నాచ్చియార్ తిరుమొళి – సరళ వ్యాఖ్యానము – మొదటి తిరుమొళి – తైయొరు తింగ

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

నాచ్చియార్ తిరుమొళి

<< తనియన్లు

తిరుప్పావైలో ఆండాళ్ ఎంబెరుమానుని ఉపాయముగా భావించింది. ఎలాంటి స్వార్థం లేకుండా [మన ఆనందం కోసం కాకుండా అతడి ప్రీతి కోసము చేసే సేవ] ఆ భగవానుడికి కైంకర్యం చేయడం వలన, అతడిని పొందుటయే ఫలము, మనకి ఈ ఆలోచన ఉంటే ఎంబెరుమానుడు తప్పక ఫలాన్ని ఇస్తాడు. అని ఆమె వెల్లడించింది.  అయితే, ఆండాళ్ విషయంలో, ఎంబెరుమానుడు ఆమె కోరికను మన్నించి ఆమెను చేపట్టడానికి రాలేదు. భగవానుడిపై ఆమెకున్న అంతులేని ప్రేమ కారణంగా అతడు ఆమెను స్వీకరించేందుకు ఇంకా రాకపోయేసరికి, ఆమె కలతచేందింది. సీతా పిరాట్టి మరియు అందరు అయోధ్యవాసులు, శ్రీరాముడు తప్పా మరే ఇతర దేవతలను ఉపాసించక పోయినా, శ్రీరామ క్షేమం కోసం సమస్థ దేవతలను ప్రార్థించారు.  శ్రీరాముడిని తాను ఏ ఇతర రూపంలోనూ పూజించను అన్న హనుమంతుడు కూడా వాచస్పతి దేవుడికి శ్రీరామ క్షేమం కోసం ప్రార్థించాడు. అదే విధంగా, తనని ఎంబెరుమానుని వద్దకు చేర్చమని ఇక్కడ ఆండాళ్ కామదేవుడిని (మన్మథుడు) ప్రార్థిస్తుంది. భగవత్ భక్తి నుండి వెలువడే అజ్ఞానం చాలా గొప్పదని మన పూర్వాచార్యులు తెలిపారు. ఎమ్పెరుమానుడికి పెరియాళ్వార్లు పుష్పమాలలు సమర్పించినట్లే, ఆండాళ్ ఆమెను ఎంపెరుమానుడితో కలపమని వన (అడవి) పుష్పాలను కామదేవుడిని సమర్పించింది. ఆండాళ్ ఇలా చేసినప్పటికీ, ఎమ్పెరుమానుడి నుండి ఆమె పడుతున్న విరహ వేదనకి అది సరే అవుటున్డి. కానీ మనం ఇతర దేవతలను ఆరాధిస్తే, అది మన స్వరూపానికి సరిపోదు.

మొదటి పాశురము: ఇందులో కాముడు, అతని సోదరుడు సాముడిని పూజించే విధిని ఆమె వివరిస్తుంది.

తైయొరు తింగళుం తరై విళక్కి త్తణ్ మండలమిట్టు మాశి మున్నాళ్
ఐయ నుణ్మణల్ కొండు తెరు అణిందు అళగినుక్కు అలంగరిత్తు అనంగ దేవా!
ఉయ్యవుమాంగొలో ఎన్ఱు శొల్లి ఉన్నైయుం ఉమ్బియైయుం తొళుదేన్
వెయ్యదోర్ తళల్ ఉమిళ్ చక్కరక్కై వేంగడవఱ్కు ఎన్నై విదిక్కిఱ్ఱియే

