తిరుమాలై – పాసురం 1 – భాగము 2

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

తిరుమాలై

<<పాసురం 1 – భాగము 1

periyaperumal-art

పాశురము-1

కావలిల్ పులనై వైత్తు| క్కలి దన్నై క్కడక్కప్పాయ్ న్దు |

నావలిట్టురు దరిగిన్రోంమ్ |నమన్ తమర్ తలైగళ్ మీదే |

మూవులగుణ్డు ఉమిళ్ న్ద| ముదల్వ నిన్నామమ్ కత్త|

ఆవలి ప్పుడమై కండాయ్ | అరజ్ఞమానగరుళానే|| 1

          కిందటి భాగంలో ఆళ్వార్లు భగవన్నామ స్మరణ బలం చేత యముడి తల మీద మరియు యమ భటుల తలల మీద కాళ్ళు పెట్టగలమని భావించడం, భగవన్నామ స్మరణ నిరంతరం చేస్తున్న భాగవతోత్తముల శ్రీపాదాలను శిరసుపైన ధరించటం తన భాగ్యంగా భావించిన యముడి గురించి చూసాము.  

దీనికి ప్రమాణం ఏమైనా ఉందా! అని చూస్తే  వ్యాఖ్యాన చక్రవర్తి పెరియ వచ్చాన్ పిళ్ళై విష్ణు పురాణం నుండి ఉదాహరణను చూపిస్తున్నారు. విష్ణుధర్మంలో యముడు తన భటులతో

 ‘ తస్య యజ్ఞ్య వరాహస్య విష్ణోరామితతేజసః ! ప్రణామం ఏపి కుర్వంతి తేషామపి నమో నమః !! 

తేజస్సుతో ప్రకాశించే యజ్ఞ్య వరాహ స్వామి అయిన విష్ణు మూర్తిని సేవించే భక్తులను నేను పదే పదే నమస్కరిస్తాను అని చెప్పాడు. ఇంకా…..

‘ స్వపురుషా మభివీక్ష్య పాశాహస్తం, వదతి యమః కిల తస్యకర్ణమూలే !

 పరిహర మధుసూదన ప్రపన్నాన్, ప్రభురహమన్యనృణామ్ నవైష్ణవానాం !! ‘  

          తన భటులు ఎవరైతే భూలోకంలో మనుష్యుల ప్రాణాలను తేవడానికి బయలుదేరుతారో వారిని పిలిచి చెవిలో రహస్యంగా మధుసూదనుడి భక్తుల జోలికి పోకండి అని చెబుతారు. నేను మనుష్యులందరికి ప్రభువునే కానీ వైష్ణవులకు మాత్రం ప్రభువును కాదు, అను ఒక శ్రీవైష్ణవులకు తప్ప అందరికీ దేవుడినే అని చేపుతాడట. ఇదే అర్థాన్ని తిరుమళిశై పిరాన్ తన నాన్ముగన్ తిరువందాది 68  పాశురంలో ‘తిరంబేన్ మిన్ కాణ్డీర్ తిరువడి తన్ నామం ……ఇరైన్జియుం సాదువరాయ్ పోదుమిన్ గళ్ ఎన్రాన్…’ అని చెప్పారు. యముడు తన భటులతో శ్రీవైష్ణవులకు మీకు చేతనైన కైంకర్యాలు చేసి వారిని ప్రశాంతంగా వదిలిపెట్టండి అని కూడా ఆదేశించాడు. అర్థాత్ యముడు శ్రీవైష్ణవులకు భయపడతాడని, వాళ్ళ జోలికి వెళ్ళడని తెలుయజేస్తున్నారు.

        సంసారులందరూ యముడికి అయన భటులకు భయపడతారు. అటువంటిది ఇక్కడ ఆళ్వార్లు ఆ యముడి తల మీద కాళ్ళు పెట్టి నడుస్తానంటారు! అదెలా సాధ్యం? అని పెరియ పెరుమాళ్ (శ్రీరంగనాథులు) ఆశ్చర్యపోయారట. దానికి ఆళ్వార్లు ఇలా చెపుతున్నారు.

        మూవులగుణ్డు ఉమిళ్ న్దముదల్వ….. ఆళ్వార్లు…నేను దేవతంతరాలను ఆశ్రయిస్తే యముడికి భయపడాలి. కానీ నేను  ఆశ్రయించింది శ్రీమన్నారాయణుని కదా ! ఆయనే సకల చేతనా చేతనములకు ప్రభువు, ప్రళయ కాలంలో సమస్త జగత్తును మింగి తన కుక్షిలో ఉంచి రక్షించి సృష్టి కాలంలో మళ్ళీ అన్నింటిని నామరూప విభాగాలతో సృజిస్తాడు. అందువలననే జీవులు ఈ లోకంలో జీవించ గలుగుతున్నారు. ఎవరైతే అయన విధించిన శాస్త్ర ప్రకారం నడచుకుంటారో వాళ్ళు జనన మరణ చక్రం నుండి బయట పడి పరమపదం చేరుకుంటారు. ఇక్కడ ఆళ్వార్లు ఒక తర్కాన్ని తెలియజేస్తున్నారు. ప్రళయ కాలమైనా సృష్టి కాలమైనా యముడకీ, నాకు నువ్వే స్వామివి. ప్రళయకాలంలో ఇద్దరం నీ కడుపులోనే ఉన్నాం కదా! ఇంకా నాకు భయమెందుకు? అని ప్రశ్నిస్తున్నారు.

దానికి పరమాత్మ ఇలా ప్రశ్నించారు.’ అయితే మీరు నన్ను శరణాగతి చేసారా? అందువల్ల దొరికే లబ్దిని పొందారా?

 దానికి ‘నేను ఎక్కడి నుంచి వచ్చాను? ని నుంచే కదా! నువ్వు కాక నీకు పక్కన ఎక్కడి నుంచైనా వచ్చానా?’ అని ఆళ్వార్లు ప్రశ్నించారు.

నిన్నామమ్ కత్త|ఆవలిప్పు….. ‘నీ నామం నేర్చుకున్న బలమే నన్ను యముడితో సవాలు చేయించిందని’ పై ప్రశ్నకు ఆళ్వార్లు సమాధానం చెపుతున్నారు. ఇక్కడ స్పష్టంగా ‘నిన్’ అని చెప్పారు. అంటే ఇంకెవరి నామాలో తెలుసుకోవటం వలన వచ్చిన బలం కాదు కేవలం నీనామమును నేర్చిన బలము సుమా అని స్పష్టంగా చెపుతున్నారు. పరమాత్మ ముద్ద బంగారము వంటి వాడు కాగా, అయన నామాలు ఆభరణాల వంటివి. ముద్ద బంగారము విలువైనదే అయినా ధరించడానికి పనికి రాదు. అదే ఆభరణాలైతే ధరించి ఆనందిచ వచ్చు. అలాగే పరమాత్మ దూరస్తుడైనా ఆయన నామాలు దగ్గర వుండి రక్షిస్తాయి. ఆయనే ఈ సంసార కడలి ప్రవాహంలో మనకు రక్షకుడు, కానీ అయన నామాలు ఈ జనన మరణ ప్రవాహం నుండి బయట పడ వేసి మొక్షార్హులను చేస్తుంది. మరి నామం అని ఎందుకు అంటున్నారు? మంత్రం అని అనవచ్చు కదా! అన్న సందేహం కలుగవచ్చు.

   మంత్రాన్ని జపించడానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, త్రైవర్ణికులకే అర్హత ఉంటుంది. కానీ నామాన్ని జపించడానికి ఎటువంటి నియమ నిబంధనలు అవసరం లేదు, అందరికి అర్హత వుంటుంది.  ఒకడు నడుస్తూ వున్నప్పుడు గబుక్కున కాలు జారితే అప్రయత్నంగా అమ్మా అని అరుస్తాడు. అలా అమ్మను పిలవడానికి ఎలాంటి నియమ నిబంధనలు అవసరం లేదు. అలాగే భాగవన్నామాలను స్మరించడానికి ఎటువంటి నియమ నిబంధనలు అవసరం లేదు. కట్ర (నేర్చిన )…. అని ప్రయోగించారు, సొన్న (చెప్పిన ) అనలేదు. అంటే గురుముఖత నేర్చిన అని అర్థం. మరి ఆ గురువు ఎవరు అంటే శ్రీరంగనాథులు తప్ప మరెవరో కాదు. కేవలం నామాలను నేర్వటమే తప్ప అర్థాను సంధానం చేయటం కాదు అని కూడా మరొక అర్థం చెప్పవచ్చు. ‘ఆవలిప్పు’ అంటే గొప్పదనం అని మనం చూసాము.

 ‘ఉడమై’ ……అంటే అధికారము కలిగి వుండుట. ‘వైశ్రవణం’ అంటే సంపదలకు దేవత. భగవంతుడి నామాలు నేర్చుకోవటం ‘వైశ్రవణం’ అనే సంపదల దేవతను పొందడమంత గొప్పదని  ఆళ్వార్లు భావిస్తున్నారు.

కండాయ్……… కళ్ళు తెరిచి భగవన్నామాలు నేర్చి తాను పొందిన సంపదని చూడమని శ్రీరంగనాధులను ఆళ్వార్లు ప్రార్తిస్తున్నారు. భగవంతుడి నామాలు నేర్వడం వలన ఆళ్వార్లు పొందిన లబ్ది గురించి వివరించాల్సిన అవసరం లేదు. భగవంతుడు మ్రుణ్ , ఆప్, తేజస్ వాయురాకాశం అనే  పంచ భూతాలలో ముల్లోకాలను ఎలా ఇమిడ్చి వుంచాడో అలాగా ఆళ్వార్లు పంచ భూతాలలోని ఒక మట్టిని మాత్రం గ్రహించి ఆయన నామాలలో అమృతాన్ని నింపారని, కేవలం ఒక్కసారి చూస్తే తెలిసిపోతుంది.

అరజ్ఞమా నగరుళానే….. ఇక్కడ ఒక్కరైనా భగవంతుడి నామాలను నేర్చిన వారు ఉన్నారా ! అని చూడడానికి నువ్వు శ్రీ వైకుంఠాన్ని వదిలి శ్రీరంగం వచ్చి శేషతల్పం మీదపడుకున్నావు. నువ్వు సత్య సంకల్పుడవు కావున నీ సంకల్పం తప్పక నెరవేరుతుంది అని ఆళ్వార్లు అంటున్నారు.

మానగర్ …..పెద్ద నగరం అని శ్రీరంగాన్ని చెపుతున్నారు. ఒక రాజు ఆజ్ఞ ఇచ్చాడంటే దానిని ఆయనే ఆపలేడు. అలాగే శ్రీరంగనాధుడు శ్రీరంగంలో ఉండి కృప చేసాడు అని అంటున్నారు. ఈ నగరంలో ఎవరు గొప్ప అని, ఎందుకు భగవంతుడికి కైంకర్యం చేయాలి అని భగవంతుడితో వాదనకు సంసారులు ఎవరూ దిగరు. అందువలన ఇది గొప్ప నగరము అని మరొక అర్థం చెప్పుకోవచ్చు.

     ఒకడు అక్రమ మార్గాలలో నడుస్తున్నాడు. అలాంటి వాడు భయంతో నలుగురికి, పండితులకు, విద్వాంసులకు ముఖం చూపించకుండా దాక్కోవాలనుకుంటాడు. హటార్తుగా వాడే ఆదేశాన్ని ఏలే రాజు కృపకు పాత్రుడైతే మహా సంపదను పొందుతాడు. ఏ పండితులను, విద్వాంసులను చూసి భయపడ్డాడో ఇక వారెవారిని లెక్క చేయక రాజు దగ్గరికే వెళ్ళిపోతాడు. అలాగే ఇక్కడ ఒకప్పుడు ఆళ్వార్లు యముడిని చూసి భయపడ్డారు. ఎప్పుడైతే భగవంతుడి నామాలను నేర్చారో అప్పుడు ఇక ఎవరికీ భయపడ వలసిన అవసరం లేకుండా పోయింది. యముడి తల మీద కాళ్ళుపెట్టి నడిచే దైర్యం వచ్చింది. అది భగవంతుడి నామాలు ఆ మనిషిని పరిశుద్ది చేయటం వలన కలిగిన మార్పు అని చెపుతున్నారు .

తరువాతి పాశురంలో  భగవంతుడి  నామాలు ఎంత భోగ్యంగా వుంటాయో చూద్దాం .

అడియెన్ చూడామణి రామానుజ దాసి

హిందీలో – https://divyaprabandham.koyil.org/index.php/2016/07/thirumalai-1-part-2/

మూలము : https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment