ఆర్తి ప్రబంధం – 21

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

ఆర్తి ప్రబంధం

<< ఆర్తి ప్రబంధం – 20

ramanujar-srisailesa-mamunigal

ప్రస్తావన

ఈ పాశురములో మణవాళమామునులు తమ హృదయమునకు ఉపదేశము చేయుచుండెను. మణవాళ మామునుల హృదయము వారిని ప్రశ్నించెనని భావించవలెను. ” ఓ మణవాళమాముని, మునుపటి పాశురములో మీరు పరమపదమును చేరు దారిని కనులకు కట్టినట్లుగా వర్ణించిరి. అంతయేగాక జీవాత్మ మరియు శ్రీమాన్నారయణుని ఐక్యమును అద్భుతముగా వర్ణించెరి. ఇట్టి తరుణము నేర్పుగా చదివిన మరియు జ్ఞానము గల పండితులకు కూడా అరుదైనది. కాని మీరు ఈ అనుభవమును స్వయముగా అనుభవించునట్లు మాట్లాడుచుండిరి. అకస్మాత్తుగా మీకు ఇట్టి విశ్వాసము మరియు ధైర్యము ఎట్లు వచ్చెను? ఏ విధమైన భయము లేదా? ” అని మణవాళ మామునుల హృదయం వారిని ప్రశ్నించెను. మణవాళమామునులు తమ హృదయము అడిగిన ఈ ప్రశ్నకు వారు సమాధానము ఇచ్చెను. ” ఓ నా ప్రియమైన హృదయమా! భయపడకుము! మాకు కలిగిన ఈ జ్ఞానము మా ఆచార్యులగు తిరువాయ్మొళి పిళ్ళైల నిష్కారణమైన కరుణచే పొందబడినది. ఆ జ్ఞానముతో వారి (తిరువాయ్మొళి పిళ్ళై) అనుగ్రహముచే ముక్తిని తప్పకుండ పొందెదనని విశ్వసించుచున్నాము. మా ఈ స్థితిని చూచి శ్రీ రామానుజులు మిక్కిలి సంతుష్టులై  వారు చేయవలసిన వాటిని వారే చేసెదరు. అందువలన మేము ఇంక భయపడము. నువ్వు కూడా దేనికిని భయపడరాదు.” అని మణవాళమామునులు సమాధానము చెప్పెను.

పాశురం 21

తిరుమలై ఆళ్వార్ తిరువాఇమొళిప్ పిళ్ళై సీరరుళాల్
తరుమ్ మది కొణ్డవర్ తమ్మై ఉత్తారకరాగ ఎణ్ణి
ఇరు మనమే! అవర్క్కాఇ ఎతిరాసర్ ఎమైక్ కడుగప్
పరమపదమ్ తనిల్ యేఱ్ఱువార్ ఎన్న బయమ్ నమక్కే!!!

ప్రతి పద్ధార్ధం

తిరుమలై ఆళ్వార్ – “శ్రీశైలేశర్” అను నామము గల
తిరువాయ్ మొళిప్ పిళ్ళై – తిరువాయ్ మొళిప్ పిళ్ళై
సీరరుళాల్ – నిష్కారణమైన కరుణచే వారు
తరుమ్ – నన్ను అనుగ్రహించి
మది – వారి దివ్యజ్ఞానమును
మనమే! – ఓ! నా మనసా
కొణ్డు – ఆ జ్ఞానము యొక్క ఆధారముగా,
ఇరు – దయచేసి ఉండు
ఎణ్ణి – దృఢమైన నమ్మకములో
అవర్ తమ్మై – ఇంతటి సహాయము చేసిన గొప్ప వారైన, తిరువాయ్ మొళిప్పిళ్ళై
ఉత్తారకరాగ – ఈ సంసారికబంధమునుండి ముక్తి ప్రసాదించిన.
ఎతిరాసర్ – ఎమ్పెరుమానార్,
అవర్క్కాఇ – మా ఆచార్యులగు తిరువాయ్ మొళిప్పిళ్ళైల కొరకు
యేఱ్ఱువార్ – పంపు
ఎమై – “స్వాచార్య అభిమానమే ఉత్తారకమ్” (శిష్యుని పై ఆచార్యుల అనుగ్రహం మాత్రమే శిష్యులను రక్షించును )అను విధిని పాటించు నన్ను,
కడుగ – తొందరగా
పరమపదమ్ తనిల్ – పరమపదమునందు
ఎన్న బయమ్ నమక్కే!!! – ఓ! నా మనసా! కావున మనము ఎందుకు భయపడవలెను!!! భయపడుటకు అవసరము లేదు ( ఆనందముగా నిద్రించ వచ్చు)

సామాన్య అర్ధం

ఎమ్పెరుమానార్లు మనను రక్షించెదరు, కావున మణవాళ మామునులు తమ మనసును భయపడవద్దని చెప్పెను. మణవాళ మామునుల ఆచార్యులగు తిరువాయ్ మొళి పిళ్ళై ల అనుగ్రహము వారితో ఉన్నందు వలన వారు శ్రీ రామానుజులు తమను రక్షించి పరమపదమునకు తీసుకెళ్ళునని దృఢముగా నమ్మెను. గురువు తమ శిష్యునిపై చూపు అనుగ్రహము మరియు తదుపరి వారు చూపు కరుణ మాత్రమే ఎమ్పెరుమానార్లను తమకు శీఘ్రముగా ముక్తి ప్రసాదించుటకు సహాయము చేయునని మణవాళ మామునులు తెలుసుకొనెను.

వివరణ

తిరుమలై ఆళ్వార్ అనునది వారి అసలు పేరు. తరువాత కాలములో వారికి తిరువాయ్ మొళి నందు ఉన్న గాఢమైన ఆసక్తి మరియు జ్ఞానముచే తిరువాయ్ మొళి పిళ్ళై అని ప్రసిద్ధి చెందెను. వారికి తిరువాయ్ మొళి తో ఉన్న సంబంధము మిక్కిలి  ప్రసిద్ధము. ఆ పేరు వారితో నిలిచిపోయెను మరియు వారిని గుర్తించుటకు ప్రత్యేక చిహ్నమైయెను. ఇట్టి తిరువాయ్ మొళి పిళ్ళై వంటి, గొప్ప ఆచార్యులు, వారి నిష్కారణమైన కరుణచే మమ్ము అనుగ్రహించి అత్యుత్తమ జ్ఞానమును ప్రసాదించెను అని మణవాళ మామునులు చెప్పెను. మణవాళ మామునులు అట్టి ఉత్తమ జ్ఞానము గ్రహించువారైయ్యెను. ఆ జ్ఞానమను ఉపాయముచే, మణవాళ మామునులు వారి హృదయముతో ” ఓ మా హృదయమా! గొప్ప ఆచార్యులగు తిరువాయ్ మొళి పిళ్ళై మనకు జ్ఞానమును ప్రసాదించెనని గుర్తుంచుకొనుము. వారే ఆ జ్ఞానముచే ఈ భౌతిక భాందవ్యములనుండి  ముక్తి ప్రసాదించెదరని తెలుసుకొనవలెను. కావున, ఓ మా మనసా! ఈ విషయమును దృఢముగా విశ్వసించవలయును.  అట్లు మనం ఈ విషయమును దృఢముగా నమ్మియుండిన యెడల, శ్రీ రామానుజులు మనపై దయ చూపి, మన ఈ స్థితిని చూచి మెచ్చెదరు. తరువాత వారు మన ఆచార్యుల గూర్చి తలచి, మనము శీఘ్రముగ పరమపదము చేరుటకు “ఏఱ్ఱరుమ్ వైకున్తమ్ (తిరువాయ్ మొళి 7.6.10)” అను ప్రబంధ వాక్యానుసారం అనుగ్రహించెదరు అని చెప్పెను. ఇంకనూ “మనమే నైయల్ మేవుదర్క్కే (ఇరామానుస నూఱ్ఱన్దాది 98)” లో చెప్పినట్లు ఏ విషయమునకును భయపడరాదు. శ్రీ రామానుజులు మనను కచ్చితముగా పరమపదమునకు చేర్చును, కావున మనము నిశ్చింతగా నిద్రించవచ్చును, అని తమ హృదయముతో పలికెను.

అడియేన్ వైష్ణవి రామానుజ దాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2016/08/arththi-prabandham-21/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a Comment