ఆర్తి ప్రబంధం – 28

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

ఆర్తి ప్రబంధం

<< ఆర్తి ప్రబంధం – 27

srivaishna-guruparamparai

పరిచయము:

తాము ఎన్నడూ శ్రద్ధ చూపని వాటిపైన శ్రద్ధ కల్పించి ఆ కార్యములను సుసంపన్నం చేసేలా చేసిన శ్రీ రామానుజుల అనుగ్రహమును మణవాళ మామునులు అనుభవిస్తున్నారు. మణవాళ మామునులు వారి పూర్వ జీవితంలో అన్నీ సత్కార్యములే చేసినా కానీ వారికి పరమపదానికి వెళ్ళడంపై పెద్ద ఆసక్తి ఉండేది కాదు. శ్రీ రామానుజులు వారిని అనుగ్రహించి, పరమపదము చేరుకోవాలనే కోరికను ప్రేరేపించిన తరువాత మాత్రమే, మాత్రమే, వారు పరమపదము చేరుట పై దృష్టి సారించారు. అందుకని మణవాళ మామునులు ఈ పాశురములో శ్రీ రామానుజులు తనకి అనుగ్రహించిన ఈ అపురూపమయిన ఆశీర్వాదమును  ప్రశంసిస్తున్నారు.

 పాశురము:

పండు పలవారియరుం పరులగోరుయ్య
ప్పరివుడనే శెయ్దరుళుం పల్గలైగళ్ తమ్మై
క్కండదెల్లాం ఎళుది అవై కఱ్ఱిరుందుం పిఱర్ క్కు
క్కాదలుడన్ కఱ్పిత్తుం కాలత్తై క్కళిత్తేన్
పుండరీగై కేళ్వనుఱై పొన్నులగుదన్నిల్
పోగ నినైవొన్ఱుం ఇన్ఱి ప్పొరుంది ఇంగే ఇరుందేన్
ఎండిశైయొం ఏత్తుం ఎదిరాశన్ అరుళాలే
ఎళిల్ విశుమ్బైయన్ఱి ఇప్పోదెన్ మనం ఎణ్ణాదే

ప్రతి పద్ధార్ధం

పణ్డు – ముందు
కాలత్తై క్కళితేన్ – నేను నా జీవితాన్ని అలా గడిపాను
క్కాదలుడన్ – ప్రేమగా
కఱ్పిత్తుం – ప్రచారము చేస్తూ / శిక్షణ ఇస్తూ
పిఱర్కు –  ఇతరులకు
అవై కఱ్ఱిరుందుం – నా గురువుల వద్ద నేను నేర్చుకున్న
క్కండదెల్లాం – గ్రంధాలలో నేను చూసిన జ్ఞానం
ఎళుది – నేను నేర్చుకున్న దాని గురించి రాశాను
పల్గలైగళ్ తమ్మై – ఆ పుస్తకాల సంగ్రహము
శెయ్దరుళుం – ఉదారముగా ఇవ్వబడిన
పలవారియరుం – “ఆత్మ యొక్క అభ్యున్నతి, శ్రేయస్సు” గురించి ఎల్లప్పుడూ ధ్యానించి, సిద్ధాంతాల కొరకు నిలబడిన గురువులు
ప్పరివుడనే – ఈ చేతనుల పట్ల కరుణతో (ఆ పుస్తకాలను) ఇచ్చారు
పరులగోరుయ్య – ఈ లోకములోని చేతనులు ఉద్ధరింపబడాలని (బంధముక్తి)
ప్పొరుంది ఇంగే ఇరుందేన్ – ఈ విభూతిలో సంతోషముగా ఉండేవాడిని
పోగ నినైవొన్ఱుం ఇన్ఱి – వెళ్ళాలని అణువు మాత్రము కూడా కోరిక లేకుండా
పొన్నులగుదన్నిల్ – “నిత్య విభూతి” అని పిలువబడే పరమపదం
ఉఱై  – నివాస స్థానమైన
పుండరీగై కేళ్వన్ – దివ్య కమల పుష్పములో ఆసీనమై ఉన్న పెరియ పిరాట్టి యొక్క దివ్య పతి,  శ్రీమన్నారాయణ
ఇప్పోదెన్ మనం ఎణ్ణాదే – నా మనస్సు ఇక దేని గురించి ఆలోచించదు.
ఎళిల్ విశుమ్బైయన్ఱి – ఆహ్లాదభరితమైన పరమపదము తప్పా
ఎదిరాశన్ అరుళాలే – ఎంబెరుమానార్ల ఆశీర్వాదము (ఆ కారణంగా)
ఎండిశైయొం ఏత్తుం – అతను అష్థ దిక్కులలోని వాళ్ళ ప్రశంసలను  అందుకుంటున్న వ్యక్తి

సరళ అనువాదము:

మణవాళ మామునులు అంతకుముందు వారు తన జీవితాన్ని ఎలా గడిపినారో వివరిస్తున్నారు. ప్రేమపూర్వకంగా ఆచర్యులు ఈ ప్రపంచానికి అందించిన గ్రంధాలను వారు చదివేవారు. వారు వాటిని క్రమంగా చదివి, వాటిని అనుసరిస్తూ, అందులోని  రహస్యాల గురించి తెలియని వారికి బోధిస్తూ ఉండేవారు. మణవాళ మామునులకు పరమపదానికి వెళ్ళాలని  ఎటువంటి ఆలోచన లేదా ఆసక్తి ఉండేది కాదు. అయినను, ఉభయ దేవేరులతో దివ్య భక్తుల నిత్య నివాసమైన శ్రీమన్నారాయణుడు వేంచేసి ఉన్న పరమపదమును చేరుకోవాలనే కోరికను తనకనుగ్రహించిన ఎంబెరుమానార్ల కృపని వారు కీర్తిస్తున్నారు.

వివరణ:

“ఈ ప్రపంచములో అజ్ఞానులను ఉద్దరించాలనే ఏకైక ఉద్దేశ్యముతో అందించిన మన పూర్వాచర్యుల గ్రంధాలను ఇదివరలో నేను చదివాను” అని మణవాళ మామునులు తెలుయజేస్తున్నారు. ఆ గ్రంధాలను వేర్వేరు ఆచార్యులు రచించినప్పటికీ, అవన్నీ ఏక కంఠంతో పలికినట్లు అందులో ఒకే అభిప్రాయం ప్రతిధ్వనించింది. చేతనుల పట్ల కరుణతో మన ఆచార్యలు ఆ గ్రంధాలను మనకిచ్చారు. ఆ సమయంలో ఎంతో ఆసక్తితో చేతికి వచ్చిన ప్రతి గ్రంధాన్ని నేను అధ్యయనం చేసాను. “తెరిత్తు ఎళుది (నాన్ముగన్ తిరువందాది 63)”లో చెప్పినట్లుగా, నేను నా ఆచార్యుల నుండి వాటిని క్రమమైన పద్ధతిలో అధ్యయనము చేశాను.  వాటిని నేర్చుకోవడమే కాకుండా, ఆ గ్రంధాలలో పేర్కొన్న వాటికి అనుసరించాను కూడా. క్రమంగా ఈ గ్రంధాల గురించి తెలియని వారికి వాటిని బోధించడం ప్రారంభించాను. ఈ పుస్తకాల ఉద్దేశ్యాన్ని వారికి తెలిపడం, తద్వారా వారి ఆత్మ శ్రేయస్సుకి  ప్రయోజనకరంగా ఉంటుందని వారికి బోధించడం జరిగింది. ఈ రకంగా నేను నా సమయాన్ని గడిపే వాడిని.  శ్రీమన్నారాయణుడు నివాసముండే పరమపదానికి చేరుకోవాలనే ఆసక్తి నాకు ఎప్పుడూ ఉండేది కాదు. నేను ఈ ప్రపంచ సుఖాలను అనుభవిస్తూ, పెరియ పిరాట్టి యొక్క భర్త  శ్రీమన్నారాయణుడు  (ముదల్ తిరువందాది 67 లో “తామరైయాళ్ కేళ్వన్” అని వర్ణించినట్లు) ఉండే చోటు గురించి పట్టించుకోలేదు.  “పరమపదం” అని పిలువబడే ఆ అద్భుతమైన ప్రదేశానికి వెళ్లాలన్న కోరిక నాకు ఎప్పుడూ కలగలేదు.

“ఎంబెరుమానార్ల ఆశీర్వాదాలతో తన కృపా వర్షాన్ని నాపై కురిపించే వరకు, పరమపదానికి వెళ్ళాలనే ఆసక్తి నాకు కలుగలేదు.” అని మణవాళ మామునులు కొనసాగిస్తున్నారు. వారి దయని ఖచ్చితంగా అష్ట దిక్కులలో అందరూ కీర్తించాల్సిన  విషయం. వారి ఆశీస్సులను పొందిన నేను ఎంత అదృష్టవంతుడిని. ఇక పరమపదానికి వెళ్లడం తప్ప మరే విషయము గురించి నా మనస్సు ఆలోచించుట లేదు. ఇది మన స్వామి అనుగ్రహముతో తప్ప మరిదేనితో సాధ్యము కానిది.  ఎంబెరుమానార్ల కృప గురించి నొక్కి చెప్పే “అరుళాలే” అన్న పదము “తేఱ్ఱత్తు ఏకారం” లోనిది.

 స్పష్ఠీకరణ :

“అరుళాలే” అనే పదంలో, రచయిత పిళ్ళైలోకం జీయర్ “తేఱ్ఱత్తు ఏకారం” గురించి ప్రస్తావించారు. ఇది తమిళ వ్యాకరణం, దీనికి కొంచెం వివరణ అవసరం. తమిళ వ్యాకరణంలో “ఏకారం” అనేది రెండు రకాలు. మొదటిది “తేఱ్ఱత్తు ఏకారం”. ఇది “ఉరుది” లేదా “నిశ్చయత” లేదా “ఏకగ్రీవత” ని సూచిస్తుంది. ఉదాహరణకి – తిరుప్పావై 1 వ పాశురములో ఆండాళ్ దానిని అందంగా వివరించింది. “నారాయణనే” లో, ఆండాల్ “ఏకారం” ను ఉపయోగించింది అంటే నారాయణుడు మాత్రమే పఱై (పర ప్రయోజనం) ఇవ్వగలడు మరెవరూ కాదు అని. మోక్షం ఎవరు ఇవ్వగలరో, మరెవరూ ఇవ్వలేరనే వాస్తవం గురించి ఖచ్చితంగా చెప్పడానికి ఇది ఉపయోగించబడుతుంది. ఇది “తేఱ్ఱత్తు ఏకారం”. “పిరినిలై ఏకారాం” రెండవ రకము. “అది కూడా” అని దాని అర్థం.  “నమక్కే” అనే ఉదాహరణలో , అంటే నారాయణుడు మనలాంటి వ్యక్తులకు పఱై ఇస్తారని ఆండాళ్ ఉపయోగించిందని అర్థం. మనమెవరు? మనము తిండి, నిద్ర, ఇతర ప్రాపంచిక సుఖాలను వెదుక్కుంటూ, అవే అలౌకిక సుఖాలనుకొని తిరిగే సాధారణ (అల్ప) మానవులము. అతి అల్పమైన, తెలివిలేని మానవులమైన మనలాంటి వాళ్ళకు కూడా (నమక్కే), నారాయణుడు అనుగ్రహిస్తాడు. ఈ అర్థాన్ని “పిరినిలై ఏకారాం” అని అంటారు. “ఎణ్ణాదే” అనే వాఖ్యములో, “తేఱ్ఱత్తు ఏకారం” ఉపయోగించబడింది.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము : https://divyaprabandham.koyil.org/index.php/2016/10/arththi-prabandham-28/

పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a Comment