ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 55 – 56

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

ఉపదేశ రత్తినమాలై

<< గతశీర్షిక

పాశురము 55

యాబైయైదవ పాశురము. ఈ పాశురములో శ్రీవచనభూషణము యొక్క రహస్యార్థములను బాగుగా తెలుసుకొని ఆచరణలో పెట్టువారు చాలా అరుదు అని తన మనసునకు ఉద్భోదిస్తున్నారు.

ఆర్ వశనభూషణత్తిన్ ఆళ్పొరుళెల్లామ్ అఱివార్।
ఆరదు శొన్నేరిల్ అనుట్టిప్పార్ ఓరొరువర్
ఉణ్డాగిల్ అత్తనైగాణ్ ఉళ్ళమే ఎల్లార్కుమ్
అణ్డాదదన్ఱో అదు॥                         

ఓ మనసా! ఈ శ్రీవచనభూషణ దివ్య శాస్త్ర రహస్యార్థములను సమగ్రముగా తెలుసుకొనగలవారెవరు? తెలుసుకొని దానిలో చెప్పిన విధముగా నడుచుకొనువారెవరు? ఈ విధముగా రహస్యార్థములను తెలుసుకొని ఆచరణలో పెట్టువారు ఎక్కడో ఒకరిద్దరు ఉండవచ్చునని తెలుసుకో. అందరికీ అంత స్థాయి వచ్చుట దుర్లభము కాదా? సముద్రములో ముత్యములు, రత్నములు మొదలగు విలువైనవి అనేకములు ఉన్నప్పటకీ సముద్ర గర్భములోనికి పోయి సంపాదించువారు ఏ కొందరో ఉంటారు కానీ ఒడ్డున ఉండి చూచు వారే చాలామంది ఉంటారు. అదే ఈ గ్రంథ రహస్యార్థములను పైపైన తెలుసుకొనువారు చాలా మంది ఉన్నప్పటికీ అంతఃరహస్యార్థములను తెలుసుకొనువారు ఏ కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఆ విధముగా రహస్యార్థములను తెలుసుకొన్నప్పట్టికీ శాస్త్రము నిషేధించిన భోగ విషయములయందు విరక్తి కలిగి, అపకారులయందు కూడా కరుణను కలిగి ఉండుట, ఆచార్యుల తిరువడయే (శ్రీపాదములే) సర్వస్వమని నమ్మి ఉండుట మొదలగు విషయములను అనుష్ఠానపూర్వకముగా జీవించు వారు బహు కొద్ది మంది మాత్రమే ఉంటారు.

పాశురము 56

యాబైయారవ పాశురము. ఈ పాశురములో సత్వగుణము మెండుగా గలవారు ఈ గ్రంథములోనున్న అర్థములను సమగ్రముగా తెలుసుకొని అనుష్ఠిస్తారని ఉపదేశిస్తున్నారు.

ఉయ్యనినైవుడైయీర్ ఉజ్ఞ్గళుక్కు చ్చొల్లుగిన్ఱేన్।
వైయగురు మున్నం వాయ్ మొళిన్ద శెయ్యకలై
యామ్ వశనభూషణత్తి వాళ్పొరుళై కత్తదను
క్కామ్ నిలైయిల్ నిల్లుమ్ అఱిన్దు॥                     

ఉజ్జీవించాలనే గొప్ప ఉద్దేశ్యము గలవారా! మీ ఉద్దేశ్యమును నెరవేర్చుటకై చెప్పుచున్నాను, పిళ్ళై లోకాచార్యులు కృపతో ఇంతకు పూర్వము అనుగ్రహించిన తత్వార్థములను సత్యముగా వెదకు వారికి దానిని చూపించు గ్రంథము ఈ శ్రీవచన భూషణము. ఈ గ్రంథము యొక్క అంతరార్థము ఆచార్య అభిమానమని, దానిని బాగుగా పొందమనీ తెలుపుచున్నది.

అడియేన్ వీ.వీ.ఎల్.ఎన్. ఆచార్యులు రామానుజ దాసన్ 🙏

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2020/07/upadhesa-raththina-malai-55-56-simple/

ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి : http://divyaprabandham.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *