కోయిల్ తిరువాయ్మొళి – సరళ వ్యాఖ్యానము – 4.1 -ఒరునాయగమాయ్

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

కోయిల్ తిరువాయ్మొళి

<< 3.3 – ఒళివిల్

ramanuja-selvapillai-2

ఐశ్వర్యయము (లౌకిక సుఖాలు), కైవల్యము (శాశ్వతంగా తనను తాను ఆనందించుట) మరియు భగవత్ కైంకార్యము (భగవానుడికి నిత్య కైంకార్యము) అనే మూడు పురుషార్థము‌లలో, ఐశ్వర్యయము మరియు కైవల్యం తమ స్వభావానికి సరితూగవని, అల్పమైనవని ఆళ్వారు నొక్కి చెబుతున్నారు. సర్వేశ్వరుడు, శ్రియః పతి, శ్రీమన్నారాయణుని పాద పద్మాల వద్ద కైంకర్యాన్ని కోరుకోవాలని ఆళ్వారు కృపతో వివరిస్తున్నారు. ఎంబెరుమానార్ ఈ పదిగాన్ని తిరునారాయణపురం తిరునారణ ఎంపెరుమానుడికి  సమర్పించుకున్నారు.

మొదటి పాశురము: “పెద్ద పెద్ద రాజులు, చక్రవర్తులు ఏదో ఒక రోజు తమ రాజ్యాన్ని కోల్పోయి  బిక్షాటన చేసుకుంటూ దీనమైన జీవితాన్ని గడిపిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి, నిత్య ఐశ్వర్య వంతుడైన తిరునారాయణుడి (శ్రీమన్నారాయణ) దివ్య పాదాలను చేరుకోండి మరియు ఉద్ధరింపబడండి” అని ఆళ్వారు వివరిస్తున్నారు.

ఒరు నాయగమాయ్‌ ఓడ ఉలగుడన్ ఆణ్డవర్
కరు నాయ్‌ కవర్‌ంద కాలర్ శిదైగియ పానైయర్
పెరు నాడు కాణ ఇమైయిలే పిచ్చై తాం కొళ్వర్‌
తిరునారణన్ తాళ్‌ కాలమ్పెఱ చ్చిందిత్తుయ్ మినో

ఈ భూమిపైన స్వతంత్ర సామ్రాజ్యాలను ఏలుతున్న అత్యున్నతమైన  రారాజులు కుడా వాళ్ళ సంపదను కోల్పోయి, రాత్రుల్లో నల్ల కుక్క కరిచిన కాళ్ళతో, విరిగిన బొచ్చె చేతిలో పట్టుకొని అడుక్కుటుంటారు. ఒకప్పుడు ఆ గొప్ప సామ్రాజ్య ప్రజలను ఏలిన వారు, వారి ముందే భిక్ష ఎత్తుకుంటారు.  ప్రాపంచిక  ఐశ్వర్యము తాత్కాలికము, కాబట్టి సమయం వృధా చేయకుండా వెంటనే నిత్య సంపన్నుడైన నారాయణుని దివ్య పాదాల యందు ధ్యానించండి ఉద్ధరించబడండి.

రెండవ పాశురము:  “మీ సంపదను పోగొట్టుకొనుటతో పాటు, మీరు మీ భార్యను కూడా కోల్పోయే సమయము కూడా రావచ్చు. కాబట్టి, మనందరికీ ప్రభువు అయిన శ్రీలక్ష్మీ పతి శ్రీమన్నారాయణుడిని శరణు వేడుకోవడం అతి అవసరము” అని ఆళ్వారు వివరిస్తున్నారు.

ఉయ్ మిన్ తిఱై కొణర్‌ందు ఎన్జులగాండవర్‌  ఇమ్మైయే
తమ్మిన్ శువై మడవారై ప్పిఱర్‌ కొళ్ళు త్తాం విట్టు
వెమ్మినొళి వెయిల్ కానగం పోయ్‌ క్కుమై తిన్బర్గళ్
శెమ్మిన్ ముడి త్తిరుమాలై విరైందడి శేర్మినో

ప్రపంచాన్ని ఏలే రాజులు, “మీ నివాళులతో మనుగడ సాగుతుంది అని సామంత రాజులతో అంటారు”, కానీ అదే జీవితంలో, వారి ప్రియమైన తమ భార్యలను ఇతర రాజులచేత హింసించబడేందుకు వదిలిపెట్టి, వారి రాజ్యంలో ఉండలేక, మండే ఎండలో అడవులలోకి వెళ్లవలసి వస్తుంది. అందుకని, మీరు త్వరగా శ్రీమహాలక్ష్మికి పతి అయిన అనంత కోటి సూర్యుల తేజస్సుగల కిరీటాన్ని ధరించిన భగవానుడి పాదాలకు శరణాగతి చేయండి.

మూడవ పాశురము: “తమకు లొంగిన రాజుల బాగోగులను చూసుకోని రారాజులు తమ సంపదను కోల్పోతారు, ఆపై ఇతరుల గౌరవము పొందకుండా జీవిస్తారు. కాబట్టి పరమానందమయుడైన శ్రీ కృష్ణుని దివ్య పాదాలను ఆశ్రయించండి”. అని ఆళ్వారు తెలుపుతున్నారు.

అడిశేర్‌ ముడియినరాగి అరశర్ కళ్‌ తాం తొళ
ఇడిశేర్‌ మురశంగళ్ ముఱ్ఱత్తియంబు ఇరుందవర్
పొడి శేర్‌ తుగళాయ్‌ పోవర్గల్ ఆదలిన్ నొక్కెన
క్కడిశేర్‌ తుళాయ్‌ ముడి క్కణ్ణన్‌ కళల్ గళ్ నినైమినో

చక్రవర్తుల కాళ్ళ యందు ఉండి తమను ఆరాధిస్తున్న ఇతర రాజులను పట్టించుకోకుండా  బయటనుండి వచ్చే తంబురు ధ్వనులను ఆనందిస్తుంటారు. అటువంటి చక్రవర్తులు, గాలిలో ఒక చిన్న అణువులా పనికిరాకుండా అవుతారు. కాబట్టి, సువాసనలు వెదజల్లే తులసితో అలంకరించబడిన కిరీటాన్ని ధరించిన కృష్ణుని దివ్య పాద పద్మాలను ధ్యానించండి.

నాలుగవ పాశురము:  “ఆయుషు కూడా అల్పమైనది కాబట్టి, మీ అడ్డంకులను తొలగించే కృష్ణుడి దివ్య చరణాలను ఆరాధించండి” అని ఆళ్వారు తెలుపుతున్నారు.

నివైప్పాన్ పుగిల్‌ కడల్‌ ఎక్కలిన్ నుణ్మణలిన్ పలర్‌
ఎనైత్తోర్‌ ఉగంగళుం ఇవ్వులగాండు కళిందవర్
మనైప్పాల్‌ మరుంగఱ మాయ్ తలల్లాల్‌ మఱ్ఱుక్కండిలం
పనై త్తాళ్‌ మద గళిఱట్టవన్  పాదం పణిమినో

‌భగవత్ అనుభవం లేకుండా మరణించిన రాజుల గురించి చెప్పడానికి బయలుదేరినట్లయితే అనేక యుగాలుగా మరణించిన వారి సంఖ్య సముద్రంలో ఇసుక దినుసుల కన్నా పెద్దదౌతుంది; వాళ్ళ కోట భవనాలకు యడారికి మధ్య వ్యత్యాసం లేనంత రీతిలో అవి నాశనమై పోయి, గుర్తుపట్టలేనంత నేలమట్టమై ఉన్నాయి. కాబట్టి, తాటి చెట్టు వలే గుండ్రంగా పాదాలు ఉన్న మత్త గజాన్ని [కువలయాపీడం] వధించిన కృష్ణుని దివ్య పాదాలను మీరందరూ ఆరాధించండి.

ఐదవ పాశురము:  “ఐశ్వర్యము లాగే  స్త్రీ సంయోగము కూడా లోపాలతో కూడినది, తాత్కాలికమైనది” అని ఆళ్వారు చెబుతున్నారు.

పణిమిన్ తిరువరుళ్‌ ఎన్నుం అంజీద ప్పైం పూమ్పళ్ళి
ఆణి మెన్ కుళలార్ ఇన్బ క్కలవి అముదుణ్డార్
తుణి మున్బునాల ప్పల్ ఏళైయర్‌ తామిళిప్ప శెల్వర్‌
మణి మిన్ను మేని నం మాయవన్ పేర్‌ శొల్లి వాళ్మినో

సుఖాన్ని పొందటానికి, సున్నితమైన చల్లని పూల మంచం మీద అలంకరించుకొని పడుకుని ఉన్న సుందరీమణులను ఆనందించిన రాజులు మరియు ధనవంతులు, ఆ సుందరీమణులు తమ పట్ల అవమానకరమైన మాటలు మాట్లాడుతున్నప్పటికీ, ఆ యువతి వద్దకి తిరిగి వెళతారు; అందువల్ల, తనను ఆస్వాదించమని తమ భక్తులకు అనుమతించే నీలమణి వంటి తేజము గల దివ్య స్వరూపమున్న ప్రభువు యొక్క దివ్య నామాలను పఠించడం ద్వారా మీరు సంతోషంగా జీవిస్తారు.

ఆరవ పాశురము:  “సృష్టి కాలం నుండి ఈ రోజు వరకు, నేను ఏ చిరకాలము శ్రీమంతునిగా ఉన్న ఎవరిని చూడలేదు. అందువల్ల క్షీరాబ్ది నాథుడికి దాసునిగా మారండి” అని ఆళ్వారు తెలుపుతున్నారు.

వాళ్ందార్గళ్ వాళ్ందదు మా మళై మొక్కుళిన్ మాయ్‌ందు మాయ్‌ందు
ఆళ్ందార్  ఎన్ఱల్లల్‌  అన్ఱు ముదల్‌ ఇన్ఱఱుదియా
వాళ్ందార్గళ్‌ వాళ్ందే నిన్ఱర్ ఎన్బదిల్లై నిఱ్కుఱిల్‌
ఆళ్ందార్‌ కడల్ పళ్ళి అణ్ణల్ ‌ అడియవరామినో

తాము జీవిస్తున్నామని భావించే వారు వర్షంలో ఒక బుడగ లాంటి వారు. అది మళ్లీ మళ్లీ పగిలి నాశనం అవుతుంది; ఇది కాకుండా, నిత్యము జీవించిన వారు సృష్టి ఆది నుండి ఇప్పటి వరకు ఎవ్వరూ లేరు; మీరు నిత్యజీవనము పొందటానికి మహాసముద్రము లాంటి శయ్యపై శయనించి ఉన్న స్వామికి భక్తుడిగా మారండి.

ఏడవ పాశురము: ఆహార పానీయాలు మొదలైన భోగాలు తాత్కాలికమైనవని ఆళ్వారు వివరిస్తున్నారు.

ఆమిన్ శువైయవై ఆఱోడు అడిశిల్‌ ఉండార్‌ంద పిన్
తూ మెన్ మొళి మడవార్‌ ఇరక్క పిన్నుం తుఱ్ఱువార్‌
ఈమిన్ ఎమక్కొరు తుఱ్ఱెన్ఱు ఇడఱువర్‌ ఆదలిన్
కోమిన్ తుళాయ్‌ ముడి ఆదియంశోది గుణంగళే

ధనవంతులు తమ స్వభావానికి సరితూగే రుచికరమైన, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆరు రకాల రుచులు ఉన్న ఆహారాన్ని తిన్న తరువాత, ఆనందంగా తృప్తిపడిన తరువాత కూడా, వడ్డించే యువతులను, మొహమాటంతో కాదనలేక, అతి కష్టంతో వెళ్ళి మళ్ళీ ఆరగిస్తారు; కానీ తమ సంపదను కోల్పోయిన తరువాత, వారు “మాకు భోజనము పెట్టండి” అని అడుగుతూ ఆ యువతుల దగ్గరకే వెళ్లి వాళ్ళ ద్వారాలను తట్టుతారు; అందుకని, దివ్య తేజోమయ స్వరూపుడు, అతి సుందరుడైన సర్వేశ్వరుని గుణాలను ఆనందించండి, తిరు తులసితో అలంకరించబడిన కిరీటాన్ని ధరించిన ఆ స్వామి అనంతమైన ఆనందాన్ని కలిగించేవాడు, సర్వకారకుడు కూడా.

ఎనిమిదవ పాశురము:  “గడించి సంపాదించిన ఈ రాజ్యాలు భగవంతుని కృప లేకుండా ఎక్కువ కాలం ఉండవు కాబట్టి, మీరు అనంతశాయి యొక్క దివ్య నామాలను పఠించండి” అని ఆళ్వారు తెలుపుతున్నారు.

గుణం కొళ్‌ నిఱై పుగళ్‌ మన్నర్‌ కొడైక్కడన్ పూండిరుందు
ఇణైంగి ఉలగుడన్ ఆక్కిలుం ఆంగవనై ఇల్లార్
మణం కొండ బోగత్తు మన్నియుం మీళ్వర్గళ్‌ మీళ్విల్లై
పణం కొెళ్‌ అరవణైయాన్  తిరునామం పడిమినో

సీలం (సరళత) వంటి లక్షణాలున్న రాజులు, రాజ కుమారులుగా పట్టాభిషేకం అయినవారు, ఖ్యాతి గాంచినవారు, ఉదార స్వభావులు (అందరి సంక్షేమం కోసం తమ సంపదను ఖర్చుపెట్టేవారు), సుస్వరముగా శాంతిప్రియులు అని ఈ ప్రపంచంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న వారు  ఎవరైనాకానీ, అష్ట ఐశ్వర్యాలలో సుసంప్పన్నుడై ఉన్నప్పటికీ ఆ సంపదకు సంబంధించిన విషయాలలో సర్వేశ్వరుడికి అధీనుడై లేనివారు, దివాళా తీసి ఆ ఐశ్వర్యము కోల్పోతారు; కాబట్టి,  తన భక్తులతో ఐక్యమై ఉండటానికి ఇష్టపడే వాడి దివ్య నామాలను మీరు పఠిస్తే / ఆచరిస్తే, ఆ అనంత శేషుడు తన శయ్యగా ఉన్నవాడు, మళ్ళీ ఈ సంసారానికి తిరిగి రాని చోటకి మిమ్మల్ని తీసుకువెళతారు.

తొమ్మిదవ పాశురము:  “ఇతర దివ్య లోకాలతో పాటు స్వర్గ లోక సుఖాలు మొదలైనవి  కూడా  తాత్కాలికమైనవి కాబట్టి, మీకు శాశ్వత లక్ష్యాన్ని ఏర్పరచే ఆ ఈశ్వరుడిని ఆశ్రయించండి”. అని ఆళ్వారు వివరిస్తున్నారు..

పడి మన్ను పల్కలన్ పఱ్ఱ ఓడఱుత్తు ఐమ్పులన్ వెన్ఱు
శెడి మన్ను కాయం శెఱ్ఱ ఆర్గళుం ఆంగవనై ఇల్లార్‌
కుడి మన్నుం ఇన్ శువర్గం ఎయ్దియుం మీళ్వర్గళ్ మీళ్విల్లై
కొడి మన్ను పుళ్ళుడై అణ్ణల్‌ కళల్గల్  కుఱుగుమినో

ఎన్నో త్యాగాలు చేసి,  నిత్యము అలంకరించుకునే తమ ఆభరణాలు, ఆస్తులు దానముచేసి, కష్థపడి ఇంద్రియ నియంత్రణలు చేసి, కఠోర తపస్సులు చేసి స్వర్గానికి వేళ్ళినా, అక్కడ ఉన్నప్పుడు భగవానుడిని శరణు వేడుకోకపోతే, వాళ్ళు ఆ స్వర్గ జీవితాన్ని కోల్పోతారు; శాశ్వత ఫలితాన్ని పొందడానికి, పెరియ తిరువడి గరుడను తన ధ్వజలో నిత్యము ఉంచుకునే సర్వేశ్వరుని దివ్య పాదాలను చేరుకోవడానికి మీరు ప్రయత్నించాలి. “పడి మన్ను” అనగా శరీరానికి బాగా సరిపోయే ఆభరణాలను సూచిస్తుంది.

పదవ పాశురము:  “కైవల్యము తాత్కాలికమైనది కాకపోయినా, ఇది పరమ పురుషార్థమైన శ్రీమన్నారాయణుని నిత్య సేవ వలె సారవంతమైనది కాదు, సర్వాధిపతి అయిన  భగవానుడిని పొందుటయే పరమ పురుషార్థము (లక్ష్యం)” అని ఆళ్వారు వివరిస్తున్నారు.

కుఱుగ మిగ ఉణర్వత్తొడు నోక్కి  ఎల్లాం విట్ట
ఇఱుగల్‌ ఇఱప్పెన్నుం జ్ఞానిక్కుం అప్పయన్ ఇల్లైయేల్‌
శిఱుగ నినైవదోర్‌ పాశం ఉండాం పిన్నుం వీడిల్లై
మఱుగలిల్‌ ఈశనై ప్పఱ్ఱి విడా విడిల్‌ వీడహ్ దే (10)

ఆత్మ తప్పా మిగిలినవన్నింటినీ త్యాగము చేసిన జ్ఞాని, తన జ్ఞానము కారణంగా ప్రఖ్యాతి గాంచినవారికి, మోక్ష సాధనలో కఠోర ఆత్మ ధ్యానము చేసేవారికి ఆత్మయే లక్ష్యముగా మిగిలిపోతుంది; అటువంటి జ్ఞాని భగవానుడిని సాధనంగా స్వీకరించకపోతే అతనిలో అల్ప లక్ష్యాల అనుబంధం ఏర్పడుతుంది; అతడు మోక్షాన్ని సాధించలేడు. కాబట్టి, అందరినీ నియంత్రించేవాడు, అన్ని పవిత్ర గుణాలకు నివాసుడు, ఏ లోపము లేని నిష్కలంకుడైన భగవానుడికి శరణాగతులై  అతడిని ఎప్పటికీ వదలకుండా ఉండుటయే పరమ పురుషార్థము.

పదకొండవ పాశురము:  దుఃఖాలన్నీ తొలగిన తరువాత ఆత్మోద్దారణయే ఈ పదిగము యొక్క ఫలితమని ఆళ్వారు వివరిస్తున్నారు..

అందే ఉయ్య ప్పుగుమాఱెన్ఱు కణ్ణన్ కళల్గళ్ మేల్
కొయ్‌ పూం పొళిల్ శూళ్‌ కురుగూర్ చ్చడగోపన్ కుఱ్ఱేవల్
శెయ్‌ కోలత్తు ఆయిరం శీర్‌ త్తొడై ప్పాడల్‌ ఇవై పత్తుం
అహ్ కామల్‌ కఱ్పవర్ ఆళ్తుయర్‌ పోయ్‌ ఉయ్యఱ్ప ఆలరే

విరపూసిన పూల తోటలు పుష్కలంగా ఉన్న ఆళ్వార్తిరునగరికి నాయకుడైన నమ్మాళ్వారు, కృష్ణుడి దివ్య పాదాలకు చేసే రహస్య సేవగా సీర్ మరియు తొడై ఉన్న ఈ వెయ్యి పాసురములను పాడారు, అవి ఆత్మ ఉద్ధరణకి ఏకైక సాధనములని నొక్కి చెప్పారు. ఈ వెయ్యి పాశురములలో ఈ పదిగమును నేర్చుకొని ఎవరైతే పఠిస్తారో, వారికి ప్రాపంచిక ఐశ్వర్యము మరియు ఆనందంలో మునిగి ఉన్నామన్న దుఃఖము నిర్మూలించబడుతుంది. భగవత్భక్తికి దారితీసే ఆత్మోద్ధారణలో పాల్గొంటారు.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము : https://divyaprabandham.koyil.org/index.php/2020/05/thiruvaimozhi-4-1-simple/

పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a Comment