శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః
పరిచయము:
మణవాళ మామునులు ఈ పాశురములో, శ్రీ రామానుజులను ఆపాదమస్తకం కీర్తిస్తూ మంగళాసాననాలు అందిస్తున్నారు. అనేక ఇతర తత్వవేక్తలతో చర్చించిన తరువాత శ్రీ రామానుజులు అలసిపోయి ఉంటారని మణవాళ మామునులు భావిస్తున్నారు. శ్రీ రామానుజులు శ్రీ భాష్యం మరియు తిరువాయ్మొళి రూపములో తన చేతిలో ఉన్నట్టుగా మణవాళ మామునులు భావిస్తున్నారు. ఇలా అద్భుతంగా ఆసీనులై ఉన్న శ్రీ రామానుజులను మణవాళ మామునులు తలంచుకుంటూ వారి తిరుమేని యొక్క ప్రతి భాగాన్ని కీర్తిస్తూ, చిర కాలం వర్ధిల్లాలని కోరుకుంటారు.
పాశురము 30
శీరారుం ఎదిరాశర్ తిరువడిగళ్ వాళి
తిరువరైయిల్ శాఱ్ఱియ శెందువరాడై వాళి
ఏరారుం శెయ్యవడివు ఎప్పొళుదుం వాళి
ఇలంగియ మున్నూల్ వాళి ఇణై త్తోళ్గళ్ వాళి
శోరాద తుయ్య శెయ్య ముగచ్చోది వాళి
తూముఱువల్ వాళి తుణైమలర్ క్కణ్గళ్ వాళి
ఈరా ఱు తిరునామ మణింద ఎళిల్ వాళి
ఇని తిరుప్పోడెళిల్ ఞ్ఙానముత్తిరై వాళియే!!!
ప్రతి పద్ధార్ధములు
వాళి – చిరకాలం జీవించు!!!
ఎదిరాశర్ – శ్రీ రామానుజులు
తిరువడిగళ్ – మనోరంజకమై మన శిరస్సులకు ఆభరణము లాంటి వారి పాద పద్మలు
శీర్ ఆరుం – మంగళ గుణాలతో నిండి ఉన్న
వాళి – చిరకాలం జీవించు!!
శెందువరాడై – ప్రకాశవంతమైన సూర్యుని రంగుతో ఉన్న కాషాయ వస్త్రం
శాఱ్ఱియ – శ్రీ రామానుజులు ధరించిన
తిరువరైయిల్ – వారి తిరుమేని
వాళి – చిరకాలం జీవించు!!!
ఎప్పొళుదుం – అన్ని సమయాల్లో
శెయ్యవడివు – దివ్య తేజోమయమైన వారి దివ్య మంగళ విగ్రహము
ఏరారుం – అంతటా సౌందర్యముతో నిండి ఉన్న
వాళి – చిరకాలం జీవించు!!!
ఇలంగియ మున్నూల్ – వారు గొప్ప వేదోపాసకులన్న వాస్థవాన్ని స్థాపింపజేసే యజ్ఞోపవీతము. వారి శరీరముపై సాయంకాలపు ఆకాశములో మెరుపు లాంటి ఆ దారము చిరకాలము వర్ధిల్లాలి!!!
వాళి – చిరకాలం జీవించు!!!
ఇణై త్తోళ్గళ్ – 1) బంగారు కల్పవృక్షపు కొమ్మలను పోలి ఉన్న భుజాలు (2) మోక్షాన్ని ఇవ్వగలిగేవి (3) మనిషిని బంధవిముక్తులను చేసే శక్తిని కలిగి ఉన్నవి (4) ఉద్ధరించి మోక్షాన్ని ఇవ్వగలిగే కారణంగా పుష్ఠిగా ఆరోగ్యంగా కనిపించే భుజాలు (5) అందమైన తులసి మాలలతో అలంకరించబడి ఉన్న భుజాలు.
వాళి – చిరకాలం జీవించు!!!
శోరాద తుయ్య శెయ్య ముగచ్చోది – అనంత పరిశుద్దమైనవి శ్రీ రామానుజుల భుజములు. దీనికి కారణము (1) శ్రీమన్నారాయణుడు మరియు వారి భక్తులను చూచుట ద్వారా పొందిన ఆనందము (2) భక్తేతరులైన వారి వాద్వివాదనలను నశ్వరం చేసిన కారణంగా.
వాళి – చిరకాలం జీవించు!!!
తూముఱువల్ – ముఖం మీద స్వచ్ఛమైన, ప్రకాశవంతమైన, అప్పుడే వికసించిన పువ్వుని పోలి ఉన్న అందమైన చిన్ని చిరుమందహాసము. ఆ చిరుమందహాసము (1) శరణార్థులను రక్షించడం వలన (2) భగవత్ సంబంధం వలన వచ్చినది.
వాళి – చిరకాలం జీవించు!!!
తుణైమలర్ క్కణ్గళ్ – వారి దివ్య నేత్రయుగళి (ఎ) శ్రీరంగశ్రీ (పెరియ పెరుమాళ్), (బి) శ్రీ రామానుజుల చేత సరిదిద్దబడిన శ్రీవైష్ణవశ్రీ (ఈ ప్రపంచములో శ్రీ రామానుజుల దివ్య పాదముల యందు శరణాగతులైన వారందరూ ఇందులోకి వస్తారు). ఆ దివ్య నేత్రములు అతని యందు శరణాగతులైన వారందరినీ కరుణతో చూస్తాయి. వారి దివ్య చూపు మనపై పడి మనల్ని పరిశుద్దులను చేస్తాయి.
వాళి – చిరకాలం జీవించు!!!
ఈరాఱు తిరునామ మణింద ఎళిల్ – మెరిసే గులాబీ వంటి వారి తిరుమేనిపై పన్నెండు దివ్య ప్రశాంతమైన “తిరుమన్ కాప్పు” / “ఊర్ధ్వ పుండ్రాలు”. బంగారపు పర్వతంపైన (శ్రీ రామానుజులు దివ్య శరీరము) తెల్లని తామరలు (తిరుమన్ కాప్పు) చూసినట్లుంది. ఈ తిరుమన్ కాప్పు ముందు వివరించిన శ్రీ రామానుజుల మంగళ గుణములకు ప్రతీకగా నిలిచి శ్రీవైష్ణవశ్రీని నలుమూలలా వ్రాపించేలా చేస్తుంది.
వాళి – చిరకాలం జీవించు!!!
ఞ్ఙానముత్తిరై – “పర తత్వ” జ్ఞానమును అందిస్తున్న శ్రీ రామానుజుల జ్ఞాన ముద్ర
ఇని తిరుప్పోడు – పద్మాసనములో ఆసీనులై ఉన్న
యెళిల్ – అందమైనది (సంస్కృత తమిళ వేదముల సారముకి ప్రతీక అయిన ముద్ర కాబట్టి)
సరళ అనువాదము:
ఈ పాశురములో, మణవాళ మామునులు శ్రీ రామానుజులకు మంగళాసాసనాలు పాడుతున్నారు. వారి దివ్య పాద పద్మాల నుండి ప్రారంభించి, వారు ధరించిన కాశాయ వస్త్రాలకి, వారి దివ్య తిరుమేనికి, వారి బ్రహ్మ సూత్రం, వారి బలమైన భుజాలకు, వారి అందమైన చిరుమందహానికి, కృపతో నిండి ఉన్న నేత్రములకు, వారి ఊర్ధ్వపుండ్రాలకు, చివరకు వారి జ్ఞాన ముద్రకి మంగళాసాసనాలు పాడుతున్నారు.
వివరణ:
ఈ పాశురములో, మణవాళ మామునులు శ్రీ రామానుజులను కీర్తిస్తున్నారు. వారు శ్రీ రామానుజుల దివ్య పాద పద్మాల నుండి మంగళం పాడడం ప్రారంభించి, వారి దివ్య పాదాలు నిత్యం వర్ధిల్లాలని కోరుకుంటున్నారు. వారి దాసులు ఆతృతగా అభిలషించే స్వరూప, రూప, గుణము వంటి మంగళ గుణాలతో సంపూర్ణుడైన శ్రీ రామానుజులు, యతులకందరికీ నాయకుడి వంటివారు. “అమరర్ సెన్నిపూ (తిరుకురుందాండగం 6)”, “ఇరామానుశన్ అడిప్పూ (ఇరామానుశ నూఱ్ఱందాది 1)” గా వర్ణించబడినట్లుగా, శ్రీ రామానుజుల దివ్య పాద పద్మములు మన శిరస్సులపై అలంకరింకొని పూర్తిగా ఆనందించతగినవి. అటువంటి దివ్య పాదాలకు ఏ హాని కలుగకుండా నిత్యము వర్ధిల్లాలి. తరువాత, శ్రీ రామానుజులు దివ్య తిరుమేనిపై వారు ధరించిన దివ్య కాషాయ వస్త్రానికి మణవాళ మామునులు మంగళం పాడుతున్నారు. వారి వస్త్రాలు నిత్యం వర్ధిల్లాలని వారు కోరుకుంటున్నారు. [కాషాయ వస్త్రానికి కారణం వివరించబడింది ఇక్కడ. కాషాయ రంగును వివరించడానికి మన పెద్దలు అందించిన రెండు అంశాలు పరిగణలోకి తీసుకోబడ్డాయి. (i) శ్రీ వచన భూషణము – ఒక చూర్ణికలో ఇలా చెప్పబడింది “ఆఱు ప్రకారత్తాలే పరిశుద్ధాత్మ స్వరూపత్తుక్కు తత్సామ్యం ఉణ్డాయిరుక్కుం (శ్రీ వచన భూషణము 240)”. ఈ చూర్ణిక యొక్క సారాంశం ఏమిటంటే, ఆత్మ తన నిజ స్వరూపాన్ని గ్రహించినపుడు, అట్టి ఆత్మను పెరియ పిరాట్టితో సమానంగా చెప్పవచ్చు. ఒక ఆత్మని ఆరు లక్షణాలతో విశదపరచ వచ్చు (1) అనన్యార్హ శేషత్వం, అంటే శ్రీమన్ నారాయణుడు తప్ప మరెవరికీ సేవకుడిగా ఉండకపోవడం (2) అనన్య శరణత్వం, శ్రీమన్ నారాయణుడు తప్ప మరెవరినీ ఆశ్రయించక పోవడం (3) అనన్య భోగ్యత్వం, అంటే శ్రీమన్ నారాయణునికి తప్ప మరెవరికీ భోగ్య వస్తువు కాకపోవడం, (4) సంశ్లేషత్తిల్ దరిక్కై, అంటే శ్రీమన్ నారాయణుడితోనే ఉండగలగడం (5) విశ్లేషత్తిల్ దరియామై, అంటే శ్రీమన్ నారాయణుడి వియోగము భరించకపోవడం. (6) తదేక నిర్వాహ్యత్వం, అంటే శ్రీమన్ నారాయణునిచే మాత్రమే నియంత్రించబడటం. శ్రీమన్ నారాయణుని కృప కారణంగా ఈ ఆరు గుణాల నిజ స్వరూపాన్ని ఆత్మ గ్రహించగలిగినప్పుడు, ఈ ఆరు లక్షణాలను నిత్యము ఎరిగిన నాయకి స్వరూపిణి అయిన పెరియ పిరాట్టితో ఆ ఆత్మ సమానమై ఉంటుంది. ఇప్పుడు రెండవ అంశం “సీతకాషాయవాసిని” అన్న వాఖ్యం. సారాంశంగా, కాషాయ రంగు “పారతంత్ర్యానికి” (తన స్వామిపై ప్రశ్నించ కుండా అతని ఆజ్ఞ ప్రకారం నడుచుకొనుట) మరియు “అనన్యార్హత్వం” (శ్రీమన్ నారాయణుడికే ఆత్మ కట్టుబడి ఉండుట) ని సూచించే రంగు అని చెప్పవచ్చు. సూర్యుడి వర్ణంలో సమానంగా ఉన్న ఈ రంగు శ్రీ రామానుజుల యొక్క తిరుమేనిని చక్కగా అలంకరిస్తుంది అని మణవాళ మామునులు ఈ అందమైన కాషాయ వస్త్రాన్ని వర్ణిస్తున్నారు. తరువాత, శ్రీ రామానుజుల యొక్క దివ్య మంగళ విగ్రహానికి మణవాళ మామునులు మంగళం పాడుతున్నారు. తమ శరణాగతులకు శ్రీ రామానుజుల దివ్య తిరుమేని అతి మనోహరంగా కనిపిస్తుందని మణవాళ మామునులు వర్ణిస్తున్నారు. అత్యున్నత సౌందర్య లావణ్యాలతో నిండి ఉంటుంది వారి తిరుమేని. అప్పుడే వికసించిన పుష్పాలలాగా మృదువుగా అతి కోమలంగా ఉంటుంది వారి తిరుమేని. “రూపమేవాస్యై తన్మహిమాన మాసష్తే” అని అన్నట్లు, పరమాత్మ (శ్రీమన్ నారాయణ) వారి లోపల ప్రకాశిస్తున్న కారణంగా శ్రీ రామానుజుల దివ్య శరీరం దివ్య తేజస్సును వెదజల్లుతూ ప్రకాశవంతంగా ఉంది. మణవాళ మామునులు అటువంటి దివ్య రూపానికి కీర్తి పాడుతున్నారు, “నిత్యం నిత్య క్రుతితరం” అన్న శాస్త్ర వాఖ్యము ప్రకారం వారి దివ్య స్వరూపము శాశ్వతంగా వర్ధిల్లాలని కోరుతూ మణవాళ మామునులు శ్రీ రామానుజులకు మంగళం పాడుతున్నారు. తరువాత, శ్రీ రామానుజులు గొప్ప వేద ఉపాసకులని సూచిస్తున్న వారి పవిత్ర యజ్ఞోపవీతానికి మణవాళ మామునులు మంగళం పాడుతున్నారు. శ్రీ రామానుజుల దివ్య తి
రుమేనిపై వారి యజ్ఞోపవీతము సంధ్య సమయమున ఆకాశంలో కనపడు వెండి తీగలతో సమానంగా గోచరిస్తుంది. అటువంటి పవిత్రమైన యజ్ఞోపవీతము చిర కాలం వర్ధిల్లాలి అని కోరుతూ కీర్తిస్తున్నారు.
