ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 21 -22

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

ఉపదేశ రత్తినమాలై

గతాశీర్షిక

పాశురం 21

ఆళ్వార్లు పదిమంది అని కొందరు కాదు పన్నెండుమంది అని కొందరు భావిస్తారు. ఎంపెరుమాన్ పరంగా చూచినచో పదిమంది. వీరవతరించిన మాసము మరియు నక్షత్రములను విపులముగా చెప్పుచున్నారు. ఆండాళ్ మరియు మధురకవి ఆళ్వారు అనే వీరిరువురు ఆచార్య నిష్ఠ కలవారు. ఆండాళ్ “విష్ణుచిత్తలే నా దైవం” అని తన తండ్రిగారైన విష్ణుచిత్తులనే తన దైవంగా భావించింది. మధురకవి ఆళ్వార్లు “దేవమత్తరియేన్” అని నమ్మాళ్వార్ల యందే భక్తి కలిగి ఉండినారు. వారిద్దరిని కలుపుకొనినచో ఆళ్వార్లు పన్నెండుమంది. వీరితో పాటు మన ఆచార్య పరంపరలోని ముఖ్యమైన ఆచార్యులైన “మాఱన్ అడి పణిన్ద ఉయన్దవరాన/నమ్మాళ్వర్ల శ్రీపాదములయందే ఈడుపడిన” ఎంబెరుమానార్/శ్రీరామానుజులను కలుపుకొని ఇక్కడ అనుభవిస్తున్నారు. ఎంబెరుమానార్ (శ్రీరామానుజులను)  నమ్మాళ్వార్ల తిరువడి (శ్రీ పాదములు) గానే భావించి కీర్తింపబడుచున్నారు. ఈ ముగ్గురికీ గల ఇంకొక విశేషమేమనగా – ఆండాళ్ భూదేవి అవతారముగాను, మధురకవి ఆళ్వార్ పెరియతిరువడి (గరడాళ్వార్) అవతారముగాను ఇక ఎంబెరుమానార్ (శ్రీరామానుజులు) ఆదిశేష అవతారముగాను కీర్తింపబడుచున్నారు.

ఆళ్వార్ తిరుమగళార్ ఆండాళ్* మధురకవియాళ్వార్ ఎతిరాశరామివర్ గళ్* వళ్వాగ వన్దుదిత్త మాదజ్ఞ్గళ్ నాళ్ గళ్ దమ్మిన్ వాశియైయుమ్* ఇన్దవులగోర్కు ఉరైప్పోమ్ యామ్!!

పెరియాళ్వార్ల కుమార్తె అయిన ఆండాళ్, మధురకవి ఆళ్వార్ మరియు యతులకే రాజులైన శ్రీరామానుజులు అనే వీరు అవతరించిన మాసములను నక్షత్రముల ప్రాముఖ్యతను ఈ లోకానికి మామునులు తెలుపుచున్నారు.

పాశురం 22

ఇరవైరెండవ పాశురము. ఆండాళ్ నాచ్చియార్ తిరుఅవతారముగావించినది తనకొరకేనని మిక్కిలిగా అనుభవిస్తూ ఈ విధముగా తెలుపుచున్నారు.

ఇన్ఱో తిరువాడిప్పూరమ్ ఎమ్మకాగ వన్ఱొ ఇజ్ఞ్గు ఆణ్డాళ్ అవదరిత్తాళ్* కున్ఱాద వాళ్వావాన వైగున్దవాన్ పోగన్దన్నై ఇగళ్ న్దు! ఆళ్వార్ తిరుమగళారాయ్!!

ఈ రోజు ఆడిమాస పూర్వఫల్గుణీ (పుబ్బ) నక్షత్రం కదా? ఈ రోజుననే భూదేవి, శ్రీవైకుంఠములోని అన్ని భోగ భాగ్యములను వదలి పెరియాళ్వార్లకు తిరుకుమార్తె అయిన ఆండాళ్ నాచ్చియార్ గా, ఒక తల్లి బావిలో జారిపడిన తన బిడ్డ కొఱకు బావిలోకి దూకి రక్షస్తుందో అదేవిధంగా మనలను రక్షించుటకై ఈ లోకంలో అవతరించినది. శ్రీవరాహ పెరుమాళ్ భూమిపిరాట్టికి “నోరారా నన్ను కీర్తించి, మనసారా ధ్యానించి మరియు పవిత్ర పుష్పములతో అర్చించినచో జీవాత్మలు నన్ను చేరుకోగలరని” చెప్పగా దానిని మనకు ఆచరించి చూపుటకు ఈ భూలోకమున అవతరించినది. ఏమి ఆశ్చర్యము! ఏమి కరుణ!

అడియేన్ వీ.వీ.ఎల్.ఎన్. ఆచార్యులు రామానుజ దాసన్

మూలము : https://divyaprabandham.koyil.org/index.php/2020/06/upadhesa-raththina-malai-21-22-simple/

ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి : https://divyaprabandham.koyil.org

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment