ఆళ్వార్లు/ఆచార్యుల వాళి తిరునామాలు – నమ్మాళ్వార్  వైభవము

పూర్తి వ్యాసమాలిక

<< సేనై ముదళియార్ / విశ్వక్సేనుల వైభవం

శ్రీ:  శ్రీమతే శఠగోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమతే వరవరమునయే నమః

నమ్మాళ్వార్ – ఆళ్వార్ తిరునగరి

నమ్మాళ్వార్ — శఠకోపన్, మారన్, మగళ్ మారన్, వళుది వళనాడన్ వంటి అనేక పేర్లతో ప్రసిద్ధి. ఆళ్వార్ వైష్ణవ కులపతి — వైష్ణవ వంశానికి నాయకుడు.   శరణాగతులందరికీ నాయకుడు కావడంతో, ఆళ్వార్ను ప్రపన్న జన కూటస్థుడు అని పిలుస్తారు.  వారు తిరుక్కురుగూర్ (ఆళ్వార్ తిరునగరి)లో అవతరించారు. ఎంపెరుమాన్ ఆళ్వార్ కు మయర్వర మతినలం — నిష్కల్మషమైన జ్ఞానం, భక్తి ప్రసాదించారు.  నమ్మాళ్వార్ తిరునక్షత్రం వైకాసి విశాగం – ఈ రోజు ఆళ్వార్ తిరునగరిలో ఇప్పటికీ మహోత్సాహంగా జరుపబడుతుంది.  ఈ దివ్యదేశంలో ఎంపెరుమాన్‌కు ఉన్న వైభవాలు అన్నీ ఆళ్వార్‌కూ సమానంగా వర్తిస్తాయి ఎంపెరుమాన్‌కు రెండు బ్రహ్మోత్సవాలు ఉన్నట్లే, ఆళ్వార్‌కూ రెండు అవతారోత్సవాలు ఉన్నాయి – వైకాసి విశాగం – మాసి విశాగం (విగ్రహ ప్రతిష్ఠ), ఆళ్వార్ తిరునగరి ఎంపెరుమాన్‌కు ఉన్నట్లే, ఆళ్వార్‌కూ హంస పతాకంతో కూడిన కోడిమరం ఉంది.  నమ్మాళ్వార్ నాలుగు వేదాల సారాన్ని – తిరువిరుత్తం, తిరువాసిరియం, పెరియ తిరువందాది, తిరువాయ్మొళి అనే నాలుగు ప్రబంధాల రూపంలో ఇచ్చినందున, ఆయనను “వేదం తమిళ్ శెయ్ద మారన్” అని స్తుతిస్తారు.

నమ్మాళ్వార్ వాళి తిరునామం – 

తిరుక్కురుగై పెరుమాళ్ తన్ తిరుత్తాళ్‌గళ్ వాళియే

తిరువాన తిరుముగత్తుచ్చెవి ఎన్రుమ్ వాళియే

ఇరుక్కుమొళి ఎన్ నెంజిల్ తేక్కినన్ వాళియే

ఎన్దై ఎతిరాశర్ క్కు ఇఱైవనార్ వాళియే

కరుక్కుళియిల్ పుగావణ్ణమ్ కత్తారుల్వోన్ వాళియే 

కాశినియిల్ అరియానైక్కాట్టిన్ వాళియే

వరుత్తమరా వందు ఎన్నై వాళ్విట్టాన్ వాళియే

మధురకవి తాం పిరాన్ వాళి వాళి వాళియే

నమ్మాళ్వార్ వాళి తిరునామం — వివరణ 

తిరుక్కురుగై పెరుమాళ్ తన్ తిరుత్తాళ్‌గళ్ వాళియే

తిరుక్కురుగూరులో ఉన్న నమ్మాళ్వార్, ఎంపెరుమాన్‌కు సమానమైన వైభవాన్ని పొందినందున, నమ్మాళ్వార్‌ను ఈ పాదంలో “పెరుమాళ్” అని పేర్కొనబడుతున్నారు. అలాంటి వైభవాన్ని పొందిన ఆళ్వర్ల దివ్యతిరువడి చిరకాలం నిలిచి ఉండుగాక.

తిరువాన తిరుముగత్తుచ్చెవ్వి ఎన్రుమ్ వాళియే

ఈ పాదంలో ఆళ్వార్ యొక్క బంగారు వంటి దివ్యముఖంలో వెలిగే కాంతి ఎల్లప్పుడూ శోభాయమానంగా ఉండాలని అభిలషిస్తున్నారు.

ఇరుక్కుమొళి ఎన్ నెంజిల్ తేక్కినార్ వాళియే

తమిళంలో ఋగ్వేదాన్ని “ఇరుకు” అంటారు.  అనేక వేదశాఖల సారాన్ని ఆళ్వార్ తన ప్రబంధాల ద్వారా మన హృదయాలకు సులభంగా అర్థమయ్యేలా ఇచ్చారు. ఆ మహానుభావుడు చిరకాలం నిలిచి ఉండుగాక.

ఎన్దై ఎతిరాశర్ క్కు ఇఱైవనార్ వాళియే

రామానుజాచార్యుల ఆచార్యులైన నమ్మాళ్వార్ చిరకాలం నిలిచి ఉండుగాక. రామానుజులు తమ రక్షణను ఆళ్వార్ తిరువడుల్లో పొందారు. ఆళ్వార్ రామానుజులపై అపారమైన ప్రేమ కలిగినవారు.

కరుక్కుళియిల్ పుగావణ్ణమ్ కత్తారుల్వోన్ వాళియే

తిరువాయ్మొళిలో అనేక చోట్ల — ఆళ్వార్ పాసురాలు జపించే వారికి పునర్జన్మ ఉండదని చెప్పబడింది. మనలను మళ్లీ గర్భంలోకి వెళ్లకుండా కాపాడి, పరమపదానికి తీసుకెళ్లే ఆళ్వార్ చిరకాలం నిలిచి ఉండుగాక.

కాశినియిల్ అరియానైక్కాట్టిన్ వాళియే

నమ్మాళ్వార్ ఈ లోకంలో మనకు ఆచార్యుడిని చూపించాడు. నాథమునిగళ్‌కు ప్రత్యక్షమై, నాలాయిర దివ్యప్రబంధం మొత్తం ఇచ్చి, ఆయనను గురుపరంపరలో తదుపరి ఆచార్యునిగా స్థాపించారు. అలాగే, భవిష్యదాచార్యుడు రామానుజులు గురించి కూడా ఆళ్వార్ ముందుగానే వెల్లడించారు. తామ్రపర్ణి నదీ నీటిని మధురకవి ఆళ్వార్ నమ్మాళ్వార్  మరిగించగా, మొదట ప్రత్యక్షమైన విగ్రహం — రామానుజుల యొక్క భవిష్యదాచార్య విగ్రహం. మధురకవులు ఆశ్చర్యంతో – మీ విగ్రహం గురించి మరిగిస్తే ఈ విగ్రహం ప్రత్యక్షం అయిందే అని అడుగగా, ఆళ్వార్ స్వయంగా చెప్పారు “ఇతనే నా తిరువడుల స్థానాన్ని ప్రాతినిధ్యం చేసే ఆచార్యుడు, 4000 సంవత్సరముల తరువాత అవతరిస్తారు” అని, మధురకవులు మళ్ళీ వేడుకొనగా, మళ్ళీ రెండవ సారి తామ్రపర్ణి నదిని మరిగిస్తే తన అర్చామూర్తి లభిస్తుంది అని చెప్పారు నమ్మాళ్వార్లు.  మధురకవి మళ్ళీ ప్రయత్నించగా లభించిన నమ్మాళ్వార్ అర్చా ముర్తి ఆళ్వార్ తిరునగరిలో మనకు దర్శనమిస్తారు. అలా లభించిన భవిష్య ఆచార్య తిరుమేని మొట్టమొదటి శ్రీ రామానుజుల విగ్రహం మరియు నమ్మాళ్వార్ చే భవిష్యాచార్యులుగా చెప్పబడ్డ తిరుమేని అని తెలుస్తోంది.

