ఆర్తి ప్రబంధం – 24

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

ఆర్తి ప్రబంధం

<< ఆర్తి ప్రబంధం – 23

paramapadham

ప్రస్తావన

ఈ పాశురమున మణవాళమామునులు ఈ భౌతికశరీరమును విడిచిన సమయము నుండి ప్రఖ్యాతిగల ఆచార్యుల నడుమ చేరు వరకు జరుగు సంఘటనలను వివరించుచుండిరి

పాశురం 24

ఇన్ద ఉడల్ విట్టు ఇరవిమణ్డలత్తూడు యేగి
ఇవ్వణ్డమ్ కళిత్తు ఇడైయిల్ ఆవరణమేzహ్ పోయ్
అన్తమిల్ పాళ్ కడన్దు అళగార్ విరసైతనిల్ కుళిత్తు అన్గు
అమానవనాల్ ఒళి కొణ్డ సోదియుమ్ పెఱ్ఱు అమరర్
వన్దు ఎదిర్కొణ్డు అలన్కరిత్తు వాళ్త్తి వళినడత్త
వైకున్తమ్ పుక్కు మణిమణ్డపత్తుచ్ చెన్ఱు
నమ్ తిరుమాలడియార్గళ్ కుళాన్గళుడన్ కూడుమ్
నాళ్ ఎనక్కుక్ కురుగుమ్ వగై నల్గు ఎన్ ఎతిరాసా

ప్రతి పదార్ధం

ఎన్ ఎతిరాసా – ఓ! యతిరాజా! జగదాచార్యా!
నల్గు – అనుగ్రహించుము
ఎనక్కు – నాకు
కురుగుం వగై – నేటికి మరియు ఆ మంచి రోజునకు ఉన్న సమయము త్వరగా తగ్గువిధముగా
కూడుం నాళ్ – ఆ గొప్ప రోజు ఎప్పుడనగా నేను చేరునప్పుడు
నమ్ తిరుమాలడియార్గళ్ – నిత్యసూరులగు మన ఆచార్యులను (శ్రియఃపతి యగు శ్రీమన్నారాయణుని దాసులు)
కుళాన్గళుడన్ – వారి వర్గములో ఒకరి ఉండును
ఇన్ద ఉడల్ – కల్మషములతో పూర్తిగ మలినమైన ఈ భౌతిక శరీరము
విట్టు – విడిచి
ఇరవిమణ్డలత్తూడు యేగి – ఈ సూర్య మండలమునుండి
కళిత్తు – అతిక్రమించి
ఇవ్వణ్డమ్ – ఈ విశ్వము
ఇడైయిల్ – వీటి నడుమ ఉన్న
ఆవరణమేళ్ పోయ్ – (తరువాత) ఏడు సాగరములను దాటి
పాళ్ కడన్దు – “మూల ప్రకృతి”ని మించి పోవు
అన్తమిల్ – అంతులేని  అగాధమైన
అళగార్ – తుదిగా, మిక్కిలి అందమైన ప్రదేశము చేరును
విరసైతనిల్ – “విరజ” అను నదిలో
కుళిత్తు – పుణ్య తీర్థమున స్నానము చేసి
అన్గు – అక్కడ
అమానవనాల్ – “అమానవన్” అను వారిచే స్పృశించబడి
ఒళి కొణ్డ సోదియుమ్ పెఱ్ఱు – అందువలన ప్రకాశమును వెదజెల్లు దివ్యమైన శరీరమును పొందును
అమరర్ వన్దు ఎదిర్కొణ్డు – నిత్యసూరులు ఎదురొచ్చి స్వాగతము పలికి
అలన్కరిత్తు – అలంకరించును
వాళ్తి – కీర్తించి
వళినడత్త – (ఆ కొత్త శరీరమున) ముందు నడిపించును
వైకున్తమ్ పుక్కు – శ్రీవైకుంఠము చేరు మార్గమున
మణిమణ్డపత్తుచ్ చెన్ఱు – “తిరుమామణిమండపం” అను దైవ సాన్నిధ్యమును చేరును

సామాన్య అర్ధం

ఈ పాశురమున మణవాళమామునులు శ్రీరామానుజులను, నేటికి మరియు తాము నిత్యసూరులలో ఒక్కరగు దినమునకు ఉన్న దూరమును త్వరగా తగ్గించి అనుగ్రహించమని ప్రార్ధించెను. మణవాళమామునులు ఈ భౌతిక శరీరమును విడిచిన తరువాతి పయణమును వర్ణించసాగెను. ఈ ఆత్మ సౌరకక్ష్యము (మండలము), విశ్వము, ఏడు సాగరములు మొదలగు వాటిని అతిక్రమించి చివరగా విరజ అను నదిని చేరును. ఆ పవిత్ర తీర్థమున స్నానమాచరించుటచే అమానవన్ అను వారు మనను ఉద్ధరించును. అందువలన ఆ ఆత్మ మిక్కిలి ప్రకాశమును వెదజెల్లు దేహమును పొందును. నిత్యసూరులు  ఎదురు వచ్చి, స్వాగతము పలికి, అలంకరించి, వారిని శ్రియఃపతియగు శ్రీమన్నారాయణులు ఆశీనులై ఉన్న తిరుమామణి మండపమునకు చేర్చును. మణవాళమామునులు ఇప్పటికి, నిత్యసూరులు ఉండు నిత్య విభుతిని చేరు సమయమునకు మధ్య ఉన్న సమయమును క్షీణింపచేయ కోరెను.

వివరణ

మణవాళమామునులు “ఓ! జగదాచార్య! యతిరాజా! “ఇమ్మాయవాక్కై (తిరువాయ్ మొళి 10.7.3)” లో చెప్పినట్లు, మా ఈ భౌతిక శరీరము కల్మషములతో పూర్తిగా మలినమై ఉన్నది. ఈ శరీరము వాంఛనీయమైనది కాదు, కావున “మన్గ ఒట్టు (తిరువాయ్ మొళి 10.7.9)” అను ప్రబంధవాక్యమున తెలిపినయట్లు దానిని పూర్తిగా నశింప చేయవలెను. తదుపరి ఆత్మ “మన్నుమ్ కడుమ్ కదిరోన్ మణ్డలత్తిన్ నన్నడువుళ్ (పెరియ తిరుమడల్ 16)” అను వాక్యానుసారం సౌర మండలము మొదలుకొని పలు జగములను మరియు విశ్వమును అతిక్రమించును. తరువాత ఆ ఆత్మ “ఆతివాహికస్” అను వారి లోకమును దాటును. అనంతరం అది 1 కోటి యోజనములు గల దేవతలు నివసించు లోకమును “ఇమయోర్వాళ్ తనిముట్టై కోట్టై (తిరువాయ్ మొళి 4.9.8)” అను ప్రబంధ వాక్యమున పేర్కొన్న విధముగా అతిక్రమించును. అటుతరువాత ఏడు సాగరములను దాటి “ముడివిల్ పెరుమ్పాళ్ (తిరువాయ్ మొళి 10.10.10)” అని వివరించబడిన అనంతమగు “మూల ప్రకృతి”ని చేరును. ఆ పిమ్మట ఆ ఆత్మ మిక్కిలి అందమైన నదియగు విరజానదిని చేరును. ఆ నదియందున స్నానమాచరిచిన తరువాత “అమానవన్” అను పేరుగల వారు వచ్చి, వారి హస్తములచే విరజానది నుండి వెలువచ్చుటకు సాయముచేయును. వారి స్పర్శముచే ఆ ఆత్మ “ఒళిక్కొణ్డ సోదియుమాఇ (తిరువాయ్ మొళి 2.3.10))” యందు చెప్పినట్లు మిక్కిలి ప్రకాశముతో వెలుగొందు, “పన్చోపనిశత్ మయం” (ఐదు ఆధ్యాత్మిక అంశములచే చేయబడిన) అని వివరించబడు కొత్త శరీరమును పొందును. తరువాత నిత్యసూరులు ఎదురొచ్చి, “ముడియుడై వానవర్ ముఱైముఱై ఎదిర్కొళ్ళ (తిరువాయ్ మొళి 10.9.8) లో వర్ణించినట్లు (కొత్త శరీరముతో ఉన్న) ఆ ఆత్మను స్వాగతించును. తదుపరి వారిని అలంకరించి, కీర్తించి, పరమపావనమగు శ్రీవైకుంఠము యందు చేర్చెదరు. అక్కడ పలు భక్తులు ఉండు “తిరుమామణి మండపం” అని ప్రసిద్ధిచెందిన పూజా స్థానము వరకు తీసుకెళ్ళెదరు” అని చెప్పెను. మణవాళమామునులు శ్రీరామానుజులను ” “అడియార్గళ్ కుళాన్గళుడన్ కూడువదు యెణ్రుకొలో (తిరువాయ్ మొళి 2.3.10)” మరియు “మత్దేవతైః పరిజనైస్తవ సన్కిశూయః” అను వాక్యములలో చెప్పినట్లు, ఇట్టి గొప్ప భక్తుల నడుమ ఉండుటకు మాకు ఎప్పుడు అవకాశము దొరకును?” అని ప్రశ్నించెను. అట్టి వారందరు మా ఆచార్యులు. వారందరు శ్రియఃపతియగు శ్రీమన్నారాయణుని దాసులు మరియు వారు అతనికి చేయు కైంకర్యముచే వారి ఉపస్థితిని నిదర్శించును. ఓ! యతిరాజా! నేటికి మరియు పైచెప్పబడిన విషయములు సంభవించు రోజునకు నడుమ ఉన్న సమయము క్షీణించునట్లు అనుగ్రహించుము.

అడియేన్ వైష్ణవి రామానుజదాసి

మూలము : https://divyaprabandham.koyil.org/index.php/2016/09/arththi-prabandham-24/

పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

0 thoughts on “ఆర్తి ప్రబంధం – 24”

  1. దాసోహం
    తెలుగు లో టీకా తాత్పర్యము తో నాలాయిర దివ్య ప్రబంధం కావాలి.
    దయతో దొరికే చోటు ని సూచించ గలరు

    Reply

Leave a Comment