శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
అవతారిక:
కిందటి పాశురములో ఆచార్యులు శ్రీమన్నారాయణుని అవతారమని చెప్పారు. జ్ఞానసారంలో “తిరుమామగళ్ కొళునన్ తానె గురువాగి”అని 39 పాశురములో చెప్పిన విషయాన్ని ఇక్కడ గుర్తుచేసుకోవాలి .
అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్లు ఆచార్యుల గొప్పదనాన్ని చెప్పి, వారు చేసే మహోపకారాన్ని తెలియజేస్తూ ఈ పాశురంతో ప్రబంధాన్ని సుసంపన్నం చేశారు.
పాశురము:
ఇఱైయుం ఉయిరుం ఇరువర్కుముళ్ళా
ముఱైయుం ముఱైయే మొళియుం
మఱైయుం ఉణర్తువార్ ఇల్లా నాళ్ ఒన్ఱల్ల ఆన
ఉణర్తువార్ ఉణ్దాన పోదు
ప్రతిపదార్థము:
ఇఱైయుం = ‘ అ ‘ కార వాచ్యుడైన పరమాత్మ
ఉయిరుం = ‘ మ ‘ కార వాచ్యుడైన జీవాత్మ
ఇరువర్కుముళ్ళా ముఱైయుం = ఈ ఇరువురి సంబంధము (జీవాత్మ పరమాత్మకే చెందిన వాడు) చతుర్ధీ విభక్తిలో చెప్పిన సంబంధము
ముఱైయే మొళియుం =ఈ సంబంధమునే ఉన్నతముగా గ్రహించి
మఱైయుం = వేద సారమైన తిరుమంత్రము యొక్క సారమును
ఉణర్తువార్ ఇల్లా నాళ్ = ఉపదేశించేవారు లేకపోతే
ఒన్ఱల్ల = పైన చెప్పుకున్న విషయాలన్నీ అర్థమయ్యీ కానట్టుగా ఉన్నప్పుడు
ఉణర్తువార్ = తిరుమంత్రార్థాన్ని విడమరచి చెప్పే ఆచార్యులు
ఉణ్దాన పోదు = ఉన్నప్పుడు కదా
ఆన =అందు వలన ఉజ్జీవనము
వ్యాఖ్యానము:
ఇఱైయుం ఉయిరుం ఇరువర్కుముళ్ళా ముఱైయుం…….. అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్లు ఈ గ్రంధ ప్రరంభంలో “అవ్వానవరుక్కు ” అన్న పాశురంలో “అ” కారార్థము శ్రీమన్నారాయణుడే(ప్రాణము) అని , వెంటనే “మవ్వానవర్” అని మకారార్థాన్ని చేతనుడని చెప్పారు. “అవ్వానవరుక్కు మవ్వానవర్ ” పరమాత్మకు -జీవాత్మకు ఉన్న సంబంధాన్ని చెప్పారు. “ ఇంకా జీవాత్మ పరమాత్మకే చెందిన వాడు అని చతుర్దీ విభక్తిలో చెప్పటం వలన పర్మాత్మకు జీవాత్మకు ఉన్న శేష శేషి సంబంధాన్ని తెలియజేసారు.
ముఱైయే మొళియుం మఱైయుం ……. పైన చెప్పిన సంబంధం వేదాలలోను , తిరుమంత్రములోను, జ్ఞాన సారం లోని 31వ పాశురంలోను వివరించబడింది. ” వేదం ఒరు నాంగిన్ ఉట్పొదింద మెయిప్పొరుళుం ” (వేదములో నిక్షేపించబడింది ) అని తిరుమంత్రము వేదములో విస్తారంగా చర్చించ బడింది. తిరుమంత్రమును వేదసారంగా చెప్పారు మన పూర్వాచార్యులు. ఇటువంటి తిరుమంత్రాన్ని ఉపదేశించే వారే లేకపోతే…….
ఉణర్తువార్ ఇల్లా నాళ్ ఒన్ఱల్ల ………పైన చెప్పిన తిరుమంత్రార్థమైన పరమాత్మ, జీవాత్మ, వారి మధ్య సంబంధం ఎప్పటికీ కొనసాగుతుంది , ఆది,అంతము లేనిది ,నిత్యమైనది అనే విషయాలను వివరించి చెప్పే వారు ఉన్నప్పుడే అవి ప్రకాశిస్తాయి. అలా చెప్పే వారు లేనప్పుడు అవి మరుగున పడిపోతాయి.
ఆన ఉణర్తువార్ ఉణ్దాన పోదు ….….” ఆన ” …కావున…చెప్పెవారు ఉన్నప్పుడే పై విషయాలన్ని ఉనికిలో ఉంటాయి. చెప్పెవారు ఎవరంటే వారే ఆచార్యులు. ఈ గ్రంధ ప్రారంభంలోనే “ఉవ్వానవర్ ఉఱైతార్ ” అన్నారు . ఇది చేతనుల పట్ల ఆచార్యులు చేసిన మహోపకారం. దీనినే నమ్మాళ్వార్లు “అఱియాదన అఱివిత్త అత్తా ” అని పెరియాళ్వార్లు “ పీదగవాడైప్పిరానార్ పిరమ గురువాగి వందు ” అని అన్నారు .
ఈ ప్రకారంగా ఈ గ్రంధంలో అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్లు ఆచార్య వైభవాన్ని చక్కగా వివరించారు .
ఆడియెన్ చూడామణి రామానుజ దాసి
మూలము : https://divyaprabandham.koyil.org/index.php/2016/01/prameya-saram-10/
archived in https://divyaprabandham.koyil.org
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org