శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
అవతారిక:
జీవాత్మలు బంధ విముక్తులై పరమపదం చేరటానికి శ్రీమన్నారాయణుని నిర్హెతుక కృప మాత్రమే కారణం కాని జీవాత్మలు ఆచరించే కర్మ యోగం, జ్ఞాన యోగం, భక్తి యోగం మొదలైనవి కావు అన్నది సత్యం. ఆయన జ్ఞానవంతుడు, శక్తిమంతుడు, గుణ పరిపూర్ణుడు, జీవాత్మలతో విడదీయలేని సంబంధం కలవాడు. ఆయన చేసే పనులు ప్రయోజనకరంగానే చేస్తాడు. శాస్త్రాలలో కర్మ యోగం, జ్ఞాన యోగం, భక్తి యోగం మొదలైనవి శ్రీమన్నారాయణుని శ్రీపాదాలను చేరటానికి ఉపాయాలుగా చెప్పబడ్డాయి , అయినా భగవంతుడి కృప లేనిదే పై ఉపాయాలేవీ సాధనాలు కావు. అందు వలన ఇవేవి సాధనాలుగా స్వీకరించటానికి వీలు లేదు. భగవంతుడిని శరణాగతి చేయడమే అసలైన ఉపాయము. అది కూడా భగవంతుడి కృప వలననే లబిస్తుందని గ్రహించాలి అన్న విషయాన్ని అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్లు ఈ పాశురంలో వివరిస్తున్నారు.
పాశురం- 5
వళియావదు ఒన్ఱు ఎన్ఱాల్ మఱ్ఱవై ముఱ్ఱుం
ఒళియా, అదు ఒన్ఱు ఎన్ఱాల్ ఓం ఎన్ఱు ఇళియాదే
ఇత్తలైయాల్ యేదుమిల్లై ఎన్ఱు ఇరుందదు తాన్
అత్తలైయాల్ వంద అరుళ్
ప్రతిపదార్థము:
వళియావదు = శరణాగతి అనే ఉపాయం
ఒన్ఱు ఎన్ఱాల్ = ఒక్కటే ఉపాయమని అని అంటే
మఱ్ఱుం = కర్మ యోగం, జ్ఞాన యోగం, భక్తి యోగం మొదలైనవి
ముఱ్ఱవై = అన్నీ
ఒళియా = పూర్తిగా వదిలి వేసి
అదు = పైన చెప్పిన శరణాగతి
ఒన్ఱు ఎన్ఱాల్ = ఒక్కటే ఉపాయమని తెలుసుకొని
ఓం ఎన్ఱు = దానినే స్వీకరించి
ఇళియాదే = వదల కుండా
ఇత్తలైయాల్= మనం చేసే పనులలో
యేదుమిల్లై = పుణ్యము కాని, మంచి కాని లేదు
ఎన్ఱు = అని తమ ఆకించన్యం
ఇరుందదు తాన్ = తలుచుకోవటం
అత్తలైయాల్ వంద అరుళ్ = ఆయన కృప వలన వచ్చిందే అని గ్రహించాలి
వ్యాఖ్యానం:
వళియావదు ఒన్ఱు ఎన్ఱాల్….. కర్మ యోగం, జ్ఞాన యోగం, భక్తి యోగం, ప్రపత్తి యోగం మొదలైనవి సాధనాలుగా శాస్త్రంలో చెప్పబడినా ,శరణాగతి ఒక్కటే ఉపాయం అని స్పష్టంగా ఉన్నప్పుడు ప్రపత్తి యోగం తప్ప మిగిలవాటిని చేపట్టినప్పుడు భగవంతుడు మాత్రమే ఫలమునివ్వ గలవాడు కాబట్టి ఆ ఉపాయాలేవి ఫలితాన్నివ్వలేవు అని శాస్త్రమే చెపుతుంది. అందు వలన వాటిని ఉపాయాలుగా స్వీకరించటం వలన ప్రయోజనం లేదు ,ప్రపత్తి యోగన్ని మాత్రమే ఉపాయంగా స్వీకరించాలని తేటతెల్ల మవుతున్నది. అర్థాత్ వళియావదు ఒన్ఱు(ఉపాయం ఒక్కటే).