పుష్యమి మాసము (తమిళంలో తై మాసము) అంతా, ఆతడు వచ్చే ప్రాంతాన్ని నేను తుడిచి శుభ్రం చేశాను. మండపాన్ని తయారు చేసాను (మండల పూజను నిర్వహించడం కోసం). మాఘమాసములో (తమిళంలో మాసి మాసము)  మొదటి పదిహేను రోజులు, వీధి గుండా ఆతడు నడుస్తాడని చక్కటి సన్నని ఇసుకతో (ఇది అతని మృదువైన పాదాలను గాయపరచ కూడదని) ఆ వీధిని నేను అలంకరించాను. అతనిని చూసి నేను “ఓ మన్మధా! నీవు నా కోరికను నెరవేరుస్తావా?” నేను నిన్ను మరియు నీ సోదరుడు అయిన సాముడిని ఆరాధించాను. తన దివ్య హస్తములో దివ్య చక్రాన్ని ధరించిన తిరువేంకటనాథుడికి నీవు నన్ను దాసిగా చేయాలి.

రెండవ పాశురము: ఆమె తన నోము యొక్క విది గురించి మరింత వివరిస్తూ తనను ఎంపెరుమానుడి వద్దకి చేర్చమని కోరుతుంది.

వెళ్ళై నుమ్మణల్ కొండు తెరువణిందు వెళ్వరైప్పదన్ మున్నం తుఱై పడిందు
ముళ్ళుమిల్లా చ్చుళ్ళి ఎరి మడుత్తు ముయన్ఱు ఉన్నై నోఱ్కిన్ఱేన్ కామదేవా!
కళ్ళవిళ్ పూంగణై తొడుత్తుక్కొండు కడల్వణ్ణన్ ఎన్బదోర్ పేర్ ఎళుది
పుళ్ళినై వాయ్ పిళందాన్ ఎన్బదోర్ ఇలక్కినిల్ పుగ ఎన్నై ఎయ్గిఱ్ఱియే

ఓ మన్మధా! నీవు వచ్చే వీధులని అందమైన రంగవల్లులతో అలంకరించెదను. వేకువనే నిద్ర లేచి నది స్నానము చేసి, ముళ్ళు లేని ఇందనముతో యాజ్ఞ్నము చేసి నీ కొరకు నొముని ఆచరించెదను. నీవు నీల వర్ణుడైన ఆ ఎంపెరుమానుడి వైపు తేనెలు కారే పుష్పపు ప్రేమ బాణాలను గురిపెట్టి ఆతడు నన్ను కౌగిలించుకునేలా చేయాలి.

మూడవ పాశురము: అతడిని [మన్మధుడు] ​​నేను ఇలా వెదించకూడదనుకుంటే, తనని ఆ తిరువేంకటనాథుని వద్దకి చేర్చమని ఆమె ప్రార్థిస్తుంది.

మత్త నన్నఱుమలర్ మురుక్క మలర్ కొండు ముప్పోదుం ఉన్నడి వణంగి
తత్తువమిలి ఎన్ఱు నెంజెరిందు వాశగత్తళిత్తు ఉన్నై వైదిడామే
కొత్తలర్ పూంగణై తొడుత్తుక్కొండు గోవిందన్ ఎన్బదోర్ పేర్ ఎళుది
విత్తగన్ వేంగడవాణన్ ఎన్నుం విళక్కినిల్ పుగ ఎన్నై విదిక్కిఱ్ఱియే

పలాశ పుష్పాలను తీసుకొని రోజుకి మూడు సార్లు నీ పాదాల యందు సమర్పించెదను (నా కోరిక తీరుస్తావని). దీని తర్వాత కూడా, నీవు నా కోరికను నెరవేర్చకపోతే, నా మనస్సు రగిలి ఊరంతా చుట్టి నీ యొక్క ప్రతిష్థ భంగమైయ్యేలా “మన్మధుడు మన కోరికలు నెరవేర్చే దేవుడుకాడు” అని నీ గురించి దుష్ప్రచారము చేసెదను. అలా నేను చేయకుండా ఉండాలంటే, అప్పుడే వికసించిన పుష్పపు బాణాలను గురిపెట్టి, నా హృదయంలో ‘గోవింద’ అని పేరుని వ్రాసి, దివ్య తేజోమయుడైన ఆ తిరువేంకటనాథుడిని నేను చేరుకోగలిగేలా నీవు చేయాలి.

నాలుగవ పాశురము: ఈ పాశురములో, ఆమె తన విరహవేదనని వెల్లడి చేస్తుంది.

శువరిల్ పురాణ! నిన్ పేర్ ఎళుది చ్చుఱవ నఱ్కొడిక్కళుం తురంగంగళుం
కవరి ప్పిణాక్కళుం కరుప్పు విల్లుం కాట్టిత్తందేన్ కండాయ్ కామదేవా!
అవరై ప్పిరాయం తొడంగి ఎన్ఱుం ఆదరైత్తు ఎళుంద ఎన్ తడములైగళ్
తువరై ప్పిరానుక్కే శంగఱ్పిత్తు త్తొళుదు వైత్తేన్ ఒల్లై విదిక్కిఱ్ఱియే

ఎంతో కాలంగా ఉన్న ఓ మన్మధా! నేను నీ పేర్లను గోడలపై వ్రాసాను,  మీకు సొర్రమీనములు చిత్రించిన ధ్వజాలను సమర్పించాను (మన్మధుని ధ్వజముపైన చేప ఉంటుంది), అశ్వాలు,  చెరకుతో చేసిన విల్లుని [ఇది కూడా మన్మధునికి గుర్తింపు] సమర్పించాను. ద్వారకకి అధిపతి అయిన శ్రీ కృష్ణుడిని నా స్థనములు ఎదుగుతున్న తొలిరోజుల నుండి ఆరాధిస్తున్నాను. నీవు నన్ను త్వరగా అతడిని చేరుకునేలా చేయాలి.

ఐదవ పాశురము: ఎంబెరుమానునితో కాకుండా మరెవరితోనైనా సమైక్యమైయ్యే పరిస్థితి వస్తే తాను జీవించనని ఆమె తెలుపుతుంది.

వానిడై వాళుం అవ్వావనర్ క్కు మఱైయవర్ వేళ్వియిల్ వగుత్త అవి
కానిడై త్తిరివదోర్ నరి పుగుందు కడప్పదుం మోప్పదుం శెయ్వదొప్ప
ఊనిడై ఆళి శంగు ఉత్తమర్ క్కెన్ఱు ఉన్నిత్తు ఎళుంద ఎన్ తడ ములైగళ్
మానిడవర్ క్కు ఎన్ఱు పేచ్చుప్పడిల్ వాళగిల్లేన్ కండాయ్ మన్మదనే

ఓ మన్మధా! యజ్ఞ యాగముల సమయంలో ఆయా దేవతలకు హవిస్సు (నెయ్యి, పాలు, పెరుగు మొదలైన వాటిని సమర్పించడం) అర్పించేందుకు తయారుచేస్తారు. కానీ అటునుంచి అడవిలో విహరిస్తున్న ఒక నక్క వాసన చూసినా ఆ నైవేద్యం వృధా అవుతుంది. అదేవిధంగా, శంఖ చక్రములను తన దివ్య హస్థాలలో ధరించిన ఆ మహా పురుషుడు ఎంపెరుమానుడి కోసమే ఎదిగిన నా స్థనములు ఉన్నది. మరో మనిషి కోసమన్న మాటే తలెత్తదు, నేను జీవించలేను.

ఆరవ పాశురము:  భగవానుడిని ఆస్వాదించి అనుభవించాలనే దారిలో ముందుకు సాగుతూ సత్వ గుణం ఉన్న వారితో మనము చేరినట్లే, ఆండాళ్ భగవానుడిని పొందాలనే మహాకోరికతో,  కామశాస్త్రములో  నిపుణులైన వారితో చేర్చమని మన్మధుడిని ప్రార్థిస్తుంది.

