తిరువాయ్మొళి నూఱ్ఱందాది – సరళ వ్యాఖ్యానము – 51 – 60

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి క్రమము

<< తిరువాయ్మొళి నూఱ్ఱందాది – 41 – 50

పాశురం–51

అవతారిక: ఈ పాశురంలో ఆర్తి వలన భగవంతుడి దగ్గరకు దూతను పంపిన నమ్మాళ్వార్ల శ్రీసూక్తులను చెప్తున్నారు. ఆర్త రక్షణ పనిలో నిమగ్నమై ఉన్నందున మన ఆర్తినీ ఆయనకు తెలియజేయగానే తప్పకుండా మన పని చేసిపెడతాడని విశ్వసించారు. తిరువణ్ వండూర్ ఐశ్వర్యానికి ఆశ్చర్యమేసి అక్కడే అది ఉంటాను, అంతే. అని తలచారు ఆళ్వార్ నాయిక. అయినా ఆర్తిని తట్టుకోలేక పక్షులను దూతగా పంపిన నాయిక దశను ఇందులో వర్ణించారు.  ఆళ్వార్లు ‘వైకల్ పూజ్ఞళివాయ్’ అనుగ్రహించిన దశకానికి సంషిప్తంగా ‘వైకల్తిరువణ్ వండూర్‘ అని మామునులు కృప చేశారు.

 వైకల్ తిరువణ్ వండూర్ వైకుమిరామనుక్కెన్ * 
శెయ్ కైతనై పుళ్ళినజ్ఞాళ్ శెప్పుమెన క్కైకళిన్ద 
కాదలుడ న్ తూతువిడుజ్ఞారిమాఱన్ కళలే 
మేతినియార్  నీర్ వణజ్ఞుమిన్

ప్రతిపదార్థము :

మేతినియార్  = ఓ భూలోక వాసులు!
తిరువణ్ వండూర్ = తిరువణ్ వండూరులో
వైకల్ = ఎల్లప్పుడూ
వైకుమ్ = వేంచేసి ఉన్న
ఇరామనుక్కు = దశరథ చక్రవర్తి కుమారుడైన శ్రీరాముడికి
పుళ్ళినజ్ఞాళ్= ఓ పక్షి గుంపులారా !
ఎన్ శెయ్ కైతనై = నా ఈ దశను
శెప్పుమెన = తెలియజేయండి అని
క్కైకళిన్ద కాదలుడన్ = ఎంతో ఆశించి
తూతువిడుమ్ = పక్షులను దూతగా పంపిన
కారిమాఱన్ = నమ్మాళ్వార్ల
కళలే = శ్రీపాదాలకు
నీర్ వణజ్ఞుమిన్ = మీరు దాసోహలు సమర్పించండి

భావం : నమ్మాళ్వార్లు భగవద్విశ్లేషం సహించలేని దశలో ఉన్నప్పుడు సర్వేశ్వరుడు రాలేదు. అప్పుడు ఆళ్వార్లు ఒక ప్రేయసిగా, నాయిక అవస్థను పొంది  ప్రణయ రోషంతో ఉంది. అప్పుడెప్పుడో గజేంద్రుడు పిలవగా కాస్త ఆలస్యం చేసినట్టుగా ఇక్కడ కూడా భగవంతుడు రావడంలో కాస్త ఆలస్యం జరిగింది. ఆళ్వారు నాయిక కోపంతో ఇప్పటిదాకా ఎక్కడ, ఎవరితో ప్రణయం జరుపుతున్నావో అక్కడికే వెళ్ళు అని నిందించింది. సర్వేశ్వరుడు నాయిక ప్రణయ కోపాన్ని పోగొట్టి, అమెతో సంశ్లేషించారు. ఓ మనసా అంతటి భగవత్ ప్రావణ్యం ఉన్న నమ్మాళ్వార్ల శ్రీపాదాలను ఆశ్రయించు ‘ అని మనకు ప్రబోధించిన వృత్తాంతాన్ని ఈ తిరువాయ్ మోళిలో  వివరించారు.

 పాశురం–52 

అవతారిక: ఇందులో నమ్మాళ్వార్ నాయిక ప్రణయ రోషంతో చెప్పిన వాక్యాలను కృప చేస్తున్నారు. అది ఎలా అంటే తమ ఆర్తితో వెనకటి నాలుగు తిరువాయ్ మొళిలో శరణు పొందారు. విశ్లేషం సహించలేక దూతను పంపారు. అయినా ప్రయోజనం లేక పోయింది. తాను వెళ్లలేక పోవడం, ఆయన రాక పోవడం, ఇక నీతో చరను అని కలహించడం కృష్ణుడు ఆమె ప్రణయ  కోపాన్ని పోగొట్టి ఆమెతో చేరడం మొదలైనవన్నీ ఈ దశకంలో ఆళ్వార్లు చెప్పారు. దానిని సంక్షిప్తంగా మామునులు ‘ మిన్నిడైయార్ శేర్ కణ్ణన్‘ అనే ప్రస్తుత పాశురంలో చెప్పారు.

మిన్నిడైయార్ శేర్ కణ్ణన్ మెత్తన వన్దానెన్ఱు
తన్నిలై పోయ్ పెణ్ణిలయాయ్ తాన్ఱళ్ళి  ఉన్నుడనే
కూడేనెన్ఱూడుజ్ఞురుకైయర్ కోన్ తాళ్ తొళవే
నాళ్ తోఱుమ్  నెంజమే నల్గు 

ప్రతిపదార్థము :

మిన్నిడైయార్ = చక్కని లతలాంటి సన్నని నడుము గల స్త్రీలు
శేర్ = చేరిన
కణ్ణన్ = శ్రీకృష్ణుడు
మెత్తన వన్దానెన్ఱు =  ఆలస్యంగా వచ్చాడని
తన్నిలైపోయ్ = అళ్వార్లనే తమ స్థాయికి
పెణ్ణిలయాయ్ = గోపికల రూపాన్ని పొందిన
తాన్ తళ్ళి  = (తమ సంకేత స్థలానికి వచ్చిన కృష్ణుడిని) పట్టుకుని తోసివేసి
ఉన్నుడనే కూడేనెన్ఱూడుమ్ = నీతో చెరలేనని (ప్రణయ రోషంతో) కలహించిన
కురుకైయర్ కోన్ = నమ్మాళ్వార్
తాళ్ తొళవే = శ్రీపాదాలను సేవించడానికి
నెంజమే = ఓ మనసా!
నాళ్ తోఱుమ్ నల్గు = నువ్వు నిత్యము సహకరించాలి

భావం : నమ్మాళ్వార్ విశ్లేష దుఃఖాన్ని సహించలేక కోపంతో తమ అవస్థను పోగొట్టుకుని ఒక నాయిక అవస్థను పొందారు. భగవంతుడు మెల్లగా వచ్చాడు. అప్పుడు ఇంత సేపు ఎవరితో ఉన్నారో అక్కడికే వెళ్ళమని ప్రణయ రోషంతో చెప్పింది. సర్వేశ్వరుడు ఈమె కోపం చల్లారే విధంగా ప్రవర్తించి, సంశ్లేషించాడు.  ఓ మనసా! అంతటి భగవత్ ప్రావణ్యం ఉన్న నమ్మాళ్వార్ల శ్రీపాదాలను ఆశ్రయించు అని మనకు ప్రబోధించిన వృత్తాంతాన్ని ఈ తిరువాయ్ మోళిలో  వివరించారు.

 పాశురం–53 

అవతారిక: భగవద్విముఖులైన తమను కూడా భగవదభిముఖులుగా మార్చిన సర్వేశ్వరుడి అఘటితఘటనా సామర్ధ్యాన్ని అనుసంధించి ఆశ్చర్యపోయిన నమ్మాళ్వార్లతో స్వామి తమ విరుద్ద విభూతి యోగాన్ని చూపించగా, దానిని అనుసంధానం చేసుకుని సంతోషపడుతున్న దశను ‘నల్ కురవుమ్ శెల్వమ్‘ అనే దశకంలో చెప్పారు. దాని అర్థాన్ని ఈ ‘నల్లవత్తాల్‘ అనే పాశురంలో మామునులు అనుగ్రహించారు.

నల్లవలత్తాల్ నమ్మైచ్చేర్ త్తోన్ మున్నణ్ణారై
వెల్లుమ్ విరుత్త విభూతియనెన్ఱు ఎల్లైయఱ
త్తానిరున్డు వాళ్ త్తున్దమిళ్ మాఱన్ శొల్ వల్లార్
వానవర్కు వాయ్ త్తకురవర్ 

ప్రతిపదార్థము :

మున్నణ్ణారై వెల్లుమ్ = పూర్వ శత్రువులను జయించేవాడును
నల్లవలత్తాల్ = మంచి ఉపాయంతో (ఆట వస్తువులను లాక్కోవడం వంటి)
నమ్మైచ్చేర్ త్తోన్ = మా ప్రణయ కోపాన్ని తీర్చి తనతో చేర్చుకున్న కృష్ణుడు
విరుత్త విభూతియనెన్ఱు = విరుద్ద వస్తువులను తన విభూతిగా గలవాడని చెప్పి
ఎల్లైయఱ =  అంతులేకుండా
త్తానిరున్డు వాళ్ త్తుమ్ = తాము స్తోత్రం చేస్తున్న
త్తమిళ్ మాఱన్ = ద్రావిడ వేదానికి ఆచార్యుడైన నమ్మాళ్వార్లు సాధించిన
శొల్ల వల్లార్ = శ్రీ సూక్తులను అభ్యసించినవారు
వానవర్కు = నిత్యసూరులకు
వాయ్ త్తకురవర్ =  తగిన ఆచార్యులవుతారు

భావం : సర్వేశ్వరుడి మీద ప్రణయ కోపంతో ఉన్న నన్ను తన సామర్ధ్యంతో నా కోపాన్ని పోగొట్టి నాతో సంశ్లేషించిన స్వామి మహాత్మ్యం ఎంతో గొప్పది. ఆయన ఒకదానికొకటి విరుద్దంగా ఉన్న పదార్థాలను తనలో చేర్చుకునే సామర్థ్యం గలవాడు. అని నమ్మాళ్వార్లు సర్వేశ్వరుడిని స్తుతించి, ‘ఈ తిరువాయ్ మొళిని అనుసంధానం చేసేవారు ఇత్యసూరులకు కూడా ఆచార్యులు అవగలరు అన్నారు.

 పాశురం–54  

అవతారిక: ‘కురవై యాయ్ చ్చియర్’ అనే తిరువాయ్మొళిలో ఆళ్వార్ కృష్ణ చేష్టితాలను, దానికి హేతువైన పరమాత్మ దివ్య గుణాలను అనుభవంచారు. దానితో అంతులేని ఆనందాన్ని పొందిన ఆళ్వార్లు ఈ తిరువాయ్ మొళిని అనుగ్రహించారు. దానికి సంగ్రహంగా ‘కురవైముతలామ్’ అనే ఈ పాశురాన్ని మామునులు అనుగ్రహించారు.

కురవైముతలాజ్ఞణ్ణన్ కోల చేయల్ కళ్
ఇరవుపగలెన్నామలెన్ఱుమ్ పరావుమనమ్
పెర్రేనెన్ఱే కళిత్తుపేశుమ్ పరాజ్ఞుశన్ఱన్
శొర్రేనినెజ్ఞే తువళ్

ప్రతిపదార్థము :

కణ్ణన్ = శ్రీకృష్ణుడు
కురవైముతలామ్ = రాస నృత్యం చేయటం మొదలైన
కోల చేయల్ కళ్ = దివ్య చేష్టితాలను
ఇరవుపగలెన్నామల్ = రాత్రిపగలు అనే తేడా లేకుండా
ఎన్ఱుమ్ = ఎల్లప్పుడూ
పరవుమ్మనమ్ పెర్రేనెన్ఱు = స్తుతించి మనసుని పొందేనని
కళిత్తుపేశుమ్ = గర్వంగా చెప్పిన
పరాజ్ఞుశన్ఱన్ = ఆళ్వార్
శొల్ తేనిల్ = శ్రీసూక్తులనే తేనెలో
నెజ్ఞే = ఓ మనసా
తువళ్ = ఓలలాడు

భావం : ఓ మనసా! ఆళ్వార్లు శ్రీకృష్ణుడి రాసలీల మొదలైన అద్భుతమైన చేష్టితాలను అనుసంధానం చేసుకోగలిగిన భాగ్యం గలవారయ్యారు. ఆ ఆనందంతో వారు అనుగ్రహించిన ఈ పరమ భోగ్యమైన్ తిరువాయ్ మొళిని ఆదరంతో అనుసంధానం చేయి.