మఱ్ఱవై ముఱ్ఱుం ఒళియా………ఈ విషయం అవగాహన అయ్యాక కర్మ యోగం, జ్ఞాన యోగం, భక్తి యోగాలను పూర్తిగా వదిలి వేయాలి అని ఈ పాశుర భాగానికి అర్థము. మఱ్ఱవై (ఇతరములు) శరణాగతి తప్ప ఇతరములైన ఉపాయములు…ముఱ్ఱుం ఒళియా…..వాటి జాడ కూడా లేకుండా వదిలివేయాలి అని నొక్కి చెపుతున్నారు.
అదు ఒన్ఱు ఎన్ఱాల్ ….అదు(అది) …శరణాగతి . ఒన్ఱు (ఒక్కటే )….వాడు ఒక్కడే…భగవంతుడు ఒక్కడే అని అర్తము . భగవంతుడు తప్ప మరేవీ సాధనాలు కావు. శరణాగతి చేసేవాడు ‘ నీ శ్రీపాదాలే గతి ‘ అని చెప్పటం కూడా సాధనం కాదు. ఆ భావన కూడా సాధనం కాదు అని శాస్త్రం చెపుతుంది. శరణాగతి చేసేవాడి మాట, క్రియ, భావన ….దేనినీ సాధనంగా భగవంతుడు స్వీకరించడు. నమ్మాళ్వార్లు ‘ అదు ఇదు ఉదు ఎదు ‘అన్నారు. ఆయన సర్వ స్వతంత్రుడు ఎదైనా ఎలాగైనా మాట్లాడగల వాడు కదా! అందు వలనా అదు ఒన్ఱు ఎన్ఱాల్ ‘ (అది ఒక్కటే అంటే) భగవంతుడొకడే అని స్వీకరించాలి.
ఓం ఎన్ఱు ఇళియాదే………..భగవంతుడి శ్రీపాదాలను పట్టినప్పుడే కదా ఆయన మనపై కృప చూపించగలడు అని భావించి ఆయనను శరణాగతి చేయకుండా ఉండటము “ ఓం ఎన్ఱు ఇళియాదే “ ఈ పదబందాన్ని వెనకటి ” అదు ఒన్రు ఎన్రాల్ “పదబంధంతో కలిపి చూడాలి. అరుళాళ పెరుమాళ్ ఎమ్బెరుమానార్ జీవాత్మ శరణాగతి మాత్రమే ఉపాయమని ,అది మాత్రమే శ్రీమన్నారాయణుని శ్రీపాదాల దగ్గరకు చేరుస్తుందని తెలుసుకుంటాడు అంటారు . మరో మాటలో చెప్పాలంటే, ఈ జీవాత్మ శ్రీమన్నారాయణుని శ్రీపాదాలను చేరటానికి ఇది ఒక్కటే ఉపాయం అని తెలుసుకుంటాడు. అలా భావించడం కూడా తప్పు అని శాస్త్రం చెపుతుంది , ఈ భావన ఆయనదగ్గరికి చేరటానికి పెద్ద అడ్డంకి కావచ్చు. సంపూర్ణ శరణాగతి అంటే అన్నింటిని ఆయన నిర్ణయానికే వదిలి వేయాలి అని సూచిస్తుంది. కాబట్టి ఈ “ఓం” అనే పదానికి అర్ధం జీవాత్మ శరణాగతిని ఉత్తమ మార్గంగా అంగీకరించాడని మరియు “ఇలియాదే ” అనే పదాన్ని అతను నిజంగా ఆచరించినట్లు సూచిస్తుంది.
ఇత్తలైయాల్ యేదుమిల్లై ఎన్ఱు ఇరుందదు తాన్ ……..శరణాగతి చేసేవాడు ఏమని భావిస్తాడు? అన్న ప్రశ్నకు భగవంతుడిని పొందడానికి మన దగ్గర సాధనమేమి లేదు అని ఆకించన్యము పాటించటమే ఉపాయమని జవాబు అని గ్రహించాలి . ఆయన కృప తప్ప మరేదీ సాధనం కాదు. ఈ ఆకించన్యమే జీవాత్మాను భగవంతుడి దగ్గరకు చేరుస్తుంది.
అత్తలైయాల్ వంద అరుళ్ …….ఆయన్ జీవాత్మల మీద చూపించిన కృప వలన లభిస్తుంది. శరణాగతి ఒక్కటే ఉపాయమని శాస్త్రాలన్నీ ధృడంగా చెప్పబడింది. ఇది తెలిసిన తరవాత ఇతర కర్మలు, జ్ఞాన, భక్తి యోగలన్నింటినీ పూర్తిగా వదిలి వేయాలి . ఇలా చేయటము వలన శరణాగతి మార్గమొక్కటే మనకు గతి అన్న నమ్మకము,విశ్వాసము స్థిరపడతాయి. అలా కూడా భావింపరాదంటారు, ఎందుకంటే ‘ భగవంతుడొక్కడే కృప చేసేవాడు కదా! ‘ ఒక్కడే ‘ అన్న చోట ‘ ఏ ‘ వకారం కర్మ, జ్ఞాన , భక్టి యోగాలు సాధనాలు కావు , శ్రీమన్నారాయణుడు మాత్రమే ఉపాయమని స్పష్టంగా తెలియచేస్తుంది. శ్రీమన్నారాయణుడు కృప చూపితే మరి ఇతర సాధనాలతో పని లేదు.
“వెఱిదే అరుళ్ సెయ్వార్” అనే తిరువాయిమొళి పాశుర వ్యాఖ్యానంలో ఈ విషయాన్నే చెప్పారు. శ్రీమన్నారాయణుడే కృప చేయటం వలన చేతనుడు చేయ వలసిన యోగాలు ఏవీ లేవు. ఈ విషయాన్ని అవగాహన చేసుకున్న వాడు శ్రీమన్నారాయణుడే కృప చేస్తాడని నీర్వ్యాపారంగా ఉండాలంటే దానికి కూడా ఆయన కృప అవసరం. నీర్వ్యాపారంగా ఉండాలంటానికి కూడా ఆయన కృప అవసరమా? అంటే అవసరమే . క్షణకాలమైనా నీర్వ్యాపారంగా ఉండటం ఎవరికీ సాధ్యంకాదు. కరచరణాలో, మనసూ నిరంతరం పని చేస్తూనే ఉంటుంది ‘అని భగవద్గీతలో చెప్పబడింది. కాబట్టి నీర్వ్యాపారంగా ఉండటానికి కూడా ఆయన కృప కావాలి. భగవంతుడిని ఆశ్రయించామనో ,ఆయనను ఆశ్రయించామని భావించటం వలననో ఫలితాన్ని పొందటం లేదు. ఈ విషయాన్నే “వాళుం సోంబర్” అన్నారు తొణ్డరడిపొడి ఆళ్వార్లు.
పెరియాళ్వార్లు “నిన్నరుళే పురిందిరుందేన్ ” అన్నారు.
“ఎన్ ఉణర్విన్ ఉళ్ళే ఇరుత్తినేన్” అన్నారు నమ్మాళ్వార్లు.
“ఉన్ మనత్తినాల్ యెన్ నినైందు ఇరుందాయ్” అన్నారు తిరుమంగై ఆళ్వార్లు.
“నిరందరం నినైప్పదాగ నీ నినైక్క వెండుమే” అన్నారు తిరుమళిసైపిరాన్. “ సిరు మానిడవర్ నాం సెయ్వదెన్” అన్నారు ఆందాళ్.
తిరుకణ్ణమంగై ఆండాన్ ఈ విధానాన్నే అవలంభించారు. ముముక్షుపడి చూర్ణికలో (230) “అవనై ఇవన్ పఱ్ఱుం పఱ్ఱు అహంకార గర్భం, ఆవధ్యకరం. ఆవనుడయ స్వీకారమే రక్షకం” అన్నారు.
తిరువాయిమొళి పదిగం 6.10 (ఉలగముండ పెరువాయా), “ఆవావెన్నుం” పాశుర ఈడు వ్యాఖ్యానంలో చెప్పిన ఒక ఐతిహ్యాన్ని ఇక్కడ చెపుతున్నారు.
నంజీయరును చూసి నంపిళ్ళై , “స్వామి పంచమోపాయం ఉంది అని చెపుతున్నరు కదా! అలా ఒకటి ఉందా? ” అని అడగగా ,’ అలా ఒకటి ఉన్నట్లు మాకు తెలియదు. చతురోపాయం మాత్రమే భగవంతుడిని పొందడానికి మార్గము ‘ అని చెప్పారు. అరుంపదంలో ‘ చతుర్థోపాయమైన పరమాత్మను తప్ప వేరు ఉపాయాలేవీ లేవు అని చెప్పడానికి ఈ సంవాదం ఉపకరిస్తుంది అని చెప్పబడింది.
ఆడియెన్ చూడామణి రామానుజ దాసి
మూలము : https://divyaprabandham.koyil.org/index.php/2016/01/prameya-saram-5/
archived in https://divyaprabandham.koyil.org
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org