జ్ఞానసారము 28

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

జ్ఞానసారము

<< పాశురము 27

10527557_834046386613354_7891795563582297209_n

 

పాశురము-28

“శరణాగతి మఱ్ఱోర్ సాదనతై పఱ్ఱిల్

అఱణాగాదు అంజనై తన్ సేయై

ముఱణ్ అళియ కట్టియదు వేరోర్ కయిఱు

కొండార్పదన్ మున్

విట్ట పడై పోల్ విడుం”

అవతారిక:

               కిందటి పాశురమైన “తప్పిల్ కరువరుళాల్” లో , స్వామి అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్  అచార్యులు చూపిన మార్గములో  శరణాగతి చేసి పరమపదమును పొందు విధానమును చెప్పారు. తరువాతి పాశురమైన ,“నెఱి అఱియాదారుం”  లో గురుముఖత   శరణాగతి  శాస్త్రమును తెలుసుకొని ఆచరించని వారు, గీతనుపదేశించిన  శ్రీకృష్ణునిపై విశ్వాసము లేనివారు పరమపదమును పొందలేరు. ఈ లోకములోనే జనన మరణ చక్రములో పడి కొట్టుకుంటూ వుంటారని చెప్పారు. ఈ పాశురములో పరమపదమును పొందుటకు శరణాగతియే మార్గమని చెపుతున్నారు.  ‘ ఊళి వినై  కుఱుంబర్ ‘ అని 23వ పాశురములో లక్ష్మీనారాయణుల శ్రీపాదములకు శరణాగతి చేయటమే ఉన్నతమైన మార్గమని చెప్పిన విషయమును ఇక్కడ గుర్తు చేస్తున్నారు. ఆత్మోజ్జీవనము నకు శరణాగతి మార్గముననుసరించటము చాలునా ఇతర పుణ్య కార్యములు ఆచరించాలా అన్న అనుమానము మనసులో ఉద్భవిస్తే ఏమి జరుగుతుందో ఈ పాశురములో తెలియజేస్తున్నారు.

ప్రతిపదార్థము:

శరణాగతి = భగవంతుడి శ్రీపాదములందు విశ్వాసముతో చేయు శరణాగతిలో

మఱ్ఱోర్ సాదనత్తిల్ = విశ్వాసము లోపించి ఇతర ప్రయత్నములు చేయుట

పఱ్ఱిల్ = ప్రారంభిస్తే

అఱణాగాదు = మొదట చేసిన శరణాగతి ఫలించదు

అంజనై తన్ సేయై = అంజనాపుత్రుడైన ఆంజనేయుని

ముఱణ్ అళియ = బలము తొలగిపోయేట్లుగా

కట్టియదు = ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రమును ప్రయోగించి  కట్టివేశాడు

వేరోర్ కయిఱు కొండు = మరొక తాటితో

ఆర్పదన్ మున్ = కట్టేటప్పుడే

విట్ట పడై పోల్ = బ్రహ్మాస్త్రము శక్తి తొలగిపోయినట్లు

విడుం = శరణాగతిలో విశ్వాసము లోపించి ఇతర ప్రయత్నములు చేయుట ప్రారంభించగానే శరణాగతి ఫలించకుండా పోతుంది

వ్యాఖ్యానము:

శరణాగతి ……..శ్రీమన్నారాయణుని శ్రీపాదములను చేరుకోవటానికి శాస్త్రము కర్మ, జ్ఞాన మార్గముల కంటే శరణాగతి మార్గము ఉన్నతమైనదని చెప్పింది . ఎందుకంటే ఇతర మార్గములు సాద్యోపాయము అలా కాక శరణాగతి మార్గము సిద్దోపాయము . శ్రీమన్నారాయణుని శ్రీపాదములకు తలను చేర్చి ‘ నువ్వు తప్ప వేరు గతి లేదని ‘ పరిపూర్ణ విశ్వాసమును ప్రకటించటము శరణాగతి అని చెప్పబడింది ఇది మహా విశ్వాసము , అధ్యవసాయము అని శాస్త్రము చెపుతుంది. మహా విశ్వాసములో లోపము ఏర్పడితే శరణాగతి ఫలితమునివ్వదు . అలాగే శరణాగతుడిలో ‘నేను ‘, ‘నాది ‘ అన్న అహంకారము తలెత్తినా శరణాగతి ఫలితమునివ్వదు . ఆకించిన్యం , అనన్యగతిత్వం ఉన్నప్పుడే శరణాగతి ఫలితమునిస్తుంది . దీనినే ఆళ్వార్’ “ పుగల్ ఒన్ఱిలా అడియేన్ ” ( ఏదారి లేని దాసుడను) .లౌకిక జీవనములో విరక్తుడై పరమాత్మను చేరాలన్న త్వర కలిగి ఆశ్రీమన్నారాయణుని శ్రీపాదములను చేరితే అప్పుడే పరమపదము దొరుకుతుంది.

మఱ్ఱోర్ సాదనతై పఱ్ఱిల్………..శరణాగతి ఔన్నత్యము తెలుసుకొని శ్రీమన్నారాయణుని శ్రీపాదములకు శరణాగతి  చేసినప్పటికీ ,ఈ మార్గమొక్కటే చాలునా ? ఇతర మార్గాలను అనుసరించాలా అన్న సందేహము మనసులో కలిగితే ఇది ఫలించదు . దీనికి ఉదాహరణగా ఇక్కడ ఒక చరిత్రను తెలియజేస్తున్నారు.

అంజనై తన్ సేయై…….అంజనాదేవి కుమారుడైన ఆంజనేయుడిని

ముఱణ్ అళియ కట్టియదు…….బలమును పోగట్టాలని ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రముతో కట్టి వేయగా

వేరోర్ కయిఱు కొండార్పదన్ మున్ ……ఆ బ్రహ్మాస్త్రము మీద విశ్వాసము లేని రాక్షసులు కొందరు వేరొక తాటితో హనుమను కట్టివేయగా

విట్ట పడై పోల్ విడుం..…… బ్రహ్మాస్త్రము హనుమపై తన ప్రభావమును వదిలి  వేసినట్లుగా శరణాగతి చేసిన తరువాత దానిపై విశ్వాసములేక వేరొక ప్రయత్నము చేస్తే శరణాగతి ప్రభావము ఉండదు అని చేపుతున్నారు. శరణాగతిని బ్రహ్మాస్త్రముతోను , ఇతర ప్రయత్నములను సాధారణమైన తాటితోను పోల్చి చెప్పారు

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము: https://divyaprabandham.koyil.org/index.php/2015/02/gyana-saram-28-sharanagathi-marror/

పొందుపరిచిన స్థానము: https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment