స్తోత్ర రత్నము – సరళ వ్యాఖ్యానము – శ్లోకము 1-10

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

స్తోత్ర రత్నము

<< తనియన్లు

శ్లోకము 1 – ఈ మొదటి శ్లోకములో, అసలు నిధియైన జ్ఞాన వైరాగ్యముల యందు నాథమునులకున్న సమర్థతకి ఆళవందార్లు నమస్కరిస్తున్నారు.

నమోऽచింత్యాధ్భుతాక్లిష్ట జ్ఞానవైరాగ్యరాశయే।
నాథాయ మునయేऽగాధ భగవద్భక్తి సిన్ధవే॥

భగవద్భక్తిలో లోతైన  సాగరము వంటివారు, భగవదనుగ్రహంతో మన ఊహకందని అద్భుత జ్ఞానవైరాగ్యాలు కలిగి, నిత్యం భగవత్ ధ్యానంలో ఉండే నాథమునులకు  నా నమస్కారములు.

శ్లోకము 2 – ఈ శ్లోకములో, నాథమునులకు భగవద్ అవతారములకు సంబంధించిన ఉత్తమ జ్ఞానము గురించి వివరణ ఇవ్వబడింది. అలాగే, “వారి జ్ఞానము వారితోనే పరిమితము కాకుండా,  పొంగి నా (ఆళవందార్ల) వరకు ప్రసరించున్నది”  అని వివరిస్తున్నారు.

తస్మై నమో మధుజిదంఘ్రిసరోజతత్త్వ
జ్ఞానానురాగ మహిమాతిశయాంతసీమ్నే।
నాథాయ నాథమునయేऽత్ర పరత్ర చాపి
నిత్యం యదీయ చరణౌ శరణం మదీయం॥

మధువనెడి రాక్షసుడిని వధించిన భగవాన్ దివ్య పాదపద్మాల యందు ఉత్తమ జ్ఞానభక్తులకు పరాకాష్ట అయిన  నాథమునుల దివ్య తిరువడియే ఇహ పరలోకాలలో కూడా నాకు ఆశ్రయము, నాకు స్వామియైన అటువంటి శ్రీమన్నాథమునులకు నా నమస్కారాలు.

శ్లోకము 3 –   దప్పికతో ఉన్న మనిషి దాహము ఎన్ని నీళ్ళు త్రాగినా తీరనట్టుగా, “నేను ఎంత కాలమైన వారి దాసుడినే” అని ఆళవందార్లు తెలుపుతున్నారు.

భూయో నమోऽపరిమితాచ్యుత భక్తితత్వ
జ్ఞానామృతాబ్ధి పరివాహ శుభైర్వచోభిః ।
లోకేऽవతీర్ణ పరమార్థ సమగ్ర భక్తి
యోగాయ నాథమునయే యమినాం వరాయ॥

భక్తి యోగ ఉపాసకులు, యోగులలో ఉత్తములు, సంపూర్ణులు, అత్యుత్తమ హితమునొసగువారు, శుద్ద సత్వ భక్తిజ్ఞాన సాగరము నుండి పొంగిన సత్యవచనాలకు ప్రతిరూపంగా ఈ భూమిపైన అవతరించిన నాథమునులకు మళ్ళీ మళ్ళీ నా నమస్కారములు.

శ్లోకము 4 –  విష్ణు పురాణము రూపంలో తనకి సహకారమందించిన శ్రీ పరాశర భగవానునికి ఆళవందార్లు నమస్కరిస్తున్నారు.

తత్త్వేన యశ్చిదచిదీశ్వర తత్స్వభావ
భోగాపవర్గ తదుపాయగతీరుదారః।
సందర్శయన్ నిరమిమీత పురాణరత్నం
తస్మై నమో మునివరాయ పరాశరాయ॥

చిత్(చేతనులు), అచిత్(అచేతనులు), ఈశ్వర(భగవాన్) గురించి, వాటి రూపగుణాల గురించి, సుఖ దుఃఖాలు, మొక్షము, మొక్ష సాధనముల గురించి, జీవాత్మలు సాధించవలసిన లక్ష్యము గురించి విసృతముగా వివరించే పురాణములన్నింటిలో మణి వంటిదైన శ్రీవిష్ణుపురాణమును మనకందించిన ఋషులలో ఉత్తముడైన పరాశర మహర్షికి నా వందనాలు.

