తిరువాయ్మొళి నూఱ్ఱందాది – సరళ వ్యాఖ్యానము – 41 – 50

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి క్రమము

<< తిరువాయ్మొళి నూఱ్ఱందాది – 31 – 40

పాశురము 41

అవతారిక: 5 వ పత్తు, మొదటి దశకమైన ‘కైయార్ శక్కరత్తు’ లో ఆళ్వార్లు పరమాత్మ తన నిర్హేతుక కృపతో తన వంటి వాడిని  స్వీకరించడాన్ని చూసి ఆశ్చర్యచకితుడై ఆ భ్రమలో పాడారు.  ఆ పాశురాల సారాన్ని మామునులు మనకు సంక్షిప్తంగా ఇక్కడ అనుగ్రహించారు.

కైయారుం శక్కరత్తోన్ కాదలిన్ఱిక్కే యిరుక్క *
పొయ్యాగ ప్పేశుం పుఱనురైక్కు * మెయ్యాన
పేత్తై ఉపకరిత్త పేరరుళిన్ తన్మైదనై *
పోత్తిననే మాఱన్ పొలిందు * (41)

ప్రతిపదార్థము:

కైయారుం శక్కరత్తోన్ = తన శ్రీ హస్తాలలో అందమైన చక్రాయుధాన్ని ధరించినవాడు
కాదలిన్ఱిక్కే యిరుక్కు = తనపై ప్రేమ లేని
పొయ్యాగ ప్పేశుం = కపట భక్తిని ప్రదర్శించే
పుఱనురైక్కు = ఆర్భాటపు మాటలను చెప్పినా
మెయ్యాన పేత్తై = వాటిని వాస్తవంలాగా గ్రహించి
ఉపకరిత్త = ఉపకరించిన
పేరరుళిన్ తన్మైదనై = కారుణ్య మూర్తిని
మాఱన్ = ఆళ్వార్లు
పొలిందు = గొప్పగా
పోత్తిననే = కీర్తించారే

భావము:  తన శ్రీహస్తాలలో అందమైన చక్రాయుధాన్ని ధరించినవాడు పరమాత్మ . తనపై ప్రేమ లేని కపట భక్తిని ప్రదర్శించే అల్పులను, ఆర్భాటపు మాటలను చెప్పే కపటులను కూడా అనుగ్రహించారు. వారి మాటలను చేష్టలను  వాస్తవంలాగా గ్రహించి ఉపకరించిన కారుణ్య మూర్తిని ఆళ్వార్లు ఎంతో గొప్పగా కీర్తించారే అని మామునులు ఆనందంతో ఈ పాశురంలో తెలుపుతున్నారు.

పాశురము 42

 అవతారిక: తిరువాయిమోళి, 5 వ పత్తు 2 వ దశకంలో ఆళ్వార్లు శ్రీమన్నారాయణుని భక్త గోష్టిని చూసి ఆనందంతో మంగాళాశాసనము చేశారు అంతే కాక భవిష్యదాచార్యులైన భగవద్రామానుజుల అవతార సంకేతంగా ఈ దశకాన్ని ఆళ్వార్లు పాడారని పెద్దల అభిప్రాయము. ఆదశకకాన్ని సంక్షేపంగా మామునులు ఈ పాశురాన్ని అనుగ్రహించారు….

పొలిగ పొలిగ వెన్ఱు పూమగళ్ కోన్ తొండర్ *
మలివుదనై కండుగందు వాళ్ త్తి * ఉలగిల్
తిరుందాదార్ దమ్మై * తిరుత్తియ మాఱన్ శొల్ *
మరుందా ప్పోగుం * మన మాశు * (42)

ప్రతిపదార్థము:

పొలిగ పొలిగ వెన్ఱు = చిరకాలం వర్థిల్లాలి చిరకాలం వర్థిల్లాలి అని
పూమగళ్ కోన్ తొండర్ = శ్రీమన్నారాయణుని దాసులను
ఉగందు = సంతోషంతో
మలివుదనై కండు = భక్త సమూహాలను చూసి
వాళ్ త్తి = మంగళశాసనము చేసి
ఉలగిల్ = ఈ భువిలో
తిరుందాదార్ దమ్మై =  ఇంకా సంస్కరింపబడని వారిని
తిరుత్తియ = సంస్కరించిన
మాఱన్ = శఠకోపులనే మాఱన్
శొల్ = శ్రీసూక్తులు
మరుందాగ = మందులాగా పని చేసి
మన మాశు ప్పోగుం = మనసులోని దోషాలన్నీ తొలగి పోతాయి

భావము: శ్రీమన్నారాయణుని భక్తుల సమూహాన్ని చూసి, ఆనందంతో ఆళ్వార్లు మంగాళాశాసనం చేశారు. “దీర్గాయుష్మాన్ భవ, చిరంజీవ చిరంజీవ” అని ఆ భక్త సమూహాన్ని దీవించారు. ఔషధం వంటి ఆళ్వార్ల శ్రీ సూక్తితో ఈ భువిలో ఇంకా సంస్కరింపబడని వారిని ఆళ్వార్లు తమ పాశురాలతో సంస్కరించారు. దాని వలన మనసు పొరలలో ఉన్న దోషాలు కూడా తొలగిపోతాయి అని ఈ పాశుర భావము.

పాశురము 43

 అవతారిక: తిరువాయిమోళి, 5 వ పత్తు 3వ ‘మాశుఱు శోది’ అనే దశకంలో ఆళ్వార్లు శ్రీమన్నారాయణుని దివ్యమంగళ విగ్రహాన్ని ప్రత్యక్షంగా అనుభవించలేక పోయారు. అందుకని ఈ దశకంలో మడలెత్తనారంభించారు.

మాశుఱు శోది కణ్ణన్ * వందు కలవామైయాల్ *
ఆశై మిగుందు పళిక్కు అంజామల్ * ఏశఱవై
మణ్ణిల్ మడలూర మాఱన్ ఒరుమిత్తాన్ *
ఉళ్ నడుంగత్తాన్ పిఱందవూర్ * (43)

ప్రతిపదార్థము:

మాశుఱు శోది = దోషాలను పరిహరించగల కాంతి స్వరూపుడైన
కణ్ణన్ = కృష్ణుడు
వందు కలవామైయాల్ = వచ్చి చేరనందున
ఆశై మిగుందు = కోరిక అధికమై
పళిక్కు అంజామల్ = నిందలకు భయపడక
ఏశు అరా = బరి తెగించి
త్తాన్ పిఱందవూర్ = తాను అవతరించిన ఊరి ప్రజల
ఉళ్ నడుంగ = హృదయాలు వణకగా
మణ్ణిల్ మడలూర = ఈ లోకంలో మడల్ ఊదడానికి
మాఱన్ ఒరుమిత్తాన్ = ఆళ్వార్లు సిద్ద పడ్డారు

భావము: ఈ పాశురంలో,  పరమాత్మ యొక్క భౌతిక సౌందర్యాన్ని ఆస్వాదించలేకపోవడం వల్ల ఆళ్వార్ల యొక్క పాశురములను అనుసరించి, మడలెత్తనరంభించారు. ( మడల్ అనేది ఒక సాంప్రదాయిక కవిత రీతి. ప్రధానంగా నాయకుడు తనను ప్రేమికురాలు నిరాకరించినప్పుడు ఈ ప్రక్రియను చేపడతాడు. తాటి ఆకులతో గుర్రాన్ని తయారు చేసి దాని మీద ఎక్కి నాలుగు రోడ్ల కూడలిలో నిలబడి ప్రేయసిపై తనకున్న ప్రేమను ఆమె నిరాకరణను బహిరంగంగా చెప్పి ఆమెను ఎలాగైనా తనతో చేర్చమని అడుగుతాడు. తిరుమంగై  ఆళ్వార్లు ఈ ప్రక్రియలో సిరియ తిరుమడల్, పెరియ తిరుమడల్ అనే  రెండు ప్రబంధాలు చేశారు) దాని పర్యవశానాలకు ఆయన బయపడలేదు. దోషాలను పరిహరించగల కాంతి స్వరూపుడైన కృష్ణుడు తనను వచ్చి చేరలేదు.  అందువలన కోరిక అధికమై నిందలకు భయపడక బరి తెగించి తాను అవతరించిన ఊరి ప్రజల హృదయాలు కంపించగా ఈ లోకంలో మడల్ ఊదడానికి ఆళ్వార్లు సిద్దపడ్డారు. ఈ వైభవాన్ని ఆళ్వార్లు ఒక దశకంలో వివరించగా మామునులు క్లుప్తీకరించి ఒక్క పాశురములో అందించారు.

పాశురము 44

 అవతారిక: ‘ఊరేల్లామ్ తుంజ‘ అనే తిరువాయిమొళి 5వ శతకం, 4వ దశకం పాశురాల సంక్షిప్తంగా ఈ పాశురాన్ని మామునులు అనుగ్రహించారు. ఇందులో ఆళ్వార్లు నాయకీ  భావంతో పాశురాలను అనుగ్రహించారు. ఆళ్వార్లు పరమాత్మను వీడి విరహంలో తపించటం వలన ఆ రాత్రి అతి దీర్ఘంగా అనిపించింది ఆళ్వార్లకు. నాయకీ  భావనలో ఎంతకూ కదలని  ఆ దీర్ఘరాత్రి తాను పడిన విరహ వేదనతో మడల్ కూడా పాడుదామనుకొని పాడలేక పోయినా విషయాన్ని వర్ణించిన  శ్రీసూక్తులివి.

ఊర నిరైంద * మడల్ ఊరవుం ఒణ్ణాదపడి *
కూఱిరుళ్ శేర్ * కంగులుడన్ కూడినిన్ఱు * పేరామల్
తీతు శెయ్య మాఱన్ తిరు ఉళ్ళత్తుచ్చెన్ఱ తుయర్ *
ఓతువతు ఇంగు ఎంగనేయో ? (44)

ప్రతిపదార్థము:

ఊరనిరైంద = పాడతలచుకున్న
మడల్ = మడల్
ఊరవుం ఒణ్ణాదపడి = పాడలేక
కూఱిరుళ్ శేర్ * కంగుల్ = ఆ అంతులేని చీకటి రాత్రి
ఉడన్ కూడినిన్ఱు = కూడా ఉండి
పేరామల్ = కదలక
తీతు శెయ్య = ద్రోహం చేయగా
మాఱన్ = నమ్మాళ్వార్ల
తిరువుళ్ళత్తుచ్చెన్ఱ తుయర్ = దుఖఃము హృదయాంతరాళాలో చేరగా
ఇంగు ఓతువతు = ఇక ఇక్కడ ఊదేవారెవరు?
ఎంగనేయో ? = అయ్యో ! ఎలా సాధ్యం ?

భావము: ఈ పాశురంలో, ఒక నాయకిగా (నాయకి, పిరాట్టి, శ్రీమాన్ నారాయణుని భార్య) మాట్లాడుతున్నారు.స్వామి దూరంగా ఉన్న నాయికకు ఆరాత్రి దీర్ఘ రాత్రిగా బాధ పెట్టింది. విరహ వేదనను భరించలేని ఆళ్వార్ నాయిక మడల్ పదలనుకుంది. కాని ఆడి కూడా చేయలేకపోయింది. మడల్ పాడలేక పోవటం వలన విరహ వేదన ద్విగుణీకృతం అయింది. పాడతలచుకున్న మడల్ పాడలేక  ఆ అంతులేని చీకటి రాత్రి  కూడా ఉండి కదలక  ద్రోహం చేయగా నమ్మాళ్వార్ల దుఖఃము హృదయాంతరాళాలో చేరగా ఇక ఇక్కడ ఊదేవారెవరు? అయ్యో ! ఎలా సాధ్యం ? అని ఆళ్వార్ పాడిన దశకానికి సంక్షిప్త రూపమే మామునుల ఈ పాశురము.

పాశురము 45

 అవతారిక: అనే 5 వ శతకము, 5 వ దశకములోని ‘ఎంగనే నీర్ మునివదు ఎన్న’ అనే 11 పాశురాల సారమే ఈ పాశురము. తిరుక్కురుంగుడి నంబి సౌందర్యాన్ని ఆళ్వార్లు మనోపలకంపై ఆవిష్కరించుకున్న విధానాన్ని మామునులు ఈ పాశురంలో అనుగ్రహించారు.

ఎంగనే నీర్ మునివదు ఎన్నై యిని? నంబి యళగు *
ఇంగనే తోన్ఱుగిన్ఱతు  * ఎన్ మున్నే * అంగన్
ఉరువెళిపాడా  వురైత్త * తమిళ్ మాఱన్  *
కరుతుమ్ అవర్కు ఇన్బక్కడల్

ప్రతిపదార్థము :

యిని ఎన్నైఎంగనే మునివదు?  = నన్ను ఎందుకు నిందిస్తున్నారు?
నంబి యళగు = తిరుక్కురుంగుడి నంబి సౌందర్యము
ఎన్ మున్నే = నా కళ్ళ ముందర
ఇంగనే తోన్ఱుగిన్ఱతు = ఇక్కడే తోచుచుండగా
అంగన్ = ఇలా
ఉరువెళిపాడా వురైత్త = కళ్లల్లో రూపు కడుతున్న అందాన్ని వర్ణించిన
తమిళ్ మాఱన్ = కృపతో తమిళంలో ప్రబంధాలను అనుగ్రహించిన మాఱన్ అనే శఠకోపులను
నీర్ =  మీరందరూ
కరుతుమవర్కు =  ధ్యానించేవారు
ఇన్బక్కడల్ = సంతోష సాగరంలో ఓలలాడుతారు.

భావము: ఆ స్వామి సౌదార్యాన్ని మనో ఫలకం మీద ఆవిష్కరించుకొని ఆనందం అనుభవించారు ఆళ్వార్లు. మీరందరూ ఇప్పుడు నన్ను కోపగించి ప్రయోజనము ఏముంది? తిరుక్కురుంగుడి నంబి సౌందర్యం నా కళ్ల ముందు కనిపిస్తున్నది. మీ తీవ్ర ఆక్షేపణలతో  ఆ ఆనందాన్ని అనుభవించకుండా నన్ను ఆపగలరా ! అని ఆళ్వార్లు తల్లిని పెద్దలను ప్రశ్నిస్తున్నారు. ఆ ఆనందం నోటి ద్వారా పొంగిపొరలగా పాశురాలుగా వర్షించారు. ఈ విధంగా తమిళ వేదాన్ని దయతో ఆవిష్కరింపజేసిన ఆళ్వార్‌ను ధ్యానించే వారికి హృదయంలో, ఆ ఆళ్వార్లే ఆనంద సాగరంలా మిగిలిపోతారు.

పాశురము 46 

  అవతారిక:  ఈ  పాశురము, మామునులు ఆళ్వార్ అనుకరణ ద్వారా తనను తాను నిలబెట్టుకునే  పాశురము అనుసరిస్తూ ఇక్కడ వివరిస్తున్నారు.

కడల్ జ్ఞానత్తీశనై * మున్ కాణామల్ నొన్ దే *
ఉడనా * అనుకరిక్కలుఱ్ఱు * తిడమాగ
వాయ్ందవనాయ్ త్తాన్ పేశుం * మాఱనురై అదనై *
ఆయ్ న్ దురైప్పార్ * ఆట్ చెయ్ యనోఱ్ఱార్

ప్రతిపాదార్థము:

కడల్ జ్ఞానత్తు = సముద్రముచే అవరింపబడిన ఈ భూమిని
ఈశనై = పరమాత్మ
మున్ కాణామల్ = నా కంటి ముందు కనపడక
నొన్ దే = కుంగి పోయాను
ఉడనా * అనుకరిక్కలుఱ్ఱు = ఆయన నామాలను ఉచ్చరిస్తూ ఆయననే అనుకరించటానికి
తిడమాగ వాయ్ందు = దృఢంగా ప్రయత్నించి
అవనాయ్ త్తాన్ పేశుం = ఆయనలాగా తాను మాట్లాడిన
మాఱన్ = నమ్మాళ్వార్ల
ఉరై అదనై = శ్రీసూక్తి
ఆయ్ న్ దురైప్పార్ = ఔన్నత్యాన్ని తెలుసుకొని పాడుకునేవారు
ఆట్ చెయ్య = కైంకర్యము చేసేవారు
నోఱ్ఱార్ = భాగ్యవంతులు

భావము: సముద్రంతో అవరింపబడిన ఈ లోకంలో ఆళ్వార్ తన కళ్లతో ఎమ్పెరుమాన్‌ను చూడలేక పోవడంతో కలత చెంది, తానే ఎమ్పెరుమాన్‌ లాగా అభినయించడం ద్వారా తనను తాను నిలబెట్టుకోవడానికి ప్రయత్నించి, దృఢ విశ్వాసంతో ఎమ్పెరుమాన్‌గా మాట్లాడారు. అటువంటి ఆళ్వార్ల శ్రీసూక్తి యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకుని, వాటిని పారాయణం చేసేవారు, అటువంటి ఆళ్వార్లను సేవించేసేవారు గొప్ప భాగ్యవంతులు కదా! అని మామునులు చెపుతున్నారు.

