కణ్ణినుణ్ శిఱుత్తాంబు – 1 – కణ్ణినుణ్

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

కణ్ణినుణ్ శిరుత్తాంబు

అవతారిక

krishna-butter-thief

పెరియవాచ్చాన్ పిళ్ళై అవతారిక

మధురకవి ఆళ్వార్  తమ ఆచార్యులైన  నమ్మాళ్వార్ల  కిష్ఠమైన కృష్ణావతార చేష్ఠితాలను ఈ పాశురములో కొనియాడుతున్నారు.

 అళగియ మణవాళ పెరుమళ్ నాయనార్ అవతారిక

నమ్మాళ్వార్ల  మధుర స్వరూపాన్ని ఈ పాశురములో మధురకవి ఆళ్వార్లు  ఆవిష్కరించారు. పరత్వమును పాలకడలి తోను,  విభవావతారములను  అమృత కలశముతోను  పోల్చారు. అవతారములన్నింటిలోను కృష్ణావతారము, చేష్ఠితములన్నింటిలోను  వెన్న దొంగిలించుట మధురాతి మధురం.

రామావతారములో ఆయన గుణశీలములను, కృష్ణావతారములో  చేష్ఠితములను భక్తులు ఇష్ఠపడతారు. సకల లోకనాయకుడై వుండి, సర్వస్వామి అయినవాడు లౌకికమైన కోరికలు కలిగివుండటము,  అదికూడా అతి సామాన్యమైన వెన్న,  ఆ వెన్నను దొంగిలించటము, ఙ్ఞానస్వరూపుడైన వాడు ఎక్కడ  ఎలా దాక్కోవాలో తెలియక  పట్టుబడటము,  శక్తి సంపన్నుడైనవాడు ఒక సామాన్య గొల్లెత అయిన  తల్లిచే కొట్టబడటము, కట్టబడటము, దాన్నుంచి తప్పించుకోవడము కూడా తెలియక పోవటము ….ఇత్యాదులన్నీ ఆళ్వార్లకు, అందునా నమ్మాళ్వార్లకు మరియు మధురకవిఆళ్వార్లకు ఎంతో ఆనందాద్భుతమైన సన్నివేశాలు.

కణ్ణినుణ్ చిఱుత్ తాంబినాల్

కట్టుణ్ణప్ పణ్ణియ పెరుమాయన్ ఎన్నపనిల్

నణ్ణిత్ తెంకురుకూర్ నంబి ఎన్ఱక్కాల్

అణ్ణిక్కుం అముతూఱుం ఎన్నావుక్కే

ప్రతి పదార్థము:

కణ్ణి = గరుకైన

నుణ్ = సూక్ష్మ

చిఱు = చిన్న

త్తాంబినాల్ = త్రాడు

కట్టుణ్ణప్పణ్ణియ = కట్టుబడిన

పెరుమాయన్ = పెద్ద మాయావి

ఎన్నపనిల్ = నా స్వామి, సర్వేశ్వరుని   నందు

నణ్ణి = దాగి

త్తెన్ కురుకూర్ నంబి ఎన్ఱక్కాల్ =  కురుకూర్ (ఆళ్వార్ తిరునగరి) నాయకుడైన

అణ్ణిక్కుం = మధురము

ఎన్నావుక్కే = నాజిహ్వకు

అముతూఱుం = అమృతము

భావము:

నా స్వామి, సర్వేశ్వరుడు  అయిన  కృష్ణుడు, తల్లి  చేతిలో చిన్న త్రాడుతో కట్టబడిన  పెద్దమాయావి. కురుకూర్ (ఆళ్వార్ తిరునగరి) నాయకుడైన  నమ్మాళ్వార్ నామము నా జిహ్వకు  మధురమైన అమృతము.

 నంజీయర్ వ్యాఖ్యానము:

* మధురకవి ఆళ్వార్లు  కృష్ణుడు, తల్లి యశోద చేతిలో చిన్న త్రాడుతో కట్టుబడిన సంఘటనను తలచుకొని బాధ పడుతున్నారు.

* ఈ పాశురములో మధురకవి ఆళ్వార్లు  “ఎత్తిఱం“(ఎలాగ?)అని ఆశ్చర్య పడుతున్నారు. నమ్మాళ్వార్లు తమ  తిరువాయ్ మొళి 1.3.1లో ఇలాగే కృష్ణ చేష్ఠితములను తలచుకొని సర్వేశ్వరుడైన వాడు పసిబిడ్డలా మారడమేమిటి, దొంగిలించటమేమిటి, ఒక గొల్లెత చేత కొట్టబడి,  కట్టబడట మేమిటని  “ఎత్తిఱం“(ఎలాగ?)అని ఆశ్చర్యపడి మూర్చపోయారు.

* రాజులు శతృవులను జయించడములోను,  రాణులకు లొంగటములో వీరత్వమును, అధికారమును, దర్పమును చాటుకుంటారు.  అలాగే పరమాత్మ శతృవులను జయించటములోను, భక్తులకు లొంగటములోను తన వీరత్వమును మరియు  అధికారమును చాటుకున్నారు.

* మధురకవి ఆళ్వార్లు మొదట తమ ఆచార్యులైన నమ్మాళ్వార్ల కు ఇష్ఠమైన  కృష్ణ చేష్ఠితములకు ఆశ్చర్యపడ్డారు. తరవాత తనకిష్ఠమైన నమ్మాళ్వార్ల గురించి పాడారు.

మధురకవి ఆళ్వార్లు, నమ్మాళ్వార్ నామము నాజిహ్వకు  మధురమైన అమృతము అని చెప్పారు. ఇది వారికే గాని సామాన్యులకు  కాదు.  భగవద్భాగవత విషయములలో అభిరుచి  ఏర్పడిన  వారికే నమ్మాళ్వార్ల  నామమృతము  అవగతమవుతుంది  అనేది మధురకవుల మనోభావము.

 నంపిళ్ళైడు వ్యాఖ్యానము:

* నమ్మాళ్వార్లు కృష్ణ చేష్ఠితములకు , అందునా వెన్న దొంగిలించు చేష్ఠితములకు వశపడిపోయారు.  వాటి ప్రాముఖ్యతను మ్మాళ్వార్ల గొప్పతనమును  మధురకవి ఆళ్వార్లు ఇక్కడ వర్ణిస్తున్నారు. అయితే  నమ్మాళ్వార్లు భగవద్విషయములో  ప్రణవులు,  మధురకవి  ఆళ్వార్లు ఆచార్య కైంకర్యములో  ప్రణవులు.

వెన్నను దొంగిలించిన తరవాత కృష్ణుడు తల్లి యశోద ముందు నిలబడి ఆమె శిక్షిస్తుందని భయపడటము, ఏడుస్తూ చేతులు జోడించటము, క్షమించమని ఆమెను ప్రార్థించటము….అంతా ఆమె ప్రేమ వలన …అంతటి వాడు కట్టుబడటము. మధుర కవులు కృష్ణుడిని ఇక్కడ “పెరుమాయన్” (గొప్ప మాయావి)అన్నారు.

* మధుర కవులు ఆచార్య నిష్టులైనప్పటికీ భగవంతుడిని “ఎన్నప్పన్”(నా స్వామి)అన్నారు. నమ్మాళ్వార్లు తనను పొగిడితే అంగీకరించరు కాని ఎంపెరుమాన్ ఘనతను ఎంత పొగిడినా ఆనందపడతారు. అందువలన మధురకవులు తమ ఆచార్య సంతృప్తి కోసము ఎంపెరుమాన్ ను కీర్తిస్తూ మొదలు పెట్టినా చరమపర్వనిష్ట పరాయణులైన వీరు కృష్ణుడిని వదిలి నమ్మాళ్వార్లను కీర్తించటము మొదలుపెట్టారు. ఇది ఎంతమాత్రము దోషము కాదు పైగా శాస్త్రసమ్మతమే.  ఎందుకనగా లౌకిక విషయాలను వదిలి ఎంపెరుమాన్ వైపు మనసు మళ్ళించటము ఎంత కష్టమో ఎంపెరుమాన్ ను   వదిలి ఆచార్యుల వైపు మనసు మళ్ళించటము  అంతకన్నా కష్టము. లౌకిక విషయాలు తాత్కాలికమైన సుఖాలకు హేతువు.  వాటి నుండి పరమాత్మ వైపు మరలటము సులభం. కాని పరమాత్మ విషయాలు శాశ్వతమైనవి మరియు ఉన్నతమైనవి.  వాటి నుండి ఆచార్యుల  వైపు మరియు  భాగవతుల  వైపు మనసును మరల్చడం అంత  తేలికైన విషయము కాదు.

* నమ్మాళ్వార్”  అన్నంతనే జిహ్వకు మాధుర్యము అబ్బుతున్నది. మునుపు లౌకిక విషయాలకు ఇలా మనసు, వాక్కు ,జిహ్వ తృప్తి పడేవి.  ఇప్పుడు నమ్మాళ్వార్ అన్నంతనే ఆతృప్తి కలుగుతున్నది.

 

  పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానము :

*ఒక మహా రాజు తన దేవేరి ప్రేమతో వేసిన పుష్ప మాలకు కట్టుబడతాడు.  కృష్ణుడు తల్లి యశోద చేతిలో ప్రేమకు  కట్టుబడ్డాడు.

* సకల జీవుల చేత పూజింపబడేవాడు  యశోద ముందు చేతులు కట్టుకొని నిలబడి తనను శిక్షించవద్దని ప్రార్థిస్తున్నాడు.  భగవంతుడిని శరణు కోరే వారు నమ్మాళ్వారు పర్యంతము శరణాగతి చేయవలసి ఉంటుంది. కాని,  నమ్మాళ్వార్లను శరణు కోరే వారు వేరెవరిని శరణు కోరేవలసిన అవసరము లేదు. ఈ సందర్భముగా  నంజీయర్ ఇలా అన్నారు. “ఆచార్యర్గళై నంబియెన్న క్కఱ్పిత్తార్ శ్రీ మధురకవిగళిఱే”. అర్థాత్ మధురకవులు, ఆళ్వార్లను  “నంబి”అని మొదటగా పిలిచారు.”నంబి” అంటే గుణ పరి పూర్ణులు అని అర్థము.

* భగవత్ విషయములో త్రికరణశుధ్ధిగా శరణాగతి చేయవలసి ఉంటుంది. కాని భాగవతుల విషయములోవాచా శరణాగతి చేసినా సరిపోతుంది.

 అళగియ మణవాళ పెరుమళ్ నాయనార్ వ్యాఖ్యానం:

* కృషుడిని,  కట్టేసిన కొయ్య విరిగిపోయినది, వాడుకలో లేనిది, ఆయనకు మాత్రమే ఉపయోగించ తగినది. ఈ విషయము పరమాత్మ యొక్క అనన్యార్హత్వమును తెలియజేస్తున్నది.

* కణ్ణి ( గరుకైన), నుణ్ (సన్నని), చిఱు (చిన్న) మొదలగు అంశములు, ఙ్ఞానము, భక్తి,  వైరాగ్యములను సూచిస్తున్నది.

* కృష్ణుడి వెన్న దొంగిలించు చేష్థితమును అపూర్వ అనుభవముగా చెప్ప  నారంభించిన మధుర కవులు, అంతలో తనకు ఆ అపూర్వ అనుభవము నమ్మళ్వార్లకు సంబంధించినదిగా వర్ణించారు.

* త్రాడు చిన్నది, పెరగదు. కొయ్య దూరాన ఉన్నది, దగ్గరకు రాదు. తనను కట్టడానికి  యశోద పడేతిప్పలు  చూడలేక కృష్ణుడే తన పొట్టను కుదించుకున్నాడు.  “నాయమాత్మా” అని శ్రుతి లో చెప్పబడినట్లుగా ఒకరికి భక్తి ఉన్నా పరమాత్మ అంగీకరిస్తేనే ఫలితానిస్తుంది. తిరుమంత్రము, ద్వయముల అర్థములు తెలిసినవారు ( వారికి పారతంత్య్రము, శరణాగతి తెలిసి వుంటాయి)పరమాత్మను కట్టివేయగలరు. మధురకవుల లౌకిక విషయ విరక్తి పరమాత్మను లొంగదీయగా, మధురకవులకు పరమాత్మపై ఉన్న భక్తి నమ్మళ్వార్లను లొంగదీసింది.

* నంబి  అనగా గుణపూర్ణుడు అని అర్థము.  భగవంతుని యందు ఙ్ఞానము మరియు  శక్తి పూర్ణములు.  నమ్మాళ్వార్లు పారతంత్య్ర ఙ్ఞానములోను మరియు  భక్తిలోను పరిపూర్ణలు. భగవంతుడు అందరినీ తన వైపుకు ఆకర్షించు శక్తి గలవాడు. నమ్మాళ్వార్లు భగవంతుడినే తన వైపుకు ఆకర్షించు శక్తి గలవారు.

క్కురుంగుడి నంబి (ఎంపెరుమాన్) కి,  కురుగూర్ నంబి (నమ్మాళ్వార్) కీ గల భేదమిది .

అడియేన్ చూడామణి రామానుజ దాసి.

ఆధారము: http://divyaprabandham.koyil.org/index.php/2015/01/kanninun-chiru-thambu-1-kanninun/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://srivaishnavagranthams.wordpress.com
pramAthA (preceptors) – http://guruparamparai.wordpress.com
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org

Leave a Comment