శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
పాశురము 36
ముప్పదారవ పాశురము. ఆళ్వార్ల ఔన్నత్యము వారి రచనల ప్రాశస్త్యమును మన పూర్వాచార్యులు కాక వేరెవరు తెలుసుకొనగలరని తన మనస్సునకు మామునులు చెప్పు విధముగా మనకు కృపచేయుచున్నారు.
తెరుళుత్త ఆళ్వార్ గళ్ శీర్మై యఱివారార్।
అరుళిచ్చెయలై అఱివారార్ * అరుళ్ పెత్త
నాదముని ముదలాన నమ్ దేశికరై యల్లాల్।
పేదై మనమే ఉణ్డో పేశు!!
ఓ అజ్ఞాని మనసా! పరిశుద్ధ జ్ఞాన వంతులైన ఆళ్వార్ల ఔన్నత్యము తెలుసుకొనగలిగిన వారెవరు? వారిచే కృప చేయబడిన ప్రబంధముల వైశిష్ట్యమును తెలుసుకొనగలిగిన వారెవరు? ఆళ్వార్ల యొక్క మరీ ముఖ్యముగా నమ్మాళ్వార్ల అనుగ్రహమును పొందిన శ్రీమన్నాధమునులు మొదలు మన ఆచార్యుల వరకు కాక వేరెవరు? నీవే ఆలోచించి చూడు. ఆళ్వార్ల వైభవమును బాగుగా తెలుసుకున్నవారు మన అచార్యులే! ఎవరైనా ఏదైనా గొప్ప విషయమును బాగుగా తెలుసుకున్నారనుకుంటే అదే విధముగా వారు నడుచుకుంటారు. మన పూర్వాచార్యులు మాత్రమే ఆళ్వార్లు మఱియు వారి కృతుల గురించి పరిపూర్ణ జ్ఞానమును కలిగినవారు. వారు ఆళ్వార్ల రచనలకు పరమ కృపతో చేసిన వ్యాఖ్యానములు చేయుట ద్వారా మరియు వారు చూపిన మార్గము నుంచి ఏ మాత్రము ప్రక్కకు జరగకుండా అచరణలో పెట్టుట ద్వారా మనము వారిని అర్థము చేసుకొనవచ్చును.
పాశురము 37
ముప్పదేడవ పాశురము. శ్రీమన్నాధమునుల నుండి మొదలుకొని ఆచార్యులచే ఆదరింపబడిన ప్రపత్తి (శరణాగతి) మార్గము క్రమముగా వచ్చినది మఱియు దానినే ఎంబెరుమానార్ వారి యొక్క నిర్హేతుక కృపవలన మార్చి అందరికి అందించినారు.
ఓరాణ్ వళియాయ్ ఉపదేశిత్తార్ మున్నోర్।
ఏరార్ ఎతిరాశర్ ఇన్నరుళాల్ * పారులగిల్
ఆశై యుడై యోర్కెల్లామ్ ఆరియర్గాళ్ కూఱుమెన్ఱు *
పేశి వరంబఱుత్తార్ పిన్!!
ఎంబెరుమానారునకు పూర్వమున్న ఆచార్యులు కొంత మంది యోగ్యులుగా భావించిన ప్రియ శిష్యులకు మాత్రమే ఈ యొక్క ప్రపత్తినిష్ఠను అర్థముతో సహా ఉపదేశిస్తూ వచ్చినారు. వారు విషయము యొక్క ఔన్నత్యమును చూసి దాచి పెట్టినారు. ఎతిరాజులనే ప్రశస్తి కలిగిన ఎంబెరుమానార్ అత్యంత కరుణతో ఈ లోకములోనున్న అందరి దుఃఖమును చూసి సహించలేక పరమ ఔదార్యముతో , తమచే నియమింపబడ్డ ఉన్నతమైన ఆచార్యులు కూరత్తాళ్వాన్, మొదలియాండాన్ మొదలగు వారిని తీసుకొని “ఈ లోకములో ఎవకైనా ఎంబెరుమాన్/పరమాత్మను పొందాలని ఆశ ఉన్నదో వారందరికీ నాలాగా కరుణతో ఉపదేశము చేయండి” అని ఆజ్ఞాపించి, అంతకు ముందున్న పద్దతులను/నియమములను మార్చినారు.
అడియేన్ వీ.వీ.ఎల్.ఎన్. ఆచార్యులు రామానుజ దాసన్
మూలము : https://divyaprabandham.koyil.org/index.php/2020/06/upadhesa-raththina-malai-36-37-simple/
ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి : https://divyaprabandham.koyil.org
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org