ఇంకొక చెప్పుకోవలిన విషయం,  నమ్మాళ్వార్ నాథమునిగాళ్‌కు ప్రబంధాలను అనుగ్రహించినప్పుడు—ప్రత్యేకంగా “పొలిగ పొలిగ” తిరువాయ్మొళి పత్తు చెప్తున్న సందర్భంలో—నమ్మాళ్వార్, సన్యాసి స్వరూపంలో, నాథమునిగాళ్ స్వప్నంలో ప్రత్యక్షమయ్యారు. నాథమునులు ఆ దివ్యరూపాన్ని ఆనందంతో దర్శించి, ఆ రూపం గురించి నమ్మాళ్వార్‌ను అడిగారు. అప్పుడు నమ్మాళ్వార్, ఈ స్వరూపానికి సంబంధించిన ఆచార్యుడు భవిష్యత్తులో అవతరిస్తాడు అని ప్రకటించారు. అదేవిధంగా, నమ్మాళ్వార్ ఆ దివ్యరూపాన్ని ఒక శిల్పితో చెక్కించి, ఆ రెండవ భవిష్యదాచార్య తిరుమేనిని నాథమునులకు అందించారు. ఈ దివ్యరూపం నాథముని కాలం నుండి ఉయ్యక్కొండార్, మణక్కాళ్ నంబి, తిరుక్కోట్టియూర్ నంబి  అనే గురుపరంపరలో చివరకు తిరుక్కోట్టియూరు నంబి కి ఇవ్వబడి తిరుక్కోట్టియూరులో ప్రతిష్ఠించబడింది. ఇప్పటికీ అక్కడే ఉంది, మనం దర్శించుకునేలా.

ఇలాంటి మహోన్నత ఆచార్యులను—నాథమునులు, రామానుజులు వంటి మహానుభావులను—ఈ లోకానికి పరిచయం చేసిన నమ్మాళ్వార్  చిరకాలం నిలిచి ఉండుగాక.

వరుత్తమరా వందు ఎన్నై వాళ్విట్టాన్ వాళియే

నా అన్ని దుఃఖాలను తొలగించి, నా జీవితాన్ని శోభాయమానంగా చేసిన నమ్మాళ్వార్ చిరకాలం నిలిచి ఉండుగాక. వారి పాసురాలు జపించడం ద్వారా ఎంపెరుమాన్, ఆచార్యుల అనుగ్రహం లభిస్తుంది.

మధురకవి తాం పిరాన్ వాళి వాళి వాళియే

మధురకవి ఆళ్వార్‌కు నమ్మాళ్వార్ దేవుడే. నమ్మాళ్వార్ తప్ప వారు ఇక దేనిగురించీ అలోచించలేదు. “తేవు మట్ట్రరియేన్” — నమ్మాళ్వార్ తప్ప మరెవ్వరూ దేవుడిగా తెలియదు అని వారు అన్నారు. అలాంటి మధురకవి ఆళ్వార్‌కు అన్నీ అయిన నమ్మాళ్వార్ చిరకాలం నిలిచి ఉండుగాక.

అడియేన్ లక్ష్మి సేనాపతి రామానుజ దాసి

పొందుపరచిన స్థానము – https://divyaprabandham.koyil.org

ప్రమేయము (లక్ష్యము) – https://koyil.org 
ప్రమాణము (గ్రంథములు) – http://granthams.koyil.org 
ప్రమాత (పూర్వాచార్యులు) – http://acharyas.koyil.org 
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a Comment