సప్తగాథై – పాశురము 1 – భాగము 1

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః

సప్తగాథై

<< మునుపు భాగము

అవతారిక
హారీతస్మృతి [8-141] లో అనుగ్రహించినట్లుగా “ప్రాప్యస్య బ్రహ్మణో రూపం ప్రాప్తుశ్చ ప్రత్యగాత్మనః, ప్రాప్త్యుపాయం ఫలం ప్రాప్తేః తథా ప్రాప్తి విరోధి చ, వదంతి సకలా వేదాః సేతిహాస పురాణకాః, మునయశ్చ మహాత్మానః వేద వేదాంత వేదినః”. దీని అర్ధాన్ని ఈ విధముగా వివరిస్తున్నారు. వేదాలన్నీ కూడా ఏకగ్రీవంగా ఇతిహాస పురాణాదులతో కలిపి, ఆ వేద వేదాంతాలను  తెలిసిన మహాత్ములైన మునులు, అందరూ కూడా ఏకగ్రీవంగా ఒకటే పలుకుతున్నారు. అదే “అర్థపంచక జ్ఞానము”. పొందదగినవాడైన పరబ్రహ్మ యొక్క స్వరూపాన్ని, దానిని పొందేవాడైన జీవాత్మ యొక్క స్వరూపాన్ని, ప్రాప్తి యొక్క ఉపాయాన్ని, ప్రాప్తి ఫలాన్ని అదే విధముగా ప్రాప్తి యొక్క విరోధి స్వరూపాన్ని. ఈ విషయాన్నే శ్రీవిళాఞ్జోలైప్పిళ్ళై అనుగ్రహిస్తున్నారు. ఎవరైతే తమ అపారమైన దయతో వేదవాక్యమందు ప్రకాశింప చేసిన ఈ అర్థపంచక జ్ఞానాన్ని, వాటి సంగ్రహమైన మరియు సారమైన తిరుమంత్రములోని మూడు పదాల వలన, ఆళ్వార్ల పాశురాలు వలన అవశ్యం తెలియవలసి ఉన్నదో అదే ఈ అర్థపంచక జ్ఞానమనీ, ఆ విషయాన్ని సదుపదేశము చేసినవాడే సదాచార్యుడు (నిజమైన ఆచార్యుడు) అనే విషయాన్ని శ్రీవిళాఞ్జోలైప్పిళ్ళై గారు తమ దృష్టిలో పెట్టుకొని మొదటి పాశురాన్ని అనుగ్రహిస్తున్నారు.
పాశురము

అమ్బొన్ అరఙ్గర్ క్కుమ్ అవిక్కుమ్ అన్తరఙ్గ
శమ్బన్దమ్ కాట్టిత్ తడై కాట్టి – ఉమ్బర్
దివమెన్నుమ్ వాష్ ఉక్కు చ్చేర్ న్ద నెఱి కాట్టుమ్
అవన్ అన్ఱో ఆచారియన్

ప్రతిపదార్థము

అమ్ : అందమైన
పొన్ : పవిత్రమైన
అరఙ్గర్ క్కుమ్ : శ్రీరంగంలో వేంచేసి ఉన్న పెరియ పెరుమాళ్ళకు అంటే శ్రీరంగనాథునకు
అవిక్కుమ్ : జీవాత్మ వర్గానికి బద్ధులు (సంసారములో బంధింపబడి ఉన్నవారు), ముక్తులు (ఈ సంసారము నుంచి ముక్తులై పరమాత్మను చేరినవారు), నిత్యులు (ఎల్లప్పుడూ పరమాత్మ వద్ద ఉన్నవారు)
అన్తరఙ్గ శమ్బన్దమ్ : అంతరంగ సంబంధాన్ని అనగా మిక్కిలి దగ్గరగా ఉన్న సంబంధాన్ని
కాట్టి : తెలియ చెప్పి
త్తడై కాట్టి : స్వరూప విరోధి మొదలైన విరోధుల స్వరూపాన్ని తెలిపి
ఉమ్బర్ దివమెన్నుమ్: నిత్య, ముక్త స్థానమైన పరమపదంలో స్థిరంగా ఉండి నిత్య కైంకర్యాలు చేయడమనే
వాష్ ఉక్కు : ఉజ్జీవనాన్ని
చ్చేర్ న్ద : అనుగుణమైన
నెఱి : ప్రపత్తి మార్గాన్ని
కాట్టుమ్ అవన్ అన్ఱో: ఎవరైతే తిరుమంత్రము ద్వారా ఉపదేశము చేస్తారో
ఆశారియన్ : వారే అసలైన ఆచార్యులు.

సంగ్రహ అర్థం

ఎవరైతే అందమైన స్పృహణీయమైన శ్రీరంగంలో నిత్య వాసము చేసే 1) శ్రీపెరియ పెరుమాళ్ళకు మరియు 2) మూడు విధమైములైన బద్ధ, ముక్త, నిత్య ఆత్మలకు ఉన్న సంబంధాన్ని (శేష – శేషి భావ రూప) అంతరంగ సంబంధాన్ని తెలియజేసి, స్వరూప విరోధి మొదలైన, విరోథి స్వరూపాలను తెలియ చెప్పి నిత్యసూరుల స్థానమైన పరమపదంలో నిత్యకైంకర్యాలు చేయడమనే ఉజ్జీవనానికి అనురూప మార్గమైన ప్రపత్తి తిరుమంత్రం ఉపదేశరూపముగా చూపిన వాడే కదా ఆచార్యుడు అంటే.

వ్యాఖ్యానము:
అమ్ పొన్ అరఙ్గర్ క్కుమ్: ముముక్షుప్పడి 5వ సూత్రము నందు శ్రీపిళ్ళైలోకాచార్యుల వారు అనుగ్రహిస్తారు “సంసారిగళ్ తఙ్గళైయుమ్ ఈశ్వరనైయుమ్ మఱన్దు” (సంసారులు తన స్వరూపాన్ని ఈశ్వర స్వరూపాన్ని మఱచి) ఇత్యాది వాక్యాలలో అర్థపంచకాన్ని ఉపదేశము చేసినవారే ఆచార్యులు అని. శ్రీవిళాఞ్జోలైప్పిళ్ళై వారు కూడా దానిని పురస్కరించుకొని తెలుపుతూ “కాట్టుమ్ అవన్ అన్ఱో ఆశారియన్” అని అంటున్నారు. శ్రీపిళ్ళైలోకాచార్యుల వారిని అనుసరించిన వారు కదా వీరు “పేశిత్తే పేశుమ్” (పూర్వులు పలికిన దానిని తిరిగి పలికే) ఇలా కైంకర్యాన్ని కలిగి ఉండడమనేది మన పూర్వాచార్యులకే కదా ఉన్నది.

వాదికేసరి కారిక” లో చెప్పబడినట్టుగా “ఉకార్థ విశదీకార యుక్తార్ధాంతరబోధనమ్ మతం వివరణం తత్ర మహితానాం మనీషీనమ్” (పెద్దలుచే చెప్పబడిన అర్ధాన్ని విశదీకరించడంతో పాటు, దానికి సంబంధించిన వేరొక అర్ధాన్ని బోధించడాన్ని వివరణమని అంటారు. తిరుమంత్రములోని మొదటి పదము ప్రణవము (ఓమ్) అసంహితాకారములో పద త్రయాత్మకమై ఉంటుంది. అనగా మూడు పదములు కలిగినదై  ఉంటుంది (అకార, ఉకార, మకారములు) అ ప్రణవము చేత ప్రతిపాదింపబడే అర్ధవిశేషాలకు ఉపయుక్తమై, అందులో చెప్పబడిన అర్ధవిశేషాలను సాక్షాత్తు ప్రతిపాదిస్తూ, మంత్ర శేషమైన పద ద్వయాత్మకమైన “నమః నారాయణాయ” అనే రెండు పదాలను కలిగినదై, మంత్రశేష ప్రణవానికి వివరణమై ఉండే రీతిలో ఉంటుంది. అందువలన తిరుమంత్రములో ప్రణవము అనేది రెండు పదములలో విశదీకరించబడి ఉన్నది.

తైత్తిరీయ ఉపనిషత్తులో చెప్పినట్టుగా “తస్య ప్రకృతి లీనస్య యః పరః స్స మహేశ్వరః” (వేదాలు ప్రణవములో లీనమవుతున్నాయి. తిరుమంత్ర అర్ధం శ్రీమన్నారాయణుడే) “అకారో విష్ణువాచకః” (అకారము విష్ణువుని బోధించే శబ్దము). తిరుచ్చన్దవిరుత్తమ్ [4] లో “తుళక్కమిల్ విళక్కమాయ్” అని ఆళ్వార్లు అనుగ్రహించినట్టుగా (అనాది అయిన జ్యోతి స్వరూపుడు, అకారముచే ప్రకాశింపబడేవాడు) అని, సంస్కృత వ్యాకరణములో “అవ-రక్షణే” అనే ధాతు పాఠం ప్రకారం శ్రియఃపతి అయిన సర్వేశ్వరుని రక్షకత్వ, శేషత్వ, శబ్దతః ప్రతిపాదించే చతుర్థీ,  విభక్తితో కూడిన అకారము యొక్క అర్ధాన్ని, అందులో చెప్పబడిన రక్షణానికి ఉపయోగించే కళ్యాణ గుణాలను శబ్దంగా తెలుపడము చేత దాని వివరణ రూపమైన నారాయణ శబ్దం యొక్క అర్ధాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పాశురాన్ని పలుకుతున్నారు శ్రీవిళాఞ్జోలైప్పిళ్ళై స్వామి వారు.

అమ్ పొన్ అరఙ్గర్ క్కుమ్: ‘అమ్ పొన్ అరఙ్గర్ క్కుమ్’ అంటూ ప్రారంభం చేస్తున్నారు. అరఙ్గర్ క్కుమ్ అమ్ పొన్. అమ్ అని అనడంలో అందమైన, మరి పొన్ అని అనడం వలన పావనమైన శ్రీరంగ మహానగరాన్ని నివాసముగా కలవాడా అనే రీతిలో తనకు నివాసభూమిగా కలిగినవాడై, సర్వరక్షకుడై, సర్వశేషియై, అశరణ్యశరణ్యాది కళ్యాణ గుణాలతో భూషితుడై ఉన్న శ్రీరంగనాథునకు అని అర్ధము. శ్రీమథురను శుభ (శోభనమైన), అని పాపహరా (పాపాలను హరించేది అని) చెప్పే రీతిలో శ్రీరంగాన్ని తెన్ అరఙ్గమ్ (దక్షిణ దిక్కున ఉన్న శ్రీరంగం అని) పొన్ అరఙ్గమ్ (పావనమైన శ్రీరంగం అని) వ్యవహరించడము వలన మథుర వలె ఇదే కదా భోగ్యమై పావనమై ఉన్నది. దీని భోగ్యతకు మూల కారణములు అనుగ్రహిస్తున్నారు. పెరియాళ్వార్ తిరుమొళి [4-8-7] లో అనుగ్రహించినట్టుగా “తెళిప్పుడయ కావిరి వన్దడి తొళుమ్ శీర్ అరఙ్గమ్” (నీటి సమృద్ధిని కల కావేరి నది వచ్చి శ్రీచరణాలను సేవించే సిరిగల శ్రీరంగం) అని, పెరియాళ్వార్ తిరుమొళి [4-8-4] లో “తేన్ఱొడుత్త మలర్ శోలై తిరువరఙ్గమ్” (తేనెలు స్రవించే సిరిగల శ్రీరంగమ్) అని, పెరియాళ్వార్ తిరుమొళి [4-9-10] లో అనుగ్రహించినట్టుగా “ఇనితాక తిరుక్కుణ్ వళర్ కిన్ఱ తిరువరఙ్గమ్” (భోగ్యముగా శ్రీరంగనాథుడు శయనించి ఉండే శ్రీరంగం) అని పలికే రీతిలో అనుగ్రహిస్తూ అందమైన శ్రీరంగాన్ని జల వైలక్షణ్యముతో, ఛాయా వైలక్షణ్యముతో స్థల వైలక్షణాన్ని తెలుపుతున్నారు. ఇహ పావనత్వానికి గల కారణాలు అనుగ్రహిస్తున్నారు పెరియాళ్వార్ తిరుమొళి [4-9-6] “తిశై విలక్కాయ్ నిఱ్కిన్ఱ తిరువరఙ్గమ్” (దక్షిణదిక్కున దీపంగా నిలిచి ఉన్న శ్రీరంగం) అని పెరియాళ్వార్ తిరుమొళి [4-9-7] “శెళుమణికళ్ విట్టెఱిక్కుమ్ తిరువరఙ్గమ్” (గొప్ప మణులు కొట్టుకొని వచ్చే శ్రీరంగం) అని పలికే రీతిలో అజ్ఞానాంధకార నిరోధిత్వాన్ని చెబుతున్నారు. ఈ విధంగా పెరియ పెరుమాళ్ కి గల ఉభయలింగత్వాన్ని హేయ ప్రతిభటత్వమనే లింగ పావనత్వాన్ని సమస్త కళ్యాణ గుణాకరత్వమనే లింగ భోగ్యత్వాన్ని తెలుపుచున్నది కనుక శ్రీరంగానికి ఆ లక్షణాలు కలిగి ఉండి, శ్రీరంగనాధుడు ఆ లక్షణం అనుగ్రహించేవాడుగా, ఎందువలన అంటే “తమ్మైయే నాళుమ్ వణఙ్గి త్తొళువార్ క్కు తమ్మైయే యొక్క అరుళ్ శెయ్ వర్” (తననే నిత్యం నమస్కరించి కొలిచే వారికి తనతో సామ్యాన్ని అనుగ్రహిస్తాడు) అనే రీతిలో తనను సదా ఆశ్రయించే వారికి తనతో సామ్యాన్ని అనుగ్రహించేవాడే భగవానుడు.

శ్రీరంగనాథుని కూడా ఒక విశేష వస్తువుని (శ్రీరంగాన్ని) పురస్కరించుకొని నిరూపించ వలసి ఉన్నది కదా అందుకే “అమ్ పొన్ అరఙ్గర్ క్కుమ్” అన్నారు. ఇది ఏ విధముగా అనగా తిరువాయ్మొళి [5-6-11] “తిరుమాల్ అడియార్ కళ్” శ్రియఃపతికి దాసులు అనే రీతిలో భగవానుని పురస్కరించుకొని అతని దాసులను నిరూపించినట్లే, భగవానునికి శేషమై ఉండే వానితో కదా అతను నిరూపింప బడతాడు సుందరకాండ [28. 10] వ శ్లోకములో అనుగ్రహించినట్టుగా “రామానుజం లక్ష్మణపూర్వజం చ” అన్నట్టుగా శ్రీరాముని తమ్ముని (లక్ష్మణుని), లక్ష్మణుని అన్నను (శ్రీరాముని) అని కదా చెప్పబడుచున్నది. ఈ అర్ధాన్ని సొగసుగా వివరిస్తున్నారు. శేష భూతుడైన లక్ష్మణుని శ్రీరాముని నామాన్ని పురస్కరించుకొని “రామానుజమ్” అని శేషభూతుడైన ఆ లక్ష్మణుని పురస్కరించుకొని “లక్ష్మణ పూర్వజమ్” అని శ్రీరాముని నిర్దేశించినట్టుగా వివరిస్తున్నారు.

అమ్ పొన్ అరఙ్గర్ క్కుమ్: నాచ్చియార్ తిరుమొళి [11. 2] లో ఆండాళ్ తల్లి అనుగ్రహించినట్టుగా “ఎన్ అరఙ్గత్తు ఇన్ అముదర్, కుళల్ అళగర్, వాయళగర్” శ్రీరంగములో వేం చేసి ఉండే తీయని అమృతం వలే భోగ్యుడు కేశ సుందరుడు అధర సుందరుడు అని తిరునెడున్దాన్డకంలో “అరఙ్గమేయ అన్దణనై” (ఒక పవిత్రమైన వాడు శ్రీరంగములో వేంచేసి ఉన్నాడు) మొదటి ప్రమాణం వలన సౌందర్యం రెండవ ప్రమాణం వలన పావనత్వం రెండు కూడా శ్రీరంగనాథునికే చెప్పవచ్చు, దీని వలన సమస్త కళ్యాణ గుణాత్మకత్వం అఖిల హేయ ప్రత్యనీకత్వం అనే ఉభయ లింగత్వం చెప్పబడినది. ఈ విధముగా శ్రీవిళాఞ్జోలైప్పిళ్ళైగారు “అమ్ పొన్” అని అనడంలో పెరియ పెరుమాళ్ యొక్క నిరూపకత్వాన్ని అనుగ్రహిస్తున్నారు పిళ్ళైలోకాచార్యులవారి శ్రీవచనభూషణ గ్రంథమందు పురుషకారవైభవంలో “పురుషాకారం అమ్బోదు కృపైయుమ్, పారతంత్య్రముమ్, అనన్యార్హశేషత్వం వేణుమ్”. పురుషకారం చేసేటప్పుడు కృప, పారతంత్య్రము, అనన్యార్హశేషత్వము కల్గి ఉండాలి. అని ఇత్యాదిగా చెప్పబడే పురుషకార వైభవాన్ని “అమ్ పొన్” అనే విశేషణాలతో సూచించారు శ్రీ విళాఞ్జోలైప్పిళ్ళై గారు. ఎందువలన అనగా “అహంతా బ్రహ్మణస్తస్య సాహమస్మి సనాతనీ” (సనాతనుడైన నేను ఆ పరబ్రహ్మ యొక్క అహమర్ధాన్ని) అని ముముక్షుప్పడిలో “ఇవలోడే కూడియ వస్తు వినుడైయ ఉన్మై” (లక్ష్మితో కూడియే పరతత్వము యొక్క సత్త ఉంటుంది అని) చెప్పబడే రీతిలో అరఙ్గర్ క్కుమ్ అనే చోట లక్ష్మీ దేవి సంబంధం భగవత్స్వరూపాంతర్గతరంగా చెబుతున్నారు శ్రీవిళాఞ్జోలైప్పిళ్ళై గారు.

ఇహ మరియొక అర్ధాన్ని అనుగ్రహిస్తున్నారు:

అమ్ పొన్ అని అంటూ ఉన్న రెండు విశేషణాలు ఇంకా వివరిస్తున్నారు “కామదం కామగం కామ్యం కారుణ్యం రంగ సంజ్ఞకమ్” (అన్ని అభీష్టాలను ఇచ్చేది కామ గమనాన్ని కలిగినది, అభిలషించతగినది రంగం అనే పేరు గలది అయిన విమానం అని చెప్పబడడం వలన శ్రీరంగానికి శ్రీరంగరాజస్తవము [67] లో చెప్పబడినట్టుగా “సఖ్యం సమస్త జన చేతసి సందథానం” (సమస్త జన మనసులలో సుఖ్యాన్ని కలిగించేవానిని) అని అనుగ్రహించినట్టుగానూ “రతిం గతో యతస్తస్మాత్ రంగ మిత్యుచ్యతే బుధై:” శ్రీరంగనాథుడు ఆదరాన్ని పొందేడు కనుక పండితుల చేత ఈ క్షేత్రం రంగమని చెప్పబడుతున్నది అనే రీతిలో శ్రీరంగనాథుడు నిరతిశయ ఆనందాన్ని వర్ధిల్ల చేసేదిగా ఉన్నందున “కోయిల్” ను శ్రీరంగం అని వ్యవహరిస్తున్నారు.

అడియేన జ్యోతిర్మయి రామానుజ దాసి

మూలము: https://divyaprabandham.koyil.org/index.php/2022/12/saptha-kadhai-pasuram-1-part-1/

పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org