 పాశురం–55

అవతారిక:  ఈ పాశురంలో ఆళ్వార్లు భగవద్విషయంలో ఉన్న ప్రావణ్యాన్ని తమ శ్రీసూక్తులలో తెలియజేశారు. శ్రీకృష్ణ గుణ చేష్టితాలను అనుభవించారు. ఆ ప్రవాహం పొంగిపొరలి వీరికి శైథిల్యం కలిగించేంత ఉధృతంగా ఉండింది. దానివలన కలత పడ్డారు. తమకు త్రికరణాలలోనూ భగవద్విషయంలో కలిగిన ప్రావణ్యాన్ని ‘తువళిల్ మామణిమాడత్తు’ దశకంలో వర్షించారు. దాని సంగ్రహంగా మామునులు ఈ పాశురాన్ని అనుగ్రహించారు.

తువళఱుశీర్ మాల్ తిఱత్తు త్తొన్నలత్తాల్ నాళుమ్
తువళఱుతన్ శీలమెల్లా జ్ఞోన్నాన్  తువళఱవే
మున్నమనుపవిత్తిన్ మూళ్ కినిన్ఱ మాఱనతిల్
మన్ను మువప్పాల్  వన్ద మాల్ ! 

ప్రతిపదార్థము :

తువళఱ = దోష రహితంగా
మున్నమనుపవిత్తిన్ మూళ్ కినిన్ఱ మాఱన్ = మునుపే భగవదనుభవంలో మునిగి ఉన్న ఆళ్వార్లు
అతిల్ మన్నుమువప్పాల్  వన్దమాల్ = ఆ అనుభవంలో ఇమిడి ఉన్న ఆనందం వలన
తువళ్ అఱుశీర్ = హేయరహితమైన కళ్యాణ గుణములు గల
మాల్ తిఱత్తు = భగవంతుడి విషయంలో
త్తొన్నలత్తాల్ = స్వభావికమైన  భక్తి వల
నాళుమ్ = ప్రతి దినము
తువళఱు = భగవద్విషయంలో అచంచలమైన
తన్ శీలమెల్లామ్ = తమ స్వభావాలన్నింటినీ
శొన్నాన్ = కృపచేశారు

భావం : సర్వేశ్వరుడు నమ్మాళ్వార్లను అనుగ్రహించిన తరువాత అజ్ఞానం పూర్తిగా తొలగి, సర్వేశ్వరుడు సాక్షాత్కరించగా, ఆయన స్వరూపాన్ని పూర్తిగా అనుభవిస్తున్న ఆళ్వార్లు ఇంకా ఆ అనుభవం మీద వ్యామోహంతో, అఖిల హేయ ప్రత్యనీకుడు, సమస్త కల్యాణ గుణాలకు నాయకుడైన శ్రియఃపతి విషయంలో తమకు కలిగిన  ప్రావణ్యాయతిశయాన్ని ఈ తిరువాయ్ మొళిలో కృప చేశారు.

 పాశురం–56 

అవతారిక: ఈ పాశురంలో తమకున్నదంతా ఎలా తమను వదిలి పోయిందో తెలియుయజేస్తున్నారు. ‘ఏఱాళుమిఱైయాన్‘ తిరువాయ్ మొళిలో తాము త్యజించతలచుకున్న ఆత్మార్థమైన పదార్థాలన్నీ తమంతట తామే వదిలిపోయాయి. అందువల్ల ఆళ్వారు నాయకి శిథిలమై పోయిన విధానాన్ని తల్లిగారు సర్వేశ్వరుడితో నివేదించారు. అలా మొరపెట్టుకున్న విధాన్ని ‘మా లుడనే తాన్ కలన్ద’ తిరువాయిమొళిలో చెప్పారు. దాని సంగ్రహ రూపమే ఈ పాశురము.

