సప్తగాథై – అవతారిక (పరిచయం) – 2 భాగము

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః

సప్తగాథై

<< మునుపు భాగము

వకుళాభరణులైన శ్రీనమ్మాళ్వార్ల దివ్యప్రబంధం అయిన తిరువాయ్మొళికి సారమైనది, అతి రహస్యమైనది, అతి విస్తృతమైనది అయిన శ్రీవచనభూషణ దివ్య శాస్త్రం యొక్క అర్థవిశేషాలు అన్నీ కూడా, శ్రీవిళాఞ్జలై ప్పిళ్ళై గారు, తమకు కలిగిన అపారమైన దయతో, ఒక చిన్న సంగ్రహమైన గ్రంథంగా, అందరికీ కూడా అతి సులభంగా, అవగతం అయ్యేట్టుగా అనుగ్రహించ సంకల్పం చేసేరు. ఏ విధంగా అయితే చరమశ్లోకం అన్నది శ్రీమద్ భగవద్గీత సారాంశాన్ని చెబుతుందో, అలాగ శ్రీవచనభూషణ గ్రంథమందు గల ఆఖరి ప్రకరణం, ప్రమాణ (శాస్త్రం), ప్రమేయ (భగవంతుడు), ప్రమాతృ (ఆచార్యులు) వైలక్షణ్యాన్ని, గ్రంథ సారంగా చెబుతుంది. అందువలన అందులో ఉన్న అర్థ విశేషాలు విస్తృతంగా కాకుండా ఏడు పాశురాలలో సప్తగాథై అనే ప్రబంధాన్ని “వాళి అవన్ అముదవాయ్మొళి కళ్” (శ్రీవిళాఞ్జోలై ప్పిళ్ళై గారు పలికిన అమృతం వంటి శ్రీసూక్తులు వర్ధిల్లాలి) అనే రీతిలో అందరికీ భోగ్యముగా ఉండేట్టుగా అనుగ్రహించేరు శ్రీవిళాఞ్జోలై ప్పిళ్ళై స్వామివారు.

ఏ క్రమంలో అనుగ్రహించేరండి?? అని అడిగితే దానికి సమాధానముగా చెబుతున్నారు

శ్రీవచనభూషణ దివ్యశాస్త్రమందు మొదటి ప్రకరణం అయిన పురుషకార వైభవంలో ఉన్న మొదటి సూత్రము “వేదార్థం అఱుతి యిడువతు” (వేదార్ధాన్ని విశదీకరించడం) అంటూ ప్రారంభం చేసి 22వ  సూత్రం వరకు “ప్రపత్త్యుపదేశం పణ్ణిత్తమ్ ఇవళుక్కాక” (అర్జునుడు దౌత్యము చేసి సారథ్యము చేసి చివరకు “సర్వధర్మాన్ పరిత్యజ్య” అని ఉపదేశించుట ద్రౌపది కొఱకే) అనే పురుషకారప్రకరణం (పిరాట్టి యొక్క సిఫార్సు) వరకు ఉన్న అర్ధవిశేషాలు అన్నింటినీ, “అహంతా బ్రహ్మణస్తస్య” (నేను ఆ పరబ్రహ్మ యొక్క అహమర్ధాన్ని) అని లక్ష్మీతంత్రంలో చెప్పిన విధంవలె, సప్తగాథై మొదట పాశురంలో “అమ్బొన్ అరంగర్ క్కుమ్” (అందమైన, పావనమైన శ్రీరంగాన్ని నివాసంగా కల్గిన శ్రీరంగనాథునకు) వివరించారు.

శ్రీవచనభూషణ గ్రంథమందు ఉన్న ఉపాయప్రకరణంలో చెప్పబడిన విశేష అర్ధాలును 23వ సూత్రం “ప్రపత్తిక్కు” (ప్రపత్తికి) అంటూ ప్రారంభం చేసి 79వ సూత్రం “ఏకాన్తీ వ్యపదేష్టవ్యః” (భగవద్ పరతంత్రుడగు వాడు ఎన్నడును గ్రామము పేరుతోకానీ కులము పేరుతోకానీ చెప్పుకొనరాదు భగవద్దాసులమనే చెప్పుకొనవలెను అన్న అర్థవిశేషాలను మొదటి పాశురమందు ఉన్న రెండవ భాగంలో “ఉమ్బర్ దివమెన్నుమ్ వాళ్ ఉక్కు చేర్ న్ద నెఱి” అన్న వాక్యాలలో వివరించారు.

శ్రీవచనభూషణ గ్రంథమందు ఉన్న అధికారినిష్ఠప్రకరణంలో 80వ సూత్రం “ఉపాయత్తుక్కు” అంటూ ప్రారంభించి, 307వ సూత్రం “ఉపేయ విరోధికళుమాయ్ ఇరుక్కుమ్” అన్న సూత్రం వరకు ఉన్న అర్థవిశేషాలను సప్తగాథై ప్రబంధములో రెండవ పాశురం “అఞ్ఙు పొరుళు మళిత్త”, మరియు మూడవ పాశురం “పార్ త్త గురువిన్ అళవిల్”, మరియు నాల్గవ పాశురం “తన్నై యిఱైయై” అన్న పాశురాలలో విశదీకరించారు.

శ్రీవచనభూషణ గ్రంథమందు ఉన్న ఆచార్య అనువర్తనం ప్రకరణంలో ఉన్న 308వ సూత్రం “తాన్ హితోపదేశమ్” (ఒకరికి ఉపదేశం చేయునప్పుడు ఉండవలసిన విధానం) నుండి 365వ సూత్రం “ఉగప్పుమ్ ఉపకార స్మృతియుమ్ నడక్క వేణుమ్” (ఉపకారస్మృతి కలిగి ఉండవలెను) ఈ సూత్రములలో ఉన్న అర్థ విశేషాలను “ఎన్బక్కల్ ఓదినార్” అన్న ఐదవ పాశురములో వర్ణించారు.

అలాగే శ్రీవచనభూషణ గ్రంథమందు ఉన్న భగవంతుని నిర్హేతుక కృపాప్రభావ ప్రకరణంలో 366వ సూత్రం “స్వదోషానుసంథానమ్ భయహేతు” అన్న సూత్రము నుంచి 406వ సూత్రము “నివర్తకజ్ఞానమభయహేతు” అన్న సూత్రం వరకు ఉన్న అర్ధవిశేషాలను “అళుక్కెన్ఱివై యఱిన్దేన్” అన్న ఆరవ పాశురము అనుగ్రహించారు.

అలాగే శ్రీవచనభూషణ గ్రంథానికి ముఖ్యమైన ప్రకరణం చరమ ప్రకరణం ఆచార్య వైభవాన్ని తెలిపే ప్రకరణం లోని 407వ సూత్రం “స్వతంత్రనై తానుపాయమాక పత్తిన పోదిఱే ఇప్ప్రసంగమ్ తాన్ఉళ్ళతు” నుండి 463వ సూత్రం “అనంతరమ్ ఫల పర్యంత మాయిరుక్కుమ్” వరకు ఉన్న అర్ధ విశేషాలను “తీఙ్గేదు మిల్లా” అన్న ఏడవ పాశురంలో అనుగ్రహించెను.

ఈ విధముగా శ్రీవిళాఞ్జోలైప్పిళ్ళై గారు వారి దయతో సంగ్రహముగా పరమరహస్యమైన గ్రంథాన్ని అందజేసేరు. ఈ గ్రంథం శ్రీవచనభూషణానికి సంగ్రహం అని అనడంలో అతిశయోక్తి లేదు. ఏ విధముగా అయితే నమ్మాళ్వార్లు దయతో తిరువాశిరియ ప్రబంధంలో ప్రథమపర్వము (భక్తికి మొదటి మెట్టు) “శెక్కర్ మాముకిల్” తో ఆరంభించి ఏడు పాశురాల ద్వారా ప్రకాశింప చేసేరో, శ్రీవిళాఞ్జోలైప్పిళ్ళై గారు కూడా “అమ్ పొన్ అరఙ్గర్ క్కుమ్” అంటూ ప్రారంభం చేసి, చరమ పర్వాన్ని ప్రకాశింపచేసేరు. అయితే నమ్మాళ్వార్ల గ్రంథం కన్నా సప్తగాథై ప్రబంధానికి చాల వైలక్షణ్యం ఉన్నదంటున్నారు.

ఏమిటా వైలక్షణ్యం అంటే చెబుతున్నారు

తిరువాశిరియ ప్రబంధం ఆశిరియప్ప (పాదప్రాసాది నియమం లేని) ఒక ఛందస్సులో కూర్చబడినది. అంటే పాశురములో ఎన్ని వాక్యాలు ఉన్నాయి అన్న లెక్క ఈ ఛందస్సుకు పెద్దగా అవసరము లేదు. ప్రబంధం అంతా కూడా ప్రధమ పర్వం అయిన పరమాత్మ గురించే చెప్పినది. శ్వేతాశ్వతర ఉపనిషద్ చెప్పినట్టు “సంసార బంధ స్థితి మోక్ష హేతు:” (సంసారానికి, బంధానికి, స్థితికి, మోక్షానికి కారణుడు) మరియు స్కందపురాణం చెప్పినట్టు “సిద్ధిర్భవతి వా నేతి” (భగవన్తుని సేవించిన వారికి సిద్ధి కలుగుతుందా లేదా అని సందేహం కలుగవచ్చును) అని, తిరువాయ్మొళి [3.2.1] లో “అన్నాళ్ నీ తన్ద ఆక్కై” (ఆనాడు నీవు ఇచ్చిన దేహం యొక్క దారిలో అలమటిస్తున్నాను) అని, తిరువాయ్మొళి [10.7.10]

“మఙ్గవొట్టు ఉన్ మామాయై” (నీ మహా మాయ నశింపచేయాలి) అన్నట్టు ఇలా ప్రబంధం అంతా కూడా పరమాత్మ గురించే చెప్పింది.

కానీ సప్తగాథై అలా కాదు. వాక్య నిబంధనలు పాటించేదై “వెణ్బా” అన్న ఛందస్సులో కూర్చబడినది. మరియు చరమపర్వ వైలక్షణాన్ని చెప్పేదిగా అనుగ్రహించబడినది. ఏ విధముగా అనగా ఛాందోగ్యఉపనిషద్ చెప్పినట్టు “తమసః పారం దర్శయతి” (అంధకారం యొక్క సారాన్ని దర్శింపచేస్తున్నాడు)” అని, “ఆచార్యస్తు తే గతిం వక్తా” (ఆచార్యుడు నీ గతిని గూర్చి పలికేవాడు) అని,“న సంశయోస్తి తద్భక్త పరిచర్యార్యతాత్మనామ్” (భగవద్ భక్తుల సేవలో ఆసక్తి కలవారు సిద్ధిని పొందడంలో సందేహము లేదు) అని, మరియు ప్రమేయసారములో “నీదియాల్ వన్దిప్పార్ క్కుణ్డిళియా వాన్”) ఎవరైతే క్రమానుసారం ఆచార్యులను సేవిస్తారో వారికి శ్రీవైకుంఠమే. మళ్ళీ జన్మ పొందే అవకాశము లేదు) అన్నట్టు ప్రమాణాలను చెప్పింది ఈ సప్తగాథై.

ఇంతేకాక ఆనాడు గోదాదేవి నాచ్చియార్ తిరుమొళిలో [10.10] పదిగంలో “విట్టుశిత్తర్ త్తంగళ్ దేవరై వరువిప్పరేల్ అదు కాన్డుమే”, (ఎమ్బెరుమాన్ నే తమకు విధేయులుగా చేసుకున్న శ్రీవిల్లిపుత్తూర్ కు శిఖామణి అయినటువంటి శ్రీవిష్ణుచిత్తులు కనక స్వామిని పిలిస్తే కనులారా సేవిద్దాం) అన్నట్టు చరమ పర్వాన్ని కలిగినది అయినది. ఈ ప్రబంధం వాక్య గురుపరంపర లో ఉండే “శ్రీమతే రామానుజాయ నమః” అన్న నాల్గవ వాక్యానికి సంగ్రహమైనది. మరియు మొదట వాక్యం అయిన “అస్మత్ గురుభ్యోనమః” అన్న సప్తాక్షరిని అర్ధంగా కలిగినది ఈ ప్రబంధము. అనగా అస్మత్ గురుభ్యోనమః లో, “అ” అన్న ప్రధమాక్షరాన్ని “అమ్బొన్ అరంగర్” అన్న మొదటి పాశురములో, “మత్” అన్న ద్వితీయ అక్షరాన్ని “అఞ్ఙు పొరుళు మళిత్తవన్” అన్న ద్వితీయ పాశురములో, “గు” అన్న తృతీయాక్షరాన్ని “పార్ త్త గురు” అన్న మూడవ పాశురములో, “రు” అన్న చతుర్ధ అక్షరాన్ని “ఒరు మందిరత్తిన్” అన్న నాల్గవ పాశురములో, “భ్యో” అన్న పంచమ అక్షరాన్ని “ఎన్బక్కల్ ఓదినార్” అన్న ఐదవ పాశురములో, “న” అన్న అక్షరాన్ని “అమ్బొన్ అరంగా” అని ఆరవ పాశురములో, “మః” అన్న సప్తమ అక్షరాన్ని “శారువరే అన్దామన్దాన్” అన్న ఏడవ పాశురములో వివరించారు.

ఏ విధముగా శ్రీరామాయణం 24000 శ్లోకాలను కలిగినదై గాయత్రీ మంత్రాక్షరాలను అంతర్భవింప చేసుకున్నదో, అదే విధముగా ఈ ప్రబంధము కూడా “అస్మద్ గురుభ్యోనమః” అన్న సప్తాక్షరి మంత్రాన్ని అంతర్భవింపజేసుకున్నది.

శ్రీమధురకవి ఆళ్వార్లు, వడుగనంబి తమ తమ అనుష్ఠానములలో ఏ విధముగా చరమపర్వాన్ని వ్యక్తం చేసేరో, అలా శ్రీవిళాఞ్జోలైప్పిళ్ళై కూడా ఈ ప్రబంధములో చరమపర్వాన్ని విశదం చేసేరు.

అడియేన జ్యోతిర్మయి రామానుజ దాసి

మూలము: https://divyaprabandham.koyil.org/index.php/2022/12/saptha-kadhai-introduction-2/

పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a Comment