శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః
ఈ పాశురము 12వ పాశురమునకు అనుబంధమైనది. మునుపటి పాశురము (13వ పాశురము) కొంచెము క్రమము తప్పినది (ప్రాసంగికం). 12వ పాశురమున శ్రీ రామానుజులు మణవాళమామునులను ” ఓ! మణవాళమామునీ, మీరు మా చరణములందు మీ ఆచార్యులు ఆఙ్ఞాపించినందువలన ఆశ్రయించిరి అని తెలిపిరి. మీ ఆచార్యుల ఆజ్ఞ మేరకు మమ్ము ఆశ్రయించుటయే ముక్తిని ప్రసాదించును అని మీరు చెప్పుచ్చున్నారు. కాని మీ యొక్క సందర్భమున ఇదియే చాలునా? మీరు మమ్ము శరణు కోరుట తప్ప ఇంకే అర్హతా అవసరములేదా?” అని ప్రశ్నించిరి. ఇదియే శ్రీ రామానుజుల మదిన ఉన్న చింతన అని మామునులు ఊహించెను. ఆ ప్రశ్నకు మణవాళ మామునులు ఈ పాశురమున సమాధానము చెప్పెను. మణవాళ మామునులు ” ఓ! శ్రీ రామానుజా! ఒకరికి ముక్తి పొందుటకు కావలసిన ఆని గుణములు ఉన్నచో వారు మీ చరణములను ఎందులకు ఆశ్రయించెదరు? మీరు ఎట్టి అర్హతా లేని వారిని కూడ ఆదరించువారు. కావున మా వంటి శరణార్ధులందరిని మీరు మాత్రమే రక్షించగలరు. మీరు లేనిచో మాకు ఇంకే దిక్కు లేదు” అని చెప్పిరి.
పాశురం 14
అదిగారమున్డేల్ అరన్గర్ ఇరన్గారో
అదిగారమ్ ఇల్లాదార్క్కన్ఱో – ఎతిరాస
నీ ఇరన్గ వేన్డువదు నీయుమ్ అదిగారిగళుక్కే
ఇరన్గిల్ ఎన్ సెయ్వోమ్ యామ్
ప్రతిపదార్దమ్
అదిగారమున్డేల్ – సమస్తఙ్ఞానములు మరియు వాటిని ఆచరించుటకు అర్హులైన వారు
అరన్గర్ – పెరియ పెరుమాళ్ (శ్రీ రంగనాధులు)
ఇరన్గారో – దిగివచ్చి, ఆదుకొనరా?
ఎతిరాస – కాని ఓ! ఎతిరాస, మీరు
అదిగారమ్ ఇల్లాదార్క్కన్ఱో – దిగివచ్చి పైచెప్పబడిన ఏ విధమైన అర్హతాలేని వారిని ఆదుకొందురు. ఇది నిజము కదా?
నీ ఇరన్గ వేన్డువదు – మేము మిమ్ము దిగివచ్చి అట్టి వారిని (నన్ను కూడా) రక్షించమని ప్రార్ధిస్తున్నాము
నీయుమ్ అదిగారిగళుక్కే ఇరన్గిల్ – ఆశ్రయించువారికి ఏకైక ఆశ్రయమైన మీరు కూడ, అర్హులైన వారిని మాత్రమే ఆదరించుట మొదలు పెట్టినచో
ఎన్ సెయ్వోమ్ యామ్ – మేము ఇంకేమి చేసెదము ?
సామాన్య అర్ధం
ఈ పాశురమున మణవాళ మామునులు, శ్రీ రామానుజులతో తమకు వారి (శ్రీ రామానుజుల) చరణకమలముల తప్ప ఆశ్రయించుటకు వేరు దిక్కు లేదని చెప్పెను. ఆశ్రయము లేని వారిని శ్రీ రామానుజులు మాత్రమే రక్షించగలరు. తమను ఆశ్రయించువారికి ఏ అర్హత ఉన్నదని శ్రీ రామానుజులు చూచుట లేదు. పెరియ పెరుమాళ్ళే(శ్రీ రంగనాధులే) ఆశ్రయించువారి యెడల ఙ్ఞానమును మరియు దానికి సహసంబంధియగు ఆచారమును (అనుష్టానమును) అర్హతగా చూసెదరు. ఒకవేళ శ్రీ రామానుజులే అర్హత చూచుట మొదలు పెట్టినచో, ఇక తనకు మరియు ఇతరులకు ఆశ్రయించుటకు ఎక్కడా గతి లేదని మణవాళ మామునులు చెప్పి ముగించిరి.
వివరణ
మణవాళ మామునులు, శ్రీ రామానుజులతో ” ఓ! శ్రీ రామానుజా! పెరియ పెరుమాళ్లను(శ్రీ రంగనాధులను) చూడుము! వారు నమ్మాళ్వార్ వంటి వారిని “పుణ్ణాన్తుళామె పొరునీర్త్ తిరువరన్గా అరుళాయ్ (తిరువిరుత్తమ్ 28)” అను వారి ప్రార్ధనచే అనుగ్రహించెను. నమ్మాళ్వార్లు, పెరియ పెరుమాళ్ యొక్క అనుగ్రహముచే ముక్తి పొందిన తరువాత “అరుళ్ సూడి ఉయ్న్దవన్ (తిరువాయ్ మొళి 7.2.11)” అని కొనియాడెను. పెరియపెరుమాళ్ అర్హులైన వారిని మాత్రమే అనుగ్రహించెదరు. కాని మా వంటి చూడుము. మాకు అట్టి అర్హతలు ఏవీ లేవు. ఓ! యతిరాజా! ఎట్టి అర్హతలేని మా వంటివారిని మీరే అనుగ్రహించవలెను. మీరొక్కరే ఏ దిక్కు లేని ఎనలేని జీవాత్మలకు ఒకే ఆశ్రయము. అట్టి మీరు కూడ శరణార్ధుల యెడల అర్హతను చూచుట మొదలుపెట్టి, అవి ఉన్నవారినే ఆదరించినచో, మావంటి వారు ఏ గుణము చూపి మీ కృపకు పాత్రులైయ్యెదము? కావున మేము ఎప్పటికి ముక్తులము కాలేము.
మూలము : https://divyaprabandham.koyil.org/index.php/2016/07/arththi-prabandham-14/
పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org