ఆళ్వార్/ఆచార్యుల వాళి తిరునామాలు – శ్రీమన్ నాథమునుల వైభవము

శ్రీ:  శ్రీమతే శఠగోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమతే వరవరమునయే నమః

పూర్తి వ్యాసమాలిక

<< నమ్మాళ్వార్ 

శ్రీమన్ నాథమునులు – కాట్టుమన్నార్ కోయిల్

శ్రీమన్నాథమునుల యొక్క అసలు పేరు శ్రీరంగనాథముని.  తరువాత అదే పేరు నాథమునిగా ప్రసిద్ధి చెందింది. వారి అవతార స్థలం కాట్టుమన్నార్ కోయిల్ (వీరనారాయణపురం అని కూడా పిలుస్తారు).  వారు ఆని (జ్యేష్ట) మాసం అనుషం (అనురాధా) నక్షత్రం లో జన్మించారు.

శ్రీమన్ నాథమునులు న్యాయ తత్త్వం, యోగ రహస్యం మరియు పురుష నిర్ణయం అనే గ్రంథాలను అనుగ్రహించారు. కాని అవి ఇప్పుడు లభ్యం కావు.  వీరు యోగశాస్త్రం, సంగీతంలో అపార నైపుణ్యం కలవారు. ఒక పెద్ద గుంపులో పలువురు తాళం వేస్తున్నప్పుడు, ఎవరు తాళం వేస్తున్నారు, ఎన్ని తాళాలు వేశారు అన్నది వీరు ఖచ్చితంగా గుర్తించగల సామర్థ్యం ఉండేది. 

వీరి ద్వారానే మనకు నాలాయిర దివ్య ప్రబంధములు లభించాయని మనకు తెలుసు. కాట్టుమన్నార్ కోయిల్లో ఉన్నప్పుడు, దక్షిణ భారతదేశం పశ్చిమ ప్రాంతం (తిరునారాయణపురం) నుండి వచ్చిన శ్రీవైష్ణవులు తిరుక్కుడందై ఆరావముదన్ గురించి పాశురాలు పఠించారు. శ్రీమన్ నాథమునులు పాశురాలను విన్నప్పుడు వాటి చివరలో ఉన్న“కురుగూర్ శఠగోపన్”, “ఆయిరత్తుళ్ ఇప్పత్తుం”  

అనే పదాలను విని, నాథమునులు ఆళ్వార్ తిరునగరికి వెళ్లి, ఆ పాశురాల  గురించి విచారించారు. అక్కడ మధురకవి ఆళ్వార్ వంశస్థులు ఇలా చెప్పారు: “మాకు మధురకవి ఆళ్వార్ యొక్క కణ్ణినుణ్ శిరుత్తాంబు మాత్రమే తెలుసు. ఆ పాశురాలని 12,000 సార్లు తిరుప్పుళియాళ్వార్ (చింత చెట్టు) క్రింద జపిస్తే, నమ్మాళ్వార్ దర్శనం లభిస్తుంది.” అని చెప్పారు.  యోగశాస్త్ర నిపుణులైన నాథమునులు ఆ చింతచెట్టు క్రింద కూర్చొని 12,000 సార్లు కణ్ణినుణ్ శిరుత్తాంబు పఠించారు. నమ్మాళ్వార్ ప్రత్యక్షమై, “ఏమి కావాలి?” అని అడిగారు. అప్పుడు నాథమునులు “దేవరవారు  ప్రసాదించిన  దివ్య ప్రబంధ పాశురాలను దయచేసి అనుగ్రహిచండి అని వేడుకున్నారు.”  నమ్మాళ్వార్ తమ నాలుగు ప్రబంధాలు — తిరువాయ్మొళి, తిరువిరుత్తం, తిరువాశిరియం, పెరియ తిరువందాదితో పాటు ఇతర ఆళ్వార్ల ప్రబంధాలతో కలిపి మొత్తం నాలాయిర దివ్య ప్రబంధములను  ప్రసాదించారు. మరియు వాటి అర్థాలను,రహస్యాలను బోధించారు.ఈ సంఘటనను బట్టి మనకు అర్థమౌతుంది నాథమునులు నమ్మాళ్వార్లకి శిష్యులు ఎలాగ అయ్యారో అని.

నాథమునులు కలియుగం ప్రారంభమైన 4000 సంవత్సరాల తరువాత అవతరించారు. ద్వాపరయుగం వరకు వేదం ఒకటే; తరువాత వ్యాస భగవానులు దానిని నాలుగుగా విభజించారు. అదే విధంగా నాథమునులు కూడా ప్రబంధాలను నాలుగు భాగాలుగా (ప్రతి భాగం 1000 పాశురాలుగా) విభజించి మనకు అందించారు. కలియుగంలో మేధో సంపత్తి తక్కువగా కలిగిన మానవులు సులభంగా అర్థం చేసుకోవడానికి ఇలా విభజించారు.

సంగీత నైపుణ్యం ఉన్న శ్రీమన్ నాథమునులు (ఇయర్పా తప్ప) మిగతా ప్రబంధాలకు సంగీత రాగాలు, తాళాలు కట్టి, తన మేనల్లుళ్లైన కీళైయగత్తు ఆళ్వాన్, మేళైయగత్తు ఆళ్వాన్లకు బోధించారు. దీని వల్ల ప్రబంధాలు విస్తృతంగా ప్రచారం పొందాయి.

మన దివ్యదేశాల్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గ ఉత్సవాలలో, అధ్యయన ఉత్సవం ఒకటి. శ్రీరంగం, తిరునారాయణపురం, ఆళ్వార్ తిరునగరి, శ్రీ విల్లిపుత్తూరు ఇలా ఎన్నో క్షేత్రాలలో చాలా అద్భుతంగా ఈ అధ్యయన ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో ప్రాశస్త్యం కల సేవ అరయర్ సేవ. ఈ సేవ నాథమునుల చేత ప్రారంభించబడింది. అలాగే వారు శ్రీరంగంలో తిరుమంగై ఆళ్వార్ కాలంలో జరిగిన అధ్యయనోత్సవాలను తిరిగి పునరుద్ధరించారు.

నాథమునులు వాళి తిరునామములు:

ఆని తనిల్ అనుడత్తిల్ అవదరిత్తాన్ వాళియే

ఆళవందార్కు ఉపదేశం అరుళివైత్తాన్ వాళియే

పాను తెఱ్కిల్ కణ్డవన్ శొల్ పల ఉరైత్తాన్ వాళియే

పరాంగుశనార్ శొల్ పిరబంధం పరిందుగట్ట్రాన్ వాళియే  

కానముఱ త్తాళత్తిళ్ కణ్డిశైత్తాన్ వాళియే

కరుణైయినాల్ ఉపదేసక్ గది అళిత్తాన్ వాళియే  

నానిలత్తిల్ కురువరైయై నాట్టినాన్ వాళియే

నలన్ తిగళు నాథముని నఱ్పదంగళ్ వాళియే

ఆని తనిల్ అనుడత్తిల్ అవదరిత్తాన్ వాళియే

ఆని మాసం అనుషం నక్షత్రంలో (జ్యేష్ట మాసం, అనురధా నక్షత్రంలో) అవతరించిన నాథమునులు చిరకాలం వర్ధిల్లాలి (పల్లాండు)

ఆళవందార్కు  ఉపదేశం అరుళివైత్తాన్ వాళియే 

తన మనవడు అయిన ఆళవందార్ గొప్ప ఆచార్యుడిగా ఎదగగలరని ముందుగానే గ్రహించి, వారికి ఉపదేశం అందేలా ఏర్పాట్లు చేసిన నాథమునులు చిరకాలం పల్లాండుగా వర్ధిల్లాలి 

పాను తెఱ్కిల్ కణ్డవన్ శొల్ పల ఉరైత్తాన్ వాళియే

దక్షిణ సూర్యుడైన నమ్మాళ్వార్లను కనుగొన్న మధురకవి ఆళ్వార్ రచించిన కణ్ణినుణ్ శిరుత్తాంబును 12,000 సార్లు జపించి, నమ్మాళ్వార్ల దర్శనం పొందిన నాథమునులు కల కాలం వర్ధిల్లాలి (పల్లాండు).

పరాంగుశనార్ శొల్ పిరబంధం పరిందుగట్ట్రాన్ వాళియే  

పరాంకుశులు (నమ్మాళ్వార్) రచించిన నాలుగు ప్రబంధాలను భక్తితో అభ్యసించిన నాథమునులు చిరకాలం వర్ధిల్లాలి (పల్లాండు).

కానముఱ త్తాళత్తిళ్ కణ్డిశైత్తాన్ వాళియే

దివ్యప్రబంధాలకు సంగీతపరమైన రాగాలు, తాళాలు కట్టి ప్రజల్లో విస్తరింపజేసిన నాథమునులు కల కాలం వర్ధిల్లాలి (పల్లాండు).

కరుణైయినాల్ ఉపదేసక్ కదియళిత్తాన్ వాళియే  

అపార కరుణతో శ్రీవైష్ణవ సంప్రదాయాన్ని పునరుద్ధరించి, ప్రపంచానికి అందుబాటులోకి తెచ్చిన నాథమునులు చిరకాలం పల్లాండుగా వర్ధిల్లాలి 

నానిలత్తిల్ కురువరైయై నాట్టినాన్ వాళియే

భూమిపై నలు దిక్కులలో గురుపరంపరను స్థాపించిన నాథమునులు చిరకాలం పల్లాండుగా వర్ధిల్లాలి 

నలం తిగళుం నాథముని నఱ్పదంగళ్ వాళియే

శుభగుణములతో ప్రకాశించే నాథమునుల యొక్క దివ్యచరణారవిందాలకు పల్లాండు.

అడియేన్ లక్ష్మి సేనాపతి రామానుజ దాసి

పొందుపరచిన స్థానము – https://divyaprabandham.koyil.org

ప్రమేయము (లక్ష్యము) – https://koyil.org 
ప్రమాణము (గ్రంథములు) – http://granthams.koyil.org 
ప్రమాత (పూర్వాచార్యులు) – http://acharyas.koyil.org 
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a Comment