పూర్వ దినచర్య – శ్లోకం 19 – భృత్యైః

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

శ్రీ వరవరముని దినచర్య

<< శ్లోకం 18

శ్లోకం 19

భృత్యైః ప్రియ హితైకాగ్రైః ప్రేమపూర్వ ముపాసితం |

తత్ప్రార్థనానుసారేణ సంస్కారాన్ సంవిధాయ మే ||

ప్రతి పదార్థము:

ప్రియ హితైకాగ్రైః = (భగవదారాధన కొరకు) ఆచార్యులకు ఏఏ వస్తువులందు ప్రీతి ఉందో ,ఆచార్యుల వర్ణాశ్రమానికి ఏఏ వస్తువులు తగినవో, ఆ యా  వస్తువులను సేకరించి సమర్పించుట

భృత్యైః = కోయిల్ అణ్ణన్ లాంటి శిష్యులు

ప్రేమపూర్వం = ప్రేమతో

ఉపాసితం! =  హితమైన వస్తువులు సమర్పించు విధమును గమనించి

తత్ప్రార్థనానుసారేణ = వారి పురుషకారముతో

మే = దాసుడికి

సంస్కారాన్ = తాపం,  పుండ్రం, నామం, మంత్రం,  యాగం అనే ఐదు సంస్కారములు

సంవిధాయ  =  శాస్త్రోక్తముగా జరిగింది (పొంది)

భావము :

పెరుమాళ్ యొక్క సన్నిధిలో మామునులు వేంచేసి వుండగా వారి శిష్యులు భగవదారాధనకు ఉపకరించు  బియ్యము, పప్పు,  పండ్లు, పాలు,  పెరుగు, కూరలు మొదలగు వస్తువులను భక్తితో తీసుకువచ్చి సమర్పించి , వారికి శుశ్రూష చేయటానికి మామునులు అంగికరించారు. “మఠాపత్యం యతిః కుర్యాత్ విష్ణు ధర్మాభివృధ్ద్ధయే ” యతులు వైష్ణవ  ధర్మములను  ( పంచ సంస్కారము,  ఉపవేదంత ‍‌‍‍‌‍రహస్యార్థ ప్రవచనములు,  ఆ యా ధర్మములను తమ శిష్యుల చేత ఆచరణ గావించుట మొదలగు) అభివృధ్ధి చేయుటకై మఠాధిపత్యము స్వీకరించాలని పరాశర సమ్హితలో నిర్దేశించిన కారణముగా మామునులు  మఠాధిపత్యము స్వీకరించారు. అంతే కాదు సాక్షాత్ శ్రీ రంగ నాథుడే వారిని ఈ కైంకర్యమునకు నియమించుట విశేషము.  అందు వలననే కోయిల్ కందాడై అణ్ణన్ వంటి శిష్యులు తదీయారాధనకు కావలసిన వస్తు సామాగ్రిని సమర్పించగా మామునులు వాటిని స్వీకరించటము జరిగింది.

అనేకులు ( ఎఱుంబిఅప్పా వంటి) వారి వద్దకు వచ్చి తమకు కూడా పంచ సంస్కారము చేసి శిష్యులుగా స్వీకరించమని ప్రార్ధించగా మామునులు వారి ప్రార్ధనను స్వీకరించి వారందరికీ పంచ సంస్కారములు అనుగ్రహించారు. ఆ రోజులలో శాస్త్రమును అనుసరించి ఒక సంవత్సర కాలము కైంకర్యము చేసిన వారికి మాత్రమే పంచ సంస్కారములు చేసే వారు.  కాని మామునులు ఎఱుంబిఅప్పాకు  వారి అంతరంగ శిష్యుల ప్రార్దన వలన  శాస్త్ర విధిని కూడా పక్కకు పెట్టి ఆశ్రయించిన మరునాడే పంచ సంస్కారములు చేసారు. మనకు శాస్త్రము కంటే శిష్యుల ప్రార్థన లోని బలమును చూపుతున్నారు. “ఆచార్యులు సుదినమున ఉదయాది నిత్య కర్మలను, భగవనుష్ఠానమును ముగించుకొని , నిత్య కర్మలనాచరించి వచ్చిన శిష్యులను కూర్చోబెట్టి కంకణ ధారణ గావించి, పంచ సంస్కారములు చేయవలెను “అని పరాశర సమ్హితలో నిర్దేశించిన విధముగానే మామునులు చేసేవారు. ఈ శ్లోకములో తాప , పుండ్ర , రామానుజ దాస నామ  సంస్కారములను పొందిన విధమును చెప్పి తరువాతి శ్లోకములో యాగము(దేవ పూజ) , ఆ తరువాతి శ్లోకములో ద్వయ మంత్రోప దేశమును పొందిన విధమును  ఎరుంబియప్పా చెపుతున్నారు. చేతనుడు శ్రీవైష్ణవుడవటానికి పైన తెలిపిన పంచ సంస్కారములు పొందుట తప్పనిసరి .ఆచార్యుడు సంస్కారం చేయుట అనగా ఒక జీవాత్మ శ్రీవైష్ణవుడిగా మారుటకు తోడ్పడే ఒక మంచి కార్యక్రమం.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

Source: https://divyaprabandham.koyil.org/index.php/2015/09/purva-dhinacharya-tamil-19/

archived in https://divyaprabandham.koyil.org

pramEyam (goal) – https://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
SrIvaishNava education/kids portal – http://pillai.koyil.org

 

Leave a Comment