శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:
శ్లోకం 2
మయి ప్రవిశతి శ్రీమన్ మందిరం రంగశాయినః
పత్యుః పదాంభుజం ద్రష్ట్రుం ఆయాంతం అవిదూరతః!
అవతారిక:
మొదట మంగళాశాసనము చేసిన తరవాత తమ ఆచార్యులైన మణవాళ మామునులు తమకనుగ్రహించిన విధమును ప్రస్తుతించారు. వారి శ్రీ సూక్తులను వినుట, వారిని సేవించుట, వారిని కీర్తించుట తమకుత్తారకములని, సంసార క్లేశములను తొలగదోయగలవని చెప్పుకున్నారు. ఆచార్యులను వారి సమక్షములోనే కీర్తించాలని,మామునులను స్తుతించతలచి దానిని దినచర్య రూపములో “మయి ప్రవిశతి” అని మొదలు పట్టి “అనాస్పదం”(శ్లో – 13)అని ముగించారు.
ప్రతి పదార్థము:
శ్రీమన్ = అపారమైన కైంకర్యశ్రీ ఉన్న మణవాళ మామునులు
రంగశాయినః =శ్రీ రంగములో శయనించి వున్న శ్రీరంగనాధుడు
మందిరం = కోవెలలోనికి
మయి = దాసుడు
ప్రవిశతి సతి = వెళ్ళు నప్పుడు
పత్యుః = జగత్పతి అయిన శ్రీ రంగనాథుని
పదాంభుజం = పద్మముల వంటి పదములను
ద్రష్ట్రుం – సేవించుకోవటానికి
అవిదూరతః = దగ్గరగా
ఆయాంతం = వేంచేసి వున్న వారై( ఈ శ్లోకానికి 12వ శ్లోకములోని “త్వామేవ” అనే పదముతో అన్వయము)
భావము:
‘శ్రీమన్ అనకుండా ‘శ్రీమత్ అన్నట్లైతే మంత్ర రూపము అవుతుంది. అప్పుడు కైంకర్య మనే సంపదను పొందడానికి శ్రీరంగనాథుని కోవెల బాగా తగిన స్థలమని అర్థము వస్తుంది. మొదట్లో మామునులను సేవించు కోవాలనుకోకుండా శ్రీరంగనాథుని సేవించు కోవాలనుకొని కోవెలకు వెళ్ళగా అనుకోని విధముగా అక్కడ, దాసుడికి అతి సమీపములో మామునులు, స్వామి సన్నిధిలో సేవించుకోవటానికి వేంచేసి వున్నారు. అది దాసుడికి అయత్న లాభముగా అమరిందని చెప్పుతున్నారు. మునుపు మామునుల విషయములో కొంత పరాకు చూపిన దోషము వారి కటాక్షముతో తొలగిపోయిందని చెప్పుతున్నారు. భగవంతుడి కంటే ఆచార్యులు ఎంతో ఉన్నతమైన వారు. భగవంతుడి దర్శనము కోసము వెళ్ళినప్పుడు ఆచార్యులు అక్కడ కనపడటము ఎలాంటిదంటే, కట్టెలు కొట్టి అవి అమ్మి బతికే వాడికి, కట్టెలు కొట్టడానికి వెళ్ళ్గాక అక్కడ ఆయాచితముగా పెద్ద నిధి దొరికినట్లు, అని వ్యాఖ్యాత అంటున్నారు. రామానుజులకు చేయు కైంకర్యమే పురుషార్థము. దానికి వారి శ్రీ పాదములే ఉపాయమని తలచిన ఆచార్య నిష్ఠులైన మామునులు కోవెలకు వెళ్ళి పెరుమాళ్ళను సేవించుకోవటము , పెరుమాళ్ళకు మంగళాశాసనము చేయటము కోసమే కాని సిధ్ధోపాయమైన పెరుమాళ్ళను తమ పురుషార్థానికి ఉపాయముగా స్వీకరించడానికో, ప్రపత్తి చేయటానికో, కాదు. దేవతాంతరమును, శబ్దాది విషయములను, ఉపాయ భక్తిని ,ఉపాయమైన పెరుమాళ్ళను,సమానముగా చూసి పెరుమాళ్ళు మనకు స్వామి, (వానిని స్వయం ప్రయోజనముగా సేవించి మంగళాశాసనము చేయాలని భావించాలి)అని తలచే వారు పరమైకాంతి అని శాస్త్రాలు చెప్పుతున్నాయి. మామునులు ఆ కోవలోని వారే అని ఇక్కడ భావము.
అడియేన్ చూడామణి రామానుజ దాసి
Source: https://divyaprabandham.koyil.org/index.php/2015/09/purva-dhinacharya-tamil-2/
archived in https://divyaprabandham.koyil.org
pramEyam (goal) – https://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
SrIvaishNava education/kids portal – http://pillai.koyil.org