తిరుమాలై – పాసురం 1 – భాగము 1

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

తిరుమాలై

<< అవతారిక 2

thondaradippodiazhwar-yama

అవతారిక : చేతనులు ఇప్పటికే చేసిన, ఇప్పటకీ చేస్తున్న పాపాల వలన, యమధర్మరాజు ఆధీనంలో ఉంటారు. అంటే నరకాన్ని, స్వర్గాన్ని, అనుభవించి మళ్ళీ మళ్ళీ పుడుతూ చస్తూ కర్మలను అనుభవించాల్సిందే. కానీ, భగవంతుడి నామాలను సంకీర్తన చేసినంత మాత్రాన మనం పునీతులమై యముడి బారి నుండి బయట పడగలము అని ఈ పాశురములో తోరడిపొడి ఆళ్వార్లు చెపుతున్నారు.

కావలిల్ పులనై వైత్తు| క్కలి తన్నై క్కడక్కప్పాయ్ న్దు |

నావలిట్టుళి తరుగిన్రోంమ్ |నమన్ తమర్ తలైగళ్ మీదే |

మూవులగుణ్డు ఉమిళ్ న్ద| ముదల్వ నిన్నామమ్ కత్త|

ఆవలి ప్పుడమై కండాయ్ | అరజ్ఞమా నగరుళానే|| 1

ప్రతిపదార్థము:

మూవులగు =మూడు లోకాలు

ఉణ్డు = భుజించి (ప్రళయ కాలంలో)

ఉమిళ్ న్ద = కక్కిన

ముదల్వ = ఆదిమూలమే

నిన్నామమ్ కత్త = నీ దివ్య నామాలు నేర్చుకోవటం వలన

ఆవలి ప్పుడమై = అబ్బిన గొప్పతనం వలన

పులనై = పంచేద్రియాలను

కావలిల్ వైత్తు = వాటి ఇష్టానుసారంగా ప్రవర్తించకుండా కాపలాలో పెట్టి

క్కలి దన్నై = పాపాల మూటను

క్కడక్కప్పాయ్ న్దు = తొలగదోసుకొని 

నావలిట్టు = విముక్తి పొంది

నమన్ తమర్ తలైగళ్ మీదే = యముడు, యమ భటులు ఇంకా బాదించే క్షుద్రదేవతలుగాని

ఊళి తరుగిన్రోంమ్ కండాయ్ = ఎవరికీ భయపడ కుండా ఉన్నాము చూడు

వ్యాఖ్యానము:

కావలిల్ పులనై వైత్తు: ఇంద్రియ నిగ్రహము…. ఇంద్రియ నిగ్రహము లేకపోవటం వలన అనేకరకాల కీడు జరుగుతుంది.. అవి ఏ విధంగానూ మనకు మంచిని చేయవు. పంచేంద్రియాలను స్వేచ్చగా వదిలి వేయటం వలన చేతనుడు జంతు సమానుడుగా ప్రవర్తిస్తాడు నరపశువుగా మారతాడు. జంతువులకు వాటి ఇంద్రియాల మీద పట్టు ఉండదు, కానీ మనుష్యులు తమ ఇంద్రియాల మీద నిగ్రహము కలిగివుండాలి. నిగ్రహము లేనివాడికీ జంతువుకు భేదం ఉండదు. అతడు శాస్త్రమును గౌరవించడు, దానికి కట్టుబడి ఉండడు. మనసుకు తోచినట్టే ప్రవర్తిస్తాడు. బుద్దితో ఆలోచించడు, చేయకూడని పనులన్నీ చేస్తాడు, చేయవలసినవేవి చేయడు. అటువంటి వాడు ఈ పాశురంలో చెప్పినట్టుగా యముడి తల మీద కాలుపెట్టె శక్తిని ఎలా పొందగలుగుతాడు? పరమాత్మ నామ సంకీర్తన చేయటం ఒక్కటే మార్గము. ఆ నామ సంకీర్తన మహిమ వలన జీవుడు సకల దోషాలను తొలగించుకో గలుగుతాడు తద్వారా యముడి తలమీద కూడా  కాలుపెట్ట గలుగుతాడు.

       మనిషి విషజంతువు కాటుకు లోనైనప్పుడు దాని ప్రభావం నుండి బయటపడటానికి ఎన్నోనియమాలను పాటించాల్సి వుంటుంది. తలంటుస్నానం చేయకూడదు, కొన్నిరకాల ఆహారపదార్థాలను తినకూడదు. వేళకు ఆహారం తీసుకోవాలి, వేళతప్పి నిద్రపోకూడదు అని ఎన్నో నిబంధనలు ఉంటాయి. కాని ఎవరైనా మంచి వైద్యులు ఆ విషానికి విరుగుడు ఇస్తే ఇవేవి పాటించనవసరం లేదు. సాదారణ జీవనం సాగించవచ్చు. ఆ ఔషదానికే అంత మహిమ ఉన్నప్పుడు పరమాత్మ నామ సంకీర్తన సకల పాపాలను తోలగదోస్తుంది అనటంలో సందేహం ఏముంటుంది? సంసారమనే విషజంతువు నోటబడి కరవ బడ్డ జీవాత్మ, పరమాత్మ ఉపకారం వలన మాత్రమే బయట పడ గలుగుతాడు.

వైత్తు: జీవాత్మ తనకు తెలియకుండానే తన ఇంద్రియాలను స్వేచ్చగా వలిలాడని కాదు,  జీవాత్మ తెలిసే తన ఇంద్రియాలను వాటి ఇష్టానుసారం వదిలి వేసాడు.

కావలిల్:  ‘కావలిల్ ఇల్లాదపడి’ నియంత్రణ లేకపోవటం వలన … ఇక్కడ నియంత్రణ ఉండటం కంటే నియంత్రణ లేకపోవటం పెద్ద విషయం. అది ఎలా అంటే ఒకడు విషాన్ని తిన్నాడు. వాడికి విరుగుడు ఇచ్చేటప్పుడు ఆ విరుగుడుకి మందు ఇంతే ఇవ్వాలి అన్న నియంత్రణ లేదు. ఒకవేళ అలా నియంత్రిస్తే అది మామూలు వైద్యం అవుతుంది. నియంత్రించ కుండా విషానికి ఎంత అవసరమైతే అంత మందుని వినియోగించి వాడిని బతికిస్తే అది గొప్ప వైద్యం అవుతుంది .

కావలిల్ పులనై వైత్తు: ‘ కావలిల్ ‘…. ఇంద్రియ నిగ్రహం. ఇక్కడ నిగ్రహం అంటే ఇంద్రియాలను తన అదుపులో ఉంచుకొని భగవన్నామ స్మరణ చేయటం అన్న అర్థం ధ్వనిస్తుంది. ఇది ఎలాంటి దంటే ఒక రాజ్యంలో రాజు లేక పొతే ప్రతివాడు ఆజ్ఞలను ఉల్లంఘిస్తాడు. అలాగే ఇంద్రియాలన్నీ అదుపు తప్పి వుంటాయి. ఎప్పుడైతే కొత్త రాజు పాలనలోకి వస్తాడో చేడు పనులు చేసే వాళ్ళందరూ నియంత్రిచ బడతారు. భగవంతుడి నామాలు కూడా కొత్తరాజులా పని చేసి జీవుడిలోని ఇంద్రియాలను నిగ్రహిస్తాయి . 

  ‘కావలిల్’….పరిధులు లేకుండా ఎక్కడెక్కడో విహరించే ఇంద్రియాలను నియంత్రించి సరి అయిన (పరమాత్మ అర్చారూప సౌందర్యంలో నిమగ్నమవటం) దారిలో నడపడం. భగవన్నామ స్మరణ వలన ఇది సాధ్యమవుతుంది. ఇది ఎలా సాధ్యం? అని వ్యాఖ్యాత ఇక్కడ ఒక సందేహాన్ని లేవనెత్తారు. శ్రీరామాయణంలో శ్రీరాముడు తన దృష్టిలోకి మనసులోకి వచ్చిన వాళ్ళందరినీ జయించే శక్తి కలిగి ఉండేవాడు అని ఆయనే సమాధానం కూడా చెప్పారు. (దృష్టా చిత్తాయ అపహారిణం).

క్కలిదన్నై క్కడక్కప్పాయ్ న్దు : కలి వలన ఏర్పడిన అన్నిరకాల పాపాల నుండి నామ రూపాలు లేకుండా బయట పడటం.. కలి కాలంలో ‘తన్నై’ (తనను)… అన్న పదాన్ని నొక్కి చేప్పాలి. ఎందుకంటే జీవాత్మ ప్రాపంచిక సుఖాల వెంట పరిగెత్తడానికి కలే కారణం. దీని వలన మరణానంతరం నరకాన్ని అనుభవించాల్సి వుంటుంది.  పరమాత్మను స్మరించక పోవటమే కాక ఆయన మీద ద్వేషం కలిగి వుండటం కూడా దీనికి కారణమవుతుంది. ఇంకా దేహాన్నే ఆత్మ అని బ్రమించటం, జీవాత్మ చేసే అనేక తప్పిదాలు కూడా కారణమవుతున్నాయి.  

‘తన్నై’ (తనను)…..ఇంత కాలం నన్ను సదా సర్వకాలం నియంత్రించిన శత్రువును ఇప్పుడు నేను అదుపులో పెట్టగలిగాను అన్న అర్థంలో కూడా గ్రహించ వచ్చు.

క్కడక్క: దాటుట…ఎంత వరకు దాటాము? సంసారంలోని బంధనాలన్నింటిని దాటాము అని ఇక్కడ వ్యాఖ్యాత చెపుతున్నారు. అర్తాత్ నిత్యసూరులలగా? సంసార బంధనాలన్నింటిని దాటాము అని చెపుతున్నారు. వారికి మాత్రమే సంసార బంధనాలేవి ఉండవు. ఇంతకు ముందు ‘కలి’ అన్న పదానికి రెండు అర్థాలు చెప్పారు. 1. పాపాల సమాహారం, 2. శత్రువు. ఇప్పుడు కలి అంటే కాలం అని మూడవ అర్థం చెపుతున్నారు. దాటుట అన్నదానికి ఇక్కడ అర్థం కలియుగానికి సంబంధం లేకుండా కృతయుగంలో ఉన్నాడు (నాలుగు యుగాలలో మొదటిది కృతయుగం, నాలుగవది కలియుగం.) అని అర్థం. ఈ ప్రబావానికి దూరంగా ఉన్నాడు ఇక భయమన్నదే లేదు.

ప్పాయ్ న్దు: కలియుగం నుండి కృతయుగం దాకా ఎలా దాటగలిగా మంటే హనుమంతుడు సముద్రాన్ని పరమాత్మా నామ సంకీర్తనం చేస్తూ ఎలా దాటాడో అలా ఆళ్వార్లు కూడా నామ సంకీర్తనం చేయటం వలన దాటగలిగారు.

నిన్ నామం కట్ర:  యముడిని, అయన భటులను ఆపే శక్తి ఆళ్వార్లకు ఎలా కలిగింది అంటే భగవంతుడి నామాలను నేర్చుకున్నారు కదా ఆ! అందువలన యముడిని అయన భటులను కూడా ధిక్కరించే శక్తిమంతులయ్యారు. మరి పాపాల కడలిని వారు స్వప్రయత్నంతో దాటారు అని అన్నారే? అంటే వారు దాటలేదు భగవంతుడి నామాలు దాటించాయి వారికి స్వతహాగా ఆశక్తి ఉంది అని చెపుతున్నారు. ఈ సందర్భంగా ‘ ఇరామడం ఊట్టువారైపోలే’ అని మన పూర్వాచార్యులు ఒక మాట అంటారు. దీనికి ఒక చిన్న కథ ఉంది. ఒక కొడుకు అలిగి ఇంట్లో నుండి వెళ్ళిపోయి ఆ ఊళ్లోనే ఒక మఠంలో ఉన్నాడు. రాత్రయింది, కొడుకు అన్నం తిన్నాడో లేదో అని తల్లి కొడుకుకు ఇష్టమైన వంట చేసి ఒక డబ్బాలో పెట్టింది. తాను తీసుకువెళ్ళి ఇస్తే తీసుకోడని వాడి స్నేహితుడిని పిలిచి విషయం చెప్పి ఈ డబ్బా ఇచ్చి , తాను ఇచ్చినట్టు చెప్పవద్దని చెప్పి బతిమాలి పంపింది. స్నేహితుడు అలాగే చేసాడు. కొడుకుకు ఆహారం నోట్లో పెట్టుకోగానే అది తన తల్లి చేతి వంట అని తెలిసిపోయింది. అయిన బింకంగా తెలియనట్లే తిన్నాడు. తల్లి ప్రాణం ఆగక వెనకాలే తాను వెళ్లి చాటుగా నిలబడి కొడుకు తినటం చూసి కుడుట బడుతుంది. అలాగే పరమాత్మ కూడా జీవాత్మలకు తోడుగా ఉంటాడని పూర్వాచార్యులు చెపుతారు.

       ఇంకొక వివరణ ప్రకారం భగవంతుడి నామ సంకీర్తన చేయటం వలన భౌతికంగా ఈ లోకంనే ఉన్నా పాపల కడలిని అవలీలగా దాటి మానసికంగా పరమపదం చేరగలిగాడు .

నావలిట్టురుదరిగిన్రోమ్ : గతంలో యమభటుల పేరో యముడి పేరో వింటేనే భయపడిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళను పేరు పెట్టి పిలవ గలుగుతున్నారు. వాళ్ళ తలల మీదుగా నడుస్తామంటున్నారు. చేతనులు భూలోకంలో చేసిన పాపాలకు శిక్షలు వేసి దండిచ గలవాడు యముడు. కానీ పరమాత్మ నామాల  ముందు ఆయన శక్తి చాలదు. కిష్కింద కాండలో సుగ్రీవుడు రాముడు రాకముందు వాలిని చూసి వణికి పోయాడు, కానీ రాముడితో స్నేహం దొరికిన తరువాత వాలి ఉన్న చోటికే వెళ్లి పిలిచి యుద్దం చేసే శక్తిమంతుడయ్యాడు. అదే పరమాత్మ నామానికి ఉన్న మహాత్మ్యము.

ఉరుదరిగిన్రోమ్: చేతనుడు యముడి ముందు రాజస టివితో నడుస్తూ వుంటాడు. యముడిని చిత్రగుప్తుడు రాసిన చిట్టా తెమ్మని, భగవన్నామ స్మరణ చేత వచ్చిన శక్తితో దానిని ముక్కలు ముక్కలుగా చింపి పారేస్తానని అంటాడు. ఇక్కడ ఆళ్వార్లు ఏకవచన ప్రయోగానికి బదులుగా బహువచన ప్రయోగ చేశారు. దానికి కారణమేమిటంటే భగవన్నామ స్మరణ చేత ఆయనకు వచ్చిన శక్తి అపారమైనది. అందువలన అయన తనను ఒక్కడిగా కాక కొన్ని వందల వేల కూడికగా భావిస్తున్నారు.

మరొక వ్యాఖ్యానం ఏవిటంటే నామ సంకీర్తన ప్రభావం తెలియక  మునుపు ఎవరైతే పరమాత్మ పట్ల విముఖులుగా ఉన్నారో వారందరూ ఇప్పుడు నామ సంకీర్తన ప్రభావం తెలిసి అభిముఖులు అయ్యారు అందువలన బహువచనంలో చెప్పారు అని అంటారు.

రామాయణంలో హనుమ సీతాన్వేషణ చేస్తూ సముద్రాన్ని దాటి, లంకలో ఆమె జాడ తెలుసుకొని, అక్కడ ఒక చిన్నపాటి యుద్ధం చేసి తిరిగి వస్తే ఇక్కడ సముద్రపు ఒడ్డులో ఉండి పోయిన వానరాలన్నీ ఆనందంతో సుగ్రీవుడి మధువనాన్ని విరిచి పాడుచేసాయి. ఆళ్వార్లు యముడి తలమీద నడుస్తాననటం కూడా అలాంటిదే. ఆళ్వార్లు నామసంకీర్తన చేస్తే లోకంలోని తక్కిన చేతనులు కూడా ఆఫలితాన్ని అనుభావస్తారని తెలియజేస్తున్నారు.

నమన్ తమర్ తలైగళ్ మీదే: ఆళ్వార్లు ఇక్కడ మరొక విశేషం చెపుతున్నారు యముడు, అయన భటుల తలలు ఇంతమంది భక్తులు నడవడానికి చాలవు. కాబట్టి, ఈ లోకంలో ఇంకా తమ బుద్ది మార్చుకోకుండా పాపాలను చేస్తున్నవారు వారి పిల్లలకు యముడు, చిత్ర గుప్తుడు అని పేర్లు పెట్టి వారికి కూడా నమస్కారాలు (వ్యగ్యంగా) చేస్తాను. అప్పుడు యముడికి ఆనందం కలుగుతుంది. నామ సంకీర్తన చేసే భాగవతోత్తములు తమ శ్రీపాదాలను తల మీద పెటడం యముడికి కూడా సంతోషమే, అని నామ సంకీర్తన మహిమను తెలియజేసారు. ఈ విషయం కొంచం  వింతగా తోస్తుంది కదా! దీనికి ఎవైన ప్రమణాలున్నాయా? అని రెండవ భాగంలో చూద్దాం .

అడియెన్ చూడామణి రామానుజ దాసి

హిందీలో – http://divyaprabandham.koyil.org/index.php/2016/07/thirumalai-1-part-1/

మూలము : http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment