శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః
అవతారిక
కిందటి పాశురములో సంచిత, ఆగామి, ప్రారబ్దమనే మూడు విధముల కర్మలలో మొదటి రెంటిని గురించి చెప్పారు. స్వామి అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్ ఈ పాశురములో శ్రీమన్నారాయణుడు తనను శరణాగతి చేసిన భక్తులు తెలియక చెసే పాపాలను చూడడు , గణించడు అని వివరిస్తున్నారు.
“వణ్డు పడి తుళబ మార్బినిడై సెయ్ద పిళై
ఉణ్డు పల ఎన్ఱు ఉళం తళరేల్ – తొణ్డర్ సెయ్యుం
పల్లాయిరం పిఱైగళ్ పార్తిరుందుం కాణుం కణ్
ఇల్లాదవన్ కాణ్ ఇఱై”
ప్రతి పదార్థము
వణ్డు పడి = తేనెను గ్రోలుటకు గుంపులు గూడిన తుమ్మెదలు
తుళబ మార్బినిడై = శ్రీతులసి మాలలను హృదయ కమలముపై ధరించిన శ్రీమన్నారాయణుడు
సెయ్ద పిళై = (జీవులు)చేసిన తప్పులు
పల ఉణ్డు ఎన్ఱు = అనేకములు కలవు అని
ఉళం = ఓ మనసా!
తళరేల్ = చింతించకు
ఇఱై = (ఒక్కసారి శరణమంటే ఎప్పటికీ వదలక కృప చేసే)మన నాయకుడు
తొణ్డర్ సెయ్యుం = తన భక్తులు చేయు
పల్లాయిరం పిఱైగళ్ = వేలాది దోషములను చూచు నపుడు
పార్తిరుందుం = తన జ్ఞానముచే అన్నింటినీ చూడగలిగి కూడా
కాణుం = భక్తుల విషయములో దోషములను చూడవలసి వస్తే
కణ్ ఇల్లాదవన్ కాణ్ = చూడనట్లే వ్యవహరిస్తాడు
వ్యాఖ్యానము
“వణ్డు పడి తుళబ మార్బినిడై సెయ్ద పిళై…….తేనెను గ్రోలుటకు తుమ్మదలు గుంపులు గూడిన శ్రీతులసి మాలలను హృదయ కమలముపై ధరించిన శ్రీమన్నారాయణుడు తన భక్తులు చేయు వేలాది దోషములను చూడనట్లే వ్యవహరిస్తాడు . ‘ శ్రీమన్నారాయణుడు ‘ అంటే చాలు కదా! మరి స్వామి అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్ ‘ శ్రీతులసి మాలలను హృదయ కమలముపై ధరించిన శ్రీమన్నారాయణుడు ‘అని ఎందుకు అన్నారు! …అంటే భక్తులు ఆయన సౌందర్యమును చూసి ఆకర్షింప బడతారు. అలా ఆకర్షింప బడిన వారు తప్పులను చేయరు. అంతే కాదు శ్రీమహాలక్ష్మి కూర్చొని ఊగే తులసి మాల అంటే ఆయనకే ఎంతో ప్రీతి కదా!
ఉణ్డు పల ఎన్ఱు……. శ్రీమన్నారాయణుని శరణాగతి చెసినా ఇంద్రియములచే నియమింపబడిన శరీరము దోషములు చేస్తూనే వుంటుంది. “ఉరన్ ఎండ్ఱుం తోతియాల్ ఓర్ ఐందుం కాప్పాన్” తిరుక్కుఱళ్(మావటి వాడు కర్ర పట్టుకొని ఏనుగును నియంత్రిస్తాడు) ఇక్కడ ఇంద్రియములను ఏనుగునుతొను , మనసును కర్ర పట్టుకున్న మావటి వాడితొను పోల్చారు. స్వామి తిరుమంగై ఆళ్వార్లు , “ఐవర్ అఱుతు తిన్ఱిద అంజి నిన్ అడైందేన్” (ఐదుగురు వెంట పడుతుంటే భయపడి నిన్ను చేరుకున్నాను)అన్నారు. అదే విషయాన్ని స్వామి నమ్మాళ్వార్లు , “ఉణ్ణిలావియ ఐవరాల్ కుమైత్తీత్ఱి” అన్నారు . అందు వలన శరణాగతి చేసినప్పటికీ ఇంద్రియములు నిరంతరము ఆ జీవుడి మీద పెత్తనము చేస్తూనే వుంటుంది . అందువలన దోషములు జరిగుతూ వుంటాయి .
ఉళం తళరేల్ …….అప్పుడు ఈ ఓదార్పు అవసరమవుతుంది . “ఉళం” (మనసు) “ఉళ్ళమే” అన్న పదమునకు సంక్షిప్త రూపము . తమిళ వ్యాకరణము ప్రకారము “మకర ఈరు విళి వేత్ఱుమై” అంటారు .( విభక్తిని తెలియజేస్తున్నారు).
తొణ్డర్ సెయ్యుం…..” తొణ్డర్ ” శ్రీమన్నారాయణుని దాసులు….చేయు తప్పులు. నిరంతరము శ్రీమన్నారాయ ణుని శ్రీపాదములను సేవించె వరే కాక ఆయన భక్తులందరూ దాసులుగానే భావింపబడతారు.
పల్లాయిరం పిళైగళ్ …….అనేక వేల దోషములు… అనగా లెక్కకు మిక్కిలైన దోషములు. దేహములు సత్వ, రాజస, తామసములనే త్రిగుణాత్మకమైనవి. ఈ మూడు గుణములు అనేక దోషములను చేయిస్తూ వుంటుంది.’ పిళైగళ్ ‘_ ‘ పాపములు ‘.రెప్ప పాటులో జీవుడు చేసే పాపములను తొలగించుకోవటానికి అనేక బ్రహ్మ యుగ ములు పడతాయి. అర్థాత్ మన పాపములను మనమే తొలగించుకోవాలంటే సాధ్యమయ్యే విషయము కాదు. శాస్త్ర విహితమైన కర్మలు ‘ పాపములుగా ‘ పరిగణింప బడతాయి. మనచా ,వాచా ,కర్మణా ఇతరులను దూషించుటము , పరుల ద్రవ్యమును కోరుకోవటము , పరస్త్రీ వ్యామొహము , అబద్దాలు చెప్పటము , తినకూడనివి తినటము వంటివి శాస్త్ర విహితమైన కర్మలు…. చేయకూడనివి. శ్రీమన్నరాయణుని ఇతర దేవతలతో పోల్చడము , ఆయన అవతార ములలో దోషములను వెతకటము , భగవంతుడి విగ్రహమును తయారు చేసిన పదార్థమును శోధించటము , పూజను పూర్తి చేయకుండా ఆపటము , పూజా ద్రవ్యాలను దొంగిలించటము , దొంగతనము చేయు వారికి సహకరించటము మొదలైనవాటిని శాస్త్రము అపచారములుగా చెప్పింది .భాగవత అపచారము , భాగవతులపై ద్వేషమును పెంచుకోవటము కూడా ఈ కోవలోకే వస్తాయి .
ఇఱై పార్తిరుందుం కాణుం కణ్…….తనను శరణాగతి చేసిన వారు ఇవన్నీ చేసినా సర్వజ్ఞుడు ,సర్వాంతర్యామి అయిన శ్రీమన్నారాయణుడు అవన్నీ చూడగలిగి కూడా చూడడు.
ఇల్లాదవన్ కాణ్…… ‘ కాణ్ ‘ చూడగలుగు జ్ఞానము…చూడదు. శ్రీమన్నారాయణుడు తన భక్తుల మీద ఉన్న అపారమైన కారుణ్యము చేత చూడడు .’ ఇఱై ‘ అనగా పెరుమాళ్ళు . కొద్దిగా అనే అర్థము కూడ వస్తుంది. అనగా శ్రీమన్నరాయణుడు తన భక్తుల దోషములను కొద్దిగా కూడా చూడడు . దీనినే శ్రీవిష్ణు సహస్ర నామ స్తోత్రములో “అవిజ్ఞ్యాత” అన్న నామము తెలియజేస్తుంది.
అడియేన్ చూడామణి రామానుజ దాసి
మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2015/02/gyana-saram-24-vandu-padi-thulaba/
పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org