్ఱు
తానే తడుమాఱ్ఱ వినైగళ్ తవిర్తాన్
తేనేయ్ పొళిల్ తెన్ తిరుప్పేర్ నగరానే
తుమ్మెదలు సమృద్దిగా విహరిస్తున్న తోటలతో చుట్టుముట్టి ఉన్న తిరుప్పేర్ అనే అందమైన నగరంలో నివసిస్తున్న భగవానుడు నాకు పరమపదాన్ని అనుగ్రహిస్తానని మాట ఇచ్చారు. మాంసము యముకలతో కూడిన ఈ నా శరీరంలోకి స్వయంగా వచ్చి ప్రవేశించి, నా కష్టాలకు కారమైన పాప పుణ్యాలను తొలగించారు. ‘తేన్’ అనగా తేనె అని అర్థము.
ఆరవ పాశురము: “భగవానుడు తాను ఉండటానికి ఎన్నో నివాసాలు ఉన్నవాడు. ఉండటానికి ఎక్కడా స్థలం లేనివాడిలా అతడు ‘నన్ను ఇక్కడ ఉండనివ్వు’ అని విన్నపముతో వచ్చి అకారణంగా నా హృదయంలోకి ప్రవేశించాడు”, అని ఆళ్వారు ధ్యానిస్తూ సంతోషిస్తున్నారు.
తిరుప్పేర్ నగరాన్ తిరుమాలిరుంజోలై
పొరుప్పే ఉఱైగిన్ఱ పిరాన్ ఇన్ఱు వందు
ఇరుప్పేన్ ఎన్ఱు ఎన్ నెంజు నిఱైయ ప్పుగుందాన్
విరుప్పే పెఱ్ఱు అముదం ఉండు కళిత్తేనే
తిరుప్పేర్ నగరములో మరియు తిరుమాలిరుంజోలై అనే దివ్య కొండలో నిత్య నివాసముంటున్న గొప్ప మహోపకారి అయిన భగవానుడు, “నన్ను ఇక్కడ ఉండనివ్వు” అని అభ్యర్థనతో వచ్చి ఈ రోజు నా హృదయంలోకి ప్రవేశించి సంపూర్ణతను ప్రసాదించారు; ఈ బహుమతిని అందుకుని ఆ అమృతాన్ని ఆస్వాదిస్తూ ఆనందిస్తున్నాను.
ఏడవ పాశురము: తాను పొందిన అనుగ్రహము గురించి ఆళ్వారు దయతో వివరిస్తున్నారు.
ఉండు కళిత్తేఱ్కు ఉంబర్ ఎన్ కుఱై? మేలై
త్తొండు ఉగళిత్తు అంది తొళుం శొల్లు ప్పెఱ్ఱేన్
వండు కళిక్కుం పొళిల్ శూళ్ తిరుప్పేరాన్
కండు కళిప్ప కణ్ణుళ్ నిన్ఱు అగలానే
ప్రసన్నమైన తుమ్మెదలు విహరించే ఉద్యానవనములు చుట్టూ విస్తరించి ఉన్న తిరుప్పేర్ నగర్లో కొలువై ఉన్న భగవానుడు, నాకు ఆనందాన్ని కలిగించాలనే ఉద్దేశ్యముతో నిరంతరం నన్ను చూస్తూ నా దృష్టి యొక్క కేంద్ర బిందువుగా మారి నన్ను విడిచి వెళ్ళడం లేదు. పరమపదాన్ని అధిరోహించాలనే కోరికతో అతడిని నిత్యమూ అనుభవిస్తూ ఆస్వాదించే నాకు ఏ భయం లేదు. ఈ గొప్ప సేవ ద్వారా ఆనందాన్ని పొందిన తరువాత ఆఖరిలో, ఆరాధన/శరణాగతిని సూచిస్తున్న “నమః” అని నేను పలకాలి. ఉగళిత్తల్ – సమృద్ధిగా ఉండటం.
ఎనిమిదవ పాశురము: “మన మనస్సుకి మాటలకి అంతుచిక్కని గుణము ఉన్న తిరుప్పేర్ నగరములోని భగవానుడు, ఆనందమయుడు. ప్రేమను కురిపిస్తూ ఎన్నడూ వీడనని నా హృదయంలోకి ప్రవేశించి నిత్యమూ నా కళ్ళు అనుభవించేలా స్థిరమై ఉన్నాడు. అతడు నిరంతరము నా స్థాయికి మించి అనుగ్రహాన్ని నాకు ప్రసాదిస్తూనే ఉన్నాడు”, అని ఆళ్వారు వివరిస్తున్నారు.
కణ్ణుళ్ నిన్ఱగలాన్ కరుత్తిన్గణ్ పెరియన్
ఎణ్జిల్ నుణ్ పొరుళ్ ఏళిశైయిన్ శువై తానే
వణ్ణ నన్ మణి మాడంగళ్ శూళ్ తిరుప్పేరాన్
తిణ్ణం ఎన్ మనత్తు పుగుందాన్ శెఱిందిన్ఱే
తిరుప్పేర్లో నివాసుడై ఉంటున్న భగవానుడు, నన్ను వదిలి వెళ్ళకుండా నిత్యమూ నా బాహ్య నేత్రాలు ఆనందించేవిగా స్థిరమై ఉన్నాడు; నా హృదయంలో స్థిరమై ఉన్నాడు; అతని గురించి ధ్యానించునపుడు – అతడు అతి సూక్ష్మ గుణాలతో ఉంటాడు, సప్త స్వరాల మాధుర్యాన్ని కలిగి ఉన్నాడు. చుట్టూ అనేక రంగుల ఉత్తమమైన రత్నాలతో కట్టబడిన భవనాలు ఉన్న తిరుప్పేర్లో నివాసుడై ఉన్న భగవానుడు ఈ రోజు అకారణంగా నా హృదయంలోకి ప్రవేశించి స్థిరముగా నిలిచిపోయాడు.
తొమ్మిదవ పాశురము: ‘”ఈ రోజు తనను తాను నాతో సంబంధపరచుకొని, నాలో స్థిరముగా ఐక్యమైన భగవానుడిని “ఇంతకాలము నన్ను ఎందుకు పట్టించుకోలేదు?” అని ప్రశ్నిచాలనుకుంటున్నాను”, అని ఆళ్వారు తెలియజేస్తున్నారు.
ఇన్ఱెన్నై ప్పొరుళాక్కి తన్నై ఎన్నుళ్ వైత్తాన్
అన్ఱు ఎన్నై ప్పుఱంబోగ పుణర్తదెన్ శెయ్యాన్
కున్ఱెన్న త్తిగళ్ మాడంగళ్ శూళ్ తిరుప్పేరాన్
ఒన్ఱు నక్కరుళ్ శెయ్య ఉణర్ త్తల్ ఉఱ్ఱేనే
ఇప్పుడు, భగవానుడు నన్ను ఒక అస్తిత్వంగా మార్చి, తన హృదయంలో పదిలపరచుకున్నాడు; కాని ఇంతకుముందు, నన్ను తనకు దూరంగా ఉండమని లౌకిక సుఖాలలో ఎందుకు ఉంచాడు? ఎత్తైన పర్వతాలలా మెరిసే భవనాలు చుట్టుపక్కల ఉన్న తిరుప్పేర్లో నివాసుడై ఉన్న భగవానుడిని నుండి ఈ ప్రశ్నలకి జవాబు ఆశిస్తున్నాను. ఈ దృష్టాంతములలో ఏదో ఒకదానికి వివరణ ఇస్తే అది మరొక దానికి విరుద్ధంగా ఉంటుందని సూచిస్తుంది. నిర్హేతుక విశయీకారాన్ని (ఎటువంటి కారణం లేని అన్వేషణ) ప్రశ్నించినప్పుడు, సర్వజ్ఞుడైన భగవానుడు కూడా సమాధానము ఇవ్వలేడు.