మాలుడనే తాన్ కలన్దు వాళప్పెఱామైయాల్
శాల నైన్దు తన్నుడమై తానడైయ క్కోలియే
తానికళవేణ్డామఱ్ ఱన్నైవిడల్ శొన్మాఱన్
ఊనమఱశీర్ నేజ్ఞేయుణ్ 

ప్రతిపదార్థము :

మాలుడనే = ఎంబెరుమానుడితో
శాల నైన్దు = చాలా శిథిలమై
తన్నుడమై తానడైయ క్కోలియే తానికళవేణ్డామల్ = తన ఆత్మీయాలన్నింటినీ పూర్తిగా త్యజించ సిద్దపడినట్లుగా
తన్నైవిడల్ శొన్మాఱన్ = తనతోబాటుగా కాక అవి ముందడుగు వేయాలని కోరిన తమను, అవి పూర్తిగా వదలిన ప్రకారాన్ని సాధించిన నమ్మాళ్వార్ల
ఊనమఱశీర్ = దోషరహితమైన కళ్యాణ గుణములను
నేజ్ఞే = ఓ మనసా!
ఉణ్ = అనుభవించుమా!

భావం : ఈ తిరువాయ్ మొళిలో తాము కోరుకున్నట్లు సర్వేశ్వరుడిని అనుభవించాలని కోరుకున్నారు. కానీ అలా జరగలేదు. బాగా శిథిలమైపోయి తనవి అని చెప్పడానికి కూడా ఏమి మిగలకుండా పోయాయని ఆళ్వార్లు చెప్పుకున్నారు. తరువాత తమ మనుసుకు ఉపదేశించటం మొదలుపెట్టారు.  అలాంటి భగవత్ప్రావణ్యం ఉన్న ఆళ్వారుల కళ్యాణ గుణాలనే అనుభవించాలని చెప్పారు.

 పాశురం–57 

అవతారిక:  ఈ పాశురంలో తిరుక్కోళ్లూరుకు పోయిన విధానాన్ని తెలియజేస్తున్నారు. ఆళ్వారుల తల్లిగా పాడుతూ ‘మాలుక్కు వైయ్యమళంద మణాళరుక్కు’ అని మొదలు పెట్టి పాదాదికేశ పర్యంతం ఆయన తిరునామాలను చెప్పి మొఱ పెట్టుకుంది. పరవశంలో తెలివి తప్పి పడిపోయిన ఆళ్వార్ నాయిక మృతసంజీవని వంటి  స్వామి నామాలను వినగానే తెలివి తెచ్చుకుని లేచి తిరుక్కో ళూరికి పోవలనుకుంది. ఈ పాశురములో తల్లి తన కూతురి ఆర్తదశను వర్ణించింది. ‘ఉణ్ణుమ్ శోఱు‘ దశక భావన్నె ఈ పాశురంలో మామునులు అనుగ్రహిస్తున్నారు.

ఉణ్ణుమ్ శోఱాది ఒరు మూన్ఱూమ్ ఎమ్పెరుమాన్
కణ్ణన్ ఎన్ఱే నీర్మల్గి క్కణ్ణినైకళ్ మణ్ణులకిల్
మన్ను తిరుక్కోళూరిల్ మాయన్పాల్ పోమాఱన్
పొన్నడియే నన్దమక్కుప్పొన్ 

ప్రతిపదార్థము :

ఉణ్ణుమ్ శోఱాది = తినే ఆహారము, త్రాగే నీరు, భోగ్యంగా అనుభవించే తాంబూలం
ఒరు మూన్ఱూమ్ = ధారక పోషక భోగ్యమం అనే మూడు రకాల పదార్థాలు
ఎమ్పెరుమాన్ కణ్ణన్ ఎన్ఱు = ఎంబెరుమాన్ అయిన కృష్ణుడే
క్కణ్ణినైకళ్ నీర్మల్గి = రెండు కళ్ళలో నీరు చిప్పిల్లుచుండగా
మణ్ణులకిల్ మన్ను = ఈ భూలోకంలో స్థిరంగా ఉన్న
తిరుక్కోళూరిల్ = తిరుక్కోళూరిలో
మాయన్పాల్ పోమ్ = సర్వేశ్వరరుని దగ్గరకు పోయిన
మాఱన్ = ఆళ్వార్ల
పొన్నడియే = స్పృహణీయమైన శ్రీపాదలు
నన్దమక్కుప్పొన్ = మనకు ధనమగును

భావం : సర్వేశ్వరుడే ధారక, పోషక, భోగ్యాలని నిశ్చయించుకుని ఆనందంతో కళ్ళలో నీళ్ళు చిప్పిల్లుతుండగా తిరుక్కోళూరికే వేంచేస్తున్న నమ్మాళ్వార్ల శ్రీపాదాలే మనకు ధారక, పోషక, భోగ్యాలుగా ఉంటాయని అర్థం.

 పాశురం–58 

అవతారిక: ఆర్తి పారవశ్యం వలన దూతలను పంపిన తీరును ఆళ్వార్లు సంక్షిప్త రూపంగా ఈ పాశురాన్ని అనుగ్రహించారు. వాత్సల్యపూరితమైన నేత్రాలున్న స్వామిని పొందాలన్న త్వరలో ప్రయాణాన్ని పూర్తి చేయలేక తల్లాడిల్లి, ఆయన ఉండే క్షేత్రాలకు పక్షులను దూతగా వెళ్ళమని అడిగిన ‘పోన్నులగాళీరో’ అన్న పాశురాలకు సంక్షిప్తరూపంగా ‘పోన్నులగు‘ అనే ఈ పాశురం కృపచేశారు.

పొన్నులకు పూమి ఎల్లామ్ పుళ్ళినన్గట్కే వళజ్ఞి
ఎన్నిడరై మాలుక్కియమ్బుమెన – మన్ను తిరు
నాడు ముదల్ తూదు నల్గివిడుమాఱనైయే
నీడులగీర్ పోయ్ వణన్గుమ్ నీర్

ప్రతిపదార్థము :

పొన్నులకు పూమి ఎల్లామ్ = బంగారం వంటి భూమి అంతా
పుళ్ళినన్గట్కే వళజ్ఞి = పక్షుల గుంపులకే ఇచ్చి
ఎన్నిడరై = నా విశ్లేష దుఃఖాన్ని
మాలుక్కు = పరమాత్మకు
ఇయమ్బుమెన = చెప్పండని
మన్ను తిరునాడు ముదల్ = వైకుంఠం మొదలైన స్థలాలకు
తూదు నల్గివిడుమ్ = కోరి దూతలుగా పంపిన
మాఱనైయే = ఆళ్వార్లనే
నీడులకీర్ = భూలోక వాసులారా
నీర్ పోయ్ వణన్గుమ్ = మీరు వెళ్ళి ప్రణామాలు సమర్పించండి

భావం : నాయికావస్థను పొందిన నమ్మాళ్వార్లు పక్షులతో, ‘మీకు ఈ ఉభయ విభూతులను ఇస్తున్నాను. అందుకు ప్రతిగా మీరు నా విశ్లేష దుఃఖాన్ని సర్వేశ్వరుడి దగ్గరుకు దూతగా వెళ్ళి చెప్పండి’ అని ప్రార్థించారు. అదే విధంగా ఓ లోకులారా! మీరు మీ ఆర్తిని తీర్చుకోవడానికి పరమాత్మ దగ్గర పురుషకారం చేయడానికి ఆచార్యులుగా నమ్మాళ్వార్ల శ్రీపాదలనే ఆశ్రయించండి అని అర్థం.

పాశురం–59

అవతారిక: ఈ పాశురంలో విన్న శ్రోతల హృదయం ద్రవించిపోయేట్టుగా పాడారు. తమ ఆర్తిని విన్న ఘటకులు నడవలేక, నేల మీద చితికి బడటం చూస్తే విన్న వాళ్ళ ఆర్తి బోధపడుతుంది. ‘నీరాయ్ నిలనాయ‘ అనే దశకానికి,  ‘ నీరాకిక్కేట్టవర్గళ్‘ అనే ప్రస్తుత పాశురం అమరింది.

నీరాకిక్కేట్టవర్గళ్ నెన్జళకియ మాలుక్కుమ్
ఏరార్ విశుమ్బిల్ ఇరుప్పరితా  ఆరాత
కాతలుడన్ కూప్పిట్ట కారిమాఱన్ శొల్లై
ఓతిడవే ఉయ్యుమ్ ఉలగు 

ప్రతిపదార్థము :

క్కేట్టవర్గళ్ నెజ్ఞు = విన్నవారి మనసు
నీరాకి అళియ = నీరులా కరిగి శిథిలమగునట్లు
మాలుక్కుమ్ = సర్వేశ్వరునికి
ఏరార్ విశుమ్బిల్ ఇరుప్ప అరితా  = అతిశయించిన సౌందర్యము గల పరమపదంలో కాలు నలవలేని విధంగా 
ఆరాత కాతలుడన్ = ఎప్పటికీ తగ్గని ప్రీతితో
కూప్పిట్ట = పిలచిన
కారిమాఱన్ శొల్లై = ఆళ్వార్ల శ్రీసూక్తిని
ఓతిడవే = నేర్చుకుంటే
ఉలకు ఉయ్యుమ్ = లోకం ఉజ్జీవిస్తుంది 

భావం : సర్వేశ్వరుడి శ్రీపాదాలను చేరుకోవాలనే అభినివేశాధిక్యంతో నమ్మాళ్వార్లు సాయించిన ఈ తిరువాయ్ మోళిని విన్నవారి మనసే కాక సమస్త అవయవాలు కరిగి నీరై పోతాయని, సర్వేశ్వరుడు ఇక పరమపదంలో ఉండలేక నమ్మాళ్వార్లను ఆయన దగ్గరకు చేర్చే శక్తిగల ఈ శ్రీసూక్తులను నేర్చుకున్న వాళ్ళు సంసారం నుండి విముక్తులై  ఉజ్జీవిస్తారు .

 పాశురం–60

అవతారిక: ఈ పాశురంలో శ్రీవేంకటేశ్వరుడి శ్రీపాదలను ఆశ్రయించే దశకాన్ని సంక్షిప్తంగా చెప్పారు. వెనకటి పాశురాలలో ఆర్తి పారవశ్యం చేత సర్వేశవ్వరుడిని నమ్మాళ్వార్లు గట్టిగా పిలిచారు. ప్రాప్యం కాని ఐశ్వర్య, కైవల్యాలను పక్కకు పెట్టి శ్రియఃపతి శ్రీపాదలనే పరమ ప్రాప్యంగా నిర్దారించుకున్నారు. పిరాట్టి పురుషకారంతో, తమ ఆకించిన్యాన్ని అనుసంధానం చేస్తూ ‘ఉలగముండ పెరువాయా ‘అనే దశకన్నీ పాడారు. ఆ దశక సంక్షిప్తరూపంగా ఈ పాశురం అమరింది.

ఉలకుయ్యమాల్ నిన్ఱ ఉయర్ వేజ్ఞడత్తే
అలర్ మగళై మున్నిట్టవన్ తన్ మలరడియే
వణ్ శరణాయ్ చ్చేర్ న్ద  మకిళ్ మ్మాఱన్ తాళిణైయే
ఉన్ శరణాయ్ నెజ్ఞమే ఉళ్

ప్రతిపదార్థము :

ఉలకుయ్య = లోకం ఉజ్జీవించడానికి
మాల్ నిన్ఱ = సర్వేశ్వరుడు వేంచేసి ఉన్న
ఉయర్ వజ్ఞడత్తే = ఎత్తైన తిరుమలలో
అలర్ మకళై మున్నిట్టు = పెరియపిరాట్టి అయిన లక్ష్మీదేవిని పురుషకారంగా పురస్కరించుకుని
అవన్ తన్ = ఆ సర్వేశ్వరుడి
మలరడియే = శ్రీపాదకమలములనే
వణ్ శరణాయ్ చ్చేర్ న్ద = నిర్దారితమై ఉపాయంగా ఆశ్రయించిన
మకిళ్ మ్మాఱన్ = వకుళపూల మాల ధరించిన మాఱన్
తాళిణైయే = శ్రీపాదాలనే
నెజ్ఞమే = ఓ మనసా!
ఉన్ శరణాయ్ = నీకుపాయంగా
ఉళ్= భావించు

భావం : ఓ మనసా! సమస్త జీవులు ఉజ్జీవయించడానికి ఎంతో ఎత్తైన కొండలైన తిరుమలలో వేంచేసి ఉన్న శ్రీనివాసుడు శ్రీపాదాలను లక్ష్మీదేవి పురుషకారంతో శరణు పొందిన నమ్మాళ్వార్ల శ్రీపాదాలను నువ్వు ఉపాయంగా చేసుకొని ఉజ్జీవించు.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము: https://divyaprabandham.koyil.org/index.php/2020/10/thiruvaimozhi-nurrandhadhi-51-60-simple/

పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org