శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
పాశురము 62
ఈ పాశురములో పరమపదమును సులభముగా ఏవిధంగా పొందవచ్చునో తెలుపుచున్నారు.
ఉయ్యనినై వుణ్డాగిల్ ఉజ్ఞ్గురుక్కళ్ దమ్ పదత్తే వైయుమ్* అన్బుతన్నై ఇన్ద మానిలత్తీర్ మెయ్యురైక్కేన్| పైయరవిల్ మాయన్ పరమపదమ్ ఉజ్ఞ్గుళుక్కామ్! కైయిలజ్ఞ్గు నెల్లిక్కని||
ఈ విశాలమైన ప్రపంచమనబడే సంసార జగత్తు నందు ఉన్న జనులారా! ఉజ్జీవించాలనే కోరికయున్నచో దానికి సులభ మార్గమును నేను చెప్పుచున్నాను వినండి! మీయొక్క ఆచార్యుల తిరువడిగళ్ళను పట్టుకొనియుండినచో మాయావియైన ఎంబెరుమాన్ యొక్క నివాస స్థానమైన పరమపదము కరతలామలకము (అరచేతిలోని ఉసిరిక) వలే సులభముగా లభించును. ఇది సత్యము.
ఆచార్య సంబంధము కలిగి ఉండి అట్టి ఆచార్యుని యందు భక్తి ఉన్న “మీకు” ఇది అనువర్తించును. ఇదే లోక ప్రశస్తి. భరతాళ్వాన్ యందు భక్తిని కలిగియుండిన శతృఘ్నునకు రాముని యందు కూడా భక్తియుండినటులే. ఆచార్య భక్తి ఉన్నచో వారికి ఎంబెరుమాన్ యందు కూడా భక్తి ఉన్నట్లే. అదే విధముగా ఆయనను పొందుట చాలా సులభము. మణవాళ మామునుల దోషరహిత ఈ తిరువాక్కుల యందు సందేహమునకు ఏ మాత్రము స్థానము లేదు.
పాశురము 63
ఈ పాశురములో ఆచార్యులు చేయు మహోపకార్యములను దానికి శిష్యుడు కృతజ్ఞుడై ఉండుట గూర్చి కృప చేయుచున్నారు.
ఆశారియన్ శెయ్ద ఉపకారమ్ ఆనవదు| తూయ్దాగ నెఞ్జుదన్నిల్ తోన్ఱుమేల్* తేశాన్తరత్తిల్ ఇరుక్క మనమ్ దాన్ పొరున్ద మాట్టాదు ఇరుత్తల్ ఇవి ఏదు అఱియోమ్ యామ్||
ఆచార్యులు చేయు ఉపకారములు దోషరహితములని శిష్యుడు తన మనస్సు నందు తలచినచో ఆచార్యునకు కైజ్ఞ్కర్యము చేయుట యందే ఆశ కలిగి ఉండాలి. కాని కొందరు ఆచార్య కైజ్ఞ్కర్యము చేయగలిగియూ చేయకుండుట నాకర్థము కావుటలేదని చెప్పుచున్నారు.
ఆచార్యులు శిష్యునకు చేయు ఉపకారములు జ్ఞానమును ప్రసాదించుట, దోషములు/పాపములు చేయకుండ నిలువరించుట, కైజ్ఞ్కర్యముల యందు ఆశ కలిగి యుండుట, మోక్షమును పొందుట యందు ఉపకారకుడుగా ఉండుట మొదలగునవి. మంచి శిష్యుడైన వారు వీటినన్నిటినీ తలచుకొనుచు ఎల్లవేళలా ఆచార్యుని యందు కృతజ్ఞుడై ఆచార్య కైజ్ఞ్కర్యము చేయుట యందే ఆశ కలవాడై ఉండాలి. మామునులు కూడా వారి ఆచార్యులైన తిరువాయ్మొళి పిళ్ళై ఈ లోకములో జీవించి ఉన్నంతవరకు ఆళ్వార్ తిరునగరిలోనే ఉండి తమ ఆచార్యునికి ఇష్ట కైజ్ఞ్కర్యములు చేసినారు. తిరువాయ్మొళి పిళ్ళై తిరునాడు (పరమపదము)ను పొందిన/వేంచేసిన పిదప వీరు శ్రీరంగమునకు విజయము చేసినారు. ఆ విధముగా వీరు ఆచరించినదే ఇతరులకు ఉపదేశించినారు.
అడియేన్ వీ.వీ.ఎల్.ఎన్. ఆచార్యులు రామానుజ దాసన్ 🙏
మూలము : https://divyaprabandham.koyil.org/index.php/2020/07/upadhesa-raththina-malai-62-63-simple/
ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి : https://divyaprabandham.koyil.org
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org