శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ మణవాళ మాముణుల యొక్క ఉపదేశ రత్నమాల 19వ పాశురములో తిరుప్పల్లాండు యొక్క గొప్పతనాన్ని అద్భుతంగా వెల్లడి చేశారు.
కోదిలవామ్ ఆళవార్గళ్ కూఱు కలైక్కెల్లాం ఆది తిరుప్పల్లాండు ఆనదువుమ్
వేదత్తుక్కు ఓమ్ ఎన్నుమ్ అదుపోల్ ఉళ్ళదుక్కెళ్ళాం శురుక్కాయ్ తాన్ మంగలం ఆదలాల్
ప్రణవం అన్ని వేదాల యొక్క సారాంశం వలె, తిరుప్పల్లాండు అనేది ఆళ్వారుల అరుళిచ్చెయల్ (దివ్య ప్రబంధాల పఠనం) యొక్క సారాంశం అని మణవాళ మాముణుల దృఢమైన అభిప్రాయం. ఈ కారణంగా అరుళిచ్చెయల్ ప్రారంభంలో తిరుప్పల్లాండు పఠించడం జరుగుతుంది.
పెరియాళ్వార్ పాండియ రాజు ఆస్థానంలో శ్రీమన్నారాయణ యొక్క ఆధిపత్యాన్ని నిరూపించిన తరువాత, రాజు ఆళ్వార్ ని సత్కరించి ఏనుగు మీద పట్టణం చుట్టూ ఊరేగింపుగా తీసుకొని వెళతారు. ఏనుగుపై ఆళ్వార్ యొక్క ఈ గొప్ప దృశ్యాన్ని వీక్షించడానికి, భగవాన్ గరుడ వాహానంపైన తన దివ్య పత్నులతో పాటు ప్రత్యక్షమౌతాడు. శ్రీవైకుంఠంలో సుఖవంతంగా ఉన్న భగవాన్, సంసారంలోకి దిగి వచ్చాడని భయపడి, పెరియాళ్వార్ భగవానుడిని స్తుతిస్తూ పాశురములు పాడతారు. ఈ పాశురములను తిరుప్పల్లాండు అని పిలుస్తారు. పెరియాళ్వార్ యొక్క ప్రత్యేకమైన గొప్పతనం ఏమిటంటే, భగవానుడిని తాను స్తుతించడమే కాకుండా వారు సంసారులు కూడా భగవానుడిని స్తుతించేలా చేస్తారు.
తిరుప్పల్లాండు యొక్క ఈ సరళమైన అనువాదం పెరియ వాచ్చాన్ పిళ్ళై యొక్క వ్యాఖ్యానం సహాయంతో జరిపబడింది.
తనియన్లు
గురుముఖం అనధీత్య ప్రాహవేదాన్ అశేషాన్ నరపతి పరిక్లుప్తం శుల్కమాదాతు కామః । స్వశురం అమరవన్ధ్యం రంగనాధస్య సాక్షాత్ ద్విజకుల తిలకం తం విష్ణుచిత్తం నమామి॥
పెరియాళ్వారుని విష్ణుచిత్తులు అని కూడా పిలుస్తారు, వీరు గురువుల నుండి జ్ఞానం పొందలేదు కాని పెరుమాళ్ (భగవానుని) చేత జ్ఞానం మరియు భక్తిని అనుగ్రహంగా పొందినవారు. బంగారు నాణేల బహుమానముగా పొంది, ఆ బహుమానాన్ని ఉపయోగించి శ్రీవిల్లిపుత్తూర్లోని ఎమ్పెరుమాన్ యొక్క ఆలయం మెరుగుపరచాలనే ఉద్దేశ్యంతో మహాపండితులు ఉన్న మధురై రాజైన శ్రీ వల్లభ దేవ రాజసభకు వెళ్ళారు. ఆ రాజసభలో వేదాలను ఉటంకిస్తూ భగవానుని యొక్క ఆధిపత్యాన్ని స్థాపించిన తరువాత ఆ బహుమతిని గెలుచుకుంటారు. అంతేకాకుండా, తన దివ్య కుమార్తె, ఆండాళ్ ని శ్రీ రంగనాథునితో వివాహం గావిస్తారు, నిత్యసూరుల చేత భగవానుని యొక్క మామగారిగా గౌరవించబడతారు. బ్రాహ్మణోత్తముడిగా కీర్తించబడ్డారు. అటువంటి పెరియాళ్వారుకి నేను వందనం చేస్తున్నాను.
మిన్నార్ తడమదిళ్ శూళ్ విల్లిపుత్తూర్ ఎన్ఱు ఒరుకాల్ శొన్నార్ కళఱ్కమలం శూడినోం – మున్నాళ్ కిళియఱుత్తాన్ ఎన్ఱురైత్తోం కీళ్మైయినిల్ సేరుం వళియఱుత్తోం నెంజమే వందు
ఓ హృదయమా! శ్రీవిల్లిపుత్తూర్ పేరును ప్రస్తావించిన వారి దివ్య తామర లాంటి పాదాలను మనము ధరించెదము, ఆ ప్రదేశం చుట్టూ ఎత్తైన భారీ గోడలు మెరుపులా మెరుస్తాయి, మన తలలపై ఆభరణాలలా ప్రకాశిస్తాయి. రాజుగారి సభకు వెళ్లిన పెరియాళ్వార్ తన వాదనల ద్వారా అక్కడ ఉంచిన బంగారు నాణేల నిధిని ఛేదించి అతని చేతిలో పడేలా జరిగింది, వారి యొక్క చర్యను గుర్తుచేసుకోవడం మరియు మాట్లాడటం ద్వారా మనము అణగారిన స్థితికి చేరకుండా మనల్ని మనం కాపాడుకుంటాము.
పాణ్దియన్ కొణ్డాడ పట్టర్పిరాన్ వందాన్ ఎన్ఱు ఈణ్డియ శంగం ఎడుత్తూద
వేండియ వేదంగళ్ ఓది విరైందు కిళియఱుత్తాన్ పాదంగళ్ యాముడైయ పత్తు
“మనకు మహోన్నతమైన అస్తిత్వం యొక్క ఆధిపత్యాన్ని స్థాపించడానికి భట్టర్పిరాన్ వచ్చారు” అని పాండియ రాజైన శ్రీవల్లభ దేవ వారిని ప్రశంసిస్తారు. అతని ఆస్థానంలో ఉన్నవారు విజయానికి చిహ్నంగా శంఖ నాదం మ్రోగిస్తారు. వేదాల నుండి అవసరమైన ప్రమాణాలను అందించడం ద్వారా, పెరియాళ్వార్ [భట్టర్ పిరాన్] శ్రీమన్నారాయణ యొక్క ఆధిపత్యాన్ని స్థాపిస్తారు. ఇటువంటి పెరియాళ్వార్ యొక్క దివ్య చరణాలు మనకు శరణు.
********
మొదటి పాశురము. ఎమ్పెరుమాన్ని తన సౌందర్యం మరియు ఇతర శుభప్రదమైన గుణాలతో ఈ సంసారంలో చూసిన తరువాత పెరియాళ్వార్, అతనికి ఏ దురదృష్టం సంభవిస్తుందోనని భయపడి, భగవానుడు చిరకాలం ఈ విధంగా గొప్పగా ఉండాలని స్తుతిస్తూ పాశురాలను పాడతాడు.
పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పలకోడి నూరాయిరం
మల్లాండ తిణ్ తోళ్ మణివణ్ణా ఉన్ శేవడి శెవ్వి తిరుక్కాప్పు.
మల్లయోధులను నియంత్రించి వధించగల బలమైన దివ్య భుజాలను కలిగి ఉన్న ఓ ఎమ్పెరుమాన్, మాణిక్యపు వర్ణం కలిగి ఉన్నవాడా! లేత ఎరుపు రంగు గల నీ దివ్య పాదాలకు చిరకాలం రక్షణ ఉండాలి. ఆళ్వార్ మానవుల సమయ ప్రమాణంతో, తరువాత స్వర్గలోక సమయ ప్రమాణంతో, ఆ తరువాత బ్రహ్మ యొక్క సమయ ప్రమాణంతో చివరకు, అనేక బ్రహ్మల సమయ ప్రమాణంతో భగవానుడిని స్తుతించారు.
రెండవ పాశురము. నిత్య విభూతి (పరమపదం) మరియు లీలా విభూతి (సంసారం) రెండింటితో ఉన్నందుకు ఆ అత్యున్నత స్థాయి భగవానుడిని ఆళ్వార్ ప్రశంసిస్తున్నారు.
అడియోమోడుం నిన్నోడుం పిరివిన్ఱి ఆయిరం పల్లాండు
వడివాయ్ నిన్ వలమార్పినిల్ వాళ్ గిన్ఱ మంగైయుం పల్లాండు
వడివార్ శోది వలత్తురైయుం శుడరాళియుం పల్లాండు
పడై పోర్ పుక్కు ముళఙ్గుం అప్పాంచశన్నియముం పల్లాండే.
నేను సేవకుడను, నీవు యజమాని అన్న మన మధ్య సంబంధం చిరకాలం వర్ధిల్లాలి. ఆభరణాలు, నిత్య యవ్వనముతో ఉన్న అతి సౌందర్యవతి, నీ కుడి ఛాతీపై నివసించే పెరియ పిరాట్టి (శ్రీ మహాలక్ష్మి) చిరకాలం అక్కడే ఉండాలి. నీ కుడి చేతిలో, అద్భుతమైన దివ్య చక్రం చిరకాలం ఉండాలి. మీ ఎడమ చేతిలో, యుద్ధభూమిలో తన ధ్వనితో శత్రువుల హృదయాలను చీల్చివేసే దివ్య శంఖం (పాంచజన్యం) చిరకాలం ఉండాలి. భాగవతులను సూచిస్తూ, ఆళ్వారు ఈ సంసారం గురించి చెబుతున్నారు. పిరాట్టి మరియు దివ్య శంఖ చక్రాల గురించి ప్రస్తావించి, పరమపదం గురించి తెలియజేస్తున్నారు.
మూడవ పాశురము. ఈ పాశురముతో ప్రారంభించి, మూడు పాశురములలో, వారు ఈ సంసార సుఖాసక్తి ఉన్నవారిని, కైవల్యముపై ఆసక్తి ఉన్నవారిని [ఆత్మను అనుభవించుట (మనను తమను తాము ఆస్వాదించుట)] మరియు భగవత్ సేవాసక్తి ఉన్నవారిని తనతో చేరి భగవత్ స్తుతి చేయమని ఆహ్వానిస్తున్నారు. ఈ మూడవ పాశురములో, భగవత్ సేవ పట్ల ఆసక్తి ఉన్నవారిని ఆహ్వానిస్తున్నారు.
వాళాల్ పట్టు నిన్నీరుళ్లీరేల్ వందు మణ్ణుం మణముం కొణ్మిన్
కూళాళ్ పట్టు నిన్నీర్ కళై ఎంగళ్ కుళువినిల్ పుగదలొట్టోమ్
ఏళాల్ కాలం పళిప్పిలోమ్ నాంగుళ్ ఇరాక్కదర్ వాళ్ ఇలంగై
పాళాళాక ప్పడై పొరుదానుక్కు పల్లాండు కూరుదుమే.
మీరు దాస్య సంపదపై ఆసక్తి కలిగి ఉంటే, త్వరగా రండి, భగవానుడి యొక్క ఉత్సవం జరుపుకోవడానికి మట్టిని తవ్వండి, ఏ సేవ అయినా సరే చేయాలని కోరిక ఉండాలి. తిండి పట్ల మాత్రమే ఆసక్తి ఉన్నవారిని మాతో చేరడానికి అనుమతించము. అనేక తరాలుగా, భగవత్ సేవ తప్ప మరేదీ కోరలేదు, దోషరహితంగా ఉన్నాము. లంకలో ఉన్న రాక్షసులపై తన విల్లుతో యుద్ధం చేసిన భగవానుడిని మేము ప్రశంసిస్తున్నాము. ఆయనను స్తుతించడంలో మీరు కూడా మాతో చేరండి.
నాల్గవ పాశురము. ఇందులో, తమ ఆత్మానుభవముపై ఆసక్తి ఉన్నవారిని ఆహ్వానిస్తున్నారు. భగవత్ సేవలను నిర్వహిస్తున్న వారిని ఆహ్వానించి తృప్తి చెందక, లౌకిక సంపద యందు ఆసక్తి ఉన్నవారిని అలాగే వారి ఆత్మానుభవముపై ఆసక్తి ఉన్నవారిని భగవత్ స్తుతి చేయడంలో చేరాలని వారు ఆశిస్తున్నారు. ఈ రెండింటిలో, లౌకిక సంపద యందు ఆసక్తి ఉన్నవారు, ఏదో ఒక సమయంలో, భగవత్ సేవ చేయాలని కోరుకుంటారు. ఏది ఏమయినప్పటికీ, కైవల్యార్థులు కైవల్య మోక్షం (ఆత్మలు తమను తాము ఆనందించే ప్రదేశం) పొందిన తరువాత వారు దాని నుండి ఎప్పటికీ బయటకు రాలేరు, భగవత్ సేవ ఎన్నటికీ చేయలేరు. అందువల్ల, అతను మొదట వారిని పిలుస్తున్నారు.
ఏడునిలత్తిల్ ఇడువదన్ మున్నం వందు ఎంగళ్ కుళాం పుగుందు
కూడు మనముడైయీర్ కళ్ వరంబొళి వందొల్లై క్కూడుమినో
నాడు నగరముం నన్గరియ నమోనారాయణాయ ఎన్ఱు
పాడు మనముడై పత్తరుళ్లీర్ వందు పల్లాండు కూరుమినే.
మీరు ఈ శరీరాన్ని వదిలిపెట్టే ముందు, ఒకవేళ మాతో చేరాలనే కోరిక ఉంటే, ఆత్మను మాత్రమే అనుభవించాలనే సరిహద్దును దాటి మాతో చేరండి. దివ్య అష్టాక్షర మంత్రం (శ్రీమన్నారాయణను ప్రశంసిస్తూ ఎనిమిది అక్షరాలతో కూడిన దివ్య మంత్రం) జపించే భక్తి మీలో ఉంటే దీని ద్వారా గ్రామాల్లో నివసించే సాధారణ జనులు మరియు పట్టణాల్లో నివసించే వారు అందరూ భగవానుడి గురించి తెలుసుకుంటారు. భగవానుడి ప్రశంసించడంలో మాతో చేరండి.
ఐదవ పాశురములో, ఆళ్వార్ ఈ లౌకిక సంపదపై ఆసక్తి ఉన్నవారిని ఆహ్వానిస్తున్నారు.
అండక్కులత్తుక్కు అదిపతియాకి అశురర్ ఇరాక్కదరై
ఇండై క్కులత్తై ఎడుత్తు క్కళైంద ఇరుడీ కేశన్ తనక్కు
తొండక్కులత్తి లుళ్లీర్ వందడి తొళుదు ఆయిరనామం శొల్లి
పండక్కులత్తై తవిర్ న్దు పల్లాండు ప్పల్లాయిరత్తాండు ఎన్మినే
నీవు రాక్షసులను వధించి వారి వంశాన్ని నిర్మూలించే హృషీకేశుని సేవకుల సమూహంలో ఉన్నావు. మీరు కూడా మా సమూహంలో చేరండి, భగవానుని యొక్క దివ్య పాదాలకు నమస్కరించి, వారి యొక్క సహస్ర నామాలను మనస్ఫూర్తిగా స్మరించి, తమ ప్రయోజనాల కోసం భగవానుడిని ప్రార్థించి, ఆ కోరికలు తీరిన తరువాత భగవానుడిని మరచిపోయే ఈ జన్మ చక్రం నుండి బయటపడండి. ఆ భగవానుడిని మళ్లీ మళ్లీ స్తుతించండి.
ఆరవ పాశురము. ఆళ్వారు ఈ మూడు వర్గాల వారిని ఈ విధంగా ఆహ్వానించిన తరువాత, ఆ సమూహం వాళ్ళు వచ్చి అతనితో కలుస్తారు. వీరిలో, భగవానుడికి సేవ చేయాలనుకునే వాళాట్పట్టు పాశురములో (మూడవ పాశురము) ఆహ్వానించబడిన వారిని, వాళ్ళు వారి గుణాలను, సేవలను వివరిస్తారు. ఆళ్వార్ వారిని స్వీకరిస్తారు.
ఎందై తందై తందై తందై తమ్మూత్తప్పన్ ఏళ్ పడికాల్ తొడంగి
వందు వళివళి ఆట్చెయ్ కిన్ఱోం తిరువోణ త్తిరువిళయిల్
అందియం బోదిల్ అరియరువాగి అరియై అళిత్తవనై
వందనైతీర ప్పల్లాండు పల్లాయిరతాండెన్ఱు పాడుదుమే.
ఏడు తరాల నుండి, మా పూర్వీకులు వేదానుసారంగా కైంకర్యం (సేవ) చేస్తున్నారు. అందమైన నరసింహ రూపాన్ని ధరించి తన శత్రువు అయిన హిరాణ్యాక్షుడిని సంహరించిన వాడి కోసం, తన భక్తుని కొరకు ఇవన్నీ తాను చేస్తున్నప్పుడు ఏ రకమైన నిరుత్సాహాన్నైనా తాను అనుభవించి ఉంటే తొలగించడానికి మనము వారిని స్తుతించి పాడదాము.
ఏడవ పాశురము. నాల్గవ పాశురము ఈడు నిలత్తిల్లో ఇంతకుముందు ప్రస్తావించబడిన ఆత్మానుభవము పొందేవారు, అతని వద్దకు వచ్చి వారి గుణాలను వివరిస్తున్న కైవల్యార్థులను ఆళ్వార్ స్వీకరిస్తున్నారు.
తీయిల్ పొలిగిన్ఱ శెంజుడరాళి తిగళ్ తిరుచ్చక్కరత్తిన్
కోయిల్ పొరియాలే ఒత్తుండు నిన్ఱు కుడికుడి యాట్చెయ్ గిన్ఱోమ్
మాయ ప్పొరు పడై వాణనై ఆయిరం తోళుం పొళి కురిది
పాయ, శుళత్తియ ఆళివల్లానుక్కు పల్లాండు కూరుదుమే.
అగ్ని కంటే ప్రకాశవంతమైన ఎర్రటి తేజస్సు గల చక్రత్తాళ్వారుల (సుదర్శన చక్రము) యొక్క దివ్య చిహ్నాలతో (తమ శరీరాలపై) గుర్తించబడిన తరువాత, వచ్చే తర తరాలు కూడా చిర కాలం నీ కైంకర్యం చేయటానికి వచ్చాము. తన చక్రము తిప్పి బాణాసురుడు అనే రాక్షసుడిని వధించిన ఆ దివ్య సుదర్శన చక్రమును ధరించిన భగవానుడిని మనము స్తుతిద్దాము.
ఎనిమిదవ పాశురము. ఐదవ పాశురము అణ్డక్కులత్తుక్కులో ప్రస్తావించబడిన సంపదను కోరేవారు, భగవాన్ ప్రశంసలు పాడటానికి వచ్చిన ఐశ్వర్యార్థులను ఆళ్వార్ స్వీకరిస్తున్నారు.
నైయ్యిడై నల్లదోర్ శోరుం నియతముం అత్తాణి చ్చేవగముం
కైయడై కాయుం కళుత్తుక్కు పూణొడు కాదుక్కు క్కుండలముం
మెయ్యిడ నల్లదోర్ శాందముం తందు ఎన్నై వెళ్ల యిరాక్క వల్ల
పైయుడై నాగ ప్పగై క్కొడియానుక్కు ప్పల్లాండు కూరువనే.
[ఐశ్వర్యార్థులు అంటున్నారు] నెయ్యి, అంతరంగ సేవ, తాంబూలం, హారాలు, చెవి కుండలాలు, చందనము, ఆభరణాల మధ్య కనిపించే స్వచ్ఛమైన రుచికరమైన ప్రసాదమును (నైవేద్యం) నాకు ప్రసాదించి, నాలో మంచి భావాలను కలిగించే సామర్థ్యం ఉన్నవాడు, సర్పాలకు శత్రువు అయిన గరుడ ధ్వజము గల భగవానుడిని నేను స్తుతిస్తాను.
తొమ్మిదవ పాశురము. ఆళ్వార్ భగవానుడితో పాటు భగవత్ సేవ చేయటానికి ఇష్టపడే వారి భక్తులను, వాళాట్పట్టు అయిన మూడవ పాశురంలో ఆహ్వానించబడినవారిని, ఎందై తందై అయిన ఆరవ పాశురములో ఆహ్వానించబడినవారిని కీర్తిస్తున్నారు.
ఉడుత్తు క్కళైనంద నిన్ పీదగవాడై ఉడుత్తు క్కలత్తదుండు
తొడుత్త తుళాయ్ మలర్ శూడిక్కళైందన శూడుం ఇత్తొండర్ గళో0
విడుత్త దిశై క్కరుమం త్తిరుత్తి తిరువోణ త్తిరు విళవిల్
పడుత్త పైన్నాగణై పళ్ళి కొండానుక్కు పల్లాండు కూరుదుమే.
నీవు ధరించిన విడిచిన దివ్య పీతాంబరాన్ని నేను ధరించి, నీవు ఆరగించిన శేష ప్రసాదాన్ని నేను తిని, నీవు ధరించిన విడిచిన దివ్య తులసి దండను నేను తొడిగి నీకు సేవకులమౌతాము. విప్పిన పడగలు ఉన్న అదిశేషునిపై శయనించి ఉన్న భగవానుడి దివ్య తిరునక్షత్రం అయిన తిరువోణం రోజున, నిన్ను స్తుతించి పాటలు పాడతాము.
పదవ పాశురము. ఇందులో ఈడు నిలత్తిల్ పాశురంలో ఆహ్వానించబడిన కైవల్య నిష్టార్లతో (ఆత్మానుభవంలో నిమగ్నమై ఉన్నవారు), తీయిల్ పొలిగిన్ఱ పాశురములో అతనితో కలిసిన వారితో ఆళ్వార్ చేరుతున్నారు.
ఎన్నాళ్ ఎంబెరుమాన్ ఉందనక్కు అడియోమ్ ఎన్ఱు ఎళుత్తుప్పట్ట
అన్నాళే అడియోంగళ్ అడిక్కుడిల్ వీడుపెత్తు ఉయందదు కాణ్
శెన్నాళ్ తోత్తి త్తిరు మదురైయుళ్ శిలై గునిత్తు ఐందలైయ
పైన్నాగత్తలై పాయందవనే ఉన్నై ప్పల్లాండు కూరుదుమే.
ఓ ప్రభూ! మేము నీ సేవకులుగా మారామని నీకు వ్రాసి ఇచ్చిన రోజున, మా వంశంలోని వారసులందరూ కైవల్యం నుండి విముక్తి పొంది ఉద్ధరింప బడ్డారు. ఒక పవిత్ర దినమున అవతరించిన ఓ భగవాన్, మధురలో కంసుని ఉత్సవములో విల్లు విరిచి, కాళియ సర్పము యొక్క ఐదు విస్తరించి ఉన్న పడగలపైకి దూకి నాట్యం చేసిన ఓ భగవాన్, మేమందరము ఒకచోట చేరి నిన్ను స్తుతిస్తాము.
పదకొండవ పాశురము. ఇందులో అణ్డక్కులం పాశురంలో ఆహ్వానించిన ఐశ్వర్యార్థులతో మరియు అతనితో కలిసి నెయ్యిడై పాశురంలో చేరిన ఐశ్వర్యార్థులుతో ఆళ్వారు చేరుతున్నారు.
అల్వళక్కు ఒన్ఱుమిల్లా అణిక్కోట్టియర్ కోన్ అబిమాన తుంగన్
శెల్వనై ప్పోల త్తిరుమాలే నానుం ఉనక్కు ప్పళవడియేన్
నల్వగైయాల్ నమో నారాయణా వెన్ఱు నామం పల పరవి
పల్వగై యాలుం పవిత్తిరనే ఉన్నై పల్లాండు కూరువనే.
ఓ మహాలక్ష్మీ పతి! ప్రపంచం మొత్తానికి ఒక ఆభరణంలాంటి, తిరుక్కోట్టియూర్ వద్ద నివసిస్తున్న వారి నాయకుడు ఏ దోషము లేని, “నేను నీకు మాత్రమే దాసుడను” అనే గౌరవంతో ఉన్న గొప్పవాడు సెల్వ నంబి మాదిరిగానే, అడియేన్ (ఈ సేవకుడు) కూడా చాలా కాలం నుండి నీకు మాత్రమే సేవకుడిగా ఉన్నాను. వారి స్వభావం, స్వరూపం, గుణం మరియు సంపదతో మనందరినీ శుద్ధి చేసేవాడు! అష్టాక్షర మంత్రాన్ని ధ్యానం చేసి, నీ సహస్ర నామాలను పఠింస్తూ నిన్ను ఆరాధిస్తాను.
పన్నెండవ పాశురము. చివరికి, ఆళ్వారు ఈ ప్రబంధాన్ని పఠిస్తే వచ్చే ప్రయోజనాలను వివరిస్తూ, భక్తితో భగవానుడిని కీర్తించేవారు, భగవానుడితో చిరకాలం అనుభందాన్ని పొందుతారని, మంగళాశాసనం చేసే అదృష్టము పొందుతారని వివరిస్తూ ఈ ప్రబంధమును సమాప్తం చేస్తున్నారు.
పల్లాండెన్ఱు పవిత్తిరనై ప్పరమేట్టియై శార్ ఙ్గమెన్నుం
విల్లాండాన్ తన్నై విల్లిపుత్తూర్ విట్టు శిత్తన్ విరుంబియ శొల్
నలాండెన్ఱు నవిన్ఱు రైప్పార్ నమో నారాయణాయ ఎన్ఱు
పల్లాండుం పరమాత్మనై శూళందిరుందు ఏత్తువర్ పల్లాండే. (12)
ఈ ప్రబంధమును శ్రీవిల్లిపుత్తూర్ లో జన్మించిన విష్ణుచిత్త స్వామి (పెరియాళ్వార్) స్వరపరిచారు. అత్యంత స్వచ్ఛమైన, శ్రీవైకుంఠంలో నివసించేవాడు, తన విల్లు శారంగాన్ని నియంత్రించే భగవానుడు, “అన్ని శుభాలతో చిరకాలం ఉండాలి” అన్న ఉద్దేశ్యముతో స్వరపరిచారు. ఈ ప్రబంధాన్ని మంచి ఉద్దేశ్యముతో పఠించేవారికి, నిరంతరం అష్టాక్షరము యొక్క చింతన లభించి, పల్లాండు పాడతారు. శ్రీమన్నారాయణ అనే సర్వశ్రేష్టమైన తత్వం చుట్టూ పదేపదే పరిభ్రమిస్తారు.
అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి
హిందీలో : http://divyaprabandham.koyil.org/index.php/2020/04/thiruppallandu-simple/
మూలము : http://divyaprabandham.koyil.org
ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org
E divya mynA prabandha SambanDha AnubhandhAm Anu bhuThi Maku MadhuRanuBhuthi AdhiyenRamanuJadaSi