శ్లోకము 5 –  నమ్మాళ్వార్ల దివ్య పాదాలయందు ఆళవందార్లు శరణాగతి చేయుచున్నారు.

మాతా పితా యువతయస్తనయా విభూతిః
సర్వం యదేవ నియమేన మదన్వయానామ్।
ఆద్యస్య నః కులపతేర్వకుళాభిరామం
శ్రీమత్తదంఘ్రి యుగళం ప్రణమామి మూర్ధ్నా ॥

నమ్మాళ్వార్ల దివ్య పాదాలు నా వంశస్థులకు నిత్యం తల్లి తండ్రుల వంటివి. ఎల్లకాలములలో స్త్రీ (భార్య) సంతాన సంపద వంటివని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. శ్రీవైష్ణవశ్రీతో (కైంకర్య సంపద), వకుళ పుష్పాలంకరణతో ఉన్నటువంటి శ్రీవైష్ణవ కులాధిపతి అయిన ఆళ్వారుని  నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.

శ్లోకము 6 – తిరువాయ్మొళి 7.9.7 “వైగుందనాగ ప్పుగళ” (శ్రీవైకుంఠనాథుడని భగవాన్ ఆళ్వార్ చేత పొగిడించుకుంటున్నారు), ఎందుకనగా పొగడ్తలు ఆయనకు (ఈశ్వర) ఇష్టము కనుక. పైగా పెరుమాళ్ళను కీర్తించడం ఆచార్యులకు మహాప్రీతి కనుక. అందువలన పెరుమాళ్ళను స్తుతించే ఉద్దేశ్యముతో ఉపాయ ఉపేయములను వివరిస్తూ కీర్తించడం మొదలుపెడుతున్నారు.

యన్మూర్ధ్ని మే శృతిశిరస్సు చ భాతి యస్మిన్
అస్మన్మనోరథపథః సకలః సమేతి।
స్తోష్యామి నః కులధనం కులదైవతం తత్
పాదారవిందం అరవిందవిలోచనస్య॥

వేద వేదాంతాలలో గోచరించే ఆ దివ్య చరణాలే నా శిరస్సుపై కనబడే ఆ పాదపద్మాలు. అవి మనకు కులదైవము వంటివి. మన వంశానికే సంపదలాంటివి. పొంగి ప్రవహిస్తున్న మన భక్తి ఎవరి దివ్య పాదాలయందు వెళ్లి చేరుతుందో, ఆ పుండరీకాక్షుని చరణ కమలములను నేను కీర్తించెదను.

శ్లోకము 7 –  శ్రీ భగవద్గీత 1.47 లో “విసృజ్య సశరం చాపం” అని ఉపదేశించబడింది, యుద్దభూమిలో అర్జునుడు తన గాండీవాన్ని క్రింద పెట్టి తాను యుద్దము చేయనని నిశ్చయించుకున్నట్టుగా  ఆళవందార్లు కూడా తమ ప్రయత్నానాన్ని విరమించుకుంటారు.

తత్వేన యస్య మహిమార్ణవశీకరాణుః
శక్యో న మాతుమపి సర్వపితామహాద్యైః।
కర్తుం తదీయమహిమస్తుతిముద్యతాయ
మహ్యం నమోऽస్తు కవయే నిరపత్రపాయ॥

బ్రహ్మ రుద్రాదులకు కూడా భగవానుని విశాల ఔన్నత్య సాగరములోని ఒక చిన్న బిందువు యొక్క ఒక అణువుని కూడా కొలవ సాధ్యము కాదు. నన్ను నేను కవిగా చాటుకుంటూ అటువంటి భగవానుని గొప్పతనాన్ని కీర్తిస్తానని సిగ్గుపడకుండా బయలుదేరిన నన్ను నేను నమస్కరించుకోవాలి (హాస్యాస్పదంగా).

శ్లోకము 8 – యుద్ధభూమిలో తన గాండీవాన్ని క్రింద పెట్టి తాను యుద్ధము చేయనని నిశ్చయించుకున్న అర్జునుడిని శ్రీ కృష్ణుడు భగవద్గీత లో 18.73 “కరిష్యే వచనం తవ” (నీవు చెప్పినట్లు నేను యుద్దము చేసెదను) అని ప్రోత్సహించినట్టుగా, ఇక్కడ ఆళవందార్లను ప్రొత్సహిస్తూ ఇలా తెలుపుతున్నారు “నోరున్నది కేవలము స్తుతించడానికే; శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో ‘స్తవ్యః స్తవప్రియః’ (ఆయన స్తుతింపతగినవాడు, స్తుతి ప్రియుడు) స్తుతింపబడటం నాకు అతిప్రియము”. ఇది విన్న ఆళవందార్లు పెరుమాళ్ళని స్తుతించడానికి ఏకీభవిస్తారు.

యద్వా శ్రమావధి యథామతి వాప్యశక్తః
స్తౌమ్యేవమేవ ఖలు తేऽపి సదా స్తువంతః।
వేదాశ్చతుర్ముఖ ముఖాశ్చ మహార్ణవాంతః
కో మజ్జతోరణుకులాచలయోర్విశేషః॥

ఈ అసమర్ధుడికి తెలిసినంత అలసిపోయేవరకు నిన్ను కీర్తిస్తాను; ఇదే విధంగా వేదములు, చతుర్ముఖ బ్రహ్మ మొదలైనవారు కూడా ఆ సర్వేశ్వరుడిని పొగిడారు; కానీ మహాసాగరములో మునిగే ఒక చిన్న అణువుకి పెద్ద పర్వతానికి మధ్య తేడా ఏముంది? మునిగే ప్రమాదం రెండింటికి ఉంది.

శ్లోకము 9 – ఈ శ్లోకములో, పెరుమాళ్ళను స్తుతించుటకు తనకి బ్రహ్మ కంటే ఎక్కువ అర్హత ఉందని ఆళవందార్లు అంటున్నారు.

కించైష శక్త్యతిశయేన న తేऽనుకంప్యః
స్తోతాऽపి తు స్తుతి కృతేన పరిశ్రమేణ।
తత్ర శ్రమస్తు సులభో మమ మందబుద్ధేః
ఇత్యుద్యమోऽయముచితో మమ చాప్జనేత్ర॥

నిన్ను స్తుతించగల సామర్థ్యము నాకు కలదని, ఆ కారణముగా నీ కృపా వర్షానికి నేను అర్హుడను కాను; కానీ నిన్ను స్తుతించి అలసినందుకు నీ కృపా వర్షానికి అర్హుడను; ఈ స్థితిలో, అల్పజ్ఞానిని కాబట్టి త్వరగా అలసిపోతాను; కావున, ఈ ప్రయత్నము నాకు సరైనది (బ్రహ్మ మొదలైనవారితో పోలిస్తే).

శ్లోకము 10 –   భగవానుని స్తుతించుటను మొదట విరమించుకొని ఆ తరువాత ఒప్పుకున్న ఆళవందార్లు, భగవానుని పరత్వమే తనకి ఆశ్రయమని తరువాతి ఐదు శ్లోకాలలో వివరిస్తున్నారు. ఇందులోని మొదటి శ్లోకములో, కృపతో ఆళవందార్లు కారణవాక్యాలతో (భగవానుడే మూలమని ఘోషించే శాస్త్రములోని కొన్ని గద్యములు) భగవత్ ఆధిపత్య గుణ వివరణను అందిస్తున్నారు.

నావేక్షసే యది తతో భువనాన్యమూని
నాలం ప్రభో భవితుమేవ కుతః ప్రవృత్తిః।
ఏవం నిసర్గ సుహృది త్వయి సర్వజంతోః
స్వామిన్ న చిత్రమిదం ఆశ్రిత వత్సలత్వం॥

ఓ భగవంతుడా! ప్రళయము తరువాత నీవు కరుణతో నీ కృపాదృష్టిని వెదజల్లకపోయి ఉంటే, ఈ సృష్టి ఉండేది కాదు; ఓ భగవాన్! ఈ విధముగా, నీవు సమస్త జీవులకు దాతవైనప్పుడు, ప్రత్యేకించి నీ భక్తుల పట్ల మాతృవాత్సల్యం చూపటంలో అతిశయోక్తి లేదు.

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2020/10/sthothra-rathnam-slokams-1-10-simple/

ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి : http://divyaprabandham.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment