రామానుశ నూత్తందాది – సరళ వ్యాఖ్యానము – పాశురములు 1 – 10

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి క్రమము

<<మునుపటి శీర్శిక

మొదటి పాశురము: “ఎంబెరుమానార్ యొక్క దివ్య చరణాల వద్ద సముచిత జీవితము గడిపేందుకు వారి దివ్య తిరునామాలను పఠిద్దాము” అని అముదనార్ తన హృదయాన్ని ఆహ్వానిస్తున్నారు.

పూ మన్ను మాదు పొరుందియ మార్బన్ పుగళ్ మలింద
పా మన్ను మాఱన్ అడి పణిందుయ్ందవన్ పల్ కలైయోర్
తాం మన్న వంద ఇరామానుశన్ చరణారవిందం
నాం మన్ని వాళ నెంజే శొల్లువోం అవన్ నామంగళే (1)

ఓ మనసా! పద్మమును తన నివాసముగా ఉన్న పెరియ పిరాట్టి, ఎంబెరుమాన్ యొక్క దివ్య వక్షస్థల మాధుర్యాన్ని చూసిన పిదప ఆ దివ్య వక్షస్థలమే తన నివాసముగా చేసుకొని ఉండిపోయింది. ఎంబెరుమాన్ యొక్క దివ్య మంగళ గుణాలు పూర్ణంగా ఉన్న తిరువాయ్మొళిలోనే నమ్మాళ్వార్ మునిగి ఉండేవారు. అటువంటి నమ్మాళ్వార్ యొక్క దివ్యమైన శ్రీ చరణాలను ఆశ్రయించి రామానుజులు జీవించారు. రామానుజులకు పూర్వ కాలములో జీవించిన వారు, శాస్త్రాధ్యయము చేసిన తరువాత కూడా, వాటి నిగూఢ అర్థాలను అర్థము చేసుకోలేక పోయారు. రామానుజులు ఆ గూఢ అర్థాలు తెలిసినవారు మరియు వాటిని చక్కగా స్థాపించారు కూడా. వారి దివ్య చరణములు మన లక్ష్యముగా ఉంచుకొని, సుసంప్పన్నముగా ఉండేందుకు రామానుజుల దివ్య నామాలను పలుకుదాము.

రెండవ పాశురము: ఎంబెరుమానార్ యొక్క దివ్య నామాలను పఠింద్దామని తన హృదయానికి చెప్పిన మునుపటి పాసురము తరువాత, అన్య సాధనములను మరచిపోతూ తన హృదయము ఎంబెరుమానార్ యొక్క దివ్య చరణాలను ఆనందించడం ప్రారంభిస్తుంది.

కళ్ళార్ పొళిల్ తెన్నరంగన్ కమల ప్పదంగళ్ నెంజిల్
కొళ్ళా మనిశరై నీంగి కుఱైయల్ పిరాన్ అడిక్కీళ్
విళ్ళాద అన్బన్ ఇరామానుశన్ మిక్క శీలం అల్లాల్
ఉల్లాదు ఎన్ నెంజు ఒన్ఱు అఱియే ఎనక్కుట్ఱ పేరియల్వే (2)

కొంత మంది మనిషిగా జన్మనెత్తినా కూడా, తేనె కారుతున్న తోటలతో నిండి ఉన్న శ్రీ రంగములో శయనించి ఉన్న పెరియ పెరుమాళ్ పైన దైవ చింతనను నేర్పే శాస్త్రాధ్యయనము చేసే అదృష్టము ఉండదు. అటువంటి వాళ్ళకి నా మనస్సు దూరమైంది. ఆ తరువాత, తిరుక్కుఱైయలూర్లో అవతరించి దివ్య ప్రబంధాన్ని రచించిన తిరుమంగై ఆళ్వార్ యొక్క దివ్య తిరువడిని నిరంతరము ధ్యానించే రామానుజుల యొక్క దివ్య మంగళ గుణాలను తప్పా మరే ఇతర వాటి గురించి నా మనస్సు ధ్యానించడం లేదు.

మూడవ పాశురము: “లౌకిక విషయాలలో మునిగి ఉన్న వారితో నా సంబంధము తొలగించి ఎంబెరుమానార్ సంబంధము ఉన్న వారి పాదాల వద్ద నా సంబంధము ఉండేలా చేసిన నీ గొప్ప ఉపకారముకి నేను తల వంచుతున్నాను” అని అముదనార్ తన హృదయముతో అంటున్నారు.తిరుమంగై ఆళ్వార్ యొక్క దివ్య తిరువడిని నిరంతరము ధ్యానించే రామానుజుల దివ్య మంగళ గుణాలను తప్పా ఇంక దేని గురించి ఆలోచించడం లేదు.

పేరియల్ నెంజే అడి పణిందేన్ ఉన్నై పేయ్ పిఱవి
ప్పూరియరోడుళ్ళ శుట్ఱం పులర్ త్తి ప్పొరువరుం శీర్
ఆరియన్ శెమ్మై ఇరామానుశ మునిక్కన్బు శెయ్యుం
శీరియ పేఱు ఉడైయార్ అడిక్కీళ్ ఎన్నై చ్చేర్త్తదర్కే (3)

గొప్ప గుణమున్న ఓ మనసా! నాకు ఎంత గొప్ప ఉపకారాన్ని చేసావు. అహంకార మమకార లోపాలున్న వారితో, అజ్ఞానులు మొదలైన వారితో నా సంబంధాన్ని తెంచి గొప్ప వ్యక్తుల చరణాలను చేరేలా చేసినందుకు నీకు నమస్కారాలు. తన దాసులతో ఇమిడిపోయే నిజాయితీ ఉన్న ఎంబెరుమానార్ పట్ల భక్తి ఉన్న వారు ఈ గొప్ప వ్యక్తులు.

నాల్గవ పాశురము: నిరహేతుకమైన ఎంబెరుమానార్ కృప కారణముగా, తాను మునుపటి దిగజారిన స్థాయికి వెళ్ళనని, తనలో ఇక ఏ దోషములూ లేవని వారు తెలియజేస్తున్నారు.

ఎన్నై ప్పువియిల్ ఒరు పొరుళాక్కి మరుళ్ శురంద
మున్నై ప్పళవినై వేర్ అఱుత్తు ఊళి ముదల్వనైయే
పన్న ప్పణిత్త ఇరామానుశన్ పరమ్ పాదముం ఎన్
శెన్ని త్తరిక్క వైత్తాన్ ఎనక్కేదుం శిదైవిల్లెయే (4)

అన్ని తత్వాలకు (చిత్ మరియు అచిత్) కారకుడు, భగవాన్ సర్వకారకుడని, మనందరము గుర్తించి ధ్యానించేలా చేసిన వారు ఎంబెరుమానార్లు. ఇది వారు శ్రీ భాష్యంతో సాధించగలిగారు. అందరి కన్నా గొప్పవారైన రామానుజులు, ఈ ప్రపంచములో అచేతనముగా ఉన్న నన్ను చేతనుడిగా తయారుచేశారు. అనాదిగా నన్ను వెంటాడుతున్న నా కర్మలను తొలగించి, వారి దివ్య తిరువడిని నా శిరస్సు పై ఉంచి నన్ను కటాక్షించారు. ఇక నాలో ఏ లోపము లేదు.

ఐదవ పాశురము: రామానుజుల దివ్య నామాలను పఠిద్దామని ఈ ప్రబంధాన్ని ప్రారంభించిన అముదనార్, వాటిని పఠించడం మొదలుపెట్టారు. కుదృష్టులు తనను నిందిస్తారేమోనని మొదట భావించి, ఆపై తనను తాను ఒప్పించుకొని, తన కార్య సాధనను ప్రారంభిస్తున్నారు.

ఎనక్కుట్ఱ శెల్వం ఇరామానుశన్ ఎన్ఱు ఇశైయగిల్లా
మన క్కుట్ఱ మాందర్ పళిక్కిల్ పుగళ్ అవన్ మన్నియ శీర్
తనక్కుట్ఱ అన్బర్ అవన్ తిరునామంగళ్ శాట్ఱుం ఎన్బా
ఇన క్కుట్ఱం కాణగిల్లార్ పత్తి ఏయ్ంద ఇయల్విదెన్ఱే(5)

మన స్వరూపానికి నిధి అయిన వారు ఒక్క ఎంబెరుమానార్, అనే నా ప్రయత్నాన్ని తోసిపుచ్చి, నా అభిప్రాయాలను బుద్దిలోపముతో అంగీకరించని వారు ఉన్నట్లైతే అది నాకు పండుగ లాంటిది. ఎంబెరుమానార్ యొక్క మంగళ గుణాలపై భక్తి ప్రపత్తులు ఉన్నవారు వారి దివ్య నామాలను మరియు దివ్య కార్యాలను వ్యక్తపరచే నా పాశురములలో లోపాలను చూడరు.

ఆరవ పాశురము: మునుపటి పాశురములో, ఎంబెరుమానార్ పట్ల తన భక్తిని వ్యక్త పరచుచున్నానని చెప్పిన అముదనార్, ఇప్పుడు ఎంబెరుమానార్ గొప్పతనానికి తగిన భక్తి తనలో లేదని తనను తాను నిందించుకుంటున్నారు.

ఇయలుం పొరుళుం ఇశైయ త్తొడుత్తు ఈన్ కవిగళ్ అన్బాల్
మయల్ కొణ్డు వాళుత్తుం ఇరామానుశనై మది ఇన్మైయాల్
పయిలుం కవిగళిల్ పత్తి ఇల్లాద ఎన్ పావి నెంజాల్
ముయల్ గిన్ఱనన్ అవన్ తన్ పెరుం కీర్తి మొళిందిదవే (6)

ఎంబెరుమానార్ పై ప్రేమతో గొప్ప కవులు పదాలను కూర్చి మాలలు చేసి కవితలు మరియు పద్యాల రూపములో కీర్తిస్తారు. పాపపూరితమైన వాడినైన నాకు అంతటి భక్తి లేదు. వారి అమితమైన గొప్పతనాన్ని నా అజ్ఞానమైన బుద్దితో నా ఈ పాశురముల ద్వారా తెలియజేయడనికి ప్రయత్నిస్తున్నాను.

ఏడవ పాశురము: తన నీచత్వాన్ని చూసి ఒక అడుగు వెనకకు వేసిన అముదనార్, కూరత్తాళ్వాన్ యొక్క దివ్య చరణాలతో ఉన్న తన సంబంధాన్ని గుర్తుచేసుకొని ఇది తనకు కష్టమైన పని కాదని నిర్ణయించుకొని ప్రారంభిస్తున్నారు.

మొళియై క్కడక్కుం పెరుం పుగళాన్ వంజ ముక్కుఱుంబామ్
కుళియై క్కడక్కుం నమ్ కూరత్తాళ్వాన్ చరణ్ కూడియ పిన్
పళియై క్కడత్తుం ఇరామానుశన్ పుగళ్ పాడి అల్లా
వళియె క్కడత్తల్ ఎనక్కు ఇని యాదుం వరుత్తం అన్ఱే (7)

కూరత్తాళ్వారుల గొప్పతనాన్ని పూర్తిగా చెప్పలేము; మూడు అగాధ లోయల రూపములో ఉన్న వంశ అహంకారము (గొప్ప కులము లో పుట్టడం ), జ్ఞాన అహంకారము, ప్రవర్తన వల్ల సంక్రమించిన అహంకారాన్ని వారు జయించినారు. మా నాయకులైన కూరత్తాళ్వారుల దివ్య చరణములను చేరుకున్నాము. మనకి, ఈ పాప సాగరమును దాటడానికి సహాయపడే ఎంబెరుమానార్ యొక్క దివ్య మంగళ గుణాలను కీర్తించడములో ఇక ఇప్పుడు అంత కష్టము ఉండదు. నా స్వరూపానికి విరోధమైన సాధనములను నుండి కూడా తప్పించు కొనవచ్చు.

ఎనిమిదవ పాశురము: పొయిగై ఆళ్వార్ అనుగ్రహించిన దివ్య ప్రబంధముపై ధ్యానించే గొప్పతనము గల ఎంబెరుమానార్, నాకు ప్రభువు.

వరుత్తుం పుఱ ఇరుళ్ మాట్ఱ ఎం పొయిగై ప్పిరాన్ మఱైయిన్
కురుత్తిన్ పొరుళైయుం శెందమిళ్ తన్నైయుం కూట్టి
ఒన్ఱ త్తిరిత్తు అన్ఱు ఎరిత్త తిరువిళక్కై త్తన్ తిరువుళ్ళత్తే
ఇరుత్తుం పరమన్ ఇరామానుశన్ ఎం ఇఱైయవనే (8)

అజ్ఞానము వలన జీవాత్మలు ఈ లౌకిక సుఖాలవైపు ఆకర్షితులై చివరికి దుఃఖాన్ని పొందుతున్నారు. ప్రపన్న కులానికి అతి ప్రియులు మరియు ఉత్తములైన పొయిగై ఆళ్వార్, అజ్ఞానాంధకారమును తోలగించే వేదాంతమును అందమైన తమిళ పదాలతో వైయమ్ తగళియ (ఈ ప్రపంచాన్నే దీపముగా) అని మొదలైయ్యే ముదల్ తిరువందాది పాడారు. ఆ దివ్య దీపాన్ని తమ దివ్య మనస్సులో ఉంచుకున్న ఉత్తములు ఎంబెరుమానార్ మనకు స్వామి.

తొమ్మిదవ పాశురము: బూదత్తాళ్వారుల దివ్య తిరువడిని ధ్యానిస్తూ ఉండే ఎంబెరుమానార్ యొక్క దివ్య మంగళ గుణాలను ఎవరైతే పఠిస్తారో, వారు ఈ ప్రపంచములో వేదాలను స్థాపించి కాపాడతారు అని అముదనార్ తెలియజేస్తున్నారు.

ఇఱైవనై క్కాణుం ఇదయత్తిరుళ్ కెడ జ్ఞానం ఎన్నుం
నిఱై విళైక్కు ఎట్ఱియ భూద త్తిరువడి తాళ్గళ్ నెంజ
త్తుఱైయ వైత్తాళుం ఇరామానుశన్ పుగళ్ ఓదుం నల్లోర్
మఱైయివై క్కాత్తు ఇంద మణ్ఞగత్తే మన్న వైప్పవరే (9)

అన్బే తగళియ అని ప్రారంభమయ్యే ఇరండామ్ తిరువందాదిని పాడిన బూదత్తాళ్వార్, అన్ని అంశాలలో పరిపూర్ణమైన దీపాన్ని (ఇరండామ్ తిరువందాది) వెలిగించారు. మన మనస్సులో ఉన్న అజ్ఞానాంధకారాన్నినాశింపజేస్తుంది ఈ దీపము. ప్రకాశవంతమైన మనస్సుతో మాత్రమే సరైన నాయకుడిని మనము గుర్తించగలము. బూదత్తాళ్వార్ల దివ్య చరణములు నిత్యము ఎంబెరుమానార్ తమ దివ్య మనస్సులో ఉంచుకున్నారు. ఎంబెరుమానార్ యొక్క దివ్య మంగళ గుణాలను ధ్యానించేవారు వేదాలను (బాహ్యులు మరియు కుదృష్టులచే నాశనము చేయలేనివి) రక్షించి, ఈ ప్రపంచములో వాటిని దృఢంగా స్థాపిస్తారు.

పదవ పాశురము: పేయ్ ఆళ్వార్ యొక్క దివ్య తిరువడిని ఎల్లప్పూడూ కీర్తించే గుణము ఉన్న ఎంబెరుమానార్ యొక్క తిరువడిని తమ శిరస్సుపై ఉంచుకొని భక్తి చుపేవారు ఎల్లప్పుడు గొప్పవారు అని అముదనార్ చెబుతున్నారు.

మన్నియ పేరిరుళ్ మాండబిన్ కోవలుళ్ మామలరాళ్
తన్నొడు మాయనై క్కణ్డమై కాట్టుం తమిళ్ త్తలైవన్
పొన్నడి పోట్ఱుమ్ ఇరామానుశర్కు పూందవర్ తాళ్
శెన్నియిల్ శూడుం తిరువుడైయార్ ఎన్ఱుం శీరియరే (10)

మొదటి ఇద్దరు ఆళ్వారులు దీపాలు వెలిగించిననంతరం (తిరువందాదులతో) అత్యంత స్థిరమైన అజ్ఞానాంధకారము పూర్తిగా కొట్టుకొనిపోయినది. అలా అంధకారము నశించిన అనంతరం, తిరుక్కోవలూర్లో వేంచేసి ఉన్న పెయాళ్వార్, భగవాన్ (కృష్ణావతారములో భక్తవత్సలునిగా ఉన్నవారు) తో కలిసి ఉన్న తిరుమామగళ్ (శ్రీ మహాలక్ష్మి) ని ఎలా దర్శించారో మనకు చూపించారు. తమిళ నాయకుడైన పేయాళ్వార్ యొక్క అపేక్షనీయమైన దివ్య చరణాలను ఎంబెరుమానార్ కీర్తించారు. ఎంబెరుమానార్ యొక్క భక్తుల దివ్య చరణాలను ధరించేవారు, ఎంబెరుమానార్ పట్ల ఉన్న భక్తి ప్రపత్తులను వారి శిరస్సుపై ఆభరణముగా ధరించువారు ఎల్లప్పుడూ పూజ్యనీయులు ( ఎందుకంటే వారి వద్ద ఈ గొప్ప సంపద ఉన్నది కాబట్టి ).

తదుపరి శీర్శికలో, ఈ ప్రబంధము యొక్క పై పాశురములను అనుభవిద్దాము.

అడియెన్ శ్రీదేవి రామానుజ దాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2020/04/ramanusa-nurrandhadhi-pasurams-1-10-simple/

ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి : http://divyaprabandham.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment