శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
భగవానుడి నుండి విరహవేదనతో ఎంతో బాధను అనుభవించిన ఆళ్వారు నాయికా భావములో రెండు పదిగాలు పాడాడు. ఇది చూసిన భగవానుడు ఆళ్వారుని శాంతింపజేయాలని భావించి, తన విజయాలన్నింటినీ ఆళ్వారుకి వ్యక్తము చేస్తారు. ఆ అనుభవాన్ని లోతుగా అనుభవించిన ఆళ్వారు, అదే అనుభవాన్ని అందరికీ అనుభవింపజేయాలనే గొప్ప సంకల్పముతో ‘ఆళియెళ’ అని ప్రారంభించి ఈ పదిగాన్ని ఎంతో కృపతో ఆళ్వారు పాడారు.
మొదటి పాశురము: భగవానుడు అన్ని లోకాలను కొలిచు ఆ దివ్య లీలని, ఆళ్వారు ధ్యానిస్తూ అనుభవిస్తున్నారు.
ఆళియెళ శంగుం విల్లుం ఎళ త్తిశై
వాళియెళ తండుం వాళుం ఎళ అండం
మోళై ఎళ, ముడి పాదం ఎళ అప్పన్
ఊళియెళ ఉలగం కొండవాఱే
దివ్య శంఖ చక్రము, విల్లు, గద, ఖడ్గము అన్ని ఆయుధాలు పెరిగి పెద్దవిగా గోచరిస్తున్నాయి; అన్ని దిక్కులలోని వాళ్ళు, వాళ్ళ మంగళాశాసనాల ద్వనులు మారుమ్రోగిస్తున్నారు. వారి దివ్య చరణములతో పాటు, దివ్య కిరీటము కూడా పెరిగి పెద్దదై విశాల రుపాన్నిదాల్చి అండాకారపు విశ్వములోకి చీల్చుకుపోయి ఆ నీటి నుండి బుడగలు రాసాగాయి; ఇంత అద్భుతమైన విధముగా సర్వోన్నతుడైన సర్వేశ్వరుడు విశ్వాన్ని కొలిచి స్వీకరించి నవీన కాలాన్ని ప్రారంభించారు.
రెండవ పాశురము: భగవానుడు సముద్ర మథనము చేయు ఆ దివ్య లీలని ఆళ్వారు ధ్యానిస్తూ అనుభవిస్తున్నారు.
ఆఱు మలైక్కు ఎదిర్ ర్దోడుం ఒలి అర
వూఱు శులాయ్ మలై తేయ్ క్కుం ఒలి కడల్
మాఱు శుళన్ఱు అళైక్కిన్ఱ ఒలి అప్పన్
శాఱు పడ అముదం కొండ నాన్ఱే
ఆ రోజున, గొప్ప మహోపకారి అయిన సర్వేశ్వరుడు అమృతాన్ని చిక్కించుకొని, దేవతలకు గొప్ప సంబరాన్ని కలిగించారు. ఆ శుభ దినమున అనేక ధ్వనులు ఘోషించాయి – 1. నదులు విపరీత దిశలో పర్వతాల వైపు ప్రవహించే శబ్దం, 2. మందర పర్వతానికి చుట్టుకొని ఉన్న వాసుకి సర్పము యొక్క శరీర రాపిడి ధ్వని, 3. మథన సమయములో గిరగిరా చిలకబడుతున్న సముద్ర ధ్వని.
మూడవ పాశురము: మహావరాహ అవతారాన్ని ఆళ్వారు గుర్తుచేసుకుంటున్నారు.
నాన్ఱిల ఏళ్ మణ్ణుం తానత్తవే పిన్నుం
నాన్ఱిల ఏళ్ మలై తానత్తవే, పిన్నుం
నాన్ఱిల ఏళ్ కడల్ తానత్తవే అప్పన్
ఊన్ఱి యిడందు ఎయిఱ్ఱిల్ కొండ నాళే
భూమి జల మయము అయిన సమయంలో, మహోపకారి అయిన భగవానుడు వరాహ అవతారాన్ని ధరించి తన కొరలతో భూమిని వెలికి తీసి తన దంతములపైన ఎత్తి ఉంచుకున్నారు; ఏడు ద్వీపాల రూపంలో భూమిపై ఉన్న వివిధ ప్రాంతాలు జారకుండా, వాటి వాటి అసలు స్థానములలో స్థాపించబడ్డాయి; ఇంకా, ఏడు ప్రధాన పర్వతాలు, వాటి అసలు స్థానములలో కదలకుండా పాతి ఉంచారు; ఇంకా, సప్త మహాసముద్రాలు, వాటి తీరాలను అతిక్రమించకుండా, వాటి అసలు స్థానములలో స్థాపించబడ్డాయి.
నాలుగవ పాశురము: మహాప్రాళయ కాలములో భగవానుడి సంరక్షణను ఆళ్వారు వర్ణిస్తున్నారు. కొంతమంది ఆచార్యుల వ్యాఖ్యానాముల ప్రకారం, ఆళ్వారు మధ్యమ జలప్రళయం గురించి వివరించారని, భగవానుడి దివ్య ఉదరము లోపల మరియు బయట కనిపించే ప్రతిదానినీ మార్కణ్డేయుడు వీక్షించారని ఆచార్యుల వ్యాఖ్యానాముల ద్వారా మనికి విదితమౌతుంది.
నాళుమెళ నిల నీరుమెళ విణ్ణుం
కోళుమెళ ఎరి కాలుమెళ మలై
తాళుమెళ శుడర్ తానుమెళ అప్పన్
ఊళియెళ ఉలగముండ ఊణే
పగలు రాత్రి, భూమి నీరు, ఆకాశము గ్రహాలు, పర్వత స్థావరాలు మెరిసే నక్షత్రాల మధ్య తేడాలని లొంగదీసుకోవాలని, “మహా ఆకలితో ఆరగించాడు” అని చెప్పినట్లుగా మహోపకారి అయిన భగవానుడు విశ్వాన్ని ఎంతో అద్భుతంగా భుజించాడు!
ఐదవ పాశురము: భూమి భారాన్ని తగ్గించడానికి నిర్వహించబడిన మహాభారత యుద్ధాన్ని ఆళ్వారు ఆస్వాదిస్తున్నారు.
ఊణుడై మల్లర్ తదర్ న్ద ఒలి మన్నర్
ఆణుడై చ్చేనై నడుంగుం ఒలి విణ్ణుళ్
ఏణుడై తేవర్ వెళి ప్పట్ట ఒలి అప్పన్
కాణుడై ప్పారతం కైయఱై పోళ్దే
పాండవ పక్షపాతి అయిన కృష్ణుడు వారితో చేతులు కలిపి మహాభారత యుద్ధాన్ని జరపడానికి చేతులతో చప్పట్లు కొట్టినప్పుడు అనేక ద్వనులు వినిపించాయి. 1. బలము శక్తికి నిదర్శనమైన కండలు పెరిగిన మహా మల్లయోధులు ఒకరినొకరు ఢీకొని కింద పడినపుడు వచ్చిన ధ్వనులు, 2. వీర సైనిక సైన్యములు ఉన్న రాజుల భయము ఝంకముతో వచ్చిన ధ్వనులు, 3. ఆకాశంలో దేవతలు వారి వారి స్థానాలలో సంబరాలు చేసుకుంటున్న ధ్వనులు వినిపించాయి.
ఆరవ పాశురము: భక్తుల అభ్యున్నతికి కారణమైన హిరణ్య వధ ఘట్టాన్ని ఆళ్వారు దయతో వివరిస్తున్నారు.
పోళ్దు మెలింద పున్ శెక్కరిల్ వాన్ తిశై
శూళుం ఎళుందు ఉదిరప్పునలా మలై
కీళ్దు పిళంద శింగం ఒత్తదాల్ అప్పన్
ఆళ్ తుయర్ శెయ్దు అశురరై క్కొల్లుమాఱే
సాయం సంధ్యావేళలో భగవానుడు తన భక్తుడిని రక్షించుటకు నరసింహ రూపాన్ని ధరించాడు. నలు దిశలలో విస్తరించిన ఎర్రటి ఆకాశము క్రింద సంధ్యా సమయంలో హిరణ్యకషిపుని చీల్చి రక్తపు మడుగులో ఆ రాక్షసుడిని వధించాడు; ఆతడు ఆ రాక్షసుడిని చంపిన విధి ఎలా ఉండిందంటే, ఒక సింహము పర్వతాన్ని చీల్చి నట్లుగా అనిపించింది.
ఏడవ పాశురము: రావణ వధ ఘట్టాన్నిఆళ్వారు ఆస్వాదిస్తున్నారు.
మాఱు నిరైత్తు ఇరైక్కుం శరంగళ్ ఇన
నూఱు పిణం మలై పోల్ పురళ కడల్
ఆఱు మడుత్తు ఉదిర ప్పునలా అప్పన్
నీఱు పడ ఇలంగై శెఱ్ఱనేరే
గుంపులు గుంపులుగా గురిపెట్టిన బాణాలు తగిలి, ఆ యేటుతో ఘోరమైన శబ్దాలు వస్తున్నాయి; పర్వతాలు రాలి పడుతున్నట్లుగా, అవి వందల కొలది రాక్షసుల మృతదేహాలను నేలమట్టం చేశాయి, ; రక్తము నదులగా ప్రవాహించి సముద్రాలను నింపివేస్తున్నాయి; ఈ విధంగా భక్త రక్షకుడైన చక్రవర్తి తిరుమగనుడు (శ్రీ రాముడు) లంకా నగరాన్ని బూడిద చేయడానికి న్యాయ యుద్ధము చేశాడు.
ఎనిమిదవ పాశురము: బాణాసురునిపై కృష్ణుని విజయాన్ని ఆళ్వారు గుర్తుచేసుకుంటున్నారు.
నేర్ శరిందాన్ కొడి క్కోళి కొండాన్ పిన్నుం
నేర్ శరిందాన్ ఎరియుమనలోన్ పిన్నుం
నేర్ శరిందాన్ ముక్కణ్ మూర్తి కండీర్ అప్పన్
నేర్శరి వాణన్ తింతోళ్ కొండ అన్ఱే
రుద్రుడు మొదలగు అన్యదేవతల సహకారముతో బలమైన భుజాలతో ఉన్న బాణాసురుని తో జరిగిన యుద్దములో శ్రీ కృష్ణుడి సహకారముతో అనిరుద్దుడు విజయాన్ని పొందాడు; ఆ రోజున, నెమలి ధ్వజముతో ఉన్న సుబ్రమణ్యుడు ప్రతిద్వందిని అడ్దుకోలేక కింద పడిపోయాడు; ఎత్తైన జ్వాలలతో కూడా అగ్నిదేవుడు ప్రతిఘటించలేక కింద పడిపోయాడు; దేవతలలో అతి ప్రముఖుడు త్రినేత్రుడైన రుద్రుడు యుద్ధభూమి నుండి పారిపోయాడు; ఇవన్నీ మనకి బాగా తెలిసినవే కదా?
తొమ్మిదవ పాశురము: విశ్వము యొక్క సృష్టి విధానాన్ని కృపతో ఆళ్వారు వివరిస్తున్నారు.
అన్ఱు మణ్ నీర్ ఎరి కాల్ విణ్ మలై ముదల్
అన్ఱు శుడర్ ఇరండు పిఱివుం పిన్నుం
అన్ఱు మళై ఉయిర్ తేవుం మఱ్ఱుం అప్పన్
అన్ఱు ముదల్ ఉలగం శెయ్దదుమే
సృష్టి ఆదిలో, సంరక్షకుడు మరియు సృష్టికర్త అయిన భగవానుడు ఈ విశ్వాన్ని సృష్టించాడు; అతడు భూమితో మొదలుపెట్టి ఐదు తత్వాలను సృష్టించాడు – అవి పర్వతాలు మొదలైన ప్రాపంచిక సృష్టికి కారణముగా మారాయి; అతడు సూర్య చంద్రులను, నక్షత్రాలను, గ్రహాలను సృష్టించాడు; ఆపైన వర్షాన్ని సృష్టించాడు, వర్షం మీద ఆధారపడే జీవులను, వర్షాన్ని అనుగ్రహించే దేవతలను సృష్టించాడు. మహాప్రళయము తరువాత ప్రారంభ సృష్టి గురించి ఆళ్వారు వివరిస్తున్నారని చెప్పుకోవచ్చు.
పదవ పాశురము: గోవర్ధన గిరిని ఎత్తి గోవులు మరియు గోకులవాసులను రక్షించిన భగవానుడి ఆ లీలను ఆళ్వారు ఆనందిస్తున్నారు.
మేయ్ నిరై కీళ్ పుగ మా పురళ శునై
వాయ్ నిఱై నీర్ పిళిఱి చ్చొఱియ ఇన
ఆనిరై పాడి అంగే ఒడుంగ అప్పన్
తీ మళై కాత్తు కున్ఱం ఎడుత్తానే
ఆపదలని తొలగించే కృష్ణుడు గోవర్ధన గిరిని పైకి ఎత్తి రేపల్లె (తిరువాయ్ ప్పాడి) వాసులకి మరియు గోవులకి విపత్తు కలిగించే వర్షాన్ని ఆపాడు. వాళ్ళు ఆ పర్వతము క్రింద ఆశ్రయం పొందటానికి, కొండపైన ఉన్న పశువులు దొరిలి క్రిందకు వచ్చి ఆ పర్వతము క్రింద తలదాచుకోవడానికి, నీరు నిండిన కొలనులు పొంగి ఘోరమైన శబ్దాలు చేసుకుంటూ ప్రవహించడానికి కృష్ణుడు గోవర్ధన గిరిని పైకి ఎత్తి వ్రేపల్లెను రక్షించాడు.
పదకొండవ పాశురము: “భగవానుడి విజయాలను గొప్పగా కీర్తించి చెప్పే ఈ పదిగాన్ని హృదయపూర్వకంగా నేర్చుకునే వారికి ఈ పదిగము ద్వారానే విజయాలు లభిస్తాయి”, అని ఆళ్వారు తెలియజేస్తున్నారు.
కున్ఱ ఎడుత్త పిరాన్ అడియారొడుం
ఒన్ఱి నిన్ఱ శడగోపన్ ఉరై శెయల్
నన్ఱి పునైంద ఓర్ ఆయిరత్తుళ్ ఇవై
వెన్ఱి తరుం పత్తుం మేవి క్కఱ్పార్కే
అత్యున్నత సంరక్షకుడు గోవర్ధన గిరిని ఎత్తిన కృష్ణడి విశేష భక్తులగా ఉన్న భాగవతులలో ఆళ్వారు ఉన్నారు; ఆళ్వారు పాడిన వేయి పాశురములలో సర్వేశ్వరుని విజయాలను వెల్లడిచేసే ఈ పదిగాన్ని అర్ధాలతో అనుసంధానము చేసేవారికి అన్ని అంశాలలో విజయము సంభవిస్తుంది.
అడియేన్ శ్రీదేవి రామానుజదాసి
మూలము : https://divyaprabandham.koyil.org/index.php/2020/06/thiruvaimozhi-7-4-simple/
పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org