తరువాత, మణవాళ మామునులు శ్రీ రామానుజుల అందమైన భుజాలు చిరకాలము వర్ధిల్లాలని కోరుకుంటూ మంగళము పాడుతున్నారు. శ్రీ రామానుజుల భుజాల యొక్క గొప్పతనాన్ని మణవాళ మామునులు విస్తారంగా వివరించారు. “బాహుచ్చాయమవ అష్టబ్దోస్యపలకో మాహాత్మనః” అన్న వచనముల ప్రకారం, శ్రీ రామానుజుల భూజాలు – ఆశ్రయించిన వారికి తోడు నీడని అందించే స్వర్ణ కప్లవృక్షము వంటిది. ఎవరికైనా మోక్షం ప్రసాదించగలవు ఆ భుజాలు. ఈ ప్రపంచంలోని నిస్సహాయులను ఉద్ధరించి వారికి ముక్తిని ఇవ్వగల సామర్థ్యము కలిగిన భుజములవి. నిస్సహాయులను ఉద్ధరించి వారికి ముక్తిని ఇవ్వగల సామర్థ్యము కలవి కాబట్టి ఆ భుజాలు పెద్దవి, విశాలమైనవి. జ్ఞానసారం పాశురము “తోళర్ చుడర్ త్తి శంగుడయ సుందరనుక్కు (జ్ఞానసారం 7)” లో శ్రీ రామానుజుల భుజాలు శక్తివంతమైనవని వివరించబడింది. తులసి, వకుళం మరియు నళినాక్ష పుష్ప మాలలతో అలంకరించబడిన శ్రీ రామానుజుల సాటిలేనటువంటి భుజాలు ఎప్పటికీ వర్ధిల్లాలని కోరుతూ మణవాళ మామునులు మంగళం పాడుతున్నారు. తరువాత, మణవాళ మామునులు శ్రీ రామానుజుల శ్రీ ముఖం వైపు చూసి మంగళం పాడటం ప్రారంభిస్తారు. “బ్రహ్మవిధ ఇవ సౌమ్యాతే ముఖం పాధి”, “ముగచ్చోది మలర్దదువో (తిరువాయ్మొళి 3.1.1)” వంటి ప్రామాణిక పదబంధాల ప్రకారం, శ్రీ రామానుజుల ముఖ తేజస్సుకి హద్దులు లేవు, అతి స్వచ్ఛమైనది, దివ్య తేజోమయమైనది వారి శ్రీముఖము. దీనికి కారణము (1) శ్రీమన్నారాయణుడిని, వారి భక్తులను చూడటం వలన లభించే ఆనందం వల్ల వచ్చిన తేజస్సు (2) భక్తులు కానివారి వాదనలను నాశనం చేసినందుకు.
తరువాత, శ్రీ రామానుజులు యొక్క అందమైన మనోహరమైన చిరునవ్వుకు మణవాళ మామునులు కీర్తి పాడుతున్నారు. ఈ ప్రబంధము ప్రకారం, “స విలాసస్స్మితాధారం భిప్రాణం ముఖ పంకజం” – శ్రీ రామానుజుల ముఖాన్ని ఒక అందమైన తామర పుష్పముతో పోల్చారు. ముఖం అని పిలువబడే ఈ తామరపుష్పములో, “నిన్ పల్ నిలా ముత్తం తవళ్ కదిర్ ముఱువల్ సెయ్దు (తిరువాయ్మొళి 9.2.5) – ఆ తామరలో నుండి ఒక అందమైన చిరునవ్వు ఉద్భవించింది అని నమ్మాళ్వార్లు తిరువాయ్మొళిలో వర్ణించారు. ఈ చిరునవ్వుకి కారణం ఏమిటంటే, (1) భక్తులను రక్షించడం ద్వారా పొందిన ఆనందం, (2) శ్రీమన్నారాయణునితో తాము కూడి ఉండుట కారణంగా పొందిన ఆనందం. వికసిస్తున్న పువ్వుని పోలి ఉన్న చల్లని చంద్రుని లాంటి అందమైన ఈ చిరునవ్వుని చిరకాలము వర్దిల్లాలని కోరుతూ మణవాళ మామునులు దివ్య తేజస్సుని వెదజల్లుతున్న ఆ చిరమందహాసముకి మంగళం పాడుతున్నారు. దీని తరువాత, మణవాళ మామునులు శ్రీ రామానుజుల దివ్య నేత్రాలకు మంగళం పాడుతున్నారు, ఈ రెండు నేత్రాలు శ్రీ రంగనాథుని, శ్రీవైష్ణవశ్రీ – శ్రీ రామానుజులు చేత సరిదిద్దబడిన వాళ్ళని ఎల్లప్పుడూ చూస్తుంటాయి. ఆ దివ్య నెత్రాలు నిరంతరం తన తోటి వారిపైన కారుణ్యము కార్చుతూ ఉంటాయి. “అమలంగళాగ విళిక్కుం (తిరువాయ్మొళి 1.9.9)”లో చెప్పినట్టుగా, అజ్ఞానమును తొలగించి తన శరణాగతులను ఆ నేత్రాలు సర్వదా అనుగ్రహిస్తు ఉంటాయి. అటువంటి అద్భుతమైన వారి నేత్రద్వయం చిరకాలము ఉండాలని మణవాళ మామునులు కోరుకుంటున్నారు. తరువాత, పన్నెండు ఊర్ధ్వపుండ్రముల అలంకరణతో ఉన్న శ్రీ రామానుజుల దివ్య తిరుమేని సౌదర్యానికి మణవాళ మామునులు మంగళం పాడుతున్నారు. “తిరుమన్ కాప్పు” (ఊర్ధ్వపుండ్రములు) బంగారు శిఖరంపై వికసించిన తెల్లటి పద్మ పుష్పముని పోలి ఉన్నట్టు శ్రీ రామానుజులను వర్ణిస్తున్నారు. స్వర్ణమయంగా మెరుస్తున్న శ్రీ రామానుజుల దివ్య తిరుమేనిపై, ఊర్ధ్వపుండ్రములు దివ్యంగా ప్రకాశిస్తున్నాయి. శ్రీ రామానుజుల ఈ దివ్య సౌదర్యం నిత్యము వర్ధిల్లాలని మణవాళ మామునులు కోరుకుంటున్నారు.
చివరిగా, మణవాళ మామునులు శ్రీ రామానుజుల యొక్క వేళ్ళ ముద్రను కీర్తిస్తున్నారు. వారి ఆ ముద్ర చిరకాలము వర్ధిల్లాలని మణవాళ మామునులు కోరుకుంటున్నారు. శ్రీమన్నారాయణుని సంకల్పము మేరకు శ్రీ రామానుజులు ఈ భూలోకముపైన అవతరించి, ఈ భౌతిక ప్రపంచములో వారి భక్తులను గానీ లేదా వారి ప్రత్యర్థులను గానీ అందరినీ శ్రీమన్నారాయణుని కృపతో జయించారు. ఇన్ని కార్యాలను సుసంపన్నం కావించిన కారణంగా గంభీరంగా పరమహంసలా ఆసీనులై ఉన్నారు “వైయం మన్ని వీఱ్ఱిరుందు (తిరువాయ్మొళి 4.3.11) లో చెప్పినట్లుగా, విషయముల మధ్య తేడాలను గమనించగల విలక్షణమైన సామర్థ్యం గురువులకి ఉంటుంది. తిరుమంగై ఆళ్వారులు “అన్నమదాయ్ ఇరుందంగు అఱ నూల్ ఉరైత్త (పెరియ తిరుమొళి 11.4.8)” అని కూడా మన దృష్ఠికి తెస్తున్నారు. అందుకని వాళ్ళను హంసలతో పోలుస్తారు. యతులకు రాజైన శ్రీ రామనుజులు తమ శిష్యుల మధ్య జ్ఞాన ముద్రతో పద్మాసనంలో గంభీరంగా ఆసీనులై కనిపిస్తున్నారు, అని “పద్మసనోపవిష్టం పాదద్వోపోదముద్రం” (పరాంకుశాష్టకం)లో వివరించబడింది. “శ్రీమత్ తదంగ్రియుగళం” లో “శ్రీ” ని ప్రయోగించిన మాదిరిగా, ఈ పాసురంలోని “సీరారుం” అనే వాక్యాన్ని పాద పద్మాలకు విశేషణంగా భావించాలి.
అడియేన్ శ్రీదేవి రామానుజదాసి
మూలము : https://divyaprabandham.koyil.org/index.php/2016/11/arththi-prabandham-30/
పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org