శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః
అవతారిక
‘ తప్పిల్ గురువరుళాల్ ‘ అనే 26వ పాశురము నుండి 37 వ పాశురమైన పొరుళుం ఉయిరుం దాకా ఆచార్య వైభవమును పలు కోణాలలో చెప్పారు . 26వ పాశురములో అచార్య అనుగ్రహము వలన చేతనుడు శ్రీవైకుంఠమును చేరుకోవచ్చనీ , 27 వ పాశురములో అచార్య శ్రీపాదములని ఆశ్రయించని వారు శ్రీవైకుంఠము ను చేరలేక జననమరణ చక్రములో పడి కొట్టుకొని దుఃఖితులవుతారని చెప్పారు . 29వ పాశురములో ఆచార్య కృపను పొందిన వారు సులభముగా అవరోధాలను అధిగమించి శ్రీవైకుంఠమును చేరుకోగలరని , ఆచార్యుని శ్రీపాదములను చేరనివారితో సంభందమును వదులుకోవాలని శాస్త్రము శాసిస్తున్నదని 30వ పాశురములో చెప్పి , 31వ పాశురములో వేదము మొదలగు ప్రమాణ గ్రంధములు , ఆచార్య శ్రీపాదములే పెన్నిధి అని , 32వ పాశురములో ఆచార్యుని సామాన్య మానవునిగా భావించే వారు నరకమునకు చేరుకుంటారని 33,34 పాశురములలో అందుబాటులో ఉన్న ఆచార్యుని తృణీకరించి దూరస్తుడైన భగవంతుడిని ఆశ్రయించాలను కోవటము అజ్ఞానమే అవుతుందని చెప్పారు. 35వ పాశురములో గురువు యొక్క అభిమానమునకు దూరమైనప్పుడు భగవంతుడు కూడా కోపగిస్తాడని , 36వ పాశురములో భగవంతుని వెతుకుతూ 108 దివ్యదేశములు తిరగనవసరము లేదు , వారందరు ఆచార్యుని శ్రీపాదములందే దొరుకుతారని చెప్పారు . 37వ పాశురములో సచ్చిష్యుడు తన ధనము, ప్రాణము ,ఆత్మ మొదలగు సమస్తము ఆచార్యునువిగా భావించాలి , అప్పుడు ఆయన శిష్యునికి అవసరమగు సంపద, ఆయుష్షు , ఆరోగ్యము, నివాసము , సద్బుధ్ధి మొదలగు సమస్తములను అనుగ్రహిస్తాడని స్వామి అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్లు చెప్పారు .
పెరియ తిరుమొళి 1-1-9 లో తిరుమంగై ఆళ్వార్లు ఇలా అన్నారు
“కులం తరుం సెల్వం తన్దిడుం
అడియార్ పడు తురాయిన ఎల్లాం
నిలం తరం సేయ్యుం నీళ్ విసుమ్బు అరుళుం
అరుళోడు పేరు నిలం అళిక్కుం
వలం తరుం మఱ్ఱుం తందిడుం
పెఱ్ఱ తాయినుమాయిన సెయ్యుం
నలం తరుం సొల్లై నాన్ కణ్దు కొణ్దేన్
నారాయణా ఎన్నుం నామం” (పెరియ తిరుమొళి 1-1-9).
ప్రస్తుత పాశురములో ‘ శ్రీమన్నారాయణ ‘ అని ఎవరైతె అంటారో వారికి అవసరమైనవన్నీ ఆయనే అనుగ్రహిస్తాడు . అలాగే ఆచార్యులు తన శిష్యునికి అవసరమైనవన్నీ అనుగ్రహిస్తాడు . కావున ఆచార్యులంటే భగవత్స్వరూపము , ఆయన మీద నిశ్చలమైన విశ్వాసమును కలిగి వుండటమే చేతనులకు ఉత్తారకము అని చెప్పి గ్రంధమును ముగిస్తున్నారు .
పాశురము
“తెనార్ కమల తిరుమామగళ్ కొళునన్
తానే గురువాగి తన్ అరుళాళ్ – మానిడర్కా
ఇన్నిలతే తొన్రుదలాల్ యార్కుం అవన్ తాళిణయై
ఉణ్ణువదే సాల ఉరుం”
ప్రతిపదార్థము
తెనార్ = తేనెలూరు
కమలం ఉడైయ = కమలము నివాసముగా కలిగి వున్న
తిరుమామగళ్ = శ్రీమహాలక్ష్మి
కొళునన్ = విభుడు
తానే = తనే
గురువాగి వందు = ఆచార్యుడై వచ్చి
తన్ అరుళాళ్ –= తన కృపచే
ఇన్నిలతే = ఈ భువిలో
మానిడర్కా = మనుష్యులను తీర్చిదిద్దుటకు
తొన్రుదలాల్ = నరుడై అవతరించటము వలన
యార్క్కుం = ఎవ్వరికైనా
అవన్ తాళిణైయై = వాడి శ్రీపాదములే
ఉణ్ణువదే = ఎప్పుడూ మనసులో నిలుపుకొనుట
సాల ఉరుం = తగినది
వ్యాఖ్యానము
“తెనార్ కమల తిరుమామగళ్ కొళునన్……..పిరాట్టి తామరలో ఉండుట వలన ఆమె స్పర్శచే ఆ తామరకు అందము పెరిగింది . తెనెలూరుతూ వుండటము వలన అందము ఇనుమడించింది . అలాగ తామర యొక్క అంద మును పెంచు అమ్మవారికి విభుడు అని శ్రీమన్నారాయణుని అందరూ కీర్తిస్తారు . ‘ తిరు ‘ అని పెరియ పిరాట్టి (శ్రీమహాక్ష్మి)కి పెరు .తిరుప్పావైలో ఆండాళ్ ‘తిరువే తుయిలెళాయ్ ‘అన్నది . ఆయన ‘ తిరు ‘ కి విభుడు .
తిరువుడయార్ తేవరెనిల్ తేవర్కుం తేవన్
” మరువు తిరుమంగై మగిళ్ నన్ కొళునన్ – ఒరువనే
అల్లోర్ తలైవరెనల్, అన్ బినాల్ మెయ్ మఱందు
పుల్లోరై నల్లరెణల్ పోం “
(మదురై తమిళ్ సంగములొని పండితులు తిరు న. అప్పన అయ్యంగార్ ) అని అన్నారు . దీని వలన అందరికంటేఅ ఉన్నతమైన వాడు శ్రీదేవి విభుడు అని తేటతెల్ల మవుతున్నది.
గురువాగి …….తన దైవ స్వరూపమును దాచి ఆచార్య స్వరూపములోనికి మార్చుకొని ఇక్కడికి రావటానికి కారణము ఏమిటంటే……
తన్ అరుళాళ్……తన అపారమైన కృప తప్ప మరే హేతువు కనపడదు
మానిడర్కా……చేతనులకు ఉపదేశించి దిద్దుబాటు చేయుటము కోసము మానవ రూపములో అవతరించి , శాస్త్రమునకు కట్టుబడి ప్రవర్తించారని అర్థము .
ఇన్నిలతే తొన్రుదలాల్…….పిల్లవాడు బావిలో పడిపోతే వెంటనే తల్లి కూడా బావిలోకి దూకినట్టు ఆత్మలు జననమరణ చక్రములో పడిపోయిన ఈ భూమిపై తాను అవతరించుట అని అర్థము.
యార్కుం……సమస్త జనులకు అనగా…కుల భేధము , స్త్రీపురుష భేధము , బ్రహ్మచారి -గృహస్తు అనే ఆశ్రమ భేధము మొదలగు వాటికి అతీతముగా…
అవన్ తాళిణయై ఉణ్ణువదే….వాడి శ్రీపాదములను ఆశ్రయించుట … ఇక్కడ “అవన్” అనుటలో పరమాత్మ సకల కల్యాణ గుణములు ఇమిడి వున్నాయి . ఆత్మలన్నింటికి నాయకుడుగా , ఆశ్రయింపదగిన వాడుగా , ఉపకరించు వాడిగా ఉండుట అని అర్థము. వాడే ఉపాయము, పురుషార్థము.’ ఉన్నువదే ‘ (ఆశ్రయించుటే)లోని ఏవకారముతో వాడు తప్ప మరొకరు లేరు అని నొక్కి చెపుతున్నారు .
సాల ఉరుం…….చాలా తగియున్నది…….పైన చెప్పినవన్నీ ఆత్మకు చాలా తగియున్నవి . ” శ్రీదేవి విభుడైన శ్రీమన్నారాయణుడు సంసార సాగరములో మునకలు వేయు జీవులను ఉపదేశము చేత వొడ్డుకు చేర్చుటకు ,అపారమైన కారుణ్యముతో తానే మానవ రూపములో ఆచార్యునిగా అవతరించారు . సమస్త జీవులకు నాయకుడై ఆశ్రయించదగిన వాడుగా ఉన్నాడు . వాడి శ్రీపాదములే సమస్త జీవులకు చేరవలసిన చోటు . అటువంటి వాడి శ్రీపాదములను చేరుటయే జీవాత్మల లక్ష్యముగా మనసులో తలచి ఆ మార్గముననే ప్రయాణించటము జీవాత్మలకు తగిన, తప్పనిసరి ధర్మమై వున్నది . ” కావున ఆచార్యులనగా భవద్స్వరూపమే తప్ప మరొకటి కాదు అన్న సత్యమును తెలిసి ఆయన శ్రీపాదములనే అందరూ ఆశ్రయించ వలసి వున్నదని ఈ పాశురములో తెలియజేస్తున్నారు.
అడియేన్ చూడామణి రామానుజదాసి
మూలము: https://divyaprabandham.koyil.org/index.php/2015/04/gyana-saram-38-thenar-kamala-thirumamagal/
పొందుపరిచిన స్థానము: https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org