ఉరువిడైయార్ ఇళైయార్గల్ నల్లార్ ఓత్తు వల్లార్గళై క్కొండు వైగల్
తెరువిడై ఎదిర్కొండు పంగుని నాల్ తిరుణ్దవే నోఱ్కిన్ఱేన్ కామదేవా!
కరువుడై ముగిల్వణ్ణన్ కాయావణ్ణన్ కరువిలై పోల్ వణ్ణన్ కమల వణ్ణ
త్తిరువుడై ముగత్తినిల్ తిరుక్కంగళాల్ తిరుందవే నోక్కెనక్కు అరుళ్ కండాయ్

ఓ మన్మధా! కామ శాస్త్రములో నిపుణులై  అందమైన స్వరూపము, యవ్వనము, మంచి నడవడి ఉన్న వారిని వేడుకుంటూ, నీవు ఉన్న వీధిలోకి ప్రవేశించి, స్వచ్ఛమైన మనస్సుతో నీ పంగుని ఉత్సవములో నిన్ను ఆరాధించాను. నీల మేఘ వర్ణుడు, కాయా పుష్పపు నీల వర్ణము కలిగిన భగవానుడి దివ్య శ్రీముఖాన ఉన్న కమల నేత్రములను నాకు ప్రసాదించాలని నీవు నన్ను ఆశీర్వదించుము.

ఏడవ పాశురము: ఈ పాశురములో, త్రివిక్రమ భగవానుడిని తన దివ్య హస్తములతో  ఆమెను తాకమని అభ్యర్థిస్తుంది. ఆమె భక్తి కేవలం ఎంపెరుమానుడి కోసం మాత్రమే అని ఆమె నొక్కి వివరిస్తుంది.

కాయుడై నెల్లొడు కరుంబమైత్తు క్కట్టి అరిశి అవల్ అమైత్తు
వాయుడై మఱైయవర్ మందిరత్తాల్ మన్మదనే ఉన్నై వణంగుగిన్ఱేన్
తేశ మున్నళందవన్ తిరివిక్కిరమన్ తిరుక్కైగళాల్ ఎన్నై త్తీణ్డుం వణ్ణం
శాయుడై వయిఱుం ఎన్ తడములైయుం తరణియిల్ తలైప్పుగళ్ తరక్కిఱ్ఱియే

ఓ మన్మధా! కామశాస్త్ర నైపుణ్యం ఉన్నవారితో, మంచి గాన ప్రావిణ్యం కలిగిన వారి మంత్రాలతో, చెరకు, బెల్లముతో పాటు అటుకులను నీకు నైవేధ్యముగా చేసి ఆరాధిస్తాను. ముల్లోకాలను తన దివ్య పాదములతో కొలిచిన ఎంపెరుమానుడు  నా అందమైన ఉదరముని మరియు నా మృదువైన స్థనములను తాకి నేను ఈ ప్రపంచంలో ప్రసిద్ది పొందేలా నీవు చేయాలి.

ఎనిమిదవ పాశురము: ఈ పాశురములో, ఆమె తన స్వరూపానికి సరితూగే ఎంపెరుమానుడి దివ్య పాదసేవని తనకి అనుగ్రహించమని మన్మదుడిని కోరుతోంది.

మాశుడై ఉడంబొడు తలై ఉలఱి వాయ్ ప్పురం వెళుత్తొరు పోదుముండు
తేశుడై త్తిఱలుడై క్కామదేవా! నోఱ్కిన్ఱ  నోన్బినై క్కుఱిక్కొళ్ కండాయ్
పేశువదు ఉండు ఒన్ఱు ఇంగు ఎంపెరుమాన్! పెణ్మైయై త్తలైయుడైత్తు ఆక్కుం వణ్ణం
కేశవ నంబియై క్కాల్ పిడిప్పాల్ ఎన్నుం ఇప్పేఱు ఎనక్కరుళ్ కండాయ్

ఓ మన్మధా! తేజస్సు మరియు బలము కలిగి ఉన్న నా స్వామీ! నేను ఈ నోముని స్నానం చేయని ఈ శరీరంతో (దుఃఖము కారణంగా), చెదిరి వియబోసిన జుట్టుతో, పాలిపోయిన పెదాలతో చేస్తున్నానని, రోజుకి ఒక్కసారి మాత్రమే తింటున్నానని నీవు గుర్తుంచుకోవాలి. నేను ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి. కేశి అనే రాక్షసుడిని వధించిన దివ్య మంగళ గుణ పూరితుడైన ఎంపెరుమానుడి దివ్య పాదాలను సేవించిన ఫలము నాకు దక్కేలా నీవు చూడుము.

తొమ్మిదవ పాశురము: ఈ పాశురములో, ఆండాళ్ తనకి సహాయపడకపోతే అతడికి కలిగే అనర్థాలను వివరిస్తుంది.

తొళుదు ముప్పోదుం ఉన్నడి వణంగి త్తూమలర్ తూయ్ త్తొళుదు ఏత్తుగిన్ఱేన్
పళుందు ఇన్ఱి పార్ క్కడల్ వణ్ణనుక్కే పణి శెయ్దు వాళ ప్పెఱావిడిల్ నాన్
అళుదళుదు అలమందు అమ్మా వళంగ ఆఱ్ఱవుం అదు ఉనక్కు ఉఱైక్కుం కండాయ్
ఉళువదోర్ ఎరుత్తినై నుగంగొడు పాయ్ందు ఊట్టమిన్ఱి త్తురందాల్ ఒక్కుమే

నీ ఎదుట రోజుకు మూడు సార్లు నా శిరస్సు వంచి, స్వచ్ఛమైన పూలను నీ పాదాలకు సమర్పిస్తూ మంత్రాలతో నిన్ను ఆరాధిస్తున్నాను. ప్రపంచాన్ని చుట్టుముట్టిన సముద్ర రూపాన్ని కలిగి ఉన్నవాడిని నేను సేవించకపోతే, నేను  పదేపదే ఏడుస్తూ, మతి భ్రమించి అస్థిరంగా తిరుగుతూ,  “అమ్మా!” అని గోలపెట్టేస్తాను. ఈ దుస్థితి ఫలము నీకు చేరుతుంది.  రైతు తన ఎద్దుతో పొలాన్ని దున్నించుకొని దానికి తిండి పెట్టకుండా కొట్టి తరిమిన దానికి ఇది సమానమైనదౌతుంది.

పదవ పాశురము: ఈ పాశుర అనుసందానముతో కలిగే ఫలితముని వివరించి ఈ పదిగాన్ని ముగించుచున్నది.

కరుప్పు విల్ మలర్ క్కణై క్కామవేళై క్కళలిణై పణిందు అంగోర్ కరి అలఱ
మరుప్పినై ఒశిత్తు ప్పుళ్వాయ్ పిళంద మణివణ్ణఱ్కు ఎన్నై వగుత్తిడెన్ఱు
పొరుప్పన్న మాడం పొలిందు తోన్ఱుం పుదువైయర్ కోన్ విట్టుచిత్తన్ కోదై
విరుప్పుడై ఇంతమిళ్ మాలై వల్లార్ విణ్ణవర్ కోన్ అడి నణ్ణువరే

చెరకుతో చేసిన విల్లు మరియు పూల బాణాలు కలిగిన మన్మధుని పాదాలను నేను ఆరాధించాను. మధురలో బాణాల ఉత్సవ రంగ ద్వారము యందు  కువలయాపీడం అనే ఏనుగు దంతాలను విరిచి వధించిన వాడు, విశాలమైన సారసపక్షి (కొంగ) రూపములో వచ్చిన బకాసురుడిని చంపినవాడు, నీల మణి వంటి వర్ణము ఉన్న శ్రీ కృష్ణుడిని చేరేలా చేయమని అతడిని కోరాను. నేను పర్వతాలలా కనిపించే భవనాలతో నిండిన శ్రీవిల్లిపుత్తుర్కి నాయకుడైన పెరియాళ్వార్ల కుమార్తె కోదైని. ఈ పది మధురమైన తమిళ పాశురాలను కోరికతో పాడేవారు, నిత్యసూరుల నాయకుడైన శ్రీమాన్నారాయణ యొక్క దివ్య పాదాలను పొందుతారు.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2020/05/nachchiyar-thirumozhi-1-simple/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *