ఆర్తి ప్రబంధం – 60

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

ఆర్తి ప్రబంధం

<< ఆర్తి ప్రబంధం – 59

పరిచయము:

మాముణులు తమలో తాము ఇలా భావిస్తున్నారు – “మనం మన లక్ష్యం కోసం ఎందుకు ఆరాటపడాలి? పెరియ పెరుమాళ్ళు ఎంబెరుమానార్లకి ప్రసాదించిన ప్రతిదీ క్రమంగా మనకు కూడా వర్తిస్తుంది, ఎందుకంటే మనము ఎంబెరుమానార్ల దివ్య చరణ కమలాల వద్ద సమర్పితులమై ఉన్నాము కాబట్టి. ప్రతిదీ మనకి కూడా వర్తిస్తుంది ఎందుకంటే మనము ఎంబెరుమానార్ల సంతానము కాబట్టి”, అని భావిస్తున్నారు.  ఈ విధంగా, ఈ ఆఖరి పాశురములో, ఎంబెరుమానార్లకి పెరియ పెరుమాళ్ళు అనుగ్రహించిన వన్నీ తమకి కూడా దక్కుతాయని భావించి మాముణులు ఆనంద పడుతున్నారు.

మణవాళ మాముని తిరువడిగళే శరణం!!! 

పాశురము 60:

ఇంద అరంగత్తు ఇనిదు ఇరు నీయెన్ఱు అరంగర్
ఎందై ఎతిరాశర్ క్కింద వరం శిందై శెయ్యిల్
నమ్మదన్ఱో నెంజమే నఱ్ఱాదై సొంపుదల్వర్
తమ్మదన్ఱో తాయముఱై తాన్

ప్రతి పద్ధార్ధములు:

అరంగర్ – పెరియ పెరుమాళ్ళు
ఇంద అరంగత్తు – ఈ కోయిల్లో (శ్రీ రంగంలో)
ఇనిదు ఇరు నీయెన్ఱు – “శ్రీరంగే సుఖమాస్వ” అని అన్నారు (సుఖంగా శ్రీ రంగంలో స్థిరమై)
ఎందై ఎతిరాశర్ క్కు – నా తండ్రి ఎంబెరుమానార్లకు
నెంజమే – ఓ నా మనసా!!!
శిందై శెయ్యిల్ – మనము దీని గురించి ఆలోచిస్తే
ఇంద వరం – పెరియ పెరుమాళ్ళు ఎంబెరుమానార్లకి అనుగ్రహించిన విలువైన వరం
నమ్మదన్ఱో – ఆ వరం వాస్థవానికి మనది కూడా కదా?
నఱ్ఱాదై – ఎంబెరుమానార్లు మనకి కారణరహితమైన తండ్రి వంటివారు
తాయముఱై తాన్  – మన తల్లిదండ్రుల కారణంగా
సొంపుదల్వర్ తమ్మదన్ఱో – ఆస్థిపాస్థులన్ని కొడుకులకి దక్కుతాయి

(మాముణులు తమ హృదయంతో – “ఓ! నా ప్రియమైన మనసా. అందుకని, మన వంతు మనం ఏమీ చేయనవసరం లేదు. ప్రతిదీ మనకి సుళువుగా అందుబాటులో ఉంది. మన భారం మనకు ఇకపై భారంగా అనిపించదు (మాముణులకు కావలసినది అనుగ్రహించినట్లుగా, ఎంబెరుమానార్లు మన భారాన్ని భరిస్తారు).

 ముగింపు గమనిక:

పెరియ పెరుమాళ్ళు తన సంపద అయిన నిత్య విభూతి (పరమపదము) మరియు లీలా విభూతి (పరమపదము కాని మిగిలిన అన్ని లోకాలు) రెండింటినీ ఎంబెరుమానార్లకి ప్రసాదించాడు. అందువల్ల, ఎంబెరుమానార్లను “శ్రీ విష్ణు లోక మణి మండప మార్గదాయి” (ధాటి పంచకం 5) అని వారిని కీర్తించారు. ప్రపన్నులందరికీ ఎంబెరుమానార్లు నాయకులు. “మణవాళ మామునిగళ్”, “యతింద్ర ప్రవణర్” అని ప్రఖ్యాతి గాంచిన ‘జీయర్’ తమను తాము అటువంటి ఎంబెరుమానార్లకి సంపూర్ణ శరణాగతులై వారికి ప్రపత్తి చేశారు. వారు పరమపదానికి వెళ్లి భగవానుడికి (మరియు భాగవతుల) నిత్య కైంకర్యం చేసే మహద్భాగ్యము పొందారు. అనగా, ఎంబెరుమానార్ల అభిమానము ఉన్న  ప్రతి ఒక్కరికీ ఇదే ఫలితం లభిస్తుంది అని అర్థం. దీనిని ఇంకా లోతుగా అర్ధం చేసుకోవాలంటే, ఎంబెరుమానార్ల దివ్య చరణాలకు శరణాగతి చేసిన ప్రతి ఒక్కరికి మొట్టమొదట తనపై ప్రేమను కలిగింపజేసి, ఆపై వారిని ఒకేసారి పరమపదములోని పరమసుఖానుభవాన్ని శాశ్వతంగా ప్రసాదిస్తారు.

సరళ అనువాదము:

ఈ చివరి పాశురములో, మాముణులు తాను కోరుకున్నది తనకి (ఎంబెరుమానార్ల సంబంధం వల్ల) లభించబోతున్నాదని ఎంబెరుమానార్లకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ పరానందపడుతున్నారు. గద్య త్రయంలోని వాక్యాలను మనం గమనిస్తే, పెరియ పెరుమాళ్ళు ఎంబెరుమానార్లకి సంపూర్ణ అధికారము ముందే ఇచ్చి ఉంచారు. ఎంబెరుమానార్ల సంతానము అవడం వలన, పెరియ పెరుమాళ్ళు ఎంబెరుమానార్లకి ప్రసాదించిన ప్రతి వరము (ఈ శేష జీవితములో తాను చేసే కైంకర్యము నుండి పరమపదములో నిత్య కైంకర్యము వరకు) తనకి కూడా వారసత్వముగా లభిస్తుంది అని భావిస్తున్నారు.

వివరణ: 

మాముణులు తన హృదయంతో, “హే! నా ప్రియమైన మనసా! పెరియ పెరుమాళ్ళు మన తండ్రిగారైన ఎంబెరుమానార్లతో చెప్పిన ఒక విషయం గుర్తుందా! శరణాగతి గద్యములోని వారి పలుకులు గుర్తున్నాయా! మొదట వారు ఇలా అన్నారు, “ద్వయం అర్థానుసందానేన సహసదైవం వక్తా యావచ్చరీర పాతం అత్రైవ శ్రీరాంగే సుఖమాస్వ”. దీని తరువాత, వారు “శరీర పాద సమయేతు” నుండి మొదలై “నిత్యకింకరో భవిష్యసి మాతే భూదత్ర సంశయః ఇతి మయైవ హ్యుక్తం అత స్త్వం తవ తత్త్వతో మద్ జ్ఞాన దర్ష్న ప్రాప్తిషు నిస్సంశయః సుఖ మాస్వ” అని పలికారు.  ఈ ప్రపంచంలో తన శేష జీవిత ప్రయాణానికి అవసరమైన వాటితో పాటు, ఈ లోకాన్ని విడిచి పెట్టిన తర్వాత వారికి ఏమి లభించాలో (ఇది పరమపదంలో కైంకర్యం తప్ప మరేమీ కాదు) పెరియ పెరుమాళ్ళు స్వయంగా ఈ వరాలన్నీ మన తండ్రి అయిన ఎంబెరుమానార్లకి ప్రసాదించారు. పెరియ పెరుమాళ్ళు స్వయంగా ఈ వరాలన్నీ ఎంబెరుమానార్లకి ప్రసాదించారు. ఈ వరాలని మనం నిశితంగా పరిశీలిస్తే, ఎంబెరుమానార్ల సంతానమైన మనకి కూడా ఈ వరాలు వర్తిస్తాయి. ఎందుకంటే, తల్లిదండ్రుల సంపదను వారి పిల్లలు వారసత్వంగా పొందుతారు. అందువల్ల, నా ప్రియమైన మనసా! మనం ఇకపై మన స్వంతంగా దేని కోసం కష్టపడవలసిన అవసరం లేదు. ప్రతిదీ మనకి సుళువుగా అందుబాటులో ఉంది, ఎంబెరుమానార్లకు ధన్యవాదాలు. పెరియ పెరుమాళ్ళు తన సంపద అయిన నిత్య విభూతి (పరమపదము) మరియు లీలా విభూతి (పరమపదము కాని మిగిలిన అన్ని లోకాలు) రెండింటినీ ఎంబెరుమానార్లకి ప్రసాదించాడు. అందువల్ల, ఎంబెరుమానార్లను “శ్రీ విష్ణు లోక మణి మండప మార్గదాయి” (ధాటి పంచకం 5) గా కీర్తిస్తారు. ఎంబెరుమానార్లు అందరు ప్రపన్నులకు నాయకులు. “మణవాళ మామునిగళ్”, “యతింద్ర ప్రవణర్” అని ప్రఖ్యాతి గాంచిన ‘జీయర్’ అటువంటి ఎంబెరుమానార్లకి సంపూర్ణ శరణాగతులై వారికి ప్రపత్తి చేశారు. వారు పరమపదానికి వెళ్లి భగవానుడికి (మరియు భాగవతుల) నిత్య కైంకర్యం చేసే మహద్భాగ్యము పొందారు. అనగా, ఎంబెరుమానార్ల అభిమానము ఉన్న  ప్రతి ఒక్కరికీ ఇదే ఫలితం లభిస్తుంది అని అర్థం. దీనిని ఇంకా లోతుగా అర్ధం చేసుకోవాలంటే, ఎంబెరుమానార్ల దివ్య చరణాలకు శరణాగతి చేసిన ప్రతి ఒక్కరికి మొట్టమొదట తనపై ప్రేమను కలిగింపజేసి, ఆపై వారిని ఒకేసారి పరమపదములోని అనంత సుఖానుభవాన్ని శాశ్వతంగా ప్రసాదిస్తారు.

“ఎతిరాశా! ఎతిరాశా!” అని మాముణులు కీర్తించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ ఎంబెరుమానార్లు అందరు యతులకు నాయకుడు అన్న సందేశాన్ని ఇస్తున్నారు. వారి శిష్యులందరూ తమ నాయకుడైన “యతిరాజుల” నిరంతర నామ జపము చేసి వారికి మంగళము పాడుతారు. మాముణులు తమని తాము ఎంబెరుమానార్ల శిష్యులలో ఒకరిగా భావించి, “యధ్యస్సుదసత్వాః” ప్రకారం వారి నిరంతర నామ జపము చేయడానికి తాను కూడా అర్హుడు అని భావిస్తున్నారు. అందువల్ల, మాముణులు నిత్యమూ “ఎతిరాశా! ఎతిరాశా!” అన్న నామాన్ని జపించారు.

జీయర్ తిరువడిగళే శరణం

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము : https://divyaprabandham.koyil.org/index.php/2017/04/arththi-prabandham-60/

పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a Comment