శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:
శ్లోకం 4
పార్శ్వతః పాణిపద్మాభ్యాం పరిగృహ్య భవత్ప్రియై!
విన్యస్యంతం శనైరంగ్రీ మృదులౌ మేధినీతలే!!
ప్రతి పదార్థము:
పార్శ్వతః = రెండువైపులా
భవత్ = తమరి
ప్రియై = ప్రీతి పాత్రులైన కొయిల్ అణ్ణన్ గారిని, వారి తమ్ములను
పాణిపద్మాభ్యాం = తామర పూల వంటి చేతులతో
పరిగృహ్య = బాగుగా పట్టుకొని
మృదులౌ = మృధువుగా
అంగ్రీ = పాదములను
మేధినీతలే = భూమి మీద
శనైః = మెల్ల మెల్లగా
విన్యస్యంతం = ఉంచి నడచు…..
భావము:
ఎరుంబియప్పా మామునులు తమ వద్దకు వచ్చు సౌందర్యమును ఈ శ్లోకములో వర్ణిస్తున్నారు. దీని వలన ఆచార్యులే శేషి అనే భావము, వారే ఉపాయమనే ధృఢ విశ్వాసము,ఆ ఉపాయము వలన లభించిన ఆచార్య కైంకర్యము ,ఈ మూడింటీకీ తగిన అనుష్ఠానము ఉండుట వలన కొయిల్ అణ్ణనైన వరదనారాయణ గురువు,ఆయన తమ్ముడైన శ్రీనివాస గురువు మామునుల కృపకు పాత్రులైనారు. అందము చేత, పవిత్రత చేత మామునుల కన్నులు తామరలను పోలి వున్నాయి. పరిగృహ్య…మనసులో నిండిన ప్రేమతో మామునులు వారి చేతులను బాగుగా పట్టుకున్నారని భావము. అనగా తాను పెద్ద అనీ ,వారు చిన్న అనీ భేదభావము లేని సౌశీల్యము ప్రకటితమవుతున్నది.
రెండు చేతులతో శిష్యులను పట్టుకోవటము చేత త్రిదండమును పట్టుకోలేరు కదా! సన్యాసులు సర్వకాల సర్వావస్థలలో త్రిదండమును పట్టుకోవాలని శ్రీ పాంచరాత్ర తత్వసార సమహితలో ఈ విధముగా చెప్పబడింది. ‘ త్రిదండమని పేరుపడ్డ విష్ణు రూపమును యతులు ఎప్పుడూ ధరించాలి. శ్రీ విష్ణు సమహితలో ‘ యఙ్ఞోపవీతం,త్రిదండం,కమండలు జలపవిత్రం ,కౌపీనం…మొల త్రాడు ఆజీవనము ధరించాలని చెప్పబడింది.కాని ఙ్ఞాన పరిపుష్ఠి గల సన్యాసుల విషయములో ఎదో ఒక సందర్భములో చేతిలో త్రిదండము లేకపోవుట దోషము కాదు. ‘ ధ్యానము,మంచి ప్రవర్తన,ఙ్ఞానము మొదలైనవి ఎవరికై తే పూర్ణముగా గలదో వారికి త్రిదండాదుల వలన కలుగు ప్రత్యేక ప్రయోజనము ఏదీలేదు అనే క్రతు వచనము గ్రహించ తగినది.కోవెలకు వెళ్ళినప్పుడు పరమాత్మకు సాష్ఠాంగ దండములు సమర్పించు సమయములో ‘ దండవత్ ప్రణామం ‘ శరీరము మొత్తము నేలను తాకుట వలన ,చేత త్రిదండమును ధరించి సాష్ఠాంగ పడుట కష్ఠము. అందు చేత కోవెలకు వెళ్ళు సమయములో త్రిదండము చేత ధరించకున్న దోషమేమీ లేదు. నమస్కరించునపుడు చేతిలో ఏ వస్తువును పట్టుకొని నమస్కరించ రాదు అన్న నియమమున్నందున త్రిదండమును పట్టుకొని నమస్కరించుట సాధ్యము కాదు. అందు వలన సన్యాసులు సర్వకాల సర్వాస్థలలో త్రిదండమును ధరించాలన్న నియమము కోవెలెకు వెళ్ళు సమయము తప్ప మిగిలిన కాలములో ఆచరించ దగినది.
(మేధినీతలే అంగ్రీ విన్యస్యంతం )మేధినీతలే అనగా భూమి మీద అని అర్థము.పరమాత్మ మధుకైటబాదులను సంహరించు సమయములో వారి శరీరము నుండి మేధస్సు భూమిపై పడుట వలన భూమికి మేధినీ అన్న పేరు వచ్చింది. ఆ రోజు వారి మేధస్సు వలన అపవిత్రమైన భూమి ఈ రోజు మామునుల పాదసంబంధము చేత పవిత్రమైనది అని అంటున్నారు. నాదనై నరసింగనై నవిర్దేత్తు వార్గళిన్ ఉళక్కియ పాద దూళి పడుదలల్ ఇవ్వులగం భాగ్గియం శేయ్దదే ‘(పెరియళ్వార్ తిరుమొళి 4-46) భగవత్ భక్తుల పాద ధూళి పడుట ఈభువనము చేసిన పుణ్యమే అని పెరియాళ్వార్లు అన్నారు.
అడియేన్ చూడామణి రామానుజ దాసి
Source: https://divyaprabandham.koyil.org/index.php/2015/09/purva-dhinacharya-tamil-4/
archived in https://divyaprabandham.koyil.org
pramEyam (goal) – https://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
SrIvaishNava education/kids portal – http://pillai.koyil.org