పాశురము 47

అవతారిక:  ఈ పాశురంలో, మామునులు  వానమామలై పెరుమాళ్ళ యొక్క దివ్యపాదాలను ఆరాధించి, శరణాగతిచేసిన  ఆళ్వార్ యొక్క ప్రేమపూర్వక పాశురాలను అనుసరిస్తూ , వివరిస్తున్నాడు. ఈ పాశురము తిరువాయిమొళిలోని 5వ శతకములోని 7వ దశకమైన “ నోఱ్ఱ నోమ్ బిలేన్ “ అనే పాశురాల సారంగా అమరింది.

పాశురము :

నోఱ్ఱ నోన్బాదియిలేన్ ఉన్దనై విట్టాఱ్ఱగిల్లేన్
పేఱ్ఱుక్కుపాయమ్ ఉన్ఱన్ పేరరుళే – సాఱ్ఱుగిన్ఱేన్
ఇన్గెన్నిలై ఎన్నుమ్ ఎళిల్ మాఱన్ సొల్ వల్లార్
అంగ మరర్క కారావముదు

ప్రతిపాదార్థము:

నోఱ్ఱ = మోక్షమును పొందుటకు అర్హమైన
నోన్బాది = నోము ఇత్యాదులు (ఉపాయము ), కర్మ యోగము
ఇలేన్ = నాకు లేదు
ఉన్ దనైవిట్టు = నిన్ను వదిలి (నీవు లేకుండా)
ఆఱ్ఱగిల్లేన్ = తరించలేను (ఉండలేను )
పేఱ్ఱుక్కు = పురుషార్దాన్ని పొందడానికి
ఉపాయం = ఉపాయముగా
ఉన్ దన్  = తమరి
పేరరుళే = నిర్హేతుకమైన కృప ఒకటే
శాత్తుగిన్ఱేన్ = కారణమని నేను లోకానికి ప్రకటిస్తున్నాను
ఇంగు = ఈ విషయములో
ఎన్ నిలై = నా స్థితిని
యెన్నుం = కృపతో చూడు
ఎళిల్ మాఱన్ = పరమ కైంకర్యపరుడైన మాఱన్ అనే నమ్మాళ్వార్లు
శొల్ = నోటి నుండి వెలువడిన పాశురాల రూపమైన శ్రీసూక్తులు
అంగు = ఆ పరమపదములో
అమరర్కు = నిత్యసూరులకు
ఆరావముదు = ఆతృప్తామృతము  

భావము: మోక్షమును పొందుటకు అర్హమైన నోము (ఉపాయము), కర్మ యోగము ఇత్యాదులు నేను చేయలేదు, నాకు ఎటువంటి పుణ్యము లేదు. నిన్ను వదిలి, నీవు లేకుండా నా  ప్రాణాలు తరించలేవు. ఉన్నత పురుషార్దమైన పరమపదాన్ని పొందడానికి  ఉపాయముగా తమరి నిర్హేతుకమైన కృప ఒకటే కారణమని నేను లోకానికి తెలియజేస్తున్నాను. ఈ నా స్థితిని కృపతో చూసి కరుణించి పాలించు అని నమ్మాళ్వార్లు పరమాత్మను ప్రార్థిస్తున్నారు. పరమ కైంకర్యపరుడైన మాఱన్ అనే నమ్మాళ్వార్ల నోటి నుండి వెలువడిన పాశురాల రూపమైన ఈ శ్రీసూక్తులు నేర్చినవారు ఆ పరమపదములో నిత్యసూరులకు ఆతృప్తామృతముగా నిలిచిపోతారు.

పాశురము 48 

అవతారిక: ఆళ్వార్లు తమ ఆకించన్యాన్ని ప్రకటించుకున్నారు. తరువాత కూడా పరమాత్మ ‘అయ్యో వీడు మనవాడు, తన ఆకించనియాన్ని ప్రకటించుకొని శరణాగతి చేశాడే’ అని ఆతృతతో రాలేదు. అందువలన తల్లడిల్లి, దుఃకించి, అల్లాడిపోయి బాధతో మాట్లాడే ఆళ్వార్ పాశురాల సారంగ ఈ పాశురాన్ని మామునులు అనుగ్రహించారు. ఈ పాశురము తిరువాయిమొళిలోని 5వ శతకములోని 8వ దశకమైన “ఆరావముదే” అనే పాశురాల సారంగా అమరింది.

ఆరావముదాళ్వార్ ఆదరిత్త పేఱుగళై *
తారామైయాలే తళర్ న్దుమిగ * తీరాద
ఆశైయుడన్ * ఆఱ్ఱామై పేశి అలమన్ దాన్
మాశఱు శీర్ * మాఱన్ ఎమ్మాన్ * (48)

ప్రతిపాదార్థము:

ఆరావముదాళ్వార్ = తిరుకుడన్దైలోని ఆరావముదు పెరుమాళ్లు
ఆదరిత్త పేఱుగళై = ఆళ్వార్లు కోరిన కోరికలను (పరమపదము )
తారామైయాలే = ఇవ్వనందున
మిగతళర్ న్దు = చాలా చింతించినవారై
తీరాద ఆశైయుడన్ = నెరవేరని కోరికతో
ఆఱ్ఱామై పేశి = తనవేదనను వెలిబుచ్చి
అలమన్ దాన్ = ఆళ్వార్లు కుంగిపోయారు
మాశఱు శీర్ = వీరు మన దోషములను తొలగదోయగల శక్తి గల
మాఱన్ = నమ్మాళ్వార్లు
ఎమ్మాన్ = మనకు స్వామి

భావము: తిరుకుడన్దైలోని ఆరావముదు పెరుమాళ్లు నమ్మాళ్వార్లు కోరికను దయతో నెరవేర్చనందున, ఆళ్వార్ తీవ్రమైన వేదనతో చాలా చింతించారు.  అది నెరవేరే వరకు ఆయన మనసుకు శాంతి లభించదు. అటువంటి వీరు మన దోషములను తొలగదోయగల శక్తి గల మాఱన్ అనే నమ్మాళ్వార్లు, మనకు స్వామి.

పాశురము 49 

అవతారిక:  ఆళ్వార్లు మానసికంగా తిరువల్లవాళ్ కి వెళ్లి పట్టణం చుట్టూ ఉన్న ఉద్యానవనంలో ఆహ్లాదకరమైన చెట్లు, పొదరిళ్ళు చూసారు. అక్కడ పెరుమాళ్లు తన పక్కన లేరని బాధపడుతూ పాశురాలను పాడారు. తిరువాయిమొళిలోని 5వ శతకములోని 9వ దశకమైన ‘మానేయ్ నోక్కు’ అనే పాశురాలననుసరిస్తూ మామునులు ఈ పాశురాన్ని అనుగ్రహించారు.

మానలత్తాల్ మాఱన్ * తిరువల్లవాళ్ పుగప్పోయ్ *
తాన్ ఇళైత్తు వీళ్ందు అవ్వూర్ తన్ అరుగిల్ * మేల్ నలన్ గి
తున్ బమ్ ఉఱ్ఱు చ్చొన్న * శొలవు కర్ పార్ తంగళుక్కు *
పిన్ పిఱక్క వేణ్డా పిర * (49)

ప్రతిపాదార్థము:

మాఱన్ = నమ్మాళ్వార్లు
మానలత్తాల్ = అపారమైన ప్రీతితో
తిరువల్లవాళ్ పుగప్పోయ్ = తిరువల్లవాళ్ అనే దివ్యదేశానికి బయలుదేరారు
అవ్వూర్ తాన్ అరుగిల్ = ఆ వూరు చుట్టూ వున్న తోటలలో
తాన్ ఇళైత్తు వీళ్ందు = కాలు ముందుకు సాగక, శరీరం సహకరించక
మేల్ నలంగి = గందరగోళపడి, తడబడి
తున్ బమ్ ఉఱ్ఱు = దుఖఃముతో
చ్చొన్న= చెప్పిన
శొలవు = శ్రీసూక్తులు
కర్ పార్ తంగళుక్కు = ఎవరైతే నేర్చుకుంటారో
పిన్ = వారు నేర్చిన తరువాత
పిరా = వారు ఈ లోకంలో మళ్ళీ
పిరక్క వేణ్డా = పుట్టనవసరము లేదు

భావము: ఆళ్వార్లు చాలా ప్రేమతో, తిరువల్లవాళ్ దివ్యదేశం వైపు బయలుదేరాడు.  కానీ అక్కడికి చేరుకోలేక, పట్టణం చుట్టూ ఉన్న ఉద్యానవనంలో శరీరం సహకరించక, తడబాటుతో ఉండిపోయారు. దుఖఃముతో ఆళ్వార్లు చెప్పిన శ్రీసూక్తులు ఎవరైతే నేర్చుకుంటారో వారు ఈ పాశురాలను నేర్చిన తరువాత ఈ లోకంలో మళ్ళీ పుట్టనవసరము లేదు.

 పాశురం–50

అవతారిక: ఈ పాశురంలో అవతార విశేషాలను అనుభవించేట్టు కటాక్షించమని ఆళ్వార్లు కోరుతున్న విధానాన్ని వివరిస్తున్నారు. తాను కృష్ణావతరనికి చాలా వెనక జన్మించడం వలన కృష్ణ చేష్టితాలను అనుభవించలేక పోయానని ఆళ్వార్లు బాధపడ్డారు. తిరువాయ్ మొళిలోని ‘పిఱన్ద వారుమ్’ యొక్క అర్థాన్ని ‘పిఱన్దులక జ్ఞాత్తళిక్కుమ్’ అనే ఈ పాశురంలో మమునులు సంగ్రహంగా అనుగ్రహించారు.

పిఱన్దులగమ్ కాత్తళిక్కుమ్ పేరరుట్ కణ్ణా ఉన్
సిఱన్ద గుణత్తాల్ ఉరుగుమ్ సీలత్తిఱమ్ తవిర్ న్దు
సేర్ న్దనుబవిక్కుమ్ నిలైసెయ్యెన్ఱ సీర్మాఱన్
వాయ్ న్ద పదత్తే మనమే వైగు

ప్రతిపదార్థము:
పిఱన్దు = జన్మలనెత్తి
ఉలకమ్ = లోకాలను
కాత్తళిక్కుమ్ = రక్షించి కృపచేస్తున్న
పేరరుళ్ = చాలా గొప్ప కృపా గుణము గల
కణ్ణా = కృష్ణా, ఉపకారకా
వున్ శిఱన్దగుణత్తాల్ = నీ కళ్యాణ గుణాను సంధానంతో
ఉరుకుమ్ శీలత్తిఱమ్ తవిర్ న్దు = మనసు ద్రవించి నీరైయ్యే స్వభావాన్ని వదిలి
శేర్ న్దనుబవిక్కు నిలై = నీతో కూడి అనుభవించే స్థితిని
శెయ్యెన్ఱ = కృప చేయమని కోరిన
శీర్ మాఱన్ = శ్రీశఠకోపుల
వాయ్ న్దపదత్తే = ఒకదనియో ఒకటి చక్కగా అమరి ఉన్న శ్రీపాదాలపై
మనమే =  ఓ మనసా!
వైకు = నిలిచి యుండు

భావము: ‘ఓ కృష్ణా! లోకంలో ధర్మ సంస్థాపనం, సాధు పరిత్రాణం కొరకు కృష్ణావతారమెత్తి రాక్షసాదులను సంహరించావు. వామనావతారంలో బలిని వశపరచుకున్నావు. ఇలా ఎన్నో అవతారాలను నీ ఇచ్చానుసారంగా పరిగ్రహించావు. నిన్ను, నీ కళ్యాణగుణాలను అనుసంధానం చేసిన నా మనసు కరిగి నీరవుతున్నది. స్థిరంగా నీ కళ్యాణగుణాలను అనుభవించే విధంగా నన్ను అనుగ్రహించు. అని ఆళ్వార్లు ప్రార్థించారు. ఓ మనసా! అలాంటి ఆళ్వార్ల పాదద్వయన్నే ఎప్పుడూ అనుసంధానం చేస్తూ ధ్యానించుమా !

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము: https://divyaprabandham.koyil.org/index.php/2020/10/thiruvaimozhi-nurrandhadhi-41-50-simple/

పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a Comment