పదవ పాశురము: ఆళ్వారు ప్రశ్నకు భగవానుడి వద్ద సమాధానం లేదు, అతనితో “నీ కోరిక ఏమిటీ చెప్పు” అని భగవానుడు దయతో అడుగగా; “నేను నిన్ను ప్రేమతో సేవించి నీ దివ్య పాదాలను ఆస్వాదించాలనుకుంటున్నాను” అని ఆళ్వారు కోరుకుంటారు; “సరే! తదాస్తు” అని భగవానుడు అభయమిస్తారు. ఆళ్వారు సంతోషించి, “తిరుప్పేర్ నగరములో భగవానుడికి శరణాగతి చేసినవారికి, దుఃఖము ఉండదు”, అని ఆళ్వారు హామీ ఇస్తున్నారు.
ఉఱ్ఱేన్ ఉగందు పణి శెయ్దు ఉన పాదం
పెఱ్ఱేన్ ఈదే ఇన్నం వేండువదు ఎందాయ్
కఱ్ఱార్ మఱై వాణర్గళ్ వాళ్ తిరుప్పేరాఱ్కు
అఱ్ఱార్ అడియార్ తమకు అల్లల్ నిల్లావే
ఎటువంటి కారణం లేకుండా (నా ప్రయత్నం లేకుండానే), నీ దివ్య పాదాలను చేరుకున్నాను; భక్తితో కీర్తనలు పాడి నిన్ను సేవించి నేను అత్యున్నత లక్ష్యం అయిన నీ దివ్య చరణాలను పొందాను. నాకు సహజం బంధువైన ఓ భగవానుడా! ఈ సేవ నాకు ఎప్పటికీ కావాలి! ఆ ఆనందానికి అడ్డంకులైన దుఃఖాలు తిరుప్పేర్లో నివసిస్తున్న నీ ప్రియ భక్తులకు సహజంగానే ఉండవు. వేద పండితులు, వేద శ్రవణము చేయువారు, ఆ విధులను నైపుణ్యముతో అనుసరించువారు ఇక్కడ భగవత్ అనుభవములో జీవిస్తున్నారు. ‘అఱ్ఱారుక్కు అడియార్’ (కేవలము భగవానుడి కోసమే ఉన్న వారి భక్తులు) అని కూడా చెప్పబడింది.
పదకొండవ పాశురము: “గొప్పదైన తిరునాడు (పరమపదము) ఈ పదిగములో నిపుణులైన వారి అధీనములో ఉంటుంది” అని ఆళ్వారు తెలియజేస్తున్నారు.
నిల్లా అల్లల్ నీళ్ వయల్ శూళ్ తిరుప్పేర్మేల్
నల్లార్ పలర్ వాళ్ కురుగూర్ చ్చడగోబన్
శొల్లార్ తమిళ్ ఆయిరత్తుళ్ ఇవైపత్తుం
వల్లార్ తొండర్ ఆళ్వదు శూళ్ పొన్ విశుంబే
అనేక ప్రముఖ వ్యక్తులు తిరువాయ్మొళిని శ్రవణము చేస్తూ నివసిస్తున్న ఆళ్వార్తిరునగరికి స్వామి అయిన నమ్మాళ్వార్లు, దుఃఖములు లేని, విశాలమైన పంట చేనుల మధ్య ఉన్న తిరుప్పేర్ పైన ఈ పదిగాన్ని పాడారు. వారు పాడిన వెయ్యి పాశురములలో ఈ పదిగాన్ని నిష్ఠగా అభ్యసించిన భక్తులు నాయకులై పరమవ్యోమ అని పిలువబడు నిత్యమూ ప్రకాశించే పరమపదముని ముందుండి నడిపిస్తారు.
అడియేన్ శ్రీదేవి రామానుజదాసి
మూలము:https://divyaprabandham.koyil.org/index.php/2020/06/thiruvaimozhi-10-8-